గత సంచిక తరువాయి... ముగింపు కథ కొనసాగింపు .... »
20. నిష్టల సుబ్రహ్మణ్యం
అంశం :: కథ మొదలు మాది_ ముగింపు మీది; శీర్షిక: తన కాళ్ళపై
కథ మొదలు మాది, ముగింపు మీది.......నేను ఇచ్చిన ముగింపు
ఒక రోజు శ్యామలమ్మ కొడుకుతో, తను ఇంక ఎవరిమీద ఆధార పడదలచుకోలేదని తన మనసులోని ఉద్దేశ్యం చెప్పింది. కొడుకు ముందు ఆశ్చర్యబోయాడు. "అమ్మా! సరిగా ఆలోచించుకునే చెబుతున్నావా ఈమాట? ఇంత వయసు వచ్చి, ఇప్పుడు ఈ నిర్ణయం అవసరమా? మనవాళ్ళు అందరూ ఏమనుకుంటారో ఊహించుకో." అన్నాడు.
శ్యామలమ్మ, "ఎవరురా ఆట అనేది? ఇన్నాళ్ళు ఏమైపోయారు వీళ్ళందరూ? నేను ఇవేమీ పట్టించుకోనవసరం లేదు. నా నిర్ణయం మారదు." అంది.
వారం రోజులు గడిచాయి. ఒకరోజు బయటకు వెళ్ళిన శ్యామలమ్మ, ఒక వ్యక్తితో కలిసి వచ్చింది. ప్రక్కింటి కామాక్షి వింతగా చూస్తోంది. ఇంట్లోనుంచి కొడుకు, కోడలు బయటకు వచ్చారు ఆతృతగా.
శ్యామలమ్మ, "రండి శర్మగారూ!" అని తనతో వచ్చిన వ్యక్తిని ఇంట్లోకి ఆహ్వానించింది.
"ఇదిగో, ఈ ప్రక్కన పెద్ద హాలు ఉంది. అందులో వంట చేసుకోవచ్చు. ఏమంటారు? సరిపోతుందా? అడిగింది.
కొడుక్కుకి జరగబోయేది తెలుసు కాబట్టి, ఏమీ మాట్లాడలేదు.
కోడలు, "ఏమిటి అత్తయ్యగారూ? మీరు ఏం చేయబోతున్నారు?" అంది.
శ్యామలమ్మతో వచ్చిన శర్మ, "ఏంలేదమ్మా. మీ అత్తయ్య గారు ఎవరిమీద ఆధార పడకుండా స్వంతంగా కేటరింగ్ పెట్టుకోవాలని మంచి నిర్ణయం తీసుకున్నారు. నాకు అనుభవం ఉందని, వారు సహాయం కోరారు." అని చెప్పాడు.
కొడుకూ, కోడలూ ఆమె నిర్ణయానికి మెచ్చుకోలేకుండా ఉండలేకపోయారు.
******
21. నిట్టల ఇందిర
అంశం :: కథ మొదలు మాది_ ముగింపు మీది; శీర్షిక: తోడు-నీడ
నా ముగింపు
తన నిర్ణయం అమలు పరచింది. తృప్తిగా జీవిస్తోంది. పదిహేను రోజులు గడిచాయి. ఓ రోజు ఉదయం ఆడపడుచు లోపలికి రావడం కనిపించింది.
'ఏంటి? ఈవిడ వస్తోంది? ఇన్నాళ్లు మొహం చూడలేదు. బ్రతికామో, చచ్చేమో కూడా పట్టించుకోలేదు. పిల్లల పెళ్ళిళ్ళకు కూడా రాలేదు. ఇప్పుడేమిటీ ఆకస్మాత్తుగా' మనసులో అనుకుంటూ ఎదురువెళ్ళి ఆహ్వానించబోయింది.
"ఏంటి, లోపలికి వచ్చేది? బుద్ధి, జ్ఞానం లేదా? ఇంత వయస్సు వచ్చాకా ఇవేం వేషాలు? కనీసం ఈ పని చేద్దామనుకున్నప్పడైనా నా తమ్ముడు గుర్తురాలేదా? ఎవరే ఆ తోడు? చూపించు" అంటూ దులిపేసింది.
'హు. తమ్ముడు వదిలేసి పోయినప్పుడు ఈ మరదలు గుర్తురాలేదు' మనసులో అనుకుంటూ "రండి ఒదినా, చూపిస్తా అంటూ ప్రక్క గదిలోకి తీసుకువెళ్ళింది. చెక్క గుర్రంమీద ఊగుతూ ఓ చిన్న పిల్లా, ప్రక్కనే కూర్చొని చదువుకుంటున్న ఓ పదిహేనేళ్ళ కుర్రాడు కనిపించారు.
ఇంతలో వంట గదిలోంచి ఓ ముప్పై, ముప్పై అయిదేళ్ళ స్ర్తీ వస్తూ "పిన్నిగారూ టిఫిన్ చేసేసాను. రండి తినేద్దురుగానీ. పిల్లాడికీ, పిల్లకీ ఇద్దరికీ ఈ రోజు సెలవే. మీ మందుల చీటి ఇస్తే, వాడెళ్ళిమందులు తీసుకు వస్తాడు" చెబుతూ కొత్త వ్యక్తిని చూసి ఆగిపోయింది ఆ అమ్మాయి.
"ఇదిగో వదినా ఈవిడే నా తోడు ఈశ్వరి. ఈ అమ్మాయి ఓ ప్రమాదంలో అయినవాళ్ళందరినీ పోగొట్టుకొని ఇద్దరు పిల్లలతో ఒంటరిగా మిగిలింది. నన్ను తన కుటుంబానికి పెద్దదిక్కుగా, అండగా ఉండమంది. నేను గూడునిస్తే, తను నా నీడై కనిపెట్టుకు ఉంటానంది. సరే అన్నాను. తనూ, తన పిల్లలూ నా చుట్టూ అల్లుకొని, ఉన్నారు. నాకు ఆలంబనా, ఆస్వాదనా అయ్యారు.
ఇప్పుడు నాలో మరో ఆలోచన కూడా చోటుచేసుకుంది. ఇలాంటి పిల్లలని చేరదీసి, విద్యాబుధ్ధులు నేర్పించాలని అనుకుంటున్నా. మా కాన్వెంట్ యాజమానిని సంప్రదిస్తే, కొన్ని సంస్థల నుంచి విరాళాలు ఇప్పించారు. ఇంకో నలుగురు పిల్లలు చేరారు ఇప్పుడు నాకు ఒంటరితనం లేదు. బీ.పీ కూడా బాగా తగ్గింది. తెలిసింది కదా నా తోడెవరో" చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది, ఇంక నువ్వు వెళ్ళచ్చు అన్నట్టుగా.
******