Menu Close
Ayyagari-Suryanarayana-Moorthy
గోదాచరితము
అయ్యగారి సూర్యనారాయణమూర్తి
చం. తులసివనాన బాలికగఁ దోయరుహానన లక్ష్మి ప్రాప్తమై 
       యలరుచు విష్ణుచిత్తుని గృహంబునఁ బెంపుడుకూతు రయ్యెఁగా
       నలరులమాల వోలెఁ గడునందము, కోమలమౌటఁ ‘గోద’(1)గాఁ
       బిలువఁ దొడంగె ప్రేమమెయిఁ బెంచుచు నామెనుఁ దండ్రి ప్రీతితో
                  (1) తమిళములో ‘కోద’ అంటే మాలిక అని అర్థము

ఉ. ఒప్పుగ మాలలల్లి తన యొంటిపయిన్ మును దాల్చి గోదయే
     తప్పక వేళ కీయఁగను దత్పరతన్ గొని నిత్యపూజలోఁ 
     జెప్ప నశక్యమౌ విధినిఁ జెల్వుగ స్వామి కమర్చె శ్రద్ధమై 
     యప్పరమాత్మదాసవరుఁ డప్పడు(1) నిశ్చలభక్తియుక్తుఁడై
                  (1) తండ్రి యైన విష్ణుచిత్తుడు

చం. తలఁపులు రంగనాథుపయిఁ దప్పక నిల్పుచుఁ బెద్ద దౌచుఁ దా
       వలచి వరింపఁగాఁ దొడఁగె స్వామిని భర్తగ నొందు కోర్కె, గో 
       కులముగ నెంచి గ్రామమును(1), గోపికగా ననుభూతిఁ జెందుచున్
       జెలులను బిల్చి నో మొకటి చేయు విధంబును దెల్పురీతిగన్
                  (1) శ్రీవిల్లిపుత్తూరును

ఉ. ముప్పది పాశురమ్ములను ముద్దుగ గోద రచించి పాడఁగాఁ
     జెప్ప నసాధ్యమౌ ముదముఁ జెందుచుఁ గైకొనె రంగనాథుఁడే
     యప్పరమాత్ము ప్రాణసతి యయ్యెను గోద వివాహవేదికన్
     జెప్పిన విన్న నీ చరితఁ జెందరె భాగ్యము స్వామి సత్కృపన్?

శా. ‘ఆండాళ'న్నను ‘దేవునే వశునిఁ జేయంగల్గు స్త్రీ’ యర్థ మౌ
      నాండాళే మన కుండ రంగపతి నిత్యంబున్ గృపన్ జూడడే?
      యండౌ తల్లియుఁ దండ్రి వారె యిఁక నన్యం బేల చింతింపఁ? గై 
      దండన్(1) దామె యొసంగఁ జాలు భవమే ధన్యంబు ధాత్రీస్థలిన్
                  (1) చేయూత

శా. “గోవిందా” యను నామ మందె నిలుచున్ ‘‘గోదా” స్వయంభూవిధిన్
      “గోవిందా” కడుప్రీతిపాత్రమగుఁగా గోపాలకృష్ణయ్యకున్
      తావిం(1) దాల్చు సుమాలమాలలను దాఁ దాల్చెన్ గదా గోదయే
      గోవిందార్పణ ముందు, విందగు నదే(2) కొల్వొందె నామాళిగా(3)
                  (1) సువాసనను (2) గోవింద శబ్దమే (3) గోవిందనామాలుగా

********

Posted in December 2025, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *