జీవజగదీశ్వరులు అనాత్మ (object) అయితే నేను (బ్రహ్మం)వాటి ఆత్మ(subject). నేను జ్ఞానం అయితే అనాత్మ నా శక్తి. నేను బింబం అయితే అనాత్మ నా ప్రతిబింబం. నేను స్వరూపం అయితే అనాత్మ నా వేషం(అవతారం). నేను విభువు నైతే అనాత్మ నా విభూతి. నేను ఆస్థికుణ్ణి అయితే అనాత్మ నా ఆస్థి. నేను ద్రష్టనైతే అనాత్మ నేను చూస్తున్న దృశ్యం. ఆత్మను, అనాత్మను వేరు చేసి చూడడం ఆత్మానాత్మ వివేకం అయితే, అనాత్మను కూడా ఆత్మలో లయం చేసి అంతా ఆత్మగానే చూడడం మోక్షం. ‘నేను’ ఆత్మ(self) అయితే నేను చూస్తున్న అనాత్మ ‘నాది’ అవుతుంది. శ్రీకృష్ణుడిలా ‘నాది’ని కూడా నాలో కలుపుకుని విశ్వరూపం దాల్చి అంతా నేనే అయితే ఆ నేను బ్రహ్మం. శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి ‘జగమంతకుటుంబం’ పాటలో , “కవినై, కవితనై, భార్యనై, భర్తనై…రవినై, శశినై, దివమై,నిశినై నాతో నేనే సహగమిస్తూ …”అనడంలో విశ్వమంతా తానై పోవడం ఉంది. బ్రహ్మం వేరు, నేను వేరు(ఆత్మ వేరు,అనాత్మ వేరు) అనుకుంటే రెండింటి మధ్య సంబంధం, సంసారం వచ్చి పడతాయి. రెండు ఉంటే రెండో దాని వల్ల భయం, దాని మీద కోరిక. జీవుడిగా ఉన్నంత కాలం ఇటు జగత్తు (ఇహం), అటు ఈశ్వరుడి(పరం) వల్ల భయం, వాటి మీద కోరిక - రెండూ జీవుణ్ణి సంసారంలోకి తోసి పనికి(కర్మకాండకు) బానిసను చేస్తాయి. జీవుడు, జగత్తును, ఈశ్వరుణ్ణి, బ్రహ్మాన్నీ తనకు వేరుగా చూస్తూ వాటి వారి గురించి వింటూ తెలుసుకుంటూ ఉన్నంత సేపూ అది అవగాహన(theory) మాత్రమే అనుభవం కాదు.
ఉపనిషత్ మహర్షులు relativity ని, సంసారాన్ని దాటి ఈశ్వరులై, తాము దాటి(transcend అయి) వచ్చిన సంసార సాగరాన్ని తమలో లయం చేసుకుని బ్రహ్మామై ‘అహం బ్రహ్మాస్మి’ అని అనుకున్నవారే. Relativity ని దాటిపోవడం స్వేచ్ఛ అయితే, దాటి వచ్చిన relativity ని తిరిగి కలుపుకోవడం బాధ్యత. బాధ్యతతో కూడిన స్వేచ్ఛే మోక్షం (utmost freedom). దాటిపోతే అనుభూతి, కలుపుకుపోతే అనుభవం కలుగుతాయి.
Relativityలో, సంసారంలో ఉన్న పార్వతిని(జీవుణ్ణి), relativity ని దాటి స్వేఛ్ఛగా, ఏకాంతంగా, సన్యాసిలా ఉన్న శివుణ్ణి (ఈశ్వరుణ్ణి) కలపాలని అందరూ సంకల్పించారు. జీవుడే పార్వతి. ఈశ్వరుడే శివుడు. శివపార్వతుల్ని ఏకం చెయ్యడమంటే జీవేశ్వరుల్ని ఏకం చెయ్యడం. అందుకోసం వారు కాముడైన మన్మధుడి సహాయం కోరారు. relativity కి, సంసారాన్ని దాటి అవతల ఉన్న శివుడిలో కామాన్ని రగిల్చి, పార్వతితో relation కోసం శివుణ్ణి relativity లోకి, సంసారంలోకి తీసుకురావాలని కాముడు ప్రయత్నించి భంగపడ్డాడు. దాంతో పార్వతి తానే relativity ని, సంసారాన్ని దాటి శివుడిలో ఐక్యమై తద్వారా మోక్షాన్ని, బ్రహ్మాన్ని పొందాలని తపస్సు చేసింది. జీవేశ్వరుల, శివపార్వతుల (అర్ధనారీశ్వరుల) ఐక్య రూపమే బ్రహ్మం. శివుడు కూడా relativity లో, సంసారంలో ఉన్న పార్వతిని, జీవుణ్ణి తనలో కలుపుకొని బ్రహ్మమై, మోక్షాన్ని పొందాలని పార్వతికోసం తపస్సు చేసాడు. శివపార్వతులిద్దరూ (జీవేశ్వరులిద్దరూ) ఒకరికోసం మరొకరు తపస్సు చేసి ఐక్యమై మోక్షాన్ని పొందారు. శివుడు కాముడి ప్రభావానికి లోనై పార్వతి కోసం relativity లో పడితే శివపార్వతులిద్దరూ సంసారంలో బందీలయ్యేవారు. మోక్షంలో జీవుడు-ఈశ్వరుడు; సంసారం -సన్యాసం అర్ధనారీశ్వరుల్లా కలిసే ఉన్నాయి. బంధంలో సంసారం ఒక్కటే ఉంటుంది.
సన్యాసాన్ని, ఏకాంతాన్ని ఇష్టపడి relatives(Relativity) ని వదిలి ఉన్న శివుడు, relatives ని (బంధుత్వాలను) ఇష్టపడి సంసారంలో ఉన్న పార్వతిని, తనలో లయంచేసుకుని అర్ధనారీశ్వరుడైనట్టు, relativity దాటి ఏకాంతంగా, సన్యాసంలో ఉన్న ఈశ్వరుడు, జీవజగత్తులను సంసారాన్ని, relativity ని తనలో లయం చేసుకుని బ్రహ్మం అయ్యాడు. బ్రహ్మం అయిన ఈశ్వరుడు కేవలం సన్యాసీ కాదు. కేవలం సంసారీ కాదు. రెండింటినీ తనలో లయం చేసుకున్న ‘జ్ఞాని’, బ్రహ్మ జ్ఞాని. జ్ఞాని సన్యాసాన్ని, సంసారాన్ని వేరుచేసి చూడడు. ఈ జ్ఞానంతోనే శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు తన ‘జగమంత కుటుంబం’ పాటలో “సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నావేలే” (రెండూ నావే)అని బ్రాహ్మీస్థి లో ఉండి పాడుకున్నారు. శూన్యం లాంటి సన్యాసం, సంసారాన్ని relativity ని కలుపుకున్నపుడే పూర్ణం అవుతుంది. ఈ పూర్ణత్వం relativityలో సంసారంలో కలిసిపోతే రాదు. సంసారాన్ని కలుపుకుంటేనే వస్తుంది. పార్వతి relativity ని, పుట్టింటిని వదిలి అత్తింటికి చేరుకుంది కానీ, శివుడు కైలాసాన్ని వదలి relativity లోకి ఇల్లరికం రాలేదు. వస్తే ఇద్దరికీ మోక్షం లేదు. ఇద్దరూ సంసారంలో, relativity లో బందీలయ్యేవారు. మనుషులు శారీరకంగా, మానసికంగా ఒక్కటి కాలేరు. పార్వతీపరమేశ్వరుల(జీవేశ్వరుల) ఐక్యం శరీరాన్ని, మనస్సునూ (relativity ) దాటి ఆధ్యాత్మిక స్థాయిలో జరిగింది.
శ్రీకృష్ణుడు జ్ఞాని. అందుకే అయన సంసారాన్నీ- సన్యాసాన్నీ; ధర్మాన్నీ- రాజకీయాల్నీ వేరు చేసి చూడలేదు. సంసారంలో ఉంటూనే, సన్యాసిలా తామరాకు మీద నీటిబొట్టులా ఉన్నాడు. రాజకీయాల్లో ఉంటూనే ధర్మాన్ని (పాండవుల్ని) విడిచి పెట్టలేదు. సంసారాన్నీ - సన్యాసాన్నీ; ధర్మాన్నీ- రాజకీయాల్నీ వేరు చేసి చూసేవారికి ఆ రెండిట్లో ఏ ఒక్కటీ ఎప్పటికీ పూర్తిగా అవగాహనకు రాదు. క్షీరసాగరాన్ని దేవతలు, రాక్షసులు కలిపి మధిస్తేనే అమృతం పుట్టినట్టు, సంసారాన్నీ, సన్యాసాన్ని కలిపి మధిస్తేనే అమృతంలాంటి బ్రహ్మానుభవం కలుగుతుంది.
ధర్మార్థకామమోక్షాలలో ధర్మం ఈశ్వరుడు(moral life). అర్ధం జగత్తు (public life), కామం జీవుడు (private life) మోక్షమే బ్రహ్మం(spiritual life). జీవ,జగత్తులను కలుపుకుపోలేని ఈశ్వరుడు బ్రహ్మం కాలేడు. అలాగే అర్ధకామాలను కలుపుకుపోలేని ధర్మం మోక్షానికి (పరిపూర్ణతకు) దారితీయదు. బ్రహ్మంలో జీవజగదీశ్వరులు ముగ్గురూ ఉన్నట్టు, మోక్షంలో ధర్మార్ధకామాలు మూడూ ఉన్నాయి కానీ ఆ మూడింటిలో ఏ ఒక్క దానిలోనూ మోక్షం లేదు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వీరి జీవితాల్లో ధర్మార్ధకామాలు మూడూ ఉన్నాయి కానీ వాటిల్లో వారు లేరు. ‘పురుషులందు పుణ్యపురుషులు వేరయా’ అన్నట్టు వారు మోక్ష స్థితిలో ఉండి ధర్మార్ధకామాలను మూడింటినీ కలుపుకుపోయారు.
భగవద్గీత ఆఖరి అధ్యాయం ‘మోక్షసన్యాసయోగం’లో ఆఖరి శ్లోకం ’సర్వధర్మాన్ పరిత్యజ్య…మామ్ ఏకం శరణం వ్రజ’ మోక్షం కోసం ధర్మాన్నీ విడిచిపెట్టమంది. కారణం ఈశ్వరుడు రెండో సమీకరణంలో చూపించినట్టు జీవజగత్తులు రెండింటితోనూ సంబంధం పెట్టుకుని వాటిని control చేస్తూ relativity (సంసారం) లో ఉన్నట్టు, ధర్మం కూడా అర్ధకామాలతో సంబంధం పెట్టుకుని వాటిని control చేస్తూ relativity (సంసారం)లోనే ఉన్నది. అర్ధకామాలను కలుపుకుపోవడం ద్వారా ధర్మం relativity ని దాటిపోయి ఏకాన్ని పట్టుకుంటేనే (మామ్ ఏకం శరణం వ్రజ) మోక్షం. ‘ఇంటికన్నా గుడి పదిలం’ ‘నికృష్టమైన శరీరం - ఉత్కృష్టమైన ఆత్మ’ అంటూ అర్ధకామాలను, ధర్మాన్నీ; జీవజగత్తులను, ఈశ్వరుణ్ణి (ఇహం-పరం అని) వేరు చేసి చూస్తే మోక్షం (పరిపూర్ణత) లేదు. అందుకే ‘కామిగాని వాడు మోక్షగామి కాడు’ అన్నారు. అల్లసాని పెద్దన మనుచరిత్ర కావ్యంలో ప్రవరాఖ్యుడు ధర్మానికీ, వరూధిని అర్ధకామాలకూ ప్రతినిధులు. పరస్పర విరుద్ధంగా కనిపించే వారిద్దరి అభిప్రాయాలకు (ధర్మానికీ, భోగలాలసతకు) మూలమైన మోక్షాన్ని, పూర్ణత్వాన్ని పొందడమే కావ్యాంశం. ధర్మార్ధకామాలు మూడింటినీ కలుపుకు పోయే సూత్రం, మంగళ సూత్రం మోక్షం. ఈ మంగళసూత్రం లేకపోతే అన్నీ ఉండీ, ఐదోతనం(వ్యక్తిత్వం) లేనట్టు. వ్యక్తి కళ్యాణం జరగనిదే, లోక కళ్యాణం జరగదు.
స్వ -అంటే నేను. ఆ నేను మోక్షస్వరూపమైన బ్రహ్మం. జీవజగదీశ్వరులు ‘స్వ’ లో ‘అంతం’ (స్వంతం) అయి స్వ- అధీనం(స్వాధీనం)లో ఉంటే అది స్వస్థత. నేను ఆ బ్రహ్మీస్థితిని కోల్పోయి జీవుడ్నయి ఇటు జగత్తుతో, అటు ఈశ్వరుడితో ఘర్షణ పడుతూ ఉంటే అది అస్వస్థత. స్వస్థత (ఆరోగ్యం) సహజం. ఎపుడూ ఉంటుంది. అస్వస్థత మధ్యలో వచ్చి మధ్యలో పోతుంది. జీవుడు, జగత్తు,ఈశ్వరుడు మూడూ బ్రహ్మంలోనే, బ్రహ్మమై ఉండడం వల్ల మోక్షం కోసం జీవుడు ఎక్కడికీ ప్రయాణం చెయ్యనక్కర లేదు. ఆలోచన, ప్రయాణం(గమనం) ఆగిపోతే ఎక్కడికక్కడే గమ్యం, బ్రహ్మం, మోక్షం. గమనమే గమ్యమని, నేను వెదికే బ్రహ్మం నేనేనని గుర్తించడమే మోక్షం.
‘స్వ’ అంటే నేను. ఈ నేను జీవుణ్ణయిన నేను కాదు. బ్రహ్మము,మోక్ష స్వరూపుడనైన నేను. ధర్మార్ధకామాలు, ‘స్వ’ - తో,మోక్షం తో connect అయినపుడు ధర్మం ‘స్వధర్మం’ అవుతుంది. అర్ధం ‘స్వార్థం’ అవుతుంది. ఇఛ్ఛ (కామం) ‘స్వేఛ్చ’ అవుతుంది. Relativity లో జగత్తు కీ, ఈశ్వరుడికీ మధ్య ఉండే జీవుడి స్వేఛ్ఛకూ, స్వార్ధానికీ పక్షపాతం(choice) ఉంది. ఈ పక్షపాత బుద్ధి తోనే జీవుడు, ఈశ్వరుడు(దైవం) ఒకరికి న్యాయం చేశాడని, మరొకరికి అన్యాయం చేశాడని అనడం జరుగుతుంది. వదిలేస్తే, పక్షపాతం లేకుండా, జీవజగదీశ్వరులను మూడింటినీ (relativityని) వదిలి ఏకాంతంగా ఏకాకిజీవితం గడిపే స్వేఛ్చ, కలుపుకుంటే, పక్షపాతం లేకుండా, అన్నింటినీ కలుపుకుని జగమంతకుటుంబం నాది, సర్వేజనా సుఖినోభ వంతు అనుకునే స్వార్ధం బ్రహ్మానిది. పక్షపాతంలేని స్వేఛ్చ, స్వార్ధం - ఇది జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన choiceless awareness. ఏదీ వద్దనే స్వేఛ్చ, అన్నీ కావాలనే స్వార్ధం- పరస్పరం విరుద్ధమైన ఈ రెండు ప్రేరణల మధ్య సమన్వయం సాధించే ధర్మం స్వధర్మం. ఇది ఎవరికి వారు స్వయంగా, స్వతంత్రంగా సాధించవలసిన ధర్మం కనుక స్వధర్మం.
ముగింపు
(జీవుడు x జగత్తు), (జననం x మరణం), (మంచి x చెడు), (సుఖం x దుఃఖం), (శరీరంxమనస్సు), ... మొదలైన ద్వంద్వాలన్నీ relatives. వాటిది విడదీయలేని బంధం. విడిచిపెడితే రెండింటినీ విడిచిపెట్టాలి. కలుపుకుంటే రెండింటినీ కలుపుకోవాలి. కానీ విడిచిపెట్టలేం. ఎందుకంటే already జీవుడిగా జన్మించి ఉన్నాం. జీవుడిగా ఉన్నందుకు జగత్తును కలుపుకు పోవాలి. జన్మించి నందుకు, మరణాన్ని కలుపుకుపోవాలి. కలుపుకుపోవడం(positive thinking)వల్లే పరిపూర్ణత సిద్ధిస్తుంది. మనలో ఉండి వెలుగు చీకటిని కలుపుకు పోయినట్టు ద్వంద్వాలను కలుపుకుపోయేది జ్ఞానమే. కాబట్టి జ్ఞానం తప్ప మోక్షానికి మరొక మార్గం లేదు. తన జ్ఞానంతో జనన, మరణాలను కలుపుకుపోయి బ్రహ్మం అయిపోవడం వల్ల బ్రహ్మానికి లాగే శివుడికి జననం లేదు- స్వయంభువు. మరణం లేదు- మృత్యుంజయుడు. బ్రహ్మానికి మల్లే లింగంలేదు - అర్ధనారీశ్వరుడు. జననమరణాలు లేని నిత్యముక్తుడు బ్రహ్మం. జననమరణాలను, relativityని తన జ్ఞానంలో కలుపుకుని వాటినుండి విముక్తి పొందిన జీవన్ముక్తుడు కూడా బ్రహ్మమే అవుతున్నాడు. కలుపుకోవడం వేరు, కలిసిపోవడం వేరు. కలుపుకుంటే అనుభవానికి వస్తుంది. కలిసిపోతే అస్థిత్వమే పోతుంది. శివుడు ఈశ్వరుడై, జీవజగత్తులను (relativityని) తనలో కలుపుకుని బ్రహ్మానుభవాన్ని, అమృతత్వాన్ని పొందాడు. మన్మధుని ప్రభావానికి లోనై జీవుడై relativity లో,సంసారంలో కలిసిపోతే ఈశ్వరుడిగా తన అస్థిత్వాన్ని కోల్పేయే వాడు. ఈశ్వర స్థాయిని వదిలి పెట్టి జీవుడై, జగత్తుతో సంబంధం పెట్టుకోవడం మొదలు చెడ్డ బేరం అవుతుంది.
గణితపరంగా, లేదా తాత్వికంగా చూసినా మూడుగా ఉన్న జీవజగదీశ్వరులు, ధర్మార్ధ కామాలు ఒక సమస్య (given problem, data). ఈ మూడింటి మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించి వాటిని ఏకం చెయ్యడమే, సూక్ష్మీకరించడమే (simplify చెయ్యడమే) సమస్యకు పరిష్కారం. పరిష్కారమే మోక్షం. సూక్ష్మీకరించడంలోనే మోక్షం ఉంది కనుక ‘సూక్ష్మంలో మోక్షం’ అన్నారు. బుద్ధితో ఈ సూక్ష్మాన్ని గుర్తించిన వినాయకుడు కుమారస్వామితో పోటీ పడి ‘మూడింటి’ చుట్టూ తిరిగి రాలేక అర్ధనారీశ్వరులై ఒకటిగా (బ్రహ్మాంగా) ఉన్న తల్లిదండ్రుల చుట్టూ తిరిగి సూక్ష్మంలో మోక్ష సిద్ధిని పొంది విజేతగా నిలిచాడు. వినాయకుణ్ణి బుద్ధి, సిద్ధి వరించి భార్యలుగా రావడం ఆయనకు సూక్ష్మ బుద్ధి, మోక్ష సిద్ధి రెండూ ఉన్నాయని ఇలా ప్రతీకాత్మకంగా (symbolic) చెప్పడం జరిగింది. శుభం, లాభం ఆయన సంతానం (by products). ఇది కూడా ప్రతీకాత్మకమే. సూక్ష్మ బుద్ధి, మోక్ష సిద్ధి ఉంటే శుభం, లాభం కలుగుతాయి. పరస్పరం ఘర్షణ పడే ధర్మార్ధకామాలు మూడూమోక్షంలో ఒకటై సామరస్యాన్ని పొందడం శుభం అయితే, మూడూ ఒకటిలో, మోక్షంలో కలిసి రావడం లాభం.
జీవజగదీశ్వరులనే అసత్ నుండి, తమస్సు నుండి, మృత్యువు నుండి ‘సత్యం,జ్ఞానం, అనంతం’ అయిన బ్రహ్మం దగ్గరికి, అమృతత్వం వైపు ప్రయాణం చెయ్యడమే ‘అసతోమాసద్గమయా’, ‘తమసోమా జ్యోతిర్గమయ’. ‘మృత్యోర్మా అమృతంగ మయ’.