Menu Close
ఘాలి లలిత ప్రవల్లిక
కొలిమి (ధారావాహిక)
ఘాలి లలిత ప్రవల్లిక

దసరా నవరాత్రులు ప్రారంభం అయ్యాయి. భవాని మాలధారులు, దేవీ ఉపాసకులు తో అమ్మవారి గుళ్ళన్ని కోలాహలంగా ఉన్నాయి.

జంబేష్, రాజన్ లిద్దరూ భవానీ మాల వేసుకున్నారు. జంబేష్, రాజన్ లు నవరాత్రులు మొదలైన దగ్గర నుంచి రోజూ పక్క ఊరిలో ఉన్న కామాక్షి అమ్మవారి ఆలయంకు వెళ్ళి వస్తున్నారు.

"బావా రేపే విజయదశమి. ప్రణవి, పిల్లలు వచ్చే రోజు," గుర్తుచేసింది రాణి.

"గుర్తుంది... వాడు ఉద్యోగం చేసే ఊరికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఇల్లు రెంటుకు తీసిపెట్టాం," చెప్పాడు రాజన్.

"అంతే... దాన్ని ఈ ఇంటికి తీసుకు రాబోకు... దాని మొహం చూడాలంటే నాకు అసహ్యం. రామలక్ష్మణుల లాంటి అన్నదమ్ములను విడగొట్టాలని చూస్తోంది," అంది సుందరి.

"పోనీలే అమ్మ నువ్వు ఊరికనే వర్రీ అవ్వక. దాని పాపాన్న అది పోతుంది. దాన్ని వేరే పెట్టడానికే కదా ఇల్లు తీశాం," అన్నాడు రాజన్.

"మనతో చక్కగా కలిసిమెలిసి ఉంటే ఇక్కడే ఉండేది కదా! కలవక వేరు పెడుతున్నాం గానీ... ఎక్కడ ఉన్నా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే అదే పదివేలు," అంది రాణి.

"ఇదంతా నా కర్మ పెడ మనిషి దొరికింది. ఇక దాంతో నా చావు నేను చావాలి," అన్నాడు బాధగా జంబేష్.

అంత ఇబ్బంది పడుతూ దాని ఎదురుగా వెళ్లి ఉండబోకు. డ్యూటీ కి వెళ్తున్నాను అని చెప్పి తెల్లవారుజామున బయలుదేరి వచ్చేయ్. ఇక్కడే టిఫిన్ అది తినేసి వెళుదువుగాని. క్యారేజీ అది కట్టిస్తుంది. నీ భార్యకి హోటల్లో తిన్నానని చెప్పేసేయ్. సాయంత్రం డ్యూటీ అవ్వగానే ఇక్కడికి వచ్చేయి. ఇక్కడే భోంచేసుకుని రాత్రి 11:00 కో 12కో ఇంటికి పో... ఆఫీసులోనే ఇంత టైం అవుతుందని దానికి చెప్పు. నీ ఆఫీస్ ఎక్కడ ఉందో ఏంటో... దానికి తెలియదు. నీ ఫ్రెండ్స్ నీ వివరాలు దానికి చెప్పబోక. ఇక అది, దానికి నువ్వే చెప్పేదే రైట్ అనుకుంటుంది. ఇంటికి వెళ్ళాక దాంతో గొడవ పడక, ఏదన్న పెడితే తినగలిగితే తినేసి, కామ్ గా పడుకో." తమ్ముడిని ఉద్దేశించి చెప్పాడు రాజన్.

****

ప్రణవి ని అత్తవారింటికి తీసుకెళ్లే రోజు రానే వచ్చింది.

ప్రణవి అయితే ఆనందంగా ఉంది కానీ, గిరిజకు ప్రణవీని పంపటానికి ధైర్యం చాలడం లేదు.

సెల్ ఫోన్ వచ్చిన కొత్తలు. ఒక బిఎస్ఎన్ఎల్ సెల్ ఫోన్ ని, కొని రీచార్జ్ కూపన్లని కూడా తీసుకుని ప్రణవికి ఇచ్చి, "ఈ ఫోన్ ఎవరికి కనపడకుండా దాచుకో... ఏదైనా అత్యవసరం అయితే మాకు ఫోన్ చెయ్యి. ఏ అఘాయిత్యం చేసుకోకు. నీకు కష్టం కలిగితే మాకు రహస్యంగా ఫోన్ చెయ్యి. మేము వెంటనే వచ్చి తీసుకొచ్చేస్తాం. ఓర్వలేని బాధను అనుభవించక. నీకు కష్టం వచ్చినప్పుడు ఆదుకోవడానికి, మేమున్నామన్న విషయం మర్చిపోకు. ఎవరో ఏదో అనుకుంటారని... మదనపడక. ఎక్కువగా ఆలోచించి పిచ్చిదానివి కావొద్దు," అని చెప్పింది గిరిజ.

"ఎందుకమ్మా! భయపడతావు? నేను బాగానే ఉంటాను. వాళ్ళు తమ తప్పు తెలుసుకొని తీసుకుని వెళుతున్నారు. అందువల్ల నాకు అక్కడ ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ఊరికే ఊహించుకొని కంగారు పడకు," అంది ప్రణవి.

"వాళ్ళు ప్రేమగా చూస్తారనే నమ్మకం మాకైతే లేదు. కరుడు గుండెలో...కరుణ మొలక ఎత్తదు. ఎడారిలో నీటి చలమకై వెతుకుతున్నావు. నీ ఆశని మేము చల్లార్చలేము. జాగ్రత్తగా ఉండు. వారి మాటల వెనుక ఉన్న మర్మాన్ని గ్రహించు. ఇకమీదటైనా తెల్లనివన్నీ పాలు కావు, నల్లనివన్నీ నీళ్లు కావు, అని తెలుసుకో. నువ్వూ పిల్లలు జాగ్రత్తగా ఉండండి." అంటూ తగు జాగ్రత్తలు చెప్పింది గిరిజ.

'తల్లి మనస్సు! నేనేమైపోతానో నని భయపడుతోంది. వాళ్ళే కదా! నన్ను చూసి పిలిచింది. నా మీద ప్రేమ ఉండబట్టే కదా! పిలిచారు. ఏంటో అమ్మ! అలా భయపడుతోంది," అనుకొంది మనస్సులో.

వేరు కాపురానికి కావలసిన సామాన్లు ఏర్పాటు చేశారు. వాటిని అన్నింటినీ సర్దుకొంది ప్రణవి.

"అన్నింటినీ ఒకసారి పట్టుకెళ్ళక. ముందు కొన్ని తీసుకుని వెళ్ళి, స్థిరపడ్డాక మిగిలినవి తీసుకొని వెళుదువు," అని గిరిజ చెప్పినా...

"నాకు అన్నీ అవసరం పడతాయి. వెళ్ళగానే ఆయనను కొనమంటే ఏం బాగుంటుంది? ఆయన దగ్గర డబ్బులు ఉంటాయి... ఉండకపోతాయి," అంటూ అన్నీ ప్యాక్ చేసేసింది ప్రణవి.

"నువ్వు మాత్రమే తల్లి పిల్లల్ని తీసుకొని రా! మీ అమ్మని వాళ్ళని ఎవరినీ తీసుకుని రావద్దు," అని మూర్తికి ముందే రాజన్ చెప్పడంతో... ప్రణవీని పిల్లల్ని తీసుకుని మూర్తి బయలు దేరాడు.

ఈ లగేజ్ మొత్తాన్ని కూడా పట్టుకొని, ట్రైన్ లో బయలుదేరారు మూర్తి, ప్రణవి పిల్లలు. మూర్తి ఫ్రెండ్స్ వచ్చి, లగేజ్ ట్రైన్లోకి ఎక్కించి సహాయం చేసారు.

'ఇక్కడ అంటే అందరూ వచ్చి ఎక్కించారు, అక్కడ ఈ లగేజ్ ని పిల్లల్ని ఎలా దించుకుంటానో ... వాళ్ళు స్టేషన్ కి వస్తారో... రారో... ' అనుకున్నాడు మూర్తి.

ట్రైన్ కదిలింది. ఊరు వెళ్తున్నామని పిల్లలు కేరింతలు కొడుతున్నారు. మోడు వారిన మొక్క కొత్త చిగురులు తొడిగినట్టు, ప్రణవి ఊహలకు రెక్కలొచ్చి కొత్త లోకాల్లో తేలిపోతోంది.

ఆమె మొహంలో ఉన్న తన్మయత్వాన్ని చూసి...

'పిచ్చి అక్క... వాళ్లు చంపడానికి నీళ్లల్లోకి తోసినా ... నాకు ఈత నేర్పడానికి తోసారు అనే రకం. బావ ఏమాత్రం తెలివైన వాడైనా... ఇంతలా ప్రేమించే భార్య ను బాధ పెట్టేవాడు కాదు,' అనుకున్నాడు. తీసుకెళ్తున్నాడు గాని... వాళ్ళు వీళ్ళను చేరదీస్తారన్న నమ్మకం అయితే మూర్తి కి లేదు.

*****

ట్రైన్ కొంత దూరం వెళ్ళింది. రాజన్ దగ్గర నుంచి మూర్తికి ఫోన్ వచ్చింది.

"జంబేష్ కి యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్లో జాయిన్ చేశాం. మీరు ఇప్పుడు రాకండి. మళ్లీ మీరు ఎప్పుడు రావాలో నేను చెప్తాను అప్పుడు వద్దురు గాని," అన్నాడు.

"అయ్యో ఎలా జరిగింది? దెబ్బలు ఏమైనా తగిలాయా?" కంగారుగా అడిగాడు మూర్తి.

"నవరాత్రులు కదా అని గుడికి వెళ్లి వస్తూ ఉంటే లారీ గుద్దేసింది. చేతి ఎముక విరిగింది. కంగారు పడాల్సిన పనిలేదు," అంటూ చెప్పాడు రాజన్.

"మేము వచ్చి చూస్తాం బావగారు,"

"చూసి, ఎవరు మాత్రం ఏం చేయగలరు. మనల్ని చూడ్డానికి కూడా రానీయరు. ఇంత దూరం వచ్చి మీకు ఉపయోగం ఉండదు. ఇలాంటి అప్పుడు ఎందుకు తీసుకురావడం? వాడి ఆరోగ్యం బాగుపడ్డాక తీసుకొస్తే... ఏదో వాళ్ళు సంతోషంగా గడుపుతారు. నేను మళ్ళీ చెప్తాను అప్పుడు తీసుకొద్దురు గాని ఇప్పుడు వద్దు," అన్నాడు రాజన్.

మూర్తికి ముందు నుంచి అనుమానం గానే ఉంది. రాజన్ చెప్పిన దాంట్లో...ఎంత వరకు నిజం ఉందో తెలియదు... అలాగని అబద్ధము అని కొట్టిపారేయలేం.

'కొంత దూరం వచ్చేసాం. ఈ ఊరు గాని ఊర్లో... ఎవరి సహాయము లేకుండా, మళ్లీ లగేజ్ దింపి... తల్లిని పిల్లల్ని తీసుకెళ్లాలంటే కష్టం,' అనుకొని,

"బావగారు ట్రైన్ ఎక్కేసాము. కొంత దూరం కూడా వచ్చేసాం. ఇప్పుడు దిగి వెనక్కి వెళ్లాలంటే... తల్లి, పిల్లల్ని, లగేజ్ ని వేసుకొని వెనక్కి వెళ్ళటం కష్టం అవుతుంది. అయినా ఇలాంటి టైంలో భార్య, పిల్లలు దగ్గర ఉండాలి కదా! ఈసారి కి మీ మాట కాదన్నందుకు ఏమీ అనుకోవద్దు. మేము వచ్చేస్తున్నాము ఎక్కడ దిగాలో చెప్పండి." అన్నాడు మూర్తి.

"అయితే మీ ఇష్టం. మేము ఎవరం ఇక్కడ లేము. వాళ్ళకు మాణిక్య పురంలో ఇల్లు తీశాను. ఆ లగేజిని, వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళు." అని చెప్పి, ఇంటి అడ్రస్ చెప్పి ఫోన్ కట్ చేశాడు రాజన్.

***సశేషం***

రచయిత్రి పరిచయం ..

Ghali-Lalitha-Pravallika పేరు: ఘాలి లలిత B.A:Bed; కలం పేరు: ప్రవల్లిక

రచనలు: మట్టి పాదాలు కవితాసంపుటి, ఆహా కథాకుసుమాల సంపుటి, మర్మదేశం సైంటిఫిక్ ఫిక్షన్ బాలల నవల (“సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వెలువడింది.), కొలిమి (మినీ నవల) (ప్రస్తుతం “సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వస్తున్నది.)

పురస్కారాలు: 1. జిల్లా కలక్టర్ గారిచే ఉగాది పురస్కారాలు నాలుగు సార్లు; 2. గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి గురజాడ రాష్టీయ పురస్కారము; 3. సావిత్రిబాయి పూలేజాతీయస్థాయి ఆదర్శ ఉపాధ్యాయిని పురస్కారం; 4. ఆదర్శ మహిళా పురస్కారం; 5. పాతూరి మాణిక్యమ్మ కీర్తి పురస్కారం; 6. గుర్రాల రమణమ్మ సాహితీ పురస్కారం; 7. గుఱ్ఱం జాషువా పురస్కారం; 8. సత్యశ్రీ పురస్కారం; 9. గాడ్ఫాదర్ ఫౌండేషన్ నుంచి సాహితీ పురస్కారం; 10. సరోజినీ నాయుడు సాహితీ పురస్కారం; 11. విద్వాన్ విశ్వం ఉత్తమ కథా పురస్కారం; 12. అక్షరయాన్ నుంచి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 2022 లో సాహిత్య స్రష్ట పురస్కారం; 13. తానా వారి నుంచి 10,000 నగదు, సత్కారం; 14. సరోజినీ నాయుడు ఎక్స్ లెన్స్ అవార్డు.

బిరుదులు: ప్రతిలిపి బెంగుళూరు వారి నుంచి 'సాహితీ విశారద' బిరుదు మరియు తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారినుంచి ‘సహస్రకవిమిత్ర’.

సాహిత్య పరంగా చేపట్టిన బాధ్యతలు: తెలుగు భాషోద్యమ సమితి ప్రధాన కార్యదర్శి; గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నెల్లూరు విభాగానికి అధ్యక్షురాలు; నెరసం సహ కార్యదర్శి; సింహపురి సాహితీ సమైఖ్యలో కార్యదర్శిగా కొంత కాలం పనిచేశారు.

ప్రస్తుతం, అక్షరయాన్ రచయిత్రుల సంఘంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ అక్షర యాన్ బాలికా, బాలుర విభాగములను నెలకొల్పారు. 108 మంది రచయితలచే మాయలోకం అనే గొలుసు నవలను రాయిస్తునారు. అలాగే శ్వేత ధామం అనే గొలుసు కట్టునవలను సాహితీ సిరికోన అనే సామాజిక మాధ్యమం లో మహిళలచే రాయిస్తున్నారు. బాల బాలికలచే నల్ల హంస అనే మరో గొలుసు నవలను కూడా వ్రాయిస్తున్నారు.

Posted in December 2025, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *