కవిత్వం అంటే నాకిష్టం
కవిత్వం అంటే నాకిష్టం
కవిత రాయటం ఎంతో కష్టం,
ఐనా, అదంటే నాకెంతో ఇష్టం.
భాషలో ఒదగమని ఒకవైపు భావాన్ని బుజ్జగించాలి,
భావంలో ఎదగమని మరోవైపు భాషని బ్రతిమలాడాలి.
ఎందుకంటే ఈ రెండూ దీవిస్తేనే,
కవిత్వం కలకాలం జీవిస్తుంది.
అంతటితో అయిపోదు సుమా!!
కవితకు కళని కాస్త అద్దుతూ తళతళలను చేర్చాలి.
భావం అలుకను తీరుస్తూ భాషకు కులుకులు నేర్పాలి.
కవితలో గుండెకవాటాలను కుదిపే నిండైనభావాన్ని ఒంపాలి.
కవితను హృదయఘోషను తెలిపే మెండైనభాషతో నింపాలి.
కలతను తప్పిస్తూ, మమతను మెప్పించేలా
కలలలో విహరింపచేస్తూ, వాస్తవాలను వివరించేలా
బాధను మరపిస్తూ, బోధతో మురిపించేలా
కవితను రాయాలి. అది పదిమంది హృదయాలను చేరాలి!!
అందుకే, కవి ఆలోచనాస్రవంతిలో జనించే కవిత్వం అంటేనే నాకిష్టం.