చెలి వినమని
అతి సరళమైన పదాలతో ఎంతో నిగూఢమైన భావుకతను ప్రదర్శించగలిగే సాహిత్య పటిమవున్న గేయ రచయితలు ఎందఱో మన చిత్రసీమలో ఉన్నారు. అటువంటి వారిలో సిరివెన్నల సీతారామశాస్త్రి గారు ముందు వరసలో ఉంటారు. ఆయన రచించిన గేయాలన్నీ విరచితాలే. అంటే ఎంతో విశేషణను కలిగి మనసును ఆకట్టుకునే భావుకత ను నింపుకుని ఉంటాయి. అటువంటిదే నాని హీరో గా వచ్చిన ‘అలా మొదలైంది’ సినిమాలోని ఈ పాట. చదువుతుంటే ఏదో వచనకావ్యం అనిపిస్తుంది. కానీ దానికి అందించిన స్వరకల్పనతో అది ఒక మధురమైన గేయంగా రూపొందింది. మీరే చదువుతూ వినండి.
చిత్రం: అలా మొదలైంది; గేయ రచన: సిరివెన్నెల; స్వరకల్పన: కళ్యాణ్ మాలిక్; పాడినవారు: హేమచంద్ర.
చెలీ వినమని..చెప్పాలి మనసులో తలపుని
మరి ఇవ్వాళే త్వరపడనా
మరో ముహూర్తం కనబడునా
ఇది ఎపుడో మొదలైందని.. అది ఇప్పుడే తెలిసిందని
తనక్కూడా ఎంతో కొంత ఇదే భావం ఉండుంటుందా
కనుక్కుంటే బాగుంటుందేమో
అడగ్గానే అవునంటుందా అభిప్రాయం లేదంటుందా
విసుక్కుంటూ పొమ్మంటుందేమో
మందారపువ్వులా కందిపోయే
ఛీ అంటే సిగ్గనుకుంటాం కానీ
సందేహం తీరక ముందుకెళితే
మరియాదకెంతో హాని
ఇది ఎపుడో మొదలైందని..అది ఇప్పుడే తెలిసిందని
పిలుస్తున్నా వినపడనట్టు పరాగ్గా నేనున్ననంటూ
చిరాగ్గా చినబోతుందో ఏమో
ప్రపంచంతో పనిలేనట్టు తదేకంగా చూస్తున్నట్టు
రహస్యం కనిపెట్టేస్తుందేమో
అమ్మాయి పేరులో మాయ మైకం
ఏ లోకం చూపిస్తుందో గానీ
వయ్యారి ఊహలో వాయువేగం
మేఘాలు దిగిరానంది
ఇది ఎపుడో... ఇది ఎపుడో... మొదలైందని... మొదలైందని...
అది ఇప్పుడే... అది ఇప్పుడే... తెలిసిందని... తెలిసిందని...