15
ఆ మరునాడు, తమ్ముణ్ణి నిలదీసింది. "నీవు అడిగావని నాన్నని ఒప్పించి నీ సంతోషం కోసం నీకు ఎలక్ట్రిక్ బైక్ కొనిపిస్తే... నాన్నగారిని నీవెంత బాధపెట్టావో నీకు అర్ధమయిందా పునీత్? అమ్మ కూడా తిండి మానేసి నీ గురించే ఆలోచిస్తుంది. నీవు సరైన సమయం చూసుకుని వెళ్లి వారికి సమాధానం చెప్పి, మరో మారు ఇలా జరగదని భరోసా ఇచ్చి, క్షమార్పణ అడుగు. లేదంటే నేను నిన్ను ఇకనుండి అస్సలు సహించను, సపోర్ట్ చేయను." అని తేల్చి చెప్పింది పారూ. తమ్ముడు ఎలా తీసుకుంటాడో అని లోలోపల కలవరపడుతూ వెనుతిరిగింది.
వెనుక నుండి "అలాగే అక్కా, నీవు కూడా వెంట రా." అన్న పునీత్ మాటల్ని సంతోషంగా స్వాగతించింది. పునీత్ ని తానే అమ్మానాన్నల వద్దకి తీసుకుని వెళ్లి సమావేశపరిచింది.
'తానసలు అలా లిక్కర్ తాగాలని ఆలోచించలేదని, సరోజ ప్రోత్సాహంపై అలా జరిగిందని, ఇకపై ఎన్నడూ అలా జరగదని...తెలిపి, "తప్పయిపోయింది నాన్నా" అంటూ అమ్మానాన్నల ముందు తల వంచుకున్నాడు పునీత్.
పునీత్ మాటలతో పరిస్థితి కాస్త తేరుకుంటుందనే భావించింది పారూ.
***
'ఆనందోబ్రహ్మ' సినిమా ప్రొమోషన్స్ తో పాటు పరమేశ్వరి పాడిన పాటలు కూడా రిలీజ్ అయ్యాయి. హైదరాబాదులో జరగనున్న సినిమా రిలీజ్ ఈవెంట్ కి పారూ కుటుంబానికి ఆహ్వానం అందింది. ఈవెంట్ కి హాజరయ్యేందుకు పారూతో పాటు తల్లితండ్రులు కూడా హైదరాబాద్ చేరారు.
ఈవెంట్ కి వెళ్లే ముందు రామనాధం గారింట కాస్త సమయం గడిపారు పారూ వాళ్ళు. పారూని అభినందిస్తూ,
"అయితే, మరి పరమేశ్వరి ఇకపై సినిమాల్లో నటిస్తుందా? అవకాశం వస్తే పాట-నటన కూడా సాగిస్తుందా?" అని ప్రశ్నించారు రామనాధం గారు ఆమె తల్లితండ్రుల్ని.
"ముందుకు సాగి వృత్తిపరంగా సరయిన నిర్ణయాలు తీసుకోవాలని, సంప్రదాయ పద్దతిలోనే ముందుకు నడవాలని ఆది నుండి మా అందరి అభిప్రాయం. సినిమా, టీవీ లలో నటించడం ప్రధాన ఉద్దేశంగా కాక గానం మీదనే దృష్టి పెట్టి ముందుకు సాగాలని కూడా మా నిర్ణయం." అని వివరించాడు రామ్.
"నిజమే అన్నయ్యగారు. సరిగ్గా ఆలోచించారు. త్వరలో పారూకి ఇరవైయొక్క సంవత్సరాలు నిండుతాయి కదా! వెంటనే కాకపోయినా వచ్చే రెండేళ్ళలో మంచి సంబంధం దొరికితే పెళ్లి చేస్తారుగా!" అంది వకుళ.
పారూకి నచ్చినవాడు, సంగీతం అంటే ఇష్టముండి, ఆమెని ప్రోత్సహించే వరుడైతే పెళ్ళి చేయడానికి మేము సిద్దమే.”అన్నాడు రామ్.
"మరి నీవేమంటావమ్మా పరమేశ్వరి?" అన్న శ్రీనాధం గారి ప్రశ్నకి 'తనకంటూ ఎటువంటి అభిప్రాయం లేదని, పెద్దవాళ్ళ ఇష్టప్రకారమే తాను నడుచుకుంటా'నని జవాబిచ్చింది పారూ.
***
ఆస్ట్రేలియాలో జరగనున్న కచేరీలకి సంగీత సాధన, కాస్ట్యూమ్స్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ప్రతి విషయాన్ని కిరణ్ తో సంప్రదించి, అతని ఆమోదం పొందడం అలవాటయింది పారూకి. అది గ్రహించిన రామ్ కూతురి మనసు అర్ధం చేసుకుని నవ్వుకున్నాడు.
కుదిరితే పునీత్ ని తమ కూడా ఆస్ట్రేలియాకి తీసుకుని వెళ్ళడం వల్ల తమ్ముడిలో ఒక నమ్మకాన్ని, సద్భావాన్ని కలిగించవచ్చన్న ఆమె ఆలోచనని కిరణ్ కూడా ప్రోత్సహించడంతో, తల్లితండ్రులని అందుకు ఒప్పించింది పారూ.
ఆస్ట్రేలియా లోని నిర్వాహకుల నుండి ప్రయాణ సమాచారాన్ని అందుకుని, తమ సొంత ఖర్చుతో పునీత్ జననీల ఫ్లైట్ ని సమన్వయ పరుచుకున్న పారూ, నిర్వాహకులకు తెలియజేసింది.
అలా పునీత్, జననీల మనస్సుల్లో సంతోషాలని నింపి, కుటుంబాన్ని ఒకే తాటి మీదకి తేగలిగిన ఆ అమ్మాయి సమర్ధత ఇంట్లోని పెద్దలని ఆశ్చర్య పరిచింది. పారూ నిస్స్వార్ధత, మంచితనం వారి మనసులని ఆనందంతో నింపేసింది.
"తల్లీ... పారూ! ఇక నీ తోబుట్టువులకి నీమీద కోపతాపాలు, ద్వేషాలకి తావుండకపోవచ్చు." అంటూ మనమరాలిని ప్రశంసలతో ముంచేసింది అమ్మమ్మ. హత్తుకుని, కంటనీరు పెట్టుకుంది తల్లి. తల నిమిరి నుదుటిపై ముద్దు పెట్టాడు తండ్రి.
ఆ క్షణం పారూ హృదిలో నిలిచి పోయింది. ఆ రోజు తనకి మరువలేని పర్వదినం అనుకుంది పారూ. తన కుటుంబం నిత్యం సంతోషంగా, హాయిగా, ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంది.
***
'ఆనందోబ్రహ్మ' సినిమా విడుదలయ్యి గాయనిగా పరమేశ్వరికి గొప్ప పేరు, వర్ధమాన నటిగా గుర్తింపు తెచ్చి పెట్టింది. విదేశీ పర్యటనకి రెండు నెలలకి ముందు పెర్త్ నుండి హర్షించదగ్గ మొత్తంలో పారితోషకం అడ్వాన్స్ గా అందుకుంది.
ఆ మరునాడే, ఆలయంలో తోబుట్టువులతో కలిసి అన్నదానం, అమ్మమ్మ చేత పేదవారికి వస్త్రదానం, తల్లితండ్రుల చేత కమ్యూనిటీ చర్చి లోని పిల్లలకి కానుకలు అందించే కార్యక్రమాలు చేసింది.
మాలిని, జోసెఫ్ ల ఇంటికి వెళ్లి వారికి పాదనమస్కారం చేసి, వారి ఆశీస్సులు పొందింది. వారి ఆదరణ, ఆప్యాయతలతోనే తన బాల్యం గడిచిందని గుర్తు చేసి కృతజ్ఞతతో కన్నీళ్లు పెట్టుకుంది.
"ఏమిటి పారూ! ఈరోజు ఇలా ఇన్ని కార్యక్రమాలు వరస పెట్టి చేస్తున్నావు? ఏమిటి విశేషం?" అని మాలిని అడిగినప్పుడు,
"ఏమీలేదు పిన్నీ! నాకు ఊహ తెలియక ముందు నుండే .. నేను, నా కుటుంబం కూడా ఎన్నెన్నో అవరోధాలని అధిగమించామంటే నీవే కదా పిన్నీ కారణం. నా వృద్ధిలో, మా అభివృద్ధిలో మీరే కదా ముఖ్యపాత్ర వహించింది. పునీత్ బాగు కోసం నిత్యం అలోచించి వాడి విషయంలో మీ సాయం మరువ గలమా? ఈ రోజున వాడు దారిలో పడతాడు అన్న నమ్మకం ఏర్పడింది పిన్నీ. కొడుకు బాగోగులు అమ్మానాన్నలకు చాలా ముఖ్యం. నాకు మీవంటి ఆప్తులని ప్రసాదించినందుకు ఈ రోజు ఇలా ఆ దేవుడికి, మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను." అని జవాబిచ్చింది పారూ.
"మంచిదానవు పారు నీవు. మా జీవితాల్లోనూ సంతోషాలు నింపావమ్మా." అంటూ పారూని హత్తుకుని ముద్దు పెట్టుకుంది మాలిని.
***
పొద్దుటే కిరణ్ ఫోన్ చేస్తే వెంటనే తీసింది. "నిన్నంతా నన్ను ఫోన్ చేయవద్దన్నావు. ఎంతలా వేచి ఉన్నాను బావా?" అంది పారూ.
"చెప్పానుగా ప్యారీ. నిన్నంతా కాలేజీ టెన్నిస్ టోర్నమెంట్. నేనే నిర్వహించాలి కూడా. అందుకే.. సరే చెప్పమ్మా ఏమిటి సంగతి?" అడిగాడు కిరణ్.
కిలకిలా నవ్వింది. ప్యారీ'? ... పారూ కి కొత్త పేరా? బావా! నాకీ కొత్త పేరు నచ్చింది. కానీ అందరి ముందూ అనేస్తావేమో జాగ్రత్త. నాకేం పర్వాలేదు. నిన్ను చూసే నవ్వుతారేమో." అనేసింది మళ్ళీ నవ్వుతూ.
"నాకేమి భయం? సరే... మీ టూర్ డేట్స్ ని బట్టి... మనం ఒక పెద్ద వేడుకని గురించి ఒక స్థాయిలో ప్లాన్ చేయాలి. ఆ తరువాతే ముందుకి సాగి నా జీవితంలో ఏమి చేయాలో ఆలోచిస్తాను. పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అవ్వడమా? లేక అమెరికాకో, రష్యాకో..." అంటూ ఆగాడు.
క్షణం పాటు మౌనం వహించింది పారూ. "కొంపదీసి నాకు చెప్పకుండా పెళ్లి ప్లానింగ్ చేసుకుంటున్నావా ఏంటి? పెళ్లికూతురు సెట్ అయిందా? అయినా ఇంతలోనే నన్ను అంత దగా చేస్తావా?" అంటూ మళ్ళీ నవ్వింది పారూ.
"ఈ సారి కలిసినప్పుడు చూపిస్తాను పెళ్ళికూతుర్ని. ఇంతకీ నీవు చెప్పాలనుకున్న విశేషాలు .. ఏమిటో చెప్పు.”అని కిరణ్ అడగడంతో...
గత రెండు రోజులుగా తోబుట్టువులని తాను దారికి తెచ్చుకున్న వైనం, గుడిలోనూ, చర్చి లోనూ చేసిన పుణ్యకార్యం, ఆస్ట్రేలియా ప్రోగ్రామ్స్ నిమిత్తం అందిన అడ్వాన్స్ గురించి చెప్పింది పారూ.
"బాగుంది. అభినందనలు డియర్! నీ కాస్ట్యూమ్స్ ట్రయల్ ఎప్పుడు? వచ్చే వారం శనాదివారాలు పెట్టుకో. నేను హైదరాబాదు వస్తాను. అమ్మా, నాన్నా వ్రతం చేస్తున్నారు. నిన్ను చూడాలని ఉంది." అన్నాడు కిరణ్.
"ఓకే సర్, అలాగే.. నేను అక్కడ హిందుస్తానీ మ్యూజిక్ గురువుని ఓసారి కలిసి ఆన్-లైన్ క్లాసులకి నమోదవ్వాలి కూడా. అమ్మమ్మ ఆజ్ఞ", "మళ్ళీ మాట్లాడుతాను బావా! నాన్న పిలుస్తున్నారు." అని ఫోన్ పెట్టింది పారూ.
***
హైదరాబాదుకి తమ్ముణ్ణి తోడు తీసుకు వెళ్ళింది పారూ. పొద్దుటి ఫ్లైట్ కి వచ్చిన వారిని పికప్ చేసుకుని, బయటనే బ్రేక్-ఫాస్ట్ చేసి ఇల్లు చేరాడు కిరణ్. కిరణ్ తో స్నేహంగా కబుర్లు చెబుతున్న పునీత్ ని చూసి సంతోషించింది పారూ.
కారు దిగి ఇంట్లోకి అడుగు వేయగానే వారికి ఎదురుపడింది మీనాక్షి. పంజాబీ డ్రెస్సులో అందంగా ఉంది ఆప్యాయంగా పలకరించింది కూడా. తాతగారికి, మామయ్యా, అత్తయ్యలకి పాదనమస్కారం చేసిని అక్కని అనుసరించాడు పునీత్.
మధ్యాహ్నం భోజనం తరువాత కాస్ట్యూమ్స్ ట్రయల్స్ కి వెళ్లారు. అదయ్యాక విజయపురిలో ఉన్న హిందుస్తానీ మ్యూజిక్ గురువు మహిపాల్ గారిని కలిసి, వారి ఆన్-లైన్ తరగుతలకి నమోదు చేసుకుని ఇల్లు చేరారు పారూ, పునీత్, కిరణ్.
ఫ్రెష్ అయి వద్దామని గెస్ట్-రూములోకి వెళ్లిన పారూ తన వెనకే మీనాక్షి రావడం గమనించుకోలేదు. ముఖం కడుక్కుని బాత్-రూము నుండి బయటకి వచ్చిన పారూ బెడ్ పై కూర్చునున్న మీనాక్షిని చూసి ఆశ్చర్య పోయింది.
"మీనాక్షి! ఇలా వచ్చావు? అత్తయ్య నన్ను పిలిచిందా?" అంటూ తలుపు వైపు వెళ్ళబోయింది. లోనుండి గడియపెట్టిన డోర్స్ ని చూసి వెనుకడుగు వేసింది.
"లేదు గాని ఇలా వచ్చి కూర్చో నీతో మాట్లాడాలి." అంది మీనాక్షి. వెళ్ళి, కాస్త దూరంగా కూర్చున్న పారూ వంక నిశితంగా చూసింది.
"మా బావతో కలిసి ఇక్కడ కూడా మ్యూజిక్ కాన్సర్ట్స్ చేస్తానన్నావట. ఎప్పుడు? ఏమిటి? మరి నేను కూడా పాల్గొనవచ్చా? ఇప్పటి నుండీ ప్రాక్టీస్ చేసి నీతో పాటు పాడగలను. ఇన్నాళ్లూ శ్రద్ధ లేక వదిలేశాను. బావకి పాటన్నా, పాడే అమ్మాయిలన్నా ఇష్టం అని నిజంగా తెలియదు. ఇదిగో నీవు మా జీవితాల్లోకి వచ్చాకే అర్ధమయింది." అంటూ పారూ వంక గుర్రుగా చూసింది మీనాక్షి.
ఆమె మాటలకి ఏమనాలో, ఏమనుకోవాలో అర్ధం కాని పారూ తత్తరపాటుకి గురయింది.
"అదేమీ లేదు మీనా. నీవు పాడాలంటే నా పర్మిషన్ ఏమిటి? అసలు ఈ ప్రోగ్రాం గురించి నాకేమీ తెలియదే." అనేసింది గాబరాగా.
"అలాగా! అది సరే గాని ... ఇదివరలో ప్రతి విషయం బావ నాతో చెప్పేవాడు. కొత్త చుట్టరికం కలుపుకుంటూ మీ కుటుంబం వచ్చాక, అతనికి మీరే లోకమయ్యారు. మొత్తానికి నీవు అదృష్టవంతురాలివే.
ఇక నేనేమో.. ఇష్టం లేకున్నా నీలా సంప్రదాయ దుస్తులు ధరించి మరీ పొద్దుటే కిరణ్ని చూసేందుకు వచ్చేసాను.
నువ్వు కూడా దిగుతున్నావని, రేపు పూజకి కూడా ఉంటావని తెలిసింది. రోజురోజుకి నీ పాపులారిటీ సంగీత ప్రపంచంలో పెరిగితే నాకే బాధా లేదు. ఇలా అన్నిదిక్కులా వ్యాపిస్తేనే సమస్య వస్తుంది. అది గుర్తుంచుకోమని కోరుతున్నాను. సరే పద కిందకి వెళదాం." అంటూ గది నుండి దూసుకు వెళ్ళింది మీనాక్షి.
***
మరి కాసేపటికి మీనా తల్లితండ్రుల రాకతో వాతావరణం ప్రశాంతంగా మారింది. పారూ ఎదురు వెళ్లి నమస్కరించి వారిని ఆప్యాయంగా పలకరించింది. "రేపటి పూజకి ఉంటావు కదూ పరమేశ్వరి." అని అడిగింది విమలమ్మ. ఔనని తలూపింది పారూ.
"అమ్మా, రేపు పూజకి నేనడిగిన చీర, నగలు తెచ్చే ఉంటావు." అన్నది తల్లితో మీనాక్షి.
***
మరునాడు, శ్రీనాధం, వకుళలు చేసుకున్న వ్రతానికి ఎప్పటిలా పది కుటుంబాలు వచ్చాయి. అందరి దృష్టి పరమేశ్వరి పైనే ఉండటం మీనాక్షికి ఏమాత్రం నచ్చలేదు. పైగా ఆమె ఓ ప్రముఖ గాయని అవడంతో అందరూ పారూ చుట్టూ చేరారు.
"నా మనమరాలు" అంటూ రామనాధం గారు "నా మేనకోడలు" అంటూ శ్రీనాధం గారు అందరికీ గర్వంగా చెప్పుకోడం అంతకన్నా నచ్చలేదు మీనాకి. అసలే షాపింగ్ నెపంతో పారూకి ఖరీదైన చీర, దానికి తగ్గ రెడీ మేడ్ బ్లౌజ్ కిరణ్ తీసుకున్నాడని మండిపోతున్న ఆమెకి ... కోపం తలకెక్కింది.
అక్కడినుండి తన గదిలోకి వెళ్లిపోయింది.
***
అతిథులంతా వెళ్ళిపోయి కూడా చాలా సేపయింది. అందరూ కాస్త సేదతీరారు. ఇంటిల్లిపాదినీ పిలిచి హాల్లో సమావేశపరిచాడు కిరణ్. అందరితో కూర్చోవడం మీనాక్షికి తప్పలేదు.
కుటుంబాన్ని ఉద్దేశించి, "ఈ సమయంలో నాక్కావల్సిన వారంతా నా ఎదుటే ఉన్నారు కనుక ఓ చక్కని ముఖ్యమైన ప్రకటన చేయబోతున్నాను." అన్నాడు కిరణ్.
అందరూ కుతూహలంగా వింటున్నారు.
"తాతగారి డెబ్భైదవ పుట్టినరోజు డిసెంబర్ 31న ఓ పండుగలా ఆర్భాటంగా జరుపుకోవాలన్నది నా ప్రతిపాదిన." అని కిరణ్ అనగానే అందరూ చప్పట్లతో తమ ఆమోదం తెలిపారు.
"సరే... ఈ వేడుకని హైదరాబాద్ లోని జయ గార్డెన్స్ లో ఏర్పాటు చేద్దాము. మంచి కార్యక్రమాలు చేద్దాము. పరమేశ్వరి మన ముఖ్య గాయని. ఆ స్టార్ సింగర్ తో కలిసి నేను సైతం అన్ని భాషల్లో పాడతాను. మేము మాత్రమే కాదు, మీనాక్షి, పునీత్ కూడా తప్పక పాడవచ్చు. మీరు వినలేదు కానీ పునీత్ కూడా చక్కగా పాడుతాడు తెలుసా?" నవ్వుతూ అందరి వంక చూసాడు కిరణ్.
"పోతే, తాతగారు! దీనికి మీ అంగీకారం, ఆశీర్వాదం ఉంది కదూ!" అన్నాడు చేతులు జోడించి ఎదురుగా ఉన్న రామనాధం గారితో.
"హహహహ .... మనవడా! మీరు పాడేప్పుడు నన్ను ఆడనిస్తానంటే నేను ఒప్పుకున్నట్టే. నీ ప్రేమ నాకు తెలియదా? నాకు నీవు, నీకు నేను కదా తండ్రీ" అన్నారు రామనాధం గారు ఆనందంగా.
"ధన్యవాదాలు తాతగారు, అన్నీ మీ ఇష్టానుసారమే జరుగుతాయి. మీకేమన్నా సూచనలు, సలహాలు ఉంటే చెప్పండి. ఇక పోతే ఫుడ్ విషయం అమ్మా, విమలత్త చూసుకుంటారు. సమయం ఉందిలే అనుకోవద్దు. ఈ ఈవెంట్ కి వెయ్యిమంది అతిధులు ఉంటారని నా అంచనా. ఇప్పటికి ఇవీ వివరాలు." అంటూ ముగించాడు కిరణ్.
మరో మారు చప్పట్లతో తమ ఆనందాన్ని ప్రకటించింది కుటుంబం.
"చాలా మంచి ఐడియా బావా. తాతగారి పుట్టినరోజు తప్పకుండా అలా గ్రాండ్ గా చేయాలి. నా పూర్తి సహకారం ఉంటుంది.”అని కిరణ్ని అభినందించిన మీనాక్షి, తల్లితండ్రులని ఉద్దేశించి, "అమ్మా, డాడీ ... ఇక్కడ మనమే కాక పారూ, పునీత్ కూడా ఉన్నారు. నాకు ఊపిరాడనట్టే ఉంది. నిద్ర పట్టదు. నేను వెళ్ళి రాధికా వాళ్ళింట్లో ఉంటాను. ఓకేనా? పొద్దున్న వచ్చేస్తాను." అని ప్రకటించి సూట్-కేసుతో నిష్క్రమించింది మీనాక్షి.
ఏమనలేక గమ్మునుండిపోయారు విమల, శ్రీనివాసులు. నిర్బంధిస్తే మరింతగా మొండి చేష్టలు చేస్తుందని... సరే’అన్నట్టుగా తలూపారు ఆ తల్లితండ్రులు.
****సశేషం****
రచయిత్రి పరిచయం ....
‘నాట్యభారతి’ ఉమాభారతి - నర్తకి, నృత్య గురువు, నటి, రచయిత్రి, టీ.వి చిత్ర దర్శక-నిర్మాత
కూచిపూడి, భరతనాట్యం నృత్యాలలో నిష్ణాతురాలు ఉమాభారతి. నాలుగు దశాబ్దాలుగా దేశవిదేశాల్లో కూచిపూడి నృత్య విస్తరణకు కృషి చేసి ఆ కళకు వన్నె తెచ్చిన మేటి నర్తకిగా, గురువుగా ఖ్యాతి గడించారు ఆమె. పద్నాలగవ యేట అఖిలభారత కూచిపూడి నృత్య పోటీలో గెలుపొంది, 1977 లో ప్రపంచ సాంస్కృతిక సభలచే ఆహ్వానింపబడి, ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక విభాగం వారిచే సాంస్కృతిక రాయబారిగా పరిగణింపబడిన అప్పటి యువ నర్తకి, ఉమాభారతి.
1970 లో ‘కూచిపూడి రంగప్రవేశం’ గావించి, 20 సంవత్సరాల వయసుకే విదేశీ పర్యటనలు, జాతీయ అంతర్జాతీయ గుర్తింపు, సినీ రంగ ప్రవేశం, చిత్ర నిర్మాణం కూడా చేపట్టి కళారంగంలో ఎనలేని కీర్తినార్జించింది ఉమాభారతి.
బాలనటిగా ‘సుడిగుండాలు’ చిత్రంలో, కథానాయకిగా ‘చిల్లరదేవుళ్లు’ చిత్రంలో, ఊర్వశి గా NTR సరసన ‘యమగోల’ చిత్రంలో నర్తించిన ఉమాభారతి 1976 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి కోసం విద్యార్ధి దశలోనే ‘భారతీయ నృత్య రీతులు’ అనే 30 నిముషాల డాక్యుమెంట్రీ నిర్మించారు.
సేవే ధ్యేయం, నృత్యం మార్గంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక ప్రతినిధిగా… విద్యానిలయాల నిర్మాణాలకి, వరద బాధితుల నిధికి, నేత్రదాన శిబిరాలకి, 2 వ తెలుగు ప్రపంచ సభలకు, ‘రామసుబ్బయ్య పేద విద్యార్ధుల స్కాలర్షిప్ ఫండ్’ కు స్వచ్చందంగా నృత్య కార్యక్రమాలను చేసారు.
సౌతాఫ్రికా, మారిషస్, సెషిల్స్ ఆంధ్ర మహాసభల నిర్వహణలో నృత్య ప్రదర్శనల ద్వారా ఆలయ నిర్మాణ నిధులకి, తెలుగు భాషా-సంస్కృతి ప్రాచుర్యం పెంపొందించే కార్యక్రమాలకి నిధులు సేకరణకి నృత్య ప్రదర్శనలు చేశారు.
అమెరికా లోని వివిధ (25) దేవాలయ నిర్మాణ సంస్థల నిధుల సేకరణార్ధం సాంస్కృతిక పర్యటనలు నిర్వహించారు. 1982 లో హూస్టన్ లో అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ స్థాపించి ప్రవాసాంధ్రుల యువతకి నృత్యశిక్షణ కొనసాగిస్తూ జెమిని టి.వి కి ‘అలయనాదాలు’ టెలీ సీరియల్ నిర్మించి దర్శకత్వం వహించారు.
ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న కృషికి గుర్తింపు:
శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి చేతుల మీదగా స్వర్ణకంకణం, ‘నాట్యభారతి’ అనే బిరుదు, పాండుచేరి గవర్నర్ నుండి L.V.R ఫౌండేషన్ వారి ‘రాజ్యలక్ష్మి అవార్డ్’. ‘వంశీ’ వారి ‘ఉత్తమ ప్రవాసాంధ్ర కళాకారిణి’ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ సినీ గోయర్స్ వారి ‘జవహర్లాల్ నెహ్రూ సెంటినియల్ అవార్డ్, U.S.A హూస్టన్ ‘ఏషియన్ విమెన్స్ వారి ‘వుమన్ ఆఫ్ ది ఇయర్ ’ అవార్డ్, ‘TANA’ వారి సాంస్కృతిక పురస్కారం... ఆమె అందుకున్న కొన్ని పురస్కారాలు.
రచయిత ఉమాభారతి:
తెలుగు భాషా సాహిత్యాల పట్ల మక్కువతో 2012 నుండీ నృత్యేతర రచనా వ్యాసంగంలోకి అడుగుపెట్టి ఉమా రాసిన కథానికలు, కవితలు, నృత్యనాటికలు తెలుగునాట ప్రముఖ పత్రికల్లోను, పలు అంతర్జాల పత్రికల్లోను ప్రచురించబడ్డాయి. విదేశీ కోడలు – కధా సంపుటి (2013), ఎగిరే పావురమా – నవల (2015), సరికొత్త వేకువ – కధా సంపుటి (201 7), వేదిక – నవల (2016), నాట్యభారతీయం – వ్యాసా సంపుటి (2018) ..ఇప్పటివరకు పుస్తక రూపంగా వంగూరి ఫౌండేషన్ వారి ప్రచురణాలగా వెలువడిన గ్రంధాలు. నాట్యభారతి ఉమాభారతి కధలు – కధా సంపుటి (2023) లో వెలువడింది.
ఆమె తాజా నవల ‘హృదయగానం – నేడే విడుదల’ – నవల (2024) లో సిరికోన సాహిత్య అకాడెమీ వారి ఉత్తమ నవలగా గెలుపొంది, ‘జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక పురస్కారం’ అందుకుంది.
నృత్య నాటికలకు గుర్తింపు:
ఆమె రచించి, నిర్వహించిన ‘భరతముని భూలోక పర్యటన’ ‘పెళ్లి ముచ్చట’, ‘మానసపుత్రి’, ‘లయగతులు’, ‘తెలుగింటి వెలుగు’ నృత్యనాటికలకి అమెరికాలోని ‘తానా’, ‘ఆటా’ వారి ఉత్తమ ప్రదర్శన అవార్డు, సృజనాత్మకతకి గుర్తింపు పొందారు.
విద్యాభ్యాసం: M.A (Pol. Science) – Osmania Universisity
కుటుంబ నేపధ్యం: తల్లితండ్రులు: కీ. శే. మేజర్ సత్యనారాయణ, కీ. శే. శ్రీమతి శారద.
భర్త: డా. మురళి మోహన్ కోసూరి, సంతానం: డా. సత్యజిత్, డా. శిల్ప-సంతానం.
కూచిపూడి గురువులు – పద్మశ్రీ వెంపటి చిన్నసత్యం, ‘కళాప్రపూర్ణ’ శ్రీ వేదాంతం జగన్నాధ శర్మ
భరతనాట్యం గురువులు – పద్మశ్రీ ఫకీరుస్వామి పిళ్ళై, కళైమామని శ్రీ. టి.ఆర్. రాధాకృష్ణన్