అతను చేసే ఆగడాలకు
ఆమె ఆశలన్నీ అనాధలవుతున్నాయి
అతనిపై హక్కుల సాధనకై పోరాటం చేయాలని ఆవేశంతో
పౌరుషం కళ్ళల్లోకి తెచ్చుకుంటుంది
తన నలుసులే ఉక్కు గొలుసులుగా అడ్డుగా నిలవడంతో
తన పోరాట ప్రతిమను పొత్తిళ్ళలోనే ప్రాణాలు తీసి
తన నలసులను ఎత్తుకొనే
తడిచిన కళ్ళల్లో కలలను పెంచడం మొదలెడుతుంది
అతను చదివే పుస్తకం ఆమె
ఆమె చదివే పుస్తకం అతను
వారివురూ చదివే పుస్తకం దాంపత్యం
ఆమె గుండెనిండా
ఆవేదన పంటే పండింది
అతను ఎప్పుడూ
అనుమానపు విత్తనాలే చల్లాడు మరి
అందుకే
ఒకరికొకరు కలుపుమొక్కలై మిగిలారు
మనసు తలుపులను మూసుకొని
తూలుతున్న
అతను
పడుకోవడం లేదు
మూల్గుతున్న
ఆమె
పడుకోవడం లేదు
వారిద్దరి మధ్య
మద్యం సీసా
చోటు సంపాదించుకుంది మరీ..
ఆ గుడిసెలో
చందమామ అతను
వెన్నెల ఆమె
చుక్కలు పిల్లలు
అప్పుడప్పుడు ముసురుకొనే మేఘాలు సమస్యలు
ఎందుకండి
కవిత రాయన్నంటున్నారని
అడిగింది ఆమె
నా కవిత
కొందరి భవితకు బాధ కల్గిస్తుందట
అందుకే అన్నాడతను
సూర్య కిరణపు కసి కూడా
నిసిని తినేస్తుంది
అలాగని సూర్యుడు ఉదయించడం మానేస్తాడాయని
తనలోని భావాలను సైతం
చూపులతో నాలోకి ఒంపి
కదిలిందామె
తన నుంచి తెగిపడిన పేగును
గుండెలపై పెట్టుకొని పెంచడం
ఆమెకు ఇష్టం
గుండెలపై తన్నిన తనయుడిని
తలదించుకోని తనువుగా తీర్చిదిద్దడం
అతనికి ఇష్టం
తలదించని తాటిచెట్టులా పెరిగాక
తల్లిదండ్రుల ఆస్తులను లాక్కొని
ముడతల మోసే తనువులలో సున్నితత్వం
తల్లడిల్లేలా అనాధ ఆశ్రమంలో వేయడం
తాటిచెట్టైన తనయుడికి ఇష్టం
తమోగుణపు బృందావనిలోని
ఆశల లతలకు
ఎవరి ఇష్టాలు వారివి
ఎవరి కష్టాలు వారివి
ఎవరి నష్టాలు వారివి
పరిమళించిన, వాడిపోయిన, రాలిపోయిన ఆశ్చర్యమేమిలేదు
ఈనాటి ఓ ఇంటి భార్యభర్తలే
రేపటి ఓ అనాధాశ్రమ తల్లిదండ్రులు మరి !!!