వీక్షణం సాహితీ గవాక్షం కాలిఫోర్నియా 159వ ప్రపంచ సాహితీ సమావేశం నవంబర్ 15, 2025 న అత్యంత ఆసక్తికరంగా జరిగింది. ఈ నాటి సభ వీక్షణం వ్యవస్థాపక అధ్యక్షురాలు డా. కె. గీతగారి స్వాగత వచనాలతో
ఈనాటి సమావేశం ప్రారంభమైనది. ఈ నాటి ముఖ్య అతిథి శ్రీ పారుపల్లి కోదండరామయ్య గారిని వేదికపైకి ఆహ్వానించి వారిని సభకు పరిచయం చేశారు.
శ్రీ పారుపల్లి కోదండరామయ్య గారు తెలుగు భాషా ఉద్యమకర్తగా, భాషా పరిరక్షణ, ప్రముఖ భావోద్వేగ కార్యకర్తగా ప్రఖ్యాతి పొందిన వ్యక్తి. వారు రిటైర్డ్ ఎలక్ట్రికల్ చీఫ్ ఇంజనీర్ అయినప్పటికీ, తెలుగు భాషాభిమానిగా వారికి గుర్తింపు లభించింది.
శ్రీ కోదండరామయ్యగారు తెలుగు కూటమిని ప్రారంభించి తెలుగుభాషా వ్యాప్తికై అనన్యమైన కృషి చేస్తున్నారు. వారు "తెలుగు భాషను రక్షించుకోవడం ఎలా?" అనే అంశంపై ప్రసంగించారు. తెలుగు భాషను రక్షించుకోవడం పై అనేక పుస్తకాలు వ్రాసారు. అనేక వేదికలపై ప్రసంగిస్తుంటారు (విదేశాలతో సహా). తెలుగుభాషను రక్షించుకోవాలంటే పాఠశాల విద్య ప్రాథమిక స్థాయినుండి చైనాలో వలె ఉన్నత స్థాయి సాంకేతిక విద్యవరకూ తెలుగు మాధ్యమంలోనే ఉండాలన్నారు. ముందుగా తలిదండ్రులు ఆంగ్లభాషను నిరసించి వారి పిల్లలకు తెలుగు భాషే నేర్పాలన్నారు. తెలుగు భాషలో మాట్లాడడం అవమానంగా భావించే దుస్థితి పోవాలన్నారు. తెలుగుభాషను కాపాడమని ముఖ్యమంత్రులకు ఉత్తరాలు పంపాలన్నారు. జనం కదలాలి ఒక ఉద్యమం చేయాలి అని ప్రబోధించారు. సుమారు గంటసేపు సాగిన వారి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. వారి ప్రసంగంపై గీత గారూ, గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారూ స్పందించారు.
పిదప శ్రీ రాజేంద్ర ప్రసాద్, బిట్రవరం శ్రీమన్నారాయణ గార్ల సారథ్యంలో కవిసమ్మేళనం ప్రారంభమైనది. మొదటగా డా.గీతామాధవి గారి "క్రిమి సంహారం" అనే శీర్షికతో క్రిములన్నిటికీ మందులున్నాయి, కానీ మనిషిని మనిషిగా చేసే మందు ఏమైనా ఉంటే బావుణ్ణు అని గోదావరి మాండలికంలో చదివిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
తరువాత కొండ్రెడ్డి నాగిరెడ్డిగారు తన కథను పాటగా పాడి అందరినీ అలరించారు. శ్రీ ఘంటా మనోహర రెడ్డిగారు "పెద్దలకు పెంచుకునే వాడుక, పేదలకు పంచుకునే వాడుక" అనే కవిత భావస్పోరకంగా ఉంది. శ్రీ వైరాగ్యం ప్రభాకర్ గారు జననిమించిన దైవం తెలుగు మించిన భాష ఏమిటంటూ తెలుగుభాషా వైశిష్ట్యాన్ని తెలిపారు. శ్రీ రామకృష్ణ చంద్రమౌళి గారు ఇటీవల స్వర్గస్తులైన ప్రజాకవి అందెశ్రీ గారికి అక్షర నివాళి సమర్పించారు. శ్రీ కందుకూరి శ్రీరాములు గారు బాలశిక్ష అనే కవితలో అమ్మంటే అర్థం తెలియని పిల్లలకు తెలుగులో శిక్షణ నివ్వాలి అన్నారు.
కందేపి రాణి ప్రసాద్ గారు బిడ్డలకు తన అనురాగాన్ని పంచలేని, ఆంగ్లంలో మాట్లాడు అనే అమ్మ నాకొద్దు అని మంచి కవిత చదివారు. శ్రీ అయ్యలరాజు సోమయాజుల ప్రసాద్ గారు అక్షర ఆయుధంతో పర్యావరణం బాగుచేస్తాను, యుద్ధవాతావరణం లేకుండా చేస్తాను అంటూ చదివిన కవిత రంజకంగా ఉంది.
శ్రీమతి కోదాటి అరుణ గారు కూడా తెలుగు భాషా సౌందర్యాన్ని గురించే కవిత చదివారు. ప్రసాదరావు రామాయణం అనే నేను అసంతృప్తి నైరాశ్యంగా, దీర్ఘనైరస్యం ఆగ్రహంగా, తీవ్ర ఆగ్రహం అంగారంగా అణుబాంబుగా అవుతుందనీ నియంత నేతలను మట్టుపెడతారనీ చదివారు. అవధానం అమృతవల్లి గారు చదివిన సాకారం చేస్తే అని చదివిన కవిత అమృతంలా ఉంది. డా.బృందగారు పుస్తకం నా ప్రియ నేస్తం అంటూ గానం చేసి అందరినీ ముగ్ధులను చేశారు.
ఉప్పలపాటి వెంకటరత్నంగారు "అదుంటే చాలు"అనే కవితను చదివారు. శ్రీమతి చీదెళ్ళ సీతాలక్ష్మిగారు తల్లి ప్రేమపై పద్యాలు చదివారు. శ్రీ జెవి కుమార్ గారు "కవిసమ్మేళన ఋణం", అంటూ చదివిన కవిత అద్భుతం! శ్రీ పరిమి వెంకట సత్యమూర్తి గారు విద్వత్తులో విద్యుత్తు అనే కవిత బావుంది. కొండపల్లి నీహారిణి గారి "తీగ" అనే కవిత భావుకత, భాష మంచి పదవిన్యాసంతో సౌరుభం గుబాళించింది. దేవులపల్లి పద్మజగారు చిట్ ఫండ్ చేష్టలూ చిత్రాలూ అంటూ చదివిన కవిత హాస్యాన్ని చిందించింది. అరుణ కీర్తి పతాక గారు అభ్యున్నతికి పోటీ అవసరమంటూ కవిత చదివారు. శ్రీమతి లలితా చండీగారు తన "ఆమె" అనే కవితలో ప్రకృతిమాత గురించి చదివారు. శ్రీమతి బుక్కపట్నం రమాదేవిగారు తెలుగుభాషా అవసరం సౌందర్యం గురించి చదివారు.
అరుణ కీర్తి పతాక గారు మంచి గాయకురాలు. శ్రావ్యంగా ఒక గజల్ అద్భుతంగా పాడి వినిపించారు. డా.విజయ మల్కాని గారు కవిత అందరినీ ఆకట్టుకుంది. మొండేటి సత్యవీణగారు వృద్ధుల అవసరం గురించి మంచి కవిత చదివారు.
శ్రీ బోగెల ఉమా మహేశ్వరరావుగారు విశిష్ట కవులందరినీ ఉటంకిస్తూ చక్కని పద్యాలు చదివారు. శ్రీమతి నెల్లూరు ఇందిరాగారు తన కవిత"సుస్థిర అక్షరంలో" మంచి భాషను వాడి అలరించారు. ఆనం ఆశ్రితారెడ్డిగారు దివ్వెల దీపావళి చేసుకుంటూ చిన్నారులకు పురాణ గాధలు చెప్పాలన్నారు. మాణిక్య లక్ష్మి గారు ధర్మో రక్షతి అనే కవితను చదువగా, శ్రీ బిట్రవరం శ్రీమన్నారాయణగారు మట్టిలో మాణిక్యాలు అనే కవితను చదువుతూ మన తెలుగుభాషను ఎందుకు చులకన చేస్తున్నాం అని ప్రశ్నించారు.
చివరగా వీక్షణం భారత ప్రతినిధి శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు కవిత్వం ఎలా ఉండాలి అని చదివిన తీరు సభకు హైలైట్! వచ్చేనెల17 వ తేదీన సాయంత్రం 6 నుండి రవీంద్రభారతిలో ప్రత్యక్షంగా సభ జరుగుతుందనే తీపి కబురుతో బాటూ గీతగారి వందన సమర్పణతో సభ దిగ్విజయంగా ముగిసింది.
ఆద్యంతం ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.