భగవంతుణ్ణి కీర్తించేటప్పుడు అనేకానేక కారణాలు చూపించి ఆయన్ని కీర్తించవచ్చు కానీ కొంతమంది కంచెర్ల గోపన్న లాంటివారు వెక్కిరిస్తూ కూడా పాటలు పాడడం మనం చూస్తాం. పరమేశ్వరుడికి మెడలో నాగు ఉందనీ (నాగేంద్ర హారాయ త్రిలోచనాయ), తలమీద చంద్రుడున్నాడనీ (చంద్రశేఖర, చంద్రశేఖర, చంద్రశేఖర పాహిమాం) అనేకానేక శ్లోకాల్లో, పద్యాల్లో చూడవచ్చు. అయితే మరో విధంగా కూడా ఆయన చేసే పనులన్నీ సగం సగమే అంటూ చెప్తూ రాసిన పద్యం ఈ నెల చూద్దాం. ఇది రాసినవారు “త: త:” అనే కలం పేరు ఉన్న ఎరికలపూడి వాసుదేవరావు గారు. శంభో తవారాధనం అనే పద్యాలలో మహేశ్వరుణ్ణి ఏమంటున్నారో చూడండి.
న్హత్తుక మేన దాల్చినది యయ్యదియున్ సగమే రతీపతి
న్మొత్తము జంపలేదు విషమున్ బరిపూర్తిగ తాగలేదు గ
మ్మత్తు సగాల దేవర శివా నిను చిందులు వేసి బాడెదన్! [10]
తలమీద పెట్టుకున్నది సగం చంద్రుణ్ణి మాత్రమే (నెత్తిన బెట్టుకొంటి విధునెన్న సగంబె). పార్వతిని (సితాద్రి కన్య - హిమవంతుడి కుమార్తె) కూడా తనలో అర్ధనారీశ్వరుడిగా సగమే కలుపుకున్నావు (మేన దాల్చినది యయ్యదియున్ సగమే). మన్మధుణ్ణి మొత్తం చంపలేదు (రతీపతిన్మొత్తము జంపలేదు). పోనీ హాలాహలం పూర్తిగా తాగావా అంటే అదీ లేదు; కంఠంలోనే ఉంచుకున్నాడు కదా (విషమున్ బరిపూర్తిగ తాగ లేదు). ఇదేం గమ్మత్తు? నువ్వు అన్నీ సగం సగం పనులు చేసే దేవుడివా (సగాల దేవరా) శివా నిన్ను నాట్యం చేసి పాడుతాను (నిను చిందులు వేసి బాడెదన్) అంటున్నారు.
చంద్రుడు దక్షుడికి అల్లుడు. ఆయన తేజస్సు క్షీణించేటట్టు దక్షుడు శపించినపుడు శివుణ్ణి శరణు వేడితే చంద్రుణ్ణి తీసుకుని తన తలమీద ఉంచుకుని – నెలకోసారి క్షీణిస్తూ, మళ్ళీ పరిపూర్ణుడిగా అవుతూ ఉండేటట్టూ వరం ఇచ్చాడు శివుడు. ఈ చంద్రుడి అంశలు కూడా అనంతంగా సాగే, చావు పుట్టుక లకు ప్రతిబింబాలుగా చెప్పుకోవచ్చు. శివుడు లయకారుడు కనక ఆయన తలలో చంద్రుడు అలా సగమే ఉండడం కనిపిస్తుంది. సతీదేవి దేహత్యగం చేసాక పార్వతిగా పుట్టి తపస్సుతో శివుణ్ణి చేరుకుని అర్ధనారీశ్వరులు అవడం శివ-శక్తులు ఏకమవడం లేదా ప్రకృతి-పురుషులు ఏకమవడానికి సూచన. సతీదేవి దేహత్యాగం చేసాక తపస్సు చేస్తున్న శివుణ్ణి బాణాలతో కొట్టినవాడు మన్మధుడు. అయితే తప్పు ఆయనది కాదు. అయినా శివుడు మూడో కన్ను తెరిచేసరికి మన్మధుడు బూడిదైపోయాడు. దేవతలు ప్రేరేపిస్తే బాణాలు వేశాడు కానీ నా భర్త తప్పు ఏమీ లేదు అని రతీ దేవి అడిగితే ‘సరే ఆయన బతికి నీకు కనిపిస్తూనే ఉంటాడు కానీ మిగతావారికి కనిపించడు’ అని వరం ఇచ్చాడు శివుడు. అందువల్ల మన్మధుణ్ణి చంపినట్టా కాదా? సగం చంపినట్టు అని కవి ఊహించడం అద్భుతం కదా? తర్వాతది హాలాహలం తాగడం. దేవతలు వచ్చి ‘ఇలా విషం పుట్టిందీ మీరు తప్ప మాకెవరూ గతిలేదు’ అంటే, వెంఠనే దాన్ని నేరేడు మింగినట్టూ మింగాడు శివుడు. అయితే భగవంతుడి ఉదరంలో ఉండేవి లోకాలు. ఆ విషం వల్ల లోకాలు దగ్ధమవకుండా ఉండడానికి అమ్మవారు ఆయన కంఠం మీద చేయి వేసి దాన్ని అక్కడే ఆపిందని, అందువల్ల ఆయన నీలకంఠుడయ్యాడనీ కధ. అందువల్ల ఆయన విషం పూర్తిగా తాగాడా అంటే సగమే తాగాడనడం నిజం కదా? అదీ ఈ పద్యంలో హాస్యం.
ఈ సగం పనులు చేయడం చెప్పుకోవాలంటే ఇటివంటిదే మరొకటి యముణ్ణి చంపడం అనే విషయం కూడా. మృకండు మహర్షి కొడుకు మార్కండేయుడు ఆరేళ్ళకే చనిపోతాడు అని చెప్పినప్పుడు నారదుడు వచ్చి చెప్తాడు – మరొక్క ఏడాది మాత్రమే ఆయుర్దాయం ఉండగా – వెళ్ళి శివ పంచాక్షరి జపించు అని మంత్ర దీక్ష ఇచ్చి. నారదుడంటే ఆత్మ సాక్షాత్కారం పొందిన ఆది గురువు. అటువంటి వారు ఇచ్చే దీక్ష ఫలించక పోవడం అన్నమాటే లేదు. ఫలించి తీరుతుంది. యముడు పంపిన దూతలు పంచాక్షరి జపించే మార్కండేయుణ్ణి చేరలేక తిరిగి వెళ్తే యముడే స్వయంగా వచ్చి యమపాశం విసురుతాడు కుర్రాడి మీదకి. అది శివుణ్ణి తగిలీ తగలడంతోటే – యముణ్ణి శూలంతో సంహరించి అడక్కుండానే మార్కండేయుడు చిరాయువుగా ఉంటాడనే వరం ఇచ్చినది ఈ సగాల దేవరే కదా? అయితే యముడు లేకుండా లయం అనే మాటలేదు. అందువల్ల బ్రహ్మాదుల మాట మన్నించి మళ్ళీ బతికిస్తాడు యముణ్ణి. ఈ విషయమే మనం ముందు రాసిన పద్యం లో (సిరిమల్లె ఆగస్ట్ 2025) ‘కాయజ సంహరాయ… శశిఖంఢ ధరాయ… యమాంతకాయ” అని శివుణ్ణి కీర్తించడం చూసాం.
ఈమాట పత్రికలో వచ్చిన తః తః గారి మిగతా ‘శంభో తవారాధనం’ పద్యాలు ఇక్కడ చూడవచ్చు.
కవి గారి హాస్యం ‘కట్టిన పుట్టమేమి, కనకాంబరమా?’, ‘వొంటికిబూది కంఠమున నుస్సుల బుస్సుల పాము’ అనే మిగతా పద్యాలలో కూడా తొణికిసలాడుతూ చదువరులకి నవ్వు తెప్పిస్తుంది.