రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు :-
పైన చెప్పిన నానుడి సంజీవరెడ్డిగారి రాజకీయ జీవితంలో రెండుసార్లు నిజమయ్యింది. ఒకటి బ్రహ్మానందరెడ్డి గారి విషయంలో, రెండోది యన్.జి.రంగా గారి విషయంలో.
నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం హైదరాబాద్ ప్రెస్ రిపోర్టర్స్ గిల్టు వారు శ్రీ బ్రహ్మానందరెడ్డి గారి గౌరవార్ధం మార్చ్ 2 1964న ఒక విందు ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా బ్రహ్మానందరెడ్డి గారు మాట్లాడుతూ :- "తాను ముఖ్యమంత్రి స్థానం అధిష్టించడానికి శ్రీ సంజీవరెడ్డి కారణమని, గత రెండు దశాబ్దాలలో తాము అతి సన్నిహితులుగా మెలిగామని, తమ ఇరువురి మధ్య సంబంధాలు కేవలం రాజకీయమైనవి మాత్రమే కాదని, ఇరువురు సోదరుల వలె, చాలా సన్నిహితంగా ఉంటూ వచ్చామని, ఆయన సహాయ సహకారాలు లేనిదే ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడిని కాదని" అన్నారు.
సంజీవరెడ్డిగారు జాతీయ రాజకీయాలలోకి వెళ్ళిపోయిన తరువాత కొంత కాలంలోనే బ్రహ్మానందరెడ్డి గారితో దూరం పెరిగింది. లాల్ బహదూర్ శాస్త్రి మరణం తరువాత ఇందిరా గాంధీ శకం మొదలైన పిమ్మట బ్రహ్మానందరెడ్డి గారు సంజీవరెడ్డి గారిని వ్యతిరేకించే ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పక్షాన నిలిచారు. రాష్ట్రంలో సంజీవరెడ్డి గారికి వ్యతిరేకంగా తన వర్గాన్ని ఏర్పరుచుకున్నారు. 1971 ఫిబ్రవరి 17న కృష్ణా జిల్లాలో ఎన్నికల ప్రచార సమయంలో శ్రీ బ్రహ్మానందరెడ్డి విలేఖరులతో శ్రీ సంజీవరెడ్డి రాష్ట్రపతి అయ్యివుంటే ఆంధ్రప్రదేశ్ రెండుగా విభజించబడి ఉండేదని విమర్శించారు. ఈ సంగతి తనకు సంజీవరెడ్డి గారి స్నేహితుల ద్వారా తెలిసిందని అన్నారు. అదే రోజు గుడివాడలో మాట్లాడుతూ "రేపు వస్తాడు గదా! సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి ఏమి చేశాడు? సారా దుకాణాలు పెట్టాడు అని చెప్పటానికి. బ్యాంకులు జాతీయీకరణ చేస్తే మీదేమి పోయింది? ఎందుకు వ్యక్తిరేకించారు? అని రేపు సంజీవరెడ్డిని అడగండి" అని అన్నారు.
సంజీవరెడ్డి గారు సహితం నవంబర్ 2, 1970న గుడివాడలో రాష్ట్రాభివృద్ధి గురించి మాట్లాడుతూ ఆనాడు జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా, నేను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ప్రాజెక్టులు, బ్రిడ్జిలు, కాలేజీలు అనేకం ఏర్పరిచాము. ఏడున్నర సంవత్సరాల నుండి బ్రహ్మానందరెడ్డి హయాములో వారు చేసిన కార్యక్రమాలు ఏమిటి? అని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి అని అన్నారు. మరలా నవంబర్ 4న రాష్ట్రంలో బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం, కేంద్రంలో శ్రీమతి ఇందిరాగాంధీ ప్రభుత్వం పట్ల రాష్ట్ర ప్రజలలో తీవ్ర అసంతృప్తి ప్రకటితమవుతుందని సంజీవరెడ్డి గారన్నారు. సంజీవరెడ్డి గారి వర్గానికి చెందిన దాదాపు యాభై మంది శాసనసభ్యులతో రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష కాంగ్రెస్ ఏర్పాటుకు సన్నాహాలు కూడా జరిగాయి.
సంజీవరెడ్డి గారి మద్దతు సహకారంతో ముఖ్యమంత్రి అయిన బ్రహ్మానందరెడ్డి చివరకు సంజీవరెడ్డి గారికి బద్ధ విరోధి కావడం రాజకీయాల్లోని వైచిత్యం కాక మరేమిటి!
ఆంధ్ర రాజకీయాలలో శ్రీ నీలం సంజీవరెడ్డి, ఆచార్య యన్.జి.రంగా దీర్ఘకాలం ప్రత్యర్థులుగా కొనసాగారు. రంగా గారిపై సంజీవరెడ్డి గారు ఏ విధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పీఠానికి పోటీపడి గెలిచింది ఇంతకు ముందు చూశాం. 1970లో డెమోక్రటిక్ ఫ్రంట్ ఏర్పాటుకై పాత కాంగ్రెస్ ఏ.ఐ.సి.సి తీర్మానించిన దరిమిలా రాజకీయాలు కొత్త రూపు దాల్చడంతో ఒకప్పటి ప్రత్యర్ధులు అయిన సంజీవరెడ్డి, రంగా గార్లు చేతులు కలిపారు. ఇద్దరి నాయకుల మధ్య సయోధ్య కుదర్చడానికి శ్రీ కామరాజ్ నాడార్ మధ్యవర్తిత్వం వహించారు.
ఫిబ్రవరి 17 1971న ఇరువురు నేతలు కృష్ణ జిల్లాలో ఎన్నికల పర్యటనలో ఇందిరాగాంధీ విధానాల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో వ్యతిరేకత ఉందని అన్నారు.
శ్రీమతి ఇందిరాగాంధీ ప్రజల ప్రాథమిక హక్కులను తారుమారు చేయడానికి పూనుకున్నదనీ, పాకిస్తాన్ లో అయూబ్ ఖాన్ నియంతగా వ్యవహరించినట్లే, ఆమె ఇక్కడ ప్రవర్తిస్తున్నదని అన్నారు. వాస్తవంలో ఈ మాటలు నిజమయ్యి 1975లో ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించింది. కానీ రంగా గారు 1971 ఎన్నికలలో ఓటమి అనంతరం కొత్త కాంగ్రెస్ లో చేరి ఇందిరాగాంధీ గారికి విధేయత ప్రకటించారు. ఇది శ్రీ రంగా రాజకీయ తప్పిదం. సంజీవరెడ్డి గారు మాత్రం ఇటువంటి రాజకీయ తప్పిదాలకు పాల్పడకుండా పాత కాంగ్రెస్ జనతాలో విలీనమవ్వడంతో ఆయన కూడా జనతా నాయకుడిగా ప్రజల వద్దకు వచ్చారు.
మే 27 1964న శ్రీ జవహర్లాల్ నెహ్రూ మరణించారు. నెహ్రూగారు నిర్యాణం చెందినపుడు నీలం సంజీవరెడ్డి గారు అనంతపురంలోని తమ స్వగ్రామమైన ఇల్లూరులో ఉన్నారు. నెహ్రూగారి ఆరోగ్యం క్షీణిస్తుందని వర్తమానం అందిన వెంటనే ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డిగారు ఇల్లూరుకు వైర్ లెస్ వర్తమానం పంపించారు. కలెక్టర్ ద్వారా సంజీవరెడ్డిగారికి కారు అందుబాటులో ఉంచారు. సాయింత్రం ఏడుగంటలకు, ఢిల్లీ విమానం బయలుదేరడానికి గంట ముందు, సంజీవరెడ్డిగారు హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీలో నూతన కాంగ్రెస్ నాయకుని ఎన్నికలో ఆయన కీలక పాత్ర వహించారు.
కాంగ్రెస్ అధ్యక్షులు కామరాజ్ గారికి ఇంగ్లీష్ సరిగా రాకపోవడం,పైగా ప్రధానమైన కాంగ్రెస్ నాయకులతో సంభాషించే ముందు వారిలో తమకు అనుకూలమైన మనస్తత్వాన్ని ముందుగానే కలిగించే మరొకరు అదీ తమకు నమ్మకమున్న వారు అవసరం కావడం, ఈ అవసరాలను తీర్చే స్థితిలో సంజీవరెడ్డి గారు ఉండడం, అటు కామరాజ్ గారికి, ఇటు సంజీవరెడ్డి గారికి అనుకూలించింది. జూన్ 2 1964న శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఎన్నికయ్యారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు మంత్రి వర్గంలో సంజీవరెడ్డిగారితో పాటు దామోదరం సంజీవయ్య గారికి కూడా స్థానం లభించింది. అప్పటికి రెండు దశాబ్దాలుగా అనగా స్వతంత్ర భారత ప్రభుత్వంలో ఇద్దరు ఆంధ్రులు క్యాబినెట్ హోదా గల మంత్రులుగా ఉండడం అదే మొదటిసారి.
సంజీవరెడ్డి గారికి లాల్ బహదూర్ శాస్త్రిగారు తమ మంత్రి వర్గంలో 9వ స్థానం ఇస్తూ ముఖ్యమైన ఉక్కు గనుల శాఖను కేటాయించారు.
జూన్ 27 1964న ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి శ్రీ నీలం సంజీవరెడ్డి స్థానంలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నికయ్యారు. ప్రత్యేకంగా ఇందుకోసం సంజీవరెడ్డి గారు ఢిల్లీ నుండి వచ్చి జూబ్లీ హాల్ జరిగిన పార్టీ సమావేశానికి అధ్యక్షత వహించారు.
కేంద్ర మంత్రి అయిన సంజీవరెడ్డి గారిని పార్లమెంట్ కు ఎన్నుకునే గౌరవం తమ జిల్లాకు దక్కాలని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ ఏకగ్రీవంగా అభిలషిస్తున్నదని పార్లమెంట్ సభ్యుడు కె.నారాయణరెడ్డి సంజీవరెడ్డిగారికి తెలియజేశారు. ఈ సూచనకు సంజీవరెడ్డి తమ హర్షాన్ని వెలిబుచ్చుతూ డి.సి.సి సూచనను కాంగ్రెస్ అధ్యక్షుడికి, ప్రధానమంత్రికి పంపిస్తానని అన్నారు. కానీ అదే సంవత్సరం సంజీవరెడ్డిగారు రాజ్యసభకు ఎన్నికయ్యారు.
1964 నవంబర్ నెలలో గుంటూరు నగరంలో అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు జరిగాయి. సభల కోసం ప్రత్యేకంగా "నెహ్రూ నగర్" నిర్మించారు. నెహ్రూ తదనంతరం జరిగిన మొదటి అఖిల భారత కాంగ్రెస్ సభ ఇది...దాంతో ప్రతి క్షణం నెహ్రూ లేని లోపం ప్రస్ఫుటమయ్యింది. ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తరువాత అందరినీ ఏకతాటిపైకి తెచ్చి తీర్మానాన్ని పాస్ చేయించగల నెహ్రూ లాంటివాడు లేకపోవడం స్పష్టంగా తెలియవచ్చింది. దాంతో సమిష్టి నాయకత్వం నినాదానికి ప్రాముఖ్యత వచ్చింది. కామరాజ్ నాడార్, అతుల్య ఘోష్, సంజీవరెడ్డి సమిష్టి నాయకత్వాన్ని బలపరిచారు. ఈ సభలకైన ఖర్చును చాలా భాగం ప్రభుత్వమే భరించగా...మిగతాది పొగాకు వ్యాపారస్తుల నుండి వసూలు చేశారు. "నెహ్రూ నగర్" అవతరణకు పూర్వం ఆ స్థలం ఒక పాడుబడిన చెరువు. దాన్ని పూడ్చడానికి అయిన ఖర్చులో అధికభాగాన్ని గుంటూరు స్టేడియం సంఘం భరించింది. అలానే స్టేడియం సంఘం తీర్మానానికి విరుద్ధంగా మంత్రులు స్టేడియం నిధుల్లోంచి యాభై వేలు తీయించి కాకతీయ కళాతోరణం నమూనాలో బ్రహ్మానందరెడ్డి స్టేడియం అని రాయించి శిలా ద్వారాన్ని ఏర్పాటు చేశారు. వీటికి తోడు కొంగర జగ్గయ్య ఆధ్వర్యంలో రాజసులోచన తదితరుల నృత్య నాటికల ప్రదర్శనలు జరిగాయి. సభకు కనీస ప్రవేశ రుసుము 25 రూపాయలు. సభలో రణగొన ధ్వనులు ఆపడానికి సంజీవరెడ్డి గారు, బ్రహ్మానందరెడ్డి గారు అనేక సార్లు విజ్ఞప్తులు చేయవలసి వచ్చింది. ఈ గుంటూరు కాంగ్రెస్ విజయం సాధించిందా లేదా అనేది ప్రక్కన పెడితే ఆనాటి దేశ పరిస్థితికి భిన్నంగా భారీ ఖర్చుతో కాంగ్రెస్ తిరునాళ్ళు మాదిరిగా సభ జరిగింది. గుంటూరు జిల్లాలో బ్రహ్మానందరెడ్డి వర్గానికి ఉన్న ప్రాబల్యం ప్రదర్శించబడింది.
****సశేషం****
అవతరణి – రచయిత మనో నేత్రం
నేను వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్ ని. ప్రవృత్తి, అధ్యయనం మరియు రచన. మా ఊరు తిరుపతి జిల్లాలోని వెంకటగిరి పట్టణం. ఆంధ్ర రాష్ట్ర రాజధానైన అమరావతికి కుడి భుజమైన గుంటూరు నగరంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాను. మాకు గురువు దైవ సమానులైన మా మాతామహులు పిచ్చుక పుల్లయ్య గారు. వీరు ఆధ్యాత్మికవేత్తగా మారిన ఒకప్పటి కమ్యూనిస్టు. మా నాయన జగదీశ్వరరావు గారు క్రియాశీల రాజకీయాలలో పాల్గొని ఉండటం వల్లనేమో నా పై రాజకీయాల ప్రభావం ఉన్నది.
నా తొలి ఇరవై తొమ్మిదేళ్ల జీవితం ఆస్తిక నాస్తికత్వాలకు నడుమ అభిప్రాయరహితంగానే సాగినది. కానీ నాలో భారతీయ భాష, సంస్కృతుల పట్ల అభిమానం సహజాతంగా ఉన్నది. నేటికీ కొనసాగుతున్నది. జీవన గమనంలో ఎదురయ్యే ఒడిదిడుకుల వల్ల మతం వైపుకి మళ్ళిన నేను, ఎనిమిదేళ్ల మేధోమథనం, సునిశిత పరిశీలన, హేతుబద్ధ ఆలోచనల ఫలితంగా వ్యక్తి తత్త్వం వద్దకు చేరాను. ఆంగ్లంలో ఈ దృక్పథాన్ని “Individualistic Philosophy” అంటాను.
నాలో రచనా ప్రవృత్తి తలెత్తింది ఆగస్టు 7, 2018 నుండి ఆగస్టు 16, 2018 మధ్య కాలంలో. పై రెండు తేదీలు కచ్చితంగా చెప్పడానికి కారణం : మొదటి తేదీన శ్రీ కరుణానిధి కాలధర్మం చెందగా, రెండవ తేదీన శ్రీ అటల్ బిహారీ వాజపేయ్ కాలధర్మం చెందారు. సాహిత్యం, రాజకీయం కలగలసిన వీరిరువురి జీవితాల గురించి తెలుసుకుంటున్నపుడు నాలో రాయాలన్న ప్రేరణ కలిగింది. నా అధ్యయనం మొదలైంది కూడా అప్పటినుండే. అప్పటి వరకు నేనొక సాదాసీదా చదువరినే.
ఐదు సంవత్సరాల పురిటి నొప్పుల తరువాత నా యొక్క రచనా దృక్పథం నిర్దిష్టంగా రూపుదిద్దుకుంది. అనుభూతులను అలంకారికంగా చెప్పడం కవిగా నా దృక్పథమైతే, మానవ జీవన కోణాలను, జీవిత పార్శ్యాలను ఆసక్తికరంగా చెప్పడం కథకుడిగా నా లక్షణం. అధ్యయన ఫలితాలను చదువరులకు అందించడం వ్యాసకర్తగా నా ఉద్దేశం. ఏలితుల ఏకరువును తెలియజెప్పడం విమర్శల వెనకున్న కారణం.
అచ్చుకు నోచుకున్న తొలి కవిత "విడివడని బాధ్యత" విశాలాక్షి మాసపత్రికలో, తొలి కథ "వై" సిరిమల్లెలో, తొలి విమర్శ "పారిశ్రామిక అభివృద్ధితోనే సీమ ప్రగతి" ఆంధ్రజ్యోతిలో, తొలి వ్యాసం "మునసబు నుండి రాష్ట్రపతి దాకా..." ఆంధ్రజ్యోతిలో. ఆంధ్రజ్యోతి దినపత్రికకు, విశాలాక్షి మాస పత్రికకు, స్వీయ ముద్రణకు అవకాశం కల్పించి నేను రాసేవి చదవదగ్గవేనన్న విశ్వాసం కల్పించిన ప్రతిలిపి పోర్టల్ కు, కథలను, వ్యాసాలను అచ్చువేయడమే కాకుండా ప్రోత్సాహకరమైన వాక్కులతో శీర్షిక రాయడానికి అవకాశం కల్పించిన సిరిమల్లె సంపాదకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. – కుమార్ బాబు