సూర్యం ఒక పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలో మంచి హోదాలో పని చేస్తున్నాడు. కాస్త ఖాళీ సమయం దొరికితే తన కుటుంబ సభ్యులతో గడపడానికి ఎక్కువగా ఇష్ట పడతాడు.
ఒక ఆదివారం సాయంత్రం, సూర్యం తన భార్య గాయత్రితోనూ, పిల్లలు వెంకట్, చిన్నిలతో టీ.వీ.లో వస్తున్న సినిమా చూస్తున్నాడు. ఇంటిల్లుపాదీ ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఆ చిత్రంలో ముగ్గురు చిన్న పిల్లలు ఒక కుక్కపిల్లను చేరదీసి దానికి ఆటలు నేర్పించడం చూపిస్తున్నారు.
"నిజంగా కుక్కపిల్లలు ఇలా చెప్పిన మాట వింటాయా?" ఆశ్చర్యంగా అడిగింది పదేళ్ల చిన్ని.
"ఓ.. ! వాటికి మన సూచనలను అనుసరించగలిగేటట్టు శిక్షణ ఇవ్వచ్చు", చెప్పాడు సూర్యం.
"అరె! దానికి మెడలో గొలుసు కట్టకుండానే ఇంటి బయట తిప్పుతున్నారే! పారిపోతుందన్న భయం లేదనుకుంటా", అన్నాడు చిన్ని అన్నయ్య పన్నెండేళ్ల వెంకట్.
"కుక్కలకు విశ్వాసం చాలా ఎక్కువ. సాధారణంగా యజమానిని విడిచి వెళ్లవు." చెప్పాడు సూర్యం.
పెంపుడు కుక్కకు సంబంధించిన ఒక్కొక్క విషయం చిన్ని, వెంకట్ లలో తాము కూడా ఒక కుక్కపిల్లను తెచ్చి పెంచుకోవాలన్న కోరిక కలిగించింది. బుల్లి తెరపై శునకం చేసే విన్యాసాలను చూసినకొద్దీ ఆ కోరిక మరింత బలపడింది.
"మనమూ ఒక కుక్కపిల్లను పెంచుకుందాము”, అని పిల్లలిద్దరూ ముక్తకంఠంతో అన్నారు.
సూర్యం బదులిచ్చేలోపే గాయత్రి, "కుక్కపిల్లను పెంచడమంటే మాటలు కాదు. దాని ఆహారం దగ్గరినుంచి అన్నీ మనమే చూసుకోవాలి. ప్రతి పూటా బయట తిప్పాలి. నాన్న ఉద్యోగానికి వెడతారు. మీరు చదువుకోవాలి. నాకు ఇంటిపనుంటుంది. ఇంకెవరు దాన్ని చూస్తారు? కాబట్టి కుక్కపిల్లను పెంచడమనేది మన వల్ల కాదు."అని అంది.
ఒక రెండు నిమిషాలు అందరూ మౌనంగా ఉండిపోయారు. ఆ తరువాత మెల్లిగా చిన్ని, వెంకట్ లు తల్లి పక్కన చేరి, "అమ్మా, కుక్కపిల్లను తెస్తే దాని వల్ల మా చదువుకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూసుకుంటాము. దానికి సంబంధించిన పనులన్నీ సాధ్యమైనంతవరకూ మేమే చేస్తాం. కుక్కపిల్లను తెచ్చుకోవడానికి ఒప్పుకోవా”, అంటూ బతిమలాడారు.
"మనదెలాగూ సొంత ఇల్లే కదా! నేను పని చేసే సంస్థలో బదిలీలు ఉండవు. మనముండే ఈ హైదరాబాద్ లో మనము ఊరెడితే మన పెంపుడు కుక్కలను చూసుకునే సంస్థలూ లేకపోలేదు. కాబట్టి కుక్కపిల్లను పెంచుకుంటే బానే ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికే కాదు. ఇంటికి కాపలాగా కూడా ఉంటుంది”, అని పిల్లలను సమర్ధిస్తూ అన్నాడు సూర్యం.
"సరే! మీ ఇష్టం. మీ అందరికీ ఆనందం కలిగిచే విషయం అయితే నా సహకారం ఎప్పుడూ ఉంటుంది”, అని అంటూ గాయత్రి వంటింట్లోకి వెళ్ళింది.
"కానీ మనమనుకున్న వెంటనే కుక్కపిల్ల దొరకాలి కదా. దొరికినప్పుడు ఆలోచిద్దాం", అన్నాడు సూర్యం.
పెంచుకోబోయే కుక్కపిల్ల గురించి ఆలోచిస్తూ ఆ రాత్రికి పడుకున్నారు వెంకట్, చిన్నిలు.
కొన్ని వారాలు గడిచాయి. చిన్ని, వెంకట్ లు పైకి ఏమీ అనకపోయినా మనసులో మాత్రం తమకు పెంచుకోవడానికి కుక్కపిల్ల త్వరగా దొరికితే బాగుండని అనుకుంటూ ఉండేవారు.
ఒక రోజు రాఖీ పండుగ సందర్భంగా చిన్నీ వాళ్ళ బడికి సెలవిచ్చారు. ఆ రోజు గురువారం కూడా కావడంతో గాయత్రి సూర్యోదయానికన్నా ముందే లేచి దత్తాత్రేయుడికి ప్రత్యేక పూజ చేసి రకరకాల పిండి వంటలతో భోజనము సిద్ధం చేసింది.
అది చూసిన వెంకట్, "అమ్మా! ఏంటీ? ఇన్ని పిండివంటలు చేసావు?", అని అడిగాడు.
"ఇవాళ గురువారం, పౌర్ణమి కలిసొచ్చాయని దత్తాత్రేయుడికి పూజ చేశాను. ఇవాళ మనింటికి ఎవరొచ్చినా వాళ్ళు దత్తాత్రేయుడేనని నా నమ్మకం. వీలైతే వారికి భోజనం పెడదామని అనుకుంటున్నాను", చెప్పింది గాయత్రి.
"దత్తాత్రేయుడు మనిషి రూపంలోనే కాదు - ఆవు, పక్షి, పిల్లి, కుక్క వంటి ఇతర ప్రాణుల రూపంలో కూడా రావచ్చు", అన్నాడు సూర్యం.
"ఏ రూపంలో వచ్చినా నాకు సంతోషమే", అంది గాయత్రి.
అంతలో సూర్యం చెల్లెలు విజయ ఫోన్ చేసి రాఖీ కట్టడానికి వాళ్ళింటికి రమ్మని అడిగింది. విజయావాళ్ళుండేది కూడా హైదరాబాద్ లోనే. వచ్చేటప్పుడు చిన్నిని కూడా తెస్తే బాగుంటుందని విజయ అనడంతో చిన్నిని తీసుకుని బయలుదేరాడు సూర్యం. విజయ సూర్యానికి రాఖీ కట్టింది.
సూర్యం కాసేపు కబుర్లు చెప్పి ఆ తరువాత చిన్నిని పిలిచి "నేనూ కూరలు తీసుకుని వస్తాను. నువ్విక్కడే ఆడుకుంటూ ఉండు. నేను రాగానే ఇంటికి వెళ్ళిపోదాం", అని అన్నాడు. సరేనంది చిన్ని.
కొద్ది సేపటి తరువాత సూర్యం ఒక తెల్లటి కుక్కపిల్లను చంకలో పెట్టుకుని వచ్చాడు.
"నాకోసమేనా?", ఆత్రంగా అడిగింది చిన్ని. "అవును", అన్నాడు సూర్యం.
చిన్ని ఆనందానికి అవధులు లేవు. ఒక్క ఉదుటున ఆ కుక్కపిల్లను ఎత్తుకుని గుండెలకు హత్తుకుంది చిన్ని.
"నచ్చిందా చిన్నీ?", అడిగాడు సూర్యం. "ఓ! త్వరగా ఇంటికి వెళ్లి దీనిని అమ్మకు, అన్నయ్యకు చూపిద్దాం", అంది చిన్ని.
ఇల్లు చేరాక గాయత్రి తలుపు తెరవగానే, "మన ఇంటికెవరు వచ్చారో చూడు!", అని సంతోషంగా అరిచింది చిన్ని.
ఆ అరుపుకు ఇంటి లోపలెక్కడో ఉన్న వెంకట్ బయటికొచ్చి కుక్కపిల్లను చూసి దాన్ని ఎత్తుకుని నెమ్మదిగా నిమురుతూ, "ఎంత ముద్దుగా ఉందో", అని అంటూ ఇంట్లోకి తీసుకెళ్లాడు.
‘ఓహో ! నా దత్తుడివాళ ఈ రూపంలో వచ్చాడన్నమాట’, అనుకుంది గాయత్రి.
"కుక్కపిల్లను వంటింట్లోకి, దేవుడి గదిలోకీ మాత్రం తీసుకు రాకండి. మిగతా గదులలో మీ ఇష్టం. అది మంచం ఎక్కకూడదు. మనం భోజనం చేసేటప్పుడు దాన్ని వేరే గదిలో ఉంచాలి", అంటూ కుక్కపిల్ల విషయంలో అందరూ పాటించాల్సిన నియమాలు చెప్పింది గాయత్రి.
"సరే! నువ్వెలా చెప్తే అలాగే!" అన్నారు వెంకట్, చిన్నిలు.
"ఇప్పుడు దీనికొక పేరు పెట్టాలి", అన్నాడు వెంకట్. “రాఖీ రోజు వచ్చింది కాబట్టి 'రాఖీ' అని పెడదాం", అంది చిన్ని.
"పెప్పీ అని పెడితే ఎలా ఉంటుందీ?" అడిగాడు వెంకట్.
"ఏమిటో దాని అర్థం”, అడిగింది గాయత్రి .
"ఉత్సాహంతో ఎగిరి పడటం అని అనుకో ", అంటూ నవ్వాడు సూర్యం.
పెప్పీ అన్న పేరు చిన్నికి కూడా చాలా నచ్చింది.
"సరే! ఈ కుక్కపిల్ల పేరు పెప్పీ", అంటూ పేరు ఖాయం చేసింది చిన్ని.
*** *** *** *** ***
పెప్పీ వచ్చిన రెండు మూడు రోజుల్లోనే ఇంటిల్లుపాదికీ అలవాటు పడింది. ఎవరేపని చేస్తున్నా వారి వెనక తిరుగుతూ చిన్న చిన్న అల్లరి పనులు చేస్తూ ఉండేది. కప్పలను వేటాడి పట్టుకునే ప్రయత్నం చెయ్యడం, ముగ్గులో నింపడానికని చిన్ని సిద్ధంగా ఉంచుకున్న రంగులన్నీ వంటినిండా పూసుకోవడం, ఇంటికి వచ్చిన వారి చెప్పులను తీసుకెళ్లి ఎవ్వరికీ కనపడకుండా దాచి పెట్టడం వంటి చిలిపి చేష్టలతో అందరినీ నవ్విస్తూ ఉండేది.
పెప్పీ ప్రవర్తన ఇంట్లో అందరితో ఒకే లాగా ఉండేది కాదు. చిన్ని చెప్పిన పనులు చేసినంత పని చేసి చివర్లో చెయ్యకుండా చిన్నిని బాగా పరిగెత్తించేది. పెప్పీకి బంతి విసిరితే అది ఆ బంతిని తిరిగి తన వద్దకు తేవాలని ఎంతో ప్రయత్నించేది చిన్ని. కానీ పెప్పీ చిలిపిగా ఆ బంతిని చిన్ని దగ్గరకంటా తెచ్చి ఠక్కున వెనక్కు తిరిగి చిన్నికి దొరక్కుండా పారిపోయేది. వెంకట్ తో ప్రతిరోజూ బయటకి వెళ్లి వచ్చేది పెప్పీ. దాని కోసమని అప్పుడప్పుడూ రొట్టె తెచ్చి పెట్టేవాడు వెంకట్. సూర్యం ఉద్యోగం నుండి ఇంటికి వచ్చాక పెప్పీ ఇంకెవరి దగ్గరకి వెళ్ళేది కాదు. సూర్యం ఏ పని చేసుకుంటున్నా పక్కనే ఉండేది. పెప్పీకి కాల్చిన మొక్కజొన్న పొత్తులంటే మహాఇష్టమని దానికోసం ప్రత్యేకంగా తీసుకొచ్చేవాడు సూర్యం. మామూలప్పుడు కాస్త అల్లరి చేస్తున్నట్టు కనపడే పెప్పీ గాయత్రి వద్ద చాలా బుద్ధిగా ఉండేది. గాయత్రి ఏ పని చెప్పినా వెంటనే చేసేసేది పెప్పీ. అది వేడి వేడి ఇడ్లీలు గుటుక్కున మింగడం చూసి కంగారు పడేది గాయత్రి. కానీ ఇడ్లీలన్నీ తిన్నాక ‘ఇంకా నా వాటా నాకు పెట్టలేదేం’ అన్నట్లు గాయత్రి వంక అమాయకంగా చూసేది పెప్పీ.
ఒక రోజు గాయత్రి దగ్గరి బంధువు ఒకాయన చనిపోయారు. గాయత్రి దుఃఖంలో ఉంటే పెప్పీ గాయత్రిని ఓదారుస్తోందా అన్నట్లు పక్కనే కూర్చుని ఆ రోజంతా వేరే ఆటలేవీ ఆడకుండా గాయత్రి వెంటే ఉంది. అప్పటి దాని ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయింది గాయత్రి. ఎప్పుడన్నా గాయత్రి పెప్పీని దగ్గరకు తీసి ముద్దు చేస్తే అది ముడుచుకుని పోయి గాయత్రి చీరలో దూరిపోయేది. "ఇది ఏనాటి బంధమో!", అని గాయత్రి దాని బొచ్చుని నిమిరేది.
కొద్ది రోజులలో పెప్పీ చిన్ని వాళ్ళుండే వీధిలో కూడా అందరికీ పరిచయమయ్యింది. ముఖ్యంగా పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా పెప్పీతో ఆటలాడేవారు. పెప్పీకి కూడా వారితో ఆడటం ఆనందంగా ఉండేది. చిన్ని వాళ్ళ పక్కింటావిడ వాళ్ళ పాపాయికి అన్నం పెట్టాలంటే పెప్పీని పిలిచేవారు. పెప్పీ తోకాడిస్తూ రకరకాల ఆటలాడుతూ ఉంటే ఆ పాపాయి అది చూస్తూ చప్పట్లు చరుస్తూ అన్నం తినేది. 'పెప్పీ చాలా మంచి కుక్క. అందరితో స్నేహంగా ఉంటుంది. పొరపాటున కూడా ఎవ్వరినీ కరవదు', అని అందరూ అనుకునేవాళ్లు.
అలా రోజులు గడిచే కొద్దీ, మొదట్లో కుక్కపిల్లను తేవడాన్ని కొద్దిగా వ్యతిరేకించిన గాయత్రితో సహా సూర్యం ఇంట్లో అందరికీ పెప్పీతో ప్రేమానుబంధం ఏర్పడిపోయింది. అది ఒక్క నిమిషం కనపడకపోతే చాలు - అందరూ తెగ కంగారు పడిపోయేవాళ్లు.
*** *** *** *** ***
చిన్ని, వెంకట్ లకు వేసవి సెలవలు రావడంతో వారితో గడపడానికి చిన్ని వాళ్ళ అమ్మమ్మ, తాతయ్యలు వచ్చారు. చిన్ని అమ్మమ్మ ఇంటిల్లుపాదికీ కొత్త బట్టలు, బొమ్మలు పట్టుకొచ్చింది. నాకేమి లేదా అన్నట్టు చూస్తున్న పెప్పీని చిన్ని తాతయ్య దగ్గరకు పిలిచి ఒక పెద్ద బిస్కట్ డబ్బా ఇచ్చి, "ఇవన్నీ నీకే! కానీ రోజుకి నాలుగంటే నాలుగు లెక్కగా నేనే పెడతాను. లేక పోతే నువ్వు ఇవి మాత్రమే తిని ఇంకేమి తినవు", అని అన్నారు. ఇంక పెప్పీ చిన్ని తాత చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. చిన్ని తాతయ్య, పెప్పీ మంచి స్నేహితులైపోయారు.
మరుసటి రోజు చిన్ని అమ్మమ్మ దేవుడికి పూజ చేసి అందరికీ తీర్థం ఇస్తూ ఉంటే అదేమిటోనని పెప్పీ కూడా అక్కడే నిలబడింది. "నువ్వు కూడా అందరితో పాటూ తీర్థం తాగుతావా?", పెప్పీని అడిగింది చిన్ని అమ్మమ్మ. అవునన్నట్టు తోక వేగంగా ఊపింది పెప్పీ.
అప్పుడు గాయత్రి, "అమ్మా! పెప్పీ మా ఇంట్లో అందరితో కలిసిపోయి మా కుటుంబ సభ్యులలో ఒకరిగా అయిపోయిందనుకో. నేను గురువారం నాడు దత్తాత్రేయుడి కోసం ఎదురు చూస్తూ ఉంటే పెప్పీ వచ్చింది. మాకు ఇలా "దత్త" పుత్రుడిలా మారింది", అంది నవ్వుతూ.
"సర్వ ప్రాణులలోనూ పరమాత్మ ఉన్నాడు కదా! నీక్కూడా పుణ్యం రావాలి కదా! ఇంద తాగు”, అని పెప్పీ పళ్లెంలో కొంత తీర్థం పోసింది చిన్ని అమ్మమ్మ. పెప్పీ కి తీర్థం రుచి చాలా నచ్చింది.
చిన్ని అమ్మమ్మ, తాతయ్యలు ఉన్నంత కాలం పెప్పీకి రోజూ తీర్థం తాగడం, బిస్కట్ లు తినడం దినచర్యలో భాగం అయిపోయాయి. వేసవి సెలవలు చివరికి రావడంతో చిన్ని అమ్ముమ్మ, తాతయ్యలు వారి సొంత ఊరికి బయలుదేరారు. దిగులుగా చూస్తున్న పెప్పీని చిన్ని తాతయ్య దగ్గరకు తీసుకుని, "మళ్ళీ కలుద్దాంలే “, అని గుండెలకు హత్తుకున్నారు.
*** *** *** *** ***
పెప్పీ రాకతో సూర్యం కుటుంబంలో అందరికీ రోజులు చాలా ఆనందంగా, హుషారుగా మారాయి.
ఇలా ఉండగా ఒక రోజు తనకప్పగించిన పనికి సంబంధించి రెండేళ్లపాటు సంస్థ తరఫున అమెరికా వెళ్లాలని సూర్యానికి తన పై అధికారులనుండి ఉత్తర్వులు అందాయి. ఇంటికొచ్చి ఆ వార్త చెప్పగానే వెంకట్, చిన్నిలు "భలే! భలే! మనం అమెరికా చూడచ్చు!", అని సంబర పడ్డారు.
"మనము వెడతాము సరే! పెప్పీని ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాను", అన్నాడు సూర్యం.
"ఇందులో ఆలోచించడానికేముంది? మనతో పాటే అదీనూ", అంది గాయత్రి.
"సరే! రేపు పెప్పీ వైద్యుడి దగ్గరకు వెళ్లి విమానంలో దాన్ని జాగ్రత్తగా ఎలా తీసుకెళ్ళాలో కనుక్కుని వస్తాను", అన్నాడు సూర్యం.
మరుసటిరోజు సూర్యం పెప్పీ వైద్యుడి దగ్గరకి వెళ్లి తాము పెప్పీని తమ వెంట అమెరికా తీసుకెళ్లదల్చుకున్నామన్న సంగతి చెప్పాడు.
అందుకు వైద్యుడు, "ఒక వైద్యుడిగా, మీ శ్రేయోభిలాషిగా నాదొక సలహా! ఇక్కడినుండి అమెరికాకు వెళ్లాలంటే కనీసం మీరు రెండు విమానాలు మారవలసి ఉంటుంది. మొత్తం ప్రయాణం సుమారుగా ఇరవై గంటల పైనే ఉంటుంది. పెప్పీ కుక్కపిల్ల కావడం వల్ల వయసు రీత్యా అది అంత ప్రయాణం తట్టుకోలేక పోవచ్చు. దాని ఊపిరి తిత్తులు ఇంకా పూర్తి స్థాయికి ఎదగలేదు. కాబట్టి ఆకాశంలో ఉన్నప్పుడు దానికి ప్రాణ వాయువు అందడంలో ఇబ్బందులు ఏర్పడవచ్చు. దానివల్ల పెప్పీ ప్రాణానికి ముప్పు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మీరు ఇంకొక్కసారి ఆలోచించి ఈ విషయంలో తగు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది", అని అన్నాడు.
మిగిలిన భాగం తరువాయి సంచికలో...