అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
శ్రీకృష్ణవేణునాదము కం. మోహనవంశీనాద మ్మూహాతీతముగ నెదల నూఁగించు నదే వాహినియై పండించును మా హృదయక్షేత్రములను మమతల పంటల్ 247 సహధర్మచారిణి శా. నా సర్వంబును నీవె కావె వనితా!(1) నా మంచిచెడ్డల్ గనన్ వీసంబైనను భేద ముండక సదా వే నోళ్ళఁ బ్రార్థింతు వే వ్యాసంగంబున నున్న వేంకటపతిన్ బత్నీమణీ! ధీమణీ! నీ సాంగత్యము తత్కటాక్షఫలమే, నిత్యంబు వర్ధిల్లుమా! 248 (1) మిక్కిలి అనురాగము కల స్త్రీ వేంకటేశ్వరదర్శనము చం. తళతళలాడు భూషణయుతాసితమూలవిరాట్స్వరూపమే లలితసుదర్శనం బిడఁ బలాయనమౌ దురితాంధకార, మా కలియుగదైవ మొక్క క్షణకాలము గన్పడఁ గల్గు మోదమున్ దెలుపఁగఁ జాల వే కృతులు(1), దివ్యము నవ్యము తత్కటాక్షమే 249 (1) కావ్యాలు/కీర్తనలు/క్రియలు శ్రీరామప్రపత్తి శా. మీరే దిక్కని నమ్మినారము కదా! మేల్సేయ రారే వెసన్ కారుణ్యామృతపూర్ణలోచనములన్ గానంగ రారే మమున్ ఘోరాంహర్విటపీకుఠారు(1) లగుచున్ క్షోణీతనూజాయుత శ్రీరామానుజులార!(2) పావనినతశ్రీమత్పదాంభోజులై(3) 250 (1) ఘోరమైన పాపము లనెడు వృక్షములకు గొడ్డళ్ళు (2) సీతారామలక్ష్మణులు (3) ఆంజనేయునిచే నమస్కరింపబడిన ప్రకాశవంతమైన పాదకమలములు కలవారై కమలబాంధవ్యము మ.కో. ప్రాక్త్రయీతనుఁ గాంచి సారసబాల లెంతొ ముదంబుతో వక్త్రముల్ వికసింప నూఁగిరి వాతపోతము వీవఁగన్ దృక్త్రపాభినయంబు సేయుచు దీధితుల్ కవయంగ నే యోక్త్ర మివ్విధి నింగినేలల నొక్కచోఁ గలిపెన్ గదా త్రయీతను = సూర్యుని, త్రపా = సిగ్గు, యోక్త్రము = త్రాడు భావము – తూర్పున ఉన్న సూర్యుని చూచి కమలములు అను బాలలు తమ ముఖములు విప్పారి, పిల్లగాలులు వీస్తూ ఉండగా, కన్నులతో (ప్రేమచేత కలిగిన) సిగ్గును వ్యక్తీకరిస్తూ, సూర్యకాంతులు క్రమ్ముకొంటూ ఉండగా, ఎంతో ఆనందముతో (సరస్సులలో) వెనక్కి, ముందుకి కదిలేరు. ఈ విధంగా సూర్యుడున్న ఆకాశాన్ని, కమలాలున్న భూమిని ఒకదగ్గర ఏ బంధమో కలిపిందికదా. 251 వేంకటేశ్వరుఁడు పం.చా. క్షణక్షణంబు రక్షయౌచుఁ గాచు దైవమై సదా యనన్యదివ్యనవ్యమంగళాకృతిన్ శ్రితాళినే కనన్ దయార్ద్రదృష్టి నిల్చుఁ గష్ట మెన్న కీ గిరిన్ గనన్ స్మరింప మ్రొక్క జన్మ గాదె ధన్య మేరికిన్? 252 ఉ. నీ చిరునవ్వుఁ జిందు ముఖనీరజమున్ గను భాగ్య మీయవే దాఁచక నీ దయామృతము దాసులపై వెదజల్లి స్వామి! నా వాచక మెంత తెల్పఁగ భవన్మహిమాన్వితలీలలన్? తనూ రోచిరనీకభాసురపురోగమనార్హపథాన నిల్పుమా! 253 ఉ. చేసిన పాపముల్ దొలఁగఁజేయు సుదర్శనదర్శనంబు నీ వాసమె యైన నా హృదయపంజర మందునఁ గుల్కు చిల్కవై తోసముఁ గూర్ప రావె, తమితోఁ దలిదండ్రుల సేవ సేయు నీ దాసుడు(1) చూప నిట్టికను ధ్యాస మరల్పక నిల్చినా వటుల్ (1)పుండలీకుడు 254