గుదిబండల్లా అనిపిస్తున్నారు
ఎంత చేసినా ఇంతేనా అంటూ
సాధించటమే తన స్వాధ్యాయంగా పెట్టుకున్న సాధ్వి
అతని భార్య ఐనప్పుడు
బుజ్జగించే కొద్దీ బుజాలపైకెక్కి గిచ్చిపోతూ
ఓర్చుకొనే కొద్దీ రెచ్చిపోయే కంత్రీ
అతని కొడుకైనప్పుడు
క్షమించాల్సిన వయసులో కోపిస్తూ
గోటితో పోయే విషయాలను గొడ్డలికి గురిచేసే అవివేకి
అతని తండ్రీ అయినప్పుడు
భార్యావిధేయుడనే నిందకు అతనిని బలి చేస్తూ
గొంతెమ్మ కోర్కెలతో గోడెక్కి కూర్చునే మూర్ఖురాలు
అతని తల్లైనప్పుడు...
ఐనా అన్నిటినీ ఓర్చుకుంటూ
అందరినీ తన దారిని చేర్చుకొంటూ
ప్రారబ్దాన్ని అనుభావిస్తున్నాననే జ్ఞానంతోనే
అతను జీవిస్తున్నా
చూసేవారికి మాత్రం వీరంతా
అతని మెడకు తగులుకున్న
గుదిబండల్లానే అనిపిస్తున్నారు.