Menu Close
Kadambam Page Title
కలలు కూలిన శబ్దం
-- గవిడి శ్రీనివాస్ --

సమయం ఎగురుతున్నప్పుడు
కలలు పండించుకోడానికి
పరుగులు పెడతాం.
సర్వం సిద్ధం చేసుకున్నాక
క్షణాలు నీవి కానప్పుడు
ఏదైనా జరగొచ్చు.

కూచున్న చోట కూలిపోవచ్చు.
చదువుకుంటున్న చోట
పిడుగులు రాలి పడవచ్చు.
ఎగురుతున్న విమానం
ఊపిరి ఆగిపోవచ్చు.
ఊహకు అందని శాపమై
కూచున్న వాళ్ళ మీద
విమానం కూలవచ్చు.

రేపటి ఆశల కోసం
కలలతో ఎగురుతున్న జీవి
నేలపై రాలిపోవచ్చు.
కొత్త ఇంటి కల విరిగి పోవచ్చు.

ప్రజా ప్రతినిధి సేవ
అర్థాంతరంగా ఆగిపోవచ్చు.

పసిపిల్లల నవ్వులు చిదిగి పోవచ్చు.

రాజ్యాధినేతలైనా
తారలైనా
వైద్య రూపేణా
సేవా నిరతి పారాయణులైనా

కొందరి నిర్లక్ష్యాలు
అనుకోని సంక్లిష్ట పరిస్థితులు
కొంతమందిని
అర్థాంతరంగా అదృశ్యం చేయవచ్చు.
మసైపోవచ్చు.
ఆనవాళ్లు కనిపించని ముక్కలై పోవచ్చు.

ఒక్కో సారి
కలలు కూలిన శబ్దం
ఎరుపు రంగు పులుముకుని
ఎన్నో బతుకుల్లో
కన్నీటి ప్రవాహాల్ని
గుండెలు ముక్కలయ్యే
దుఃఖపు భారాన్ని
మిగిల్చి పోతుంది కాలం....!

Posted in December 2025, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *