Menu Close
C-Vasundhara Photo
తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు
డా.సి.వసుంధర

అన్నమయ్య

ప్రతి తెలుగు బిడ్డ ఉయ్యాలలో వినే పాట జ్యోఅచ్చుతానంద జో జో ముకుందా’అన్న జోల పాట. దానిని రచించిన వాడు శ్రీ అన్నమయ్య.

కడప జిల్లాలో రాజంపేట, సిద్ధవటం మండలాల లోని భూభాగాన్ని పొత్తిపినాడు అంటారని అక్కడ తాళ్ళపాక అనే గ్రామంలో అన్నమయ్య జన్మించాడు అని ఆరుద్ర ప్రారంభించి అన్నమయ్య వంశ మూలాలను గూర్చి ముందు ప్రస్తావించారు. ఆరుద్ర రచనలో మనం పరిశీలిస్తే ఈ విధమైన మూల వివరణ మనకు గోచరిస్తుంది. సాహిత్య చరిత్రతో పాటు దేశ చరిత్ర, ఆయా కవుల కుటుంబ చరిత్ర సమకూర్చడం ఆరుద్ర గారి రచనలో విశిష్టమైన విషయం.

అన్నమయ్య సంతతి మాత్రం సరస్వతీ పుత్రులే నని ఆరుద్ర చెబుతూ అన్నమయ్య తాతగారైన నారాయణ సూరికి మొదట చదువు విషయంలో కోదండాలు వేయించినా, చెవులు మెలిపెట్టినా ఏడుపు తప్ప చదువు అబ్బలేదు. అంతేగాక తప్పించుకోవడానికి నారాయణ సూరి పారిపోయినా ఆయనను ఊటుకూరులో చదివించడానికి ప్రయత్నించినప్పుడు ఆయన పాఠాల కంటే పాము పుట్టలో చేయి పెట్టడమే మేలని చింతలమ్మ గుడిలోనున్న పాము పుట్ట వద్దకు పోతున్నప్పుడు ఆ దేవతే వచ్చినట్లు ఒక స్త్రీ వచ్చి తాళ్ళపాకలో కేశవ స్వామి దేవాలయం ఉంది. ఆయన్ను వేడుకో”అని చెప్పగా నారాయణ సూరి వెళ్లి ఆ దేవుని అయ్యా! నీవు సరస్వతీదేవికి మామగారివి. నాకు విద్య దయ చేయుము” అని వేడుకొన్నాడు. అటుపై విద్యలో సర్వజ్ఞుడయ్యాడు.

నారాయణ సూరి మనమడే మన అన్నమయ్య. అన్నమయ్య కూడా తాతగారి వలె తిరుపతి కొండలపై తిరిపెమెత్తుకున్నా పరవాలేదని పారిపోవడం జరిగింది.

తిరుపతి కే ఎందుకు పోయాడు అనడానికి ఒక కారణం ఉంది. అన్నమయ్య తల్లిగారు వెంకన్న భక్తురాలు. ఆమె తిరుపతి కొండెక్కి స్వామిని దర్శించుకొంది. ఆమె కలలో స్వామివారి బిరుదు గజ్జెల ముప్పడి కిఠారం సాక్షాత్కరించింది. తత్ఫలితమే అన్నమయ్య జన్మించాడు. అందుకే ఆ తల్లీ కొడుకులకు వెంకన్నపై అంత భక్తి.

పువ్వు పుట్టగానే పరిమళించినట్లు అన్నమయ్య చిన్నప్పుడే పాటలు పాడుతుండేవాడు. సాధుస్వభావం గల అన్నమయ్యను ఆయన వదిన పనులకు పురమాయించేది. ఎవరు చెప్పినా ఓర్పుతో ఆ పనులను చేసేవాడు.

అన్నమయ్య తిరుపతి ప్రయాణం

ఒకనాడు పశువులకు గడ్డికోస్తున్న అన్నమయ్య పాటలు పాడుకొంటూ పరధ్యానంలో వ్రేలు కోసుకొన్నాడు. తన రక్తం కళ్ళ చూచుకొన్న అన్నమయ్యకు ఏమి తోచిందో వేసుకున్న కిర్రు చెప్పులు తాళం వేస్తుంటే పాడుకొంటూ తిరుపతి వైపు ప్రయాణం సాగించాడు. తిరుపతికి చేరి అక్కడి నుండి అలిపిరి మెట్లమీదుగా వెంకన్న కోసం వెళ్ళే భక్త బృందంతో ఆనందంగా ముందుకు పయనం సాగించాడు. ఏకబిగిన నడవడం వల్ల అన్నమయ్య అలసిపోయి ఓ చెట్టు క్రింద చెప్పుల కాళ్ళతోనే విశ్రమించాడు. బిడ్డ బాధను చూడలేని అలివేలమ్మ ఓ స్త్రీ లా వచ్చింది.

అలసి ఉన్న అన్నమయ్యతో చెప్పుల కాళ్ళతో కొండ ఎక్కితే ఇంతే నాయనా”అంటూ హితం పలుకగా అన్నమయ్య జోళ్ళు విడిచాడు. ఆ తల్లి తాను తెచ్చిన ఫలహారాలు అన్నమయ్య కు పెట్టగా తృప్తుడైన అన్నమయ్య ఆశువుగా సరస కవిత్వం వాచా ప్రౌడితో ఒక శతకం చెప్పాడు. దానిని ఆరుద్ర తెల్పారు. ఆ పద్యం:

అరిసెలు నూనెబూరియలు నౌగులు జక్కెర మండిగల్ వడల్
బురుడలు పాలమండిగ లపూపము లయ్యలమేలుమంగనీ
కరుదుగ విందు వెట్టు పరమాన్న చయంబులు నూపకోటియున్
నిరత వినిర్మలాన్నములు నేతులసోనలు వెంకటేశ్వరా! (వెంక.50)

ఈ వేంకటేశ్వర శతకము ఎంతో ప్రఖ్యాతమైనది. కడుపునిండా తిండి పెట్టిన తల్లిని అలమేలుమంగగా భావించి, ఆమెను దేవుణ్ణి చూపించమని అంతకుముందే అడిగాడు. అదే భావాన్ని పద్యంలో చెప్పాడు. అటుపై అలమేలుమంగను స్మరిస్తూ చెప్పిన అన్నమయ్య ఓ లలితాంగీ యో కలికి యో యెలజవ్వని యో వధూటి యో....’(వెంక. 5) అంటూ ఆమెను స్మరించాడు. ఇందులో కలికి’అనే పదం మనోజ్ఞమయినది అన్న అర్థంలో వస్తుంది. క్షేత్రయ్య పదాలలో కూడా ఆయన కలికి రోట గట్టేనా’అని రాయడం వల్ల కలికి అన్న తెలుగు పదం శ్రేష్టమైన గుణాదులు కల్గిన స్త్రీల పట్ల ఉపయోగిస్తారని తెలుస్తున్నది.

అన్నమయ్య పై పోతన ప్రభావం ఉన్నట్లు ఆరుద్ర చెబుతూ పోతన వలె అనుప్రాసతో అన్నమయ్య రాసిన ఈ క్రింది పద్యాన్ని ఉంటంకించాడు:

చక్కని తల్లికిన్ నవరసంబుల వెల్లికి బుష్పవల్లికిం
జక్కని మోవి ముత్తియపు జల్లికి శ్రీయల మేలుమంగకున్
జెక్కులు మించుటద్దములు చేతులు క్రొత్త మెరుంగదీగ
లాక్రిక్కిరిగుబ్బలే పసిడి కిన్నెరకాయలు వెంకటేశ్వరా! (వెంక. 49)

తొలు దొల్త చెప్పిన ఈ వెంకటేశ్వర శతకంలో ఆ స్వామిని ఎన్నెన్నో విధాలుగా ఊహించుకొని అన్నమయ్య ఎవరికీ తెలియని దేవరహస్యాలు తనకు తెలుసునన్నట్లు భావించి చెప్పిన పద్యం ఈ క్రింది పద్యం అని ఆరుద్ర గుర్తు చేశారు. ఇటువంటి భావభరిత రచనలను ఆరుద్ర వదిలిపెట్టరు. ఆయా కవుల ప్రత్యేకతలు గుర్తించి వివరించడంలోనే విమర్శకుల ప్రతిభ కనపడుతుంది.

ఒప్పగు తూగుటుయ్యెలల నూగుచు నీ వల మేలుమంగతో
నప్పుడు కౌగిట న్రతుల వాకటిపెల్లున నప్పళించుచున్
రెప్పల నవ్వుతో మనసు కిచ్చలతో నరగన్నులార్చుచున్
దెప్పలదేలు సౌఖ్య మిదే దేవరహస్యము వెంకటేశ్వరా! (వెంక. 46)

ఈ దేవరహస్యాలు కళ్ళకు గట్టినట్లుగా ఊహించిన అన్నమయ్య యొక్క ఈ ఆశుకవితా శతకంలో ఎన్నో శృంగార దృశ్యాలు, పచ్చి తలపులు ఉన్నాయన్నారు ఆరుద్ర. అన్నమయ్య కు మధురభక్తి. ఆ ఆవేశంతో పాటు యుక్త వయస్సు, పాండిత్యం తోడైనాయి. రసాలలో శృంగారానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించాడో లేక భక్తి పారవశ్యమో తెలియదు కానీ అన్నమయ్య వ్రాసిన ఈ తొలి శతకంలో ఎన్నో మధుర శృంగార దృశ్యాలు ఉన్నాయి అని అన్నాడు ఆరుద్ర. ఆరుద్ర పలుకులు సత్యమే కదా.

ఉత్తరోత్తరా అన్నమయ్య పన్నెండు శతకాలు రచించినట్లు తెలుస్తున్నదని, వాటికి గుర్తుగా ఈ వెంకటేశ్వర శతకం మాత్రమె లభిస్తున్నదని ఆరుద్ర మాట.

అన్నమయ్య మోకాళ్ళ ముడుపు (మోకాళ్ళ కనుమ అని కూడా అంటారు) దగ్గర చెప్పిన శతకం ఇదేనని అనుకోవాలి. ఈ శతకం అలిమేలుమంగపై చెప్పినట్లు ఒక పద్యం ద్వారా తెలుస్తున్నదని తెల్పి ఆరుద్ర ఆ పద్యాన్ని ఉదాహరించారు.

అమ్మకు తాళ్ళపాక ఘను డన్నడు పద్యశతంబు చెప్పెగో
కొమ్మని వాక్ర్సుసూనముల గూరిమితో నలమేలుమంగకున్
నెమ్మది నీవు చేకొని యనేకయుగంబులు బ్రహ్మకల్పముల్
సమ్మద మంది వర్ధిలను జవ్వనలీలలు వెంకటేశ్వరా!!

దేవరహస్యాలు గల ఈ శతకం చెప్పి ఇక్కడినుండి తిరుమల చేరి, చంపక ప్రదక్షిణం చేసి, పుష్కరిణి లో స్నానం చేసి దైవ దర్శనం చేసుకొని, ఒక కాసు (తన దగ్గర ఉన్న డబ్బు) హారతిలో వేసి నవ కీర్తనలు ఆలపించి భక్తులను ఆనందపరిచాడని ఆరుద్ర తెల్పారు. ఈ సమాచారమంతా చిన్నన్న రాసిన అన్నమాచార్య చరిత్ర నుండి తెల్పినట్లు ఆరుద్ర తన రచనలో క్రింద వివరణ లో తెల్పారు.

మరునాడు ఆకాశగంగ లో, పాపనాశనం లో స్నానం చేసి కట్టు చీర (వస్త్రం) ఆరేలోపున కుతుకంబు సమకూర శతకంబు’ఒక్కటి చెప్పాడు అన్నమయ్య అన్న ఆరుద్ర మాటల వల్ల అన్నమయ్య ఆశు మహాకవి అని చెప్పవచ్చు. ఈ శతకం వితత వృత్తాలలో రచించినట్లు ఆరుద్ర తెల్పాడు. ఇట్టి పేరు గల వృత్తాలు ప్రస్తుతం అంతగా వినబడడం లేదు.

దైవ దర్శనానికి వెళ్ళిన అన్నమయ్య స్వామి దర్శనానికై మరొక శతకం చెప్పగానే ద్వారాలు అవే తెరుచుకున్నాయి. అందరూ ఆశ్చర్యపోయారు. ఇంత చిన్న కుర్రాడు సంకీర్తనలు. శతకాలు ఆశువుగా రచించి పఠిస్తుంటే అతడు వరప్రసాదుడని గుర్తించారు. అతనికి చందన తీర్థప్రసాదాలు ఇచ్చారని ఆరుద్ర తెల్పారు.

ఒక సంఘటన:

అన్నమయ్య అదృష్టం వల్ల తిరుపతి లో ఉన్న విష్ణువు అన్న వైష్ణవయతి ఈ నల్లని చిన్నవానిని శ్రీ వైష్ణవునిగా చెయ్యాలని సంకల్పించి ముద్రాధారణ చేసి చేరదీయగా అన్నమయ్య కృతార్థుడను’అన్నాడని అన్నమయ్య వైష్ణవులతో కలిసి భుజించాడని ఆరుద్ర చెప్పిన విషయాలు వైష్ణవ మత విషయాలను తెల్పుతున్నాయి.

ఈ సందర్భంగా వివరిస్తూ ఆరుద్ర వీరశైవులు దీక్ష పుచ్చుకున్నాక పునర్జన్మ పొందినట్లు భావిస్తారు. వైష్ణవులు అలా కాదేమో”అని సంపుటి 3 పుట 8 లో ఉన్న అన్నమయ్య పాటను తెల్పి వివరించాడు. దీనిని గురించి అన్నమయ్య కీర్తన. ఆరుద్ర వివరణ వచ్చే సంచికలో తెలుసుకుందాం.

**** సశేషం ****

Posted in December 2025, సమీక్షలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *