"మధూ" అంటూ వెళ్లి, నోటికి వేసిన ప్లాస్టర్ తీసి, కాళ్ళు చేతుల కట్లు విప్పాడు. టాయిలెట్ పేపర్ పూర్తిగా విప్పబడి ఉంది. పక్కనే ఎర్రని సబ్బు ముక్క పడి ఉంది. "ఏం జరిగింది సార్?" ఆందోళనగా ప్రశ్నించింది రిసెప్షననిస్ట్. "ఏం లేదు" అని మధును ముందు గదిలోకి తీసుకువచ్చి, మంచినీళ్లు ఇచ్చాడు.
ఏమి మాట్లాడవద్దు అన్నట్లు మధుకు సైగ చేసి, "ఈ రూమ్ ఎవరి పేరు మీద ఉంది?" అని అడిగాడు మోహన్.
"కిందకి వెళ్లి చూడాలి సర్" అంది ఆ అమ్మాయి.
ముగ్గురూ కిందకు వెళ్లారు. గది చౌదరి పేరున బుక్ చేయబడింది. ఆ రోజు వచ్చిన అందరి పేర్లు చూసాడు. ఈ గది పక్కనే ఉన్న గది నగేష్ పేరిట ఉంది. రెండు గంటల ముందు తీసుకున్నట్లు ఉంది. అంతే. ఆరోజు ఇంకెవరూ రాలేదు.
"మీరు ఏమి జరగనట్లే ఉండండి మిస్. రెండు గదులకు ఒకే వ్యక్తి డబ్బులు చెల్లిస్తే, నాకు ఫోన్ చేయండి" అని చెప్పి, తన నెంబర్ ఇచ్చి, మధుతో ముందుకు కదిలాడు మోహన్. వీళ్ళ బండి మలుపు తిరగగానే, ఒక కారు వచ్చి హోటల్ ఆవరణలో ఆగింది. నగేష్ కారు దిగి, లిఫ్ట్ వైపు నడిచాడు. రిసెప్షననిస్ట్ ఎందుకో లిఫ్ట్ వైపు చూసింది. మూడవ అంతస్తుకు వెళ్తోంది. ఊపిరి బిగబట్టి ఎదురుచూడసాగింది. అరగంట గడిచినా ఎలాంటి హడావుడి లేదు.
*********
బండి తీసి, మధును ఎక్కించుకుని దగ్గర లోని పార్కు కి తీసుకువెళ్లాడు మోహన్. కనుచీకటి పడుతోంది. పల్లీలు కొనుక్కొని ఇద్దరూ ఒక బెంచీ మీద చతికిల పడ్డారు. "ఇప్పుడు చెప్పరా మధు. ఏం జరిగింది?" అడిగాడు మోహన్.
"మా బాబాయ్ ని కలవడానికి ఆఫీస్ కి వచ్చాను. లోపల అతని స్నేహితుడు ఉన్నాడని బయట ఉద్యోగి చెప్పాడు. ఇంతలో బాబాయి గదిలో నుంచి సుమారు ఇరవై మంది కుర్రాళ్ళు వచ్చి, వేరే గదిలోకి వెళ్ళేరు. వాళ్ళు మనం ఎంపిక చేసిన కుర్రాళ్లలో కొందరు. వాళ్ళు వెళ్ళిపోయాక నేను బాబాయి గది వైపు వెళ్లాను. చిన్నగా మాటలు వినిపిస్తున్నాయి. "ఏదో హారం అని, వెతకడానికి వెళ్లిన వారు ఎవరో కానీ మరణించారని, బాబాయికి ఇప్పుడు ఆయన సహాయం చేస్తానని" చెప్తున్నాడు. బాబాయి అన్న మాటలు నాకు వినబడలేదు. సాయంత్రం కలుద్దామని చెప్పాడు ఆయన. అంతే. క్షణంలో తలుపు తెరుచుకుని బయటకు వచ్చాడు ఆయన. నన్ను చూడగానే నవ్వాడు. నాకు పక్కకి తప్పుకునే అవకాశం కూడా లేదు. ఎంత త్వరగా తీసాడో కానీ పక్కనే ఉన్న పూలకుండీ తో తలపై కొట్టాడు. నాకు వెంటనే స్పృహ తప్పింది. మళ్ళీ మెలకువ వచ్చేసరికి బాత్ రూమ్ లో బంధించబడి ఉన్నాను. బయట రోడ్డుపై నీ పాట వినిపిస్తోంది. మొదట ఎవరో లే అనుకున్నాను.
కానీ అన్ని పాటలు “మధు”తో ఉండడం, అన్ని పల్లవులే కావడంతో కాస్త జాగ్రత్తగా విన్నాను. నీ గొంతు పోల్చాను. నా నోటికి ప్లాస్టర్ ఉంది. నువ్వు వెళ్లిపోయావు. కానీ కాసేపటిలోనే మళ్ళీ నీపాట వినిపించింది. ఏం చేయాలో తోచలేదు. నువ్వు వెళ్లిపోయావు. టాయిలెట్ పేపర్ పై మన ఇద్దరి పేర్లు సబ్బుతో రాసి ఉండచుట్టి విసురుతూ ఉన్నాను. మొత్తానికి నువ్వు చూశావు. నన్ను రక్షించావు." అన్నాడు మధుమూర్తి.
"సరే. ఆ విషయం ఏమిటో రేపు చూద్దాం. ఇప్పుడు ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకో. లక్ష్మీ గాభరా పడుతోంది. నీ ఫోన్ ఎక్కడ ఉంది?" అడిగాడు మోహన్. మధు జేబులో నుంచి ఫోన్ తీసి ఇచ్చాడు. ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. అందుకే ఎవరి ఫోన్ చేసినా వీలుకాలేదు. ఫోన్ తిరిగి మధుకు ఇచ్చేసాడు. అక్కడ నుండి లక్ష్మికి ఫోన్ చేసాడు మోహన్. మధు మాట్లాడాడు. వ్యాపారం మీద బయటకు వచ్చానని, ఫోన్ ఛార్జింగ్ అయిపోవడం వలన ఫోన్ చేసి చెప్పలేకపోయానని, మోహన్ ను కంగారు పెట్టావని" అన్నాడు మధు.
ఇద్దరూ మధు ఇంటికి వెళ్లారు. బయట నుంచి మధును దింపేసి, ఇంట్లోకి వెళ్లకుండా తిరిగి తమ ఇంటికి వెళ్ళిపోయాడు మోహన్.
******
నగేష్ ముందుగా చౌదరి పేరిట తీసుకున్న గదికి వెళ్ళాడు. లోపల మధు లేడు. తాళ్ళు విప్పి ఉన్నాయి. టీపాయ్ మీద గ్లాసులో నీళ్లు ఉన్నాయి. ఎలా తప్పించుకు పోయాడో అర్ధంకాలేదు నగేష్ కి. రాఘవరావు గదిలో మాట్లాడుతూ ఉండగానే తలుపుల కింద నీడ చూసాడు. గభాలున తలుపులు తీసేసరికి ఆ కుర్రాడు తప్పించుకోలేక పోయాడు. రాఘవ తనతో పాటు బయటకు రాకపోవడం మేలే అయ్యింది. తమ మాటలు అన్ని విన్నట్లున్నాడు. వెంటనే పక్కనే ఉన్న పూలకుండీతో తలపై కొట్టగానే స్పృహతప్పిపోయాడు. వెంటనే ఆ కుర్రాడిని చాటుకు లాగి, తాను గోడకు అతుక్కుపోయాడు. రాఘవ బయటకు వచ్చి చూసాడు. మళ్ళీ లోపలకు వెళ్ళిపోయాడు. ఆ కుర్రాడిని జాగ్రత్తగా నడిపిస్తూ బయటకు వచ్చి, కారులో కూర్చోపెట్టాడు. బయట ఉండే ఉద్యోగి అక్కడ లేదు. ఇది కూడా మేలే అనుకుంటూ హోటల్ కి వచ్చాడు. ఆ కుర్రాడిని సోఫాలో కూర్చోపెట్టి, రిసెప్షన్ దగ్గరకి వచ్చాడు. అక్కడ రిసెప్షననిస్ట్ లేదు. వేరే అబ్బాయి ఉన్నాడు. చౌదరి పేరుతో రూమ్ తీసుకుని, ఆ కుర్రాడిని తెచ్చి, బాత్ రూమ్ లో కట్టి పడేసాడు. బయట భోజనం చేసి, కాసేపు తిరిగి వచ్చాడు. అంతా కలిపి రెండు గంటలు బయట ఉన్నాడేమో… అంతలోనే ఈ కుర్రాడు ఎలా తప్పించుకుపోయాడు? అదీ వేసిన తలుపులు వేసినట్లు ఉండగానే… తేలు కుట్టిన దొంగలా కిమ్మనకుండా ఉండిపోయాడు.
తన గదికి వచ్చి, రిసెప్షన్ కి ఫోన్ చేసి, కావలసినవి ఆర్డర్ ఇచ్చాడు. ఇష్టం లేకపోయినా తప్పనిసరి అయి బయలుదేరి వచ్చాడు రాఘవరావు. హోటల్ గదిలో అడుగుపెట్టగానే, మందు, భోజనం, అమ్మాయిలు, అనేకరకాల చిరుతిళ్ళు అన్ని సిద్ధంగా ఉన్నాయి.
"రావోయ్ రాఘవ, రా" ఆహ్వానించాడు నగేష్.
సంకోచంగానే అడుగుపెట్టాడు రాఘవరావు. నగేష్ సైగతో ఇద్దరు అమ్మాయిలు వచ్చి, రెండు చేతులూ పట్టుకుని, తీసుకువెళ్లి సోఫాలో కూర్చోపెట్టారు. రాఘవరావు నోటికి మందు గ్లాసు అందించారు. రాఘవరావు మందు తీసుకోడానికి నిరాకరించాడు.
"విషయం చెప్పు నగేష్" అన్నాడు మెల్లిగా.
"చెప్పడానికేముంది రాఘవా! నీకేం భయం లేదు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డువేస్తాను. ఇక నుంచి నీతోనే ఉంటాను. ఇద్దరం కలిసి పనిచేద్దాం" అన్నాడు నగేష్.
రాఘవరావుకి అంత చల్లటి వాతావరణం లో కూడా చెమటలు పట్టేసాయి. నోరు ఆరిపోయి, ముందు వద్దు అని తిరస్కరించిన ద్రవాన్ని గబుక్కున నోటిలో పోసుకున్నాడు.
రాఘవరావుకు ఏం పాలుపోలేదు. తాను కూడా విరమించుకుంటాను అని చెప్పడానికి వీలు లేకుండా, తనతోనే ఉంటానంటున్నాడు నగేష్. లేదంటే వెతుకుతున్నట్లు కాలయాపన చేసేద్దాం అనుకున్నాడు. ఇంక చేసేదేం లేక "సరే. రేపు ఉదయం దుర్గ గుడికి వెళదాం అనుకుంటున్నాను. మొదటి బేచ్ ట్రైనింగ్ పూర్తి అయింది కదా" అన్నాడు నెమ్మదిగా రాఘవరావు.
"హహ… అమ్మవారి హారం అపహరించడానికి అమ్మవారిని అనుమతి అడుగుతున్నావా? సరే పద నీతోనే నేను కూడా వస్తాను" అన్నాడు నగేష్.
*****
మరునాడు ఉదయం నగేష్, రాఘవరావు ఒక కారు లోను శిక్షణ పొందిన యువకులు రెండు జీపుల లోను అమ్మవారి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. వీళ్ళు కొండ ఎక్కే సమయానికి మోహన్ కుటుంబం దర్శనం పూర్తిచేసుకుని ఆలయ ఆవరణలోకి వచ్చారు. మోహన్ రాఘవరావును కారులో చూడగానే, "సార్" అని పిలిచాడు. రాఘవరావు నగేష్ కి చెప్పి, కారు దిగి వచ్చి, మోహన్ దగ్గరకు చేరుకున్నాడు. ఇంతలో ఎవరూ ఊహించని సంఘటన జరిగిపోయింది.
కొండపై నుంచి చరియ విరిగి, ఒక బండరాయి దొర్లుకుంటూ వచ్చి నగేష్ కూర్చున్న కారుపై పడింది. కారు డ్రైవర్ చిన్న గాయాలతో, తుళ్ళిపోయి బయటపడ్డాడు. నగేష్ కారులోనే నుజ్జు నుజ్జు అయిపోయాడు. వెనుక రెండు జీపులలోని యువకులు నిర్ఘాంతపోయి చూస్తూ ఉండిపోయారు. మోహన్ తనని పిలవకపోతే, తానుకూడా నగేష్ తో పాటే ప్రయాణం కట్టవలసి వచ్చేది అన్న ఊహే వణుకు తెప్పించింది రాఘవరావుకు. మోహన్ బృందమంతా నిర్విణ్ణులై చూస్తూ ఉండిపోయారు. రాఘవరావు మోహన్ చేతుల్లో ముఖాన్ని ఉంచి బావురుమన్నాడు. దుఃఖం ఉపశమించాక, మోహన్ ని గుండెలకు హత్తుకున్నాడు. "ప్రాణదాత" వని పొగిడాడు.
మోహన్ రాఘవరావును పక్కకు తీసుకువెళ్లి జరిగినదంతా చెప్పాడు. రాఘవరావు కు మతిపోయినట్లు అయ్యింది. నగేష్ కి తగిన శాస్తి జరిగిందని ఆనందించాడు. తాను మారడానికి మరొక అవకాశం అమ్మవారు ఇచ్చిందని నమస్కారాలు తెలియజేసుకున్నాడు. ఆ రాతిని తొలగిస్తే కానీ కారులో నగేష్ మృతదేహాన్ని బయటకు తియ్యడానికి లేదు. పోలీసులు వచ్చి, అందరిని అక్కడి నుంచి తప్పించారు. చుట్టూ బారికేడ్లు పెట్టి, క్రేన్ తెప్పించి బండరాతిని తీయించే ఏర్పాట్లు చేస్తున్నారు. మరణించింది తన స్నేహితుడు కాబట్టి, కార్యక్రమం అంతా పూర్తిచేసుకుని వస్తానని చెప్పి, మోహన్ కుటుంబాన్ని జాగ్రత్తగా కిందకు పంపేసాడు రాఘవరావు. కారులో వ్యక్తి తన స్నేహితుడని, కలకత్తా నుంచి వచ్చాడని చెప్పి, జరగవలసిన కార్యక్రమం అంతా దగ్గరుండి చూసుకున్నాడు రాఘవరావు.
కళ్లెదుటే జరిగిన ఘోరం నుంచి మోహన్ కుటుంబం చాలా సేపు తేరుకోలేకపోయింది. కానీ కారులో నగేష్ ఉన్న విషయాన్ని సుధకు ఎవరూ చెప్పలేదు. రాఘవరావు, డ్రైవర్ తప్పించుకున్న విషయం మాత్రమే తెలుసు. అందరూ ఇంటికి చేరుకున్నారు. భోజనాలు అయిన తరువాత సుధని కన్నవారింటికి తొలి పురిటి కోసం తీసుకువెళ్లారు ఉమ, మహేశ్వరరావులు. వారితో పాటు మోహన్, అతని తల్లిదండ్రులు కూడా వెళ్లారు.
జరిగిన విషయం అంతా మధుకు ఫోన్ లో చెప్పాడు మోహన్. మధు వెంటనే రాఘవరావుకు ఫోన్ చేసి ఏమైనా సహాయం కావాలేమో కనుక్కున్నాడు. రాఘవరావు పదేపదే మోహన్ ని పొగిడాడు. మోహన్ లేకపోతే తన ప్రాణాలు నిలిచేవి కావన్నాడు. జీవితాంతం మోహన్ కి ఋణపడి ఉంటానన్నాడు. ఆరోజుకు తన పాలిటి భగవంతుడు మోహన్ అన్నాడు. రాఘవరావు మనఃస్థితి గమనించిన మధు రాఘవరావుకు తోడుగా వెళ్లి, రాత్రి సమయానికి మొత్తం కార్యక్రమం పూర్తిచేయించాడు. మర్నాడు రాఘవరావు మధు, లక్ష్మి తోడుగా అమ్మవారి దర్శనం చేసుకున్నాడు. మనస్ఫూర్తిగా అమ్మవారికి కృతజ్ఞతలు తెలియజేసుకుని, ప్రాణాలు నిలిచినందుకు అమ్మవారికి కంఠాభరణం చేయించి ఇస్తానని మొక్కుకున్నాడు.
****
నెలలు ఇట్టే గడిచిపోయాయి. సుధ చక్కని ఆడపిల్లను ప్రసవించింది. మహాలక్ష్మి పుట్టిందని అందరూ మురిసిపోయారు. రెండు ఇళ్లలో సంతోషం వెల్లివిరిసింది. 21 వ రోజు ఘనంగా బాలసార కార్యక్రమం నిర్వహించారు. అందరూ రకరకాల ఆభరణాలు, కానుకలు, వస్త్రాలు పుట్టిన బిడ్డకు చదివిస్తున్నారు. అందరి ఆశీస్సులు బిడ్డకు అందుతున్నాయి. రాఘవరావు ప్రభాకరరావు కంటే ఎక్కువగా మోహన్ కూతుర్ని ముద్దు చేస్తున్నాడు. తన ప్రాణాలు కాపాడిన దుర్గమ్మే మోహన్ కూతురిగా పుట్టిందని మురిసిపోతున్నాడు. అమ్మవారికి కంఠాభరణం చేయించి మొక్కు తీర్చుకున్న తర్వాత అదే నమూనాలో చిన్న హారం చేయించి పాపకు బహుమానంగా ఇచ్చాడు. పాపపై రాఘవరావు ప్రేమను చూసి అందరూ ఆశ్చర్య పోతున్నారు.
ఉమ, మహేశ్వరరావు కూతురుకి, అల్లుడికి, వియ్యంకులకు బట్టలు పెట్టారు. నగల పెట్టి తీసుకువచ్చి, "ఇది మా వంశ పారంపర్య హారం. తరతరాలుగా ఇంటి పెద్దకొడుక్కి రహస్యంగా అందించే మణి హారం. రహస్యంగా అని ఎందుకన్నానంటే ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే రక్తపాతం జరగకుండా ఈ హారాన్ని పెద్ద కొడుకుకు వివాహ సమయంలో రహస్యంగా ఇచ్చేవారు. ఆ హారాన్ని అమ్మడం కానీ, మార్చడం కానీ చేయకూడదు. అలా గత నూటయాభై ఏళ్లుగా వారసత్వ సంపదగా వస్తోంది. మాకు కొడుకులు లేని కారణంగా, మా అమ్మాయి సుధకు పుట్టిన ఈ పాపకే ఆ హారాన్ని ఇస్తున్నాను." అని పెట్టి తెరచి, ధగధగలాడుతున్న మరకతమణి హారాన్ని పాపకు, సుధ, మోహన్ లకు అందించారు ఉమ, మహేశ్వరరావులు. చూస్తున్న రాఘవరావుకు కళ్ళు తిరిగినట్లయ్యింది. ఇన్నాళ్లుగా ఏ హారం కోసమైతే ఇంతమంది ప్రాణాలు బలిపెట్టుకున్నారో అదే మరకతమణి హారం.
"నూటయాభై ఏళ్ళు అంటున్నారు… ఇంత కొత్తగా కాంతులీనుతోంది" అన్నాడు మధు.
"ఆ హారం ప్రత్యేకత అదే. ఎన్నేళ్లయినా పాతబడటం లేదు. వన్నె తగ్గడం లేదు. ఎప్పుడో నూట యాభై ఏళ్ళ కిందట ఆ హారం దోపిడిదొంగలు దొంగిలించుకుని పోతూండగా, పిడుగు పడి ఆ దొంగలందరూ మరణించారట. ఆ హారం వారి చేతిలో నుంచి ఎగిరి, ఎంతో దూరంలో ఉన్న మా పూర్వీకుని చేతిలో పడిందట. ఆ సమయంలో ఆయన కృష్ణానదిలో సంధ్యావందనం చేస్తున్నారు. చేతిలో పడిన హారాన్ని చూసి, మహిమాన్వితమైనదిగా భావించి, కాపాడే బాధ్యతను ఇంటి పెద్ద కొడుక్కు అప్పగిస్తూ వచ్చారు. ఈనాడు మా రాఘవరావు బావగారు పాపను అమ్మవారి రూపంగా భావించడం వలన, మాకు కొడుకులు లేని కారణంగానూ ఈ హారం బాధ్యతను బహిరంగంగా పాపకే అప్పజెప్తున్నాను" అన్నాడు మహేశ్వరరావు.
ఇంకా సుధ, మోహన్ ఆ హారాన్ని అందుకోక మునుపే సుధ ఒడిలోని 21 రోజుల పాప ఆ హారాన్ని తాకి, గట్టిగా తన పిడికిటితో పట్టుకుంది. అందరూ ఆశ్చర్యంతో హర్షధ్వానాలు చేశారు.
"ఇంతకీ ఈ హారానికి పేరేమిటి నాన్నా" అడిగింది సుధ.
"ఏ పేరు లేదమ్మా" అన్నాడు మహేశ్వరరావు.
"లేకపోవడమేమిటండీ… అదే *అనామిక* " అన్నాడు రాఘవరావు భక్తిగా హారానికి నమస్కరిస్తూ.
అందరూ సంతోషంగా తలవూచారు. అనామికను అందుకున్న శిశువు చిద్విలాసంగా నవ్వులు కురిపిస్తోంది.
****సమాప్తం****
రచయిత్రి పరిచయం:
నాగమంజరి గుమ్మా గారు వృత్తి రీత్యా ఉపాధ్యాయిని. ప్రవృత్తి: సాహిత్య సేవ. భాషణం, పఠనం, లేఖనం మూడూనూ..
కవితలతో మొదలై పద్యాలు, ఖండికలు, నాటిక, యక్షగానం, నృత్యరూపకం, వ్యాసం, సమీక్ష, గీతం, కథలు, నవల... ఇలా వీలైనన్ని, చేతనైనన్ని సాహితీరూపాల్లో రచనలు చేయడం వారికి నిత్యకృత్యమైనది. వారు వ్రాసిన శ్రీగణేశ చరిత్ర, విశ్వనాథ శతకం, ఆరామద్రావిడ వంశ ప్రవరలు, ఆయుష్మతి, పుష్పమంజరి పుస్తకాలుగా ముద్రితమయ్యాయి. అనేక దిన, వార, పక్ష, మాస, ద్వైమాస పత్రికలలో వారి రచనలు ప్రచురితమయ్యాయి.
అవకాశం దొరికినప్పుడల్లా పురాణ ప్రవచనాలు చెప్పడం, పిల్లలకు శ్లోకాలు పద్య పఠనంలో శిక్షణ నివ్వడం. ముగ్గుల పోటీల్లో, మాస్టర్స్ అథ్లెటిక్స్ లో రాష్ట్రస్థాయిలో బహుమతులు, పతకాలు పొందడం జరిగింది.
ముందుమాట:
"అనామిక" అనే ఈ నవల 90' లలో మొదలైన ప్రేమకథ ఏ మలుపులు తిరిగింది? అనామిక ఎవరు? ఆ ప్రేమ జంటకి అనామికకు సంబంధం ఏమిటి? అనే విషయాలతో ఆసక్తికరంగా సాగుతుంది.
దైవిక శక్తులతో ఆటలాడడం ప్రమాదాలను కొని తెచ్చుకోవడమే అవుతుంది. అలాంటి వారిని శిక్షించే పని భగవంతుడే వివిధ రూపాలలో పూర్తి చేస్తారు. అలా జరిగిన ఒక చిన్న సంఘటన ఆధారంగా ఈ నవల రూపు దిద్దుకుంది.
ఈ నవల మిమ్మల్ని ఆకట్టుకుంటుందని ఆశిస్తూ....మీ అభిప్రాయాలను, సూచనలను మీ కామెంట్స్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ.. "అనామిక" నవలను సీరియల్ గా ప్రచురిస్తున్న సిరిమల్లె సంపాదకులు మధు మరియు ఉమప్రియ గార్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ...
- నాగమంజరి గుమ్మా, శృంగవరపుకోట
చాలా చక్కటి ముగింపునిచ్చారు