Menu Close
balyam_main

సామెతలతో చక్కని కధలు

- ఆదూరి హైమావతి

అభ్యాసం కూసు విద్య

“తాతగారూ! ‘అభ్యాసం కూసు విద్య’ అంటే ఏంటండీ!" అంటూ వచ్చిన మనవడ్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని చెప్పసాగారు తాతగారు.

"నీవు ఒక సామెతతో వచ్చావంటే, ఒక కధ చెప్పమనేని నాకు తెల్సులే. చెప్తాను విను --

రదాపురం అనే గ్రామంలో జాలయ్య అనే పేదవాడు ఉండేవాడు. వాడికి ఏ విద్యారాదు. తండ్రి ‘వరదానది’ పై నావలో మనుషుల్ని అటు, ఇటు దాటిస్తూ వారిచ్చిన రూకలతో కలో గంజో పోసి జాలయ్యను పెంచాడు.

తండ్రికి వయస్సు మీరడంతో జాలయ్య ఆ నావను సరిచేసుకుని, తండ్రి చేసిన పనే తనూ చేస్తూ, ఆ ముసలి తల్లి దండ్రులను, భార్యను మరియు బిడ్డను పోషించసాగాడు.

జాలయ్యకు తండ్రితోపాటు నావలో తిరిగి తిరిగి నావ ఎలా చాక చక్యంగా నడపాలో బాగా తెల్సివచ్చింది.

రాత్రింబవళ్ళూ రెక్కలు ముక్కలయ్యేలా నావ తెడ్డేసినా, ఇంటిల్లిపాదికీ ఐదు వేళ్ళూ నోట్లోకి వెళ్ళడం కష్ట మౌతున్నది. ఐనా ఆ పని తప్ప మరే పని చేతగాని జాలయ్య వేరే దారిలేక ఆ నావ మీదే జీవనం గడపసాగాడు.

ఆ ఊరి పిల్లలు చదువు కోసం నదిదాటి జాలయ్య నావలోనే పై ఊరికి రోజూ వెళ్ళే వారు. వారిని దాటించేప్పుడల్లా, జాలయ్య చిన్నతనంలో తానూ చదివి ఉంటే తన జీవితం కొంతైనా బావుండేదని తలచేవాడు. తన బిడ్డను చదివించడానికి తనకు శక్తి లేదనీ, వాడూ తనలా నావ వేసుకోవలసిందేనని విచారించేవాడు.

ఇలాఉండగా ఆ ఏడాది వరదాపురంలో అమ్మవారి తిరునాళ్ళు పెద్ద ఎత్తున జరపాలని నిశ్చయించారు ఊరి పెద్దలు. ఉపన్యాసాలు, భజనలు, నాటకాలు ఏర్పాటు చేశారు. రోజంతా జాలయ్య కు చేతి నిండా పనే.

అతడికి పోటీ ఎవ్వరూ లేనందున, అతగాడి ఒక్కనావే వారందరికీ దిక్కైంది. జనాలను అటు ఇటు దింపడంతో శ్రమపడినా నాల్గు రూకలు కళ్ళ బడుతున్నందుకు ఎంత గానో సంబర పడసాగాడు జాలయ్య. భోజనం సైతం నావలోనే!.

“నిజంగా వరదాపురం అమ్మవారి జాతర తమ పాలిటి వరమే” అని ఆ కుటుంబం ఆనందించ సాగింది.

ఆ రోజు పెద్ద పండితుడి ఉపన్యాసం ఉందని ఎంతోమంది చుట్టు పక్కల ఊర్ల వారంతా వరదాపురం వచ్చారు. ఊరిపెద్ద "జాలయ్యా! సాయంకాలం సూర్యాస్తమయంవేళకు, పట్నం నుండి పెద్ద ఉపన్యాసకుడు వస్తున్నాడు. నదికి ఆ వైపు ఉండి జాగ్రత్తగా ఇటు తెచ్చి దించు. ఆయనతోపాటుగా ఎవ్వర్నీ ఎక్కించకు. పెద్ద పండితుడు!. నీకు నేను ఆ సొమ్మంతా ఇస్తాను, సరా?" అని చెప్పాడు.

జాలయ్య వినయంగా "తమ దయ. అట్టాగే చేత్తాను.” అని చెప్పి, వెళ్ళి ఆ సమయానికి తన నావతో అక్కడ వేచి ఉండి, ఆ పండితుల వారిని తన నావలోనే నది దాటించాడు.

ఊరి పెద్దలు ఆయనకు పూలమాలవేసి నది నుండి ఎడ్ల బండిపై అమ్మవారి గుడికి తీసుకెళ్ళారు. ఆ పండితుడు తన ఉపన్యాసంలో ‘జీవితంలో మానవులు ఆచరించవలసిన ముఖ్య మైన సూత్రాలను, తోటివారితో మెలగవలసిన విధానాన్ని ’ఎంతో చక్కగా అందరికీ అర్ధమయ్యే విధంగా వివరించి చెప్పాడు.

అంతా ఆయన పాదాలకు నమస్కారాలు పెట్టి మెచ్చుకున్నారు.

"అయ్యా! అఙ్ఞానంలో ఉన్న మాకు ఎన్నోమంచి మంచి విషయాలు చెప్పి మాకు ‘ఙ్ఞానభిక్ష’ పెట్టారు. మీ మేలు మరువలేం." అని పొగిడారు.

బట్టలు, పండ్లు, కొంతసొమ్ము ఇచ్చారు. పండితుడ్ని నది దాటించను జాలయ్య తయారుగా ఉన్నాడు.

అప్పటికి చాలా పొద్దు పోయింది. జాలయ్య రోజంతా విశ్రాంతి లేక పని చేయడంతో బాగా అలసిపోయి ఉన్నాడు. పండితుడు తన సరంజామాతో వచ్చి, నావ ఎక్కి కూర్చున్నాడు. అందరూ పొగడటాన ఆయన కాస్త ఉబ్బిపోయి ఉన్నాడు.

"ఏమోయ్! నీది ఈ ఊరేనా?" అని జాలయ్యను పలకరించాడు.

తెడ్డు వేస్తున్నజాలయ్య "అవ్ సామీ!" అని చెప్పి తన పనిలో మునిగి పోయాడు.

"ఏం చదువుకున్నావ్?" అని అడిగాడు పండితుడు తిరిగి.

"ఈ తెడ్డేసి నావను నడపడం ఒక్కటే సామీ.."

"అయ్యో పాపం చదువేరాదా? ‘చదువు రాని మొద్దు కదలలేని ఎద్దు’ అన్నారు విన్నావా! విద్య వస్తే ఎక్కడైనా నాలాగా బ్రతకవచ్చు. నీకీ నదీ, నావ తప్ప వేరే జీవితమే లేదు కదా పాపం. చూశావా నన్నెంత గౌరవించారో! పండితుణ్ణి ఐనందున. నాలా నిన్నెవరు గౌరవిస్తారు?.." అన్నాడా పండితుడు.

జాలయ్య పాపo మౌనంగా పడవ నడప సాగాడు. అతడి ముఖం చిన్నబోయింది.

"మరి నీకు కొన్ని పద్యాలైనా వచ్చా?" ………..

"ఏమీ రావు సామీ! తెడ్డేయడం తప్ప"

"అయ్యో పాపం! అభ్యాసం కూసు విద్య అన్నారు. అయ్యో నీకు భాష కూడా రాదుగా! అంటే ఏదైనా విద్య బాగా నేర్చుకుంటే అది మనకు ఎంతగానో ఉపయోగిస్తుంది. నాలాగా. నన్ను చూడూ ఎంత గౌరవం? ఏం కధా! నా కెన్ని పూలమాలలు, క్రొత్తబట్టలు, డబ్బు ఇచ్చారో! చూశావా! నీవూ చదివి ఉంటే ఇలాంటివి లభించేవి మరి."

"నేను తెడ్డేసి నావ నడిపి, కష్టం చేసి వొచ్చింది తింటాం సామీ!"

"పాపం ఎంత కష్టం! నీ జీవితం అంతా ఇలా కష్టంతోనే గడపాలి మరి."

"ఏం చేస్తాం సామీ! మా నుదుటి రాతంతే"

"ఔను. నీ నుదుట దేవుడు ఇలా నావ నడపమని, కష్టపడమనీ వ్రాసినట్లుంది.. నాకు ఇలా ఉపన్యాసాలు చెప్పి గౌరవం పొందమని వ్రాశాడు."

"ఏం చేయను సామీ! నా గతింతే ఇట్టాగే బ్రతకాలి మరి" కాస్త బాధగా చెప్పాడు జాలయ్య.

"చిన్నతనంలో చదివి ఉంటే బావుండేది"

"ఏం చేయను సామీ! మా అయ్య కూడా ఇట్టాగే తెడ్డేసి నన్ను సాకాడు, నేను ఆడ్ని, నా భార్యా బిడ్డడ్నీ సాకాల"

"ఎంత కష్టం! ఎలా బ్రతుకుతావు పాపం" అని చాలా ఎగతాళిగా జాలయ్యను చూశాడు పండితుడు.

ఇంతలో పెద్దగాలి వచ్చి, పండితుడి భుజంపై శాలువా నీటిలో పడి పోయి నీటి వాలుకు కొట్టుకు పోసాగింది.

"నా శాలువా కొట్టుకు పోతోంది పట్టుకోలేవా?" అడిగాడు పండితుడు. పై వాలున వర్షం పడటంతో నదికి వరద రాసాగింది.

"సామీ! మీ శాలవా మాట అటుంచండి. మీకు ఈత వచ్చా? నదికి వరద నీరు వస్తున్నై, తెడ్డు వేయడం కష్టమౌతున్నది. నదిలో దూకి ఈదాల." అన్నాడు జాలయ్య.

"అయ్యో నాకు ఈత రాదే! ఏంచేయను" అంటూ పండితుడు కంగారు పడసాగాడు.

"సామీ! నేను ఈది బ్రతికి బయట పడగలను. మీరు ఎలా బ్రతుకుతారు పాపం. ఇంత చదువు, పూల మాలలు, ధనం, గౌరవం  మిమ్ములను బతికించ లేకపోడం మీ తలరాత!" అంటూ నదిలోకి దూకి ఈదుకుంటూ వెళ్ళాడు జాలయ్య.

పండితుడు తన పాండిత్యం, అది సంపాదించి పెట్టిన ధనం, గౌరవంతో సహా నదిలో కొట్టుకుపోయాడు పాపం.

నీతి :- ఎవరి విద్య వారికి గొప్ప. తోటి వారిని కించపరచడం మానవత్వం కాదు.

అభ్యాసం కూసు విద్య. అందుకే విద్య అంటే చదువే కాదు మనవడా! ఏవృత్తి ఐనా సరే దాన్లో ప్రావీణ్యం ఉంటే అదే జీవితానికి ఆధారమవుతుంది." అంటూన్న తాతగారి ఒళ్ళోంచీ ఒక్కదూకు దూకి పరుగెట్టాడు మనవడు, ఆ రోజుకు కథ అయిపోయిందిగా మరి!

******

Posted in June 2019, బాల్యం

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!