Menu Close
RSharma-Danthurthi
ధన్-బాద్ – 5 (కథ)
— ఆర్. శర్మ దంతుర్తి —

పాత సైకిల్ రిపేర్ కి ఇస్తూ పొద్దుట తండ్రి సంగతి గమనించడం అయింది బాలజీకి; ఈయన మోసాలు చేస్తూ, సారా దుకాణాన్ని ప్రోత్సాహిస్తూ ఇంకా అలాగే ఉన్నాడు. ఈయన్ని మరోసారి కలిసే పని లేదు. ఇంక మిగిలిన పని తల్లితో మాట్లాడ్డం. దానికి ముందు తల్లి తనని గుర్తు పట్టడానికి, మంగళి షాపులో క్షవరం, గడ్డం తీసేయాలి. అయినా ఇన్నేళ్ళ తర్వాత అసలు తనను గుర్తుపడుతుందా? లేకపోతే ఆవిడ తనని చూసి ఎవరనుకుంటుందో?

సాయంత్రం అయిదింటికి రంగారావు తల్లి ఎవరింట్లోనో పని అయ్యాక వెనక్కి వచ్చేస్తూంటే దారిలో కలిసాడు, తమ ఇంటికి దూరంగా రోడ్డుమీద రద్దీ లేనిచోట; కళ్ళజోడు తీసి అడిగాడు, “అమ్మా నన్ను గుర్తుపట్టావా?”

ఆవిడకి కలగాపులగంగా ఆశ్చర్యమో ఆనందమో. తమ ఇంటిదగ్గిరైతే “అమ్మో, అయ్యో అంటూ ఏదో గొంతెత్తి ఏడిచేదేమో కానీ నడిరోడ్డు మీద ఏమీ అనలేక “నువ్వురా బాలాజీ, ఎప్పుడొచ్చావు ఎక్కడున్నావు?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది కన్నీళ్ళు పెట్టుకుని.

“చెప్తాను రా,” అంటూ తల్లిని రైల్వే స్టేషన్ లోకి లాక్కెళ్ళి కూర్చోపెట్టి చెప్పాడు మొత్తం కధ ఎలా తాను బొకారో ఎక్స్ ప్రెస్ ఎక్కాడో, సర్దార్జీ ఎలా ఆదుకున్నాడో అన్నీ. మరో గంటకి ఆవిడ ఏడుపు లోంచి తేరుకున్నాక తాను ఎందుకు వెనక్కి వచ్చాడో అనే మిగతా కధ చెప్పాడు.

“నాన్న షాపుకి వెళ్ళాను. పాత సైకిల్ ఒకటి తీసుకెళ్ళి. కావాలనే గుర్తు పట్టకుండా ఉండడానికి జుట్టూ గెడ్డం పెంచి కళ్ళజోడు పెట్టుకుని వెళ్ళి తెలుగూ హిందీ కలిపి మాట్లాడాను. ఇచ్చిన సైకిల్ రిపేర్ కి మహా అయితే ఆరు వందలు అవ్వొచ్చు కానీ పదిహేనువందలని అబద్ధం ఆడాడు. పదమూడు వందలకి బేరం కుదిర్చాననుకో. నన్ను గుర్తు పట్టలేదు. అదికాదు అసలు విషయం. ఇప్పటికీ జనాలని మోసం చేస్తున్నాడా, లేకపోతే మనిషి మారాడా అనేది తెలియడానికి వెళ్ళాను పాత సైకిల్ తీసుకెళ్ళి. ఏమీ మారలేదు అని తెల్సింది. నేను ఇంట్లోంచి పోయినా ఆయన మారడన్నమాట. ఇంకా రోజూ తాగుతున్నాడా?”

“డబ్బులుంటే తాగుతున్నాడు.”

“నిన్ను కొట్టడం సంగతో?”

“అదీ ఆపలేదు కానీ ఆ గోల ఎక్కువైతే నేను ట్యూబ్ తో రెండు దెబ్బలు వేయడం నేర్చుకున్నాను; దాంతో కొట్టడం సగం తగ్గినట్టే లెక్క. కానీ మరీ ఎక్కువ తాగిననాడు తప్పడం లేదు.”

“సర్దార్ మీ ఇద్దర్నీ నాతో పాటు తీసుకురమ్మన్నాడు. కానీ ఇప్పుడు నాన్నని చూసాక, నువ్వు చెప్పింది విన్నాకా ఆయనకీ నాకూ తీరిపోయింది. ఆయన్ని తీసుకెళ్ళకూడదని నిశ్చయించుకున్నాను. తీసుకెళ్తే ఈయన అక్కడ రెచ్చిపోయి నా జీవితం నాశనం చేస్తాడు. నీకు నాతో రావాలని ఉంటే చెప్పు మూడు రోజుల్లో వెళ్ళిపోదాం. మళ్ళీ ఇటు వైపు రానవసరం లేదు. నీకు ఇష్టం లేకపోతే సరే, నేను ఒక్కణ్ణీ వెనక్కి వెళ్ళిపోతాను కానీ మరోసారి నన్ను ఎప్పటికీ చూడలేవు. నువ్వు నన్ను కనడం అయితే కన్నావు కానీ సర్దార్ నన్ను చేయిపట్టుకుని బతికించాడు. ఆయన లేకపోతే నేను ఏమై ఉండేవాణ్ణో. నేను ఇలా వచ్చానని మాత్రం నాన్నకి చెప్పకు సుమా.”

“ఇప్పుడెక్కడ ఉన్నావురా?ఈ ఊళ్ళో?”

“ఇప్పుడు అవన్నీ ఎందుకే అమ్మా, నువ్వు నాకూడా వస్తావా రావా?”

“… … … …”

“ఆదివారం బొకారో ఎక్స్ ప్రెస్ రాత్రి పదకొండున్నరకి, నీ కూడా ఏమీ తెచ్చుకోనవసరం లేదు. అంతగా కావలిస్తే చేతి సంచీలో బట్టలూ, దాచుకున్న డబ్బులూ ఏవైనా ఉంటే తెచ్చుకో. నువ్వు పదకొండున్నరకి స్టేషన్ కి రాకపోతే నీకిష్టం లేదని అనుకుంటా. నాన్నకి గానీ నేనొచ్చినట్టు చెప్పావంటే మన ఇద్దరికీ కూడా తంటా.” తల్లి ఏమాటా చెప్పకపోవడం చూసి వెళ్ళడానికి లేచాడు బాలాజీ.

మర్నాడు బాలాజీ తిరుపతి వెళ్ళాడు. దేవుడి మీద నమ్మకం కోసంకాదు కానీ తిరుపతి అంటే అప్పటికే బాగా విని ఉండడం వల్లా, ఆదివారం దాకా వేరే పనేమీ లేనందు వల్లా. శనివారం సాయంత్రం వెనక్కి వచ్చి తండ్రి సైకిల్ షాపులోకి చూసాడు దూరం నుంచి. రంగారావు ఏదో అవస్థ పడుతున్నాడు తానిచ్చిన పాత సైకిల్తో.

మరోసారి మధ్యాహ్నం తల్లిని రైల్వే స్టేషన్ లో కలిస్తే అవిడ చెప్పింది “నువ్వు కలిసిన రోజు రాత్రి, పాత సైకిల్ కి రిపేర్ చేయడానికి ఎవరో హిందీ ఆసామీ వచ్చాడు, ఈ రోజు మంచి బేరం వచ్చింది అని చెప్పి నాకు వంద రూపాయలు ఇచ్చాడు. తర్వాత కధ మామూలే; తాగి వచ్చి వాగుడు. తర్వాత నన్ను కొట్టడం. కాసేపటికి పడుకున్నాడనుకో….”

బాలాజీ మొహంలో అసహ్యం ధ్వనిస్తుండగా చెప్పాడు “నేను చెప్పానుగా ఆయన మారడని? ఆయన ఇచ్చిన వంద రూపాయలు అక్కడే పారేయ్. డబ్బులింకా చేతిలో ఆడుతున్నాయి కనక రేపు ఆదివారం సాయంత్రం కూడా తాగి వచ్చి పడుకుంటాడు. ఆయన పడుకోగానే బయల్దేరు తొమ్మిదింటికే, అర్ధరాత్రి వరకూ చూడక్కర్లేదు.”

“తర్వాత నాన్నఎలా బతుకుతాడ్రా?”

బాలాజీకి ఒక్కసారి కోపం ఉవ్వెత్తున తన్నుకొచ్చింది, కానీ తమాయించున్నాడు. “నన్ను శరీరం తూట్లు పడేటప్పుడు కొట్టినప్పుడు కానీ నిన్ను రోజూ కొట్టేటప్పుడు కానీ మనం ఎలా బతుకుతామో ఆలోచించాడా అయన? ఇప్పటివరకూ అసలు నువ్వు నాన్నతో ఎందుకు ఎలా కలిసి ఉన్నావమ్మా? ఇప్పటికి కూడా నువ్వు నాలుగిళ్లలో పనిచేస్తూ తిండి పెడితే నువ్వు సంపాదించిన పెట్టిన తిండే తిని, నిన్ను కొడుతున్నాడు కదా? ఏమైనా సరే, ముందు చెప్పాను కదా, నేను రేపు వెళ్ళిపోతున్నాను. నువ్వు వస్తే మనిద్దరం లేకపోతే నేనొకణ్ణే. వెళ్ళేది నేనొకణ్ణే అయితే మరోసారి నీకు కనిపించను; నీ ఇష్టం మరి.” బాలాజీ చెప్పాడు లేచి వెళ్ళడానికి సిద్ధమౌతూ.
*********
ఆదివారం సాయంత్రం రంగారావు ఎప్పటిలాగానే తాగొచ్చి వాగుతూ ఉంటే వాళ్ళావిడ చూస్తూ కూర్చుంది. తాను కొడుకు కూడా వెళ్ళాలంటే మరో అయిదు గంటలు మాత్రమే ఉన్నాయి. తాను పోయాక ఈ తాగుబోతు ఎలా బతుకుతాడో? ఇంటింటికీ తిరిగి అడుక్కుంటాడో లేకపోతే ఏమౌతుందో? తనకే యాభై దాటాయి. ఇప్పటికి దాదాపు ముప్ఫై ఏళ్లనుంచి వళ్ళు వాచిపోయింది ఈ పెద్దమనిషి కొట్టే దెబ్బలు తిని. తాను కొట్టడం వల్ల కొడుకు ఇంట్లోంచి పారిపోయాడని కానీ పెళ్ళాం సంపాదించి తిండి పెడుతోందని కానీ సిగ్గూ ఎగ్గూ ఏమీ లేదు ఈ మనిషికి. బాలాజీ చెప్పనే చెప్పాడు కదా “నన్ను కొట్టినప్పుడు కానీ నిన్ను కొట్టినప్పుడు కానీ మనం ఎలా బతుకుతామో ఆలోచించాడా అయన? ఇప్పటి వరకూ అసలు నువ్వు నాన్నతో ఎలా కలిసి ఉన్నావమ్మా?” నిజమే కదా? రేప్పొద్దున్న తనకి రోగమో రొచ్చో వస్తే వీడు తనని సర్కార్ అసుపత్రిక్కూడా తీసుకెళ్లలేడు. ఆవిడ ఆలోచనలు తెగ్గొడుతూ రంగారావు అరుపు వినబడింది, “ఏమే తినడానికేమైనా ఉందా? లేకపోతే పోయిన ఏబ్రాసి కొడుకు గురించి ఇంకా ఏడుస్తున్నావా? డబ్బు ఎలా సంపాదించాలో నేర్పిద్దారి అని రెండు దెబ్బలేత్తే గాంధీ గారి కబుర్లు చెప్పి ఇంట్లోంచి పారిపోయేడు. కనిపిస్తే వళ్ళు చీరేద్దుని ముండాకొడుకుని…”

లేచి గిన్నెలో ఉంచిన అన్నం, తాను పనిచేసేవారి ఇంట్లోంచి తెచ్చిన కూరా నారా కలిపి రంగారావు ముందు పెట్టి మరో మూలకి పోయి కూర్చుంది ఆవిడ. ఆవిడ మనసులో జరిగే మధనం ఆవురావురుమంటూ తిండి తినే రాక్షసుడికి ఏమీ తెల్సినట్టు లేదు. అరగంట పోయాక వళ్ళు విరుచుకుని చాపమీద పడ్డాడు పడుకోవడానికి రంగారావు.

గంట పది దాటిందా? ఇంట్లో చుట్టూ చూసింది రంగారావు వాళ్ళావిడ. కొడుకు ఒకవైపు నుంచి తన బలమైన చేయి అందించి ‘తోడిస్తాను నాతోరా’ అని పిలుస్తున్నాడు పైలోకంలో మంచి జీవితానికి తీసుకెళ్ళడానికా అన్నట్టు. రెండో వైపు ఈ రాక్షసుడు మురికికూపంలో తన చేయి పట్టుకుని ప్రతీరోజూ తనతో పాటు నరకానికి లాగుతున్నాడు. ఒక చేయి పట్టుకుని వెళ్ళడానికి, రెండో చేయి విడిపించుకోవడానికి తనకి ఇదే ఆఖరి రోజు. ఉన్నది మరో గంటన్నర సమయం. ఎందుకో ఉద్ధృతంగా ఏడుపు వచ్చింది ఆవిడాకి తన జీవితం తల్చుకుని. అరగంట పోయాక తేరుకుని ఏదో నిశ్చయించుకున్నట్టూ చేతిసంచీ తీసి చూసింది. అందులో కనిపించినవి రెండు పాత చీరలు. రెండు వందల రూపాయలు తాను ఈ రాక్షసుడికి కనబడకుండా దాచుకున్న డబ్బు. జైల్లోంచి విడుదల చేసాక స్వాత్రంత్రం వచ్చినవాడికి వంటిమీద బట్టలూ, తినబోయే తిండీ అనే విషయాలేమీ పట్టనట్టూ అన్నీ అక్కడే వదిలేసి ఇంటి తలుపు దగ్గిరగా వేసి ఉఠ్ఠి చేతుల్తో వెనక్కి కూడా చూడకుండా రైల్వే స్టేషన్ వేపు నడిచింది రంగారావు భార్య.

నాయుడిపేట రైల్వే స్టేషన్లో బోర్డు మీద రాసిన “బొకారో ఎక్స్ ప్రెస్స్ రాక 23:48, పోక 23:50” అనే అక్షరాలు గుడ్డి వెల్తుర్లో కనబడీ కనబడనట్టు మెరుస్తున్నై. ప్రతీరోజూ యధావిధిగా కనీసం గంట లేట్ గా వచ్చే బొకారో ఎక్స్ ప్రెస్ ఆ రోజు సరైన సమయానికే వస్తోంది.

బండి కదిలి ఆఖరిసారి కోచ్ లోకి ఎక్కేవరకూ ప్లాట్ ఫాం మీద తల్లికోసం వేయికళ్ళతో చూసిన బాలాజీకి ఆవిడ కనబడలేదు. ఒక్క నిట్టూర్పుతో పై బెర్త్ మీదకి ఎక్కి పడుకున్నాడు. బొకారో ఎక్స్ ప్రెస్ కదిలి ఆఖరి పెట్టె ఊరి ప్లాట్ ఫాం దాటుతూంటే ఒక్క ఉదుట్న ఆగింది ఎందుకో, ఎవరో చైన్ లాగినట్టూ. కాసేపటికి కిందన ఎవరో మాట్లాడుకుంటున్న విషయాలు వినబడుతున్నాయి – బండి కింద ఎవరో పడ్డారుట రైల్వే క్రాసింగ్ దగ్గిర. కదలడానికి మరో అరగంట పట్టొచ్చు. తల్లి గురించి ఆలోచిస్తూ, ఆవిడ జీవితం తండ్రి చేతుల్లో దెబ్బలు తింటూ అలాగే తెల్లారిపోతుందేమో పాపం అనుకుంటూ అలాగే బెర్త్ మీద పడుకున్న బాలాజీ నిద్రలోకి జారుకున్నాడు.

నలభై నిముషాలకి లైన్ క్లియర్ అయ్యాక మరోసారి బొకారో కదిలింది వచ్చిన సమయానికి నలభై నిముషాల ఆలస్యం కలుపుకుని. తాగుడికి బానిసైన తన తండ్రి ప్రతీరోజూ చూపించే నరకంలోంచి తప్పించి తల్లిని తనతో తీసుకెళ్దాం అనుకున్న బాలాజీని, ఛిన్నాభిన్నమైన అతని తల్లి శరీరం లోంచి రైలు పట్టాలమీద కారిన రక్తం మరకలు చెరుపుతూ బొకారో ఎక్స్ ప్రెస్ వేగం పుంజుకుని ధన్ బాద్ వేపు కదిలిపోయింది.

****అయిపోయింది****

Posted in December 2025, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *