Menu Close
ఘాలి లలిత ప్రవల్లిక
మర్మదేశం (ధారావాహిక)
ఘాలి లలిత ప్రవల్లిక

ఆమె అప్రయత్నంగా కళ్ళు మూసుకుంది.

కళ్ళు తెరిచేసరికి వారిరువురు ఓ అద్భుత ప్రదేశం లో ఉన్నారు.

పచ్చని మొక్కలు, రకరకాల పువ్వులు, వింత వింత పక్షులు, జంతువులు, కొలనులు, అబ్బో ప్రకృతి రమణీయత అంతా అక్కడే ఉంది.

అక్కడ వ్యక్తులు 12 అడుగుల పొడవుతో కృష్ణ నీల వర్ణంలో ఉన్నారు. వారి కళ్ళు ఆకుపచ్చ రంగులో మెరుస్తూ వున్నాయి. వారిని చూడగానే ఏదో శక్తి, ఏదో అనుబంధం ముడిపడిన ఆత్మీయ బంధం ఉన్నట్లు అనిపించింది శర్వాణికి. వారిని ఎక్కడో చూసినట్టుగా ఎంతో పరిచయమైన వ్యక్తుల్లాగా కనిపించారు. ఆ నగరం అంతా మంచి సువాసనలు వెదజల్లుతూ ఉన్నాయి.

సడన్ గా వారి ముందుకి మేధా ప్రత్యక్షమయ్యాడు.

మేథా ను చూడగానే ఎక్కడలేని ఆనందం పొంగుకు వచ్చింది శార్వాణికి.

మేథా బ్లోండే కి నమస్కరించి. "కృతజ్ఞతలు బ్లోండే. మీ సహాయము నేను ఎప్పటికీ మరువలేను." అన్నాడు మేథా.

"మనలో మనకు కృతజ్ఞతలు ఎందుకు ఇది మన బాధ్యత. ముందు వారిని వారి ఇళ్లకు చేర్చు. నేను సమయానికి వెళ్ళాగాబట్టి తనను రక్షించుకోగలిగాం." అన్నాడు బ్లోండే.

"అమ్మాయీ మీరంతా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. అన్నాడు బ్లోండే.

బ్లోండే కి రెండు చేతులు ఎత్తి నమస్కరించి, "థాంక్స్ అంకుల్. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను సారీ." అంది శార్వాణి.

"నీ పరిస్థితుల్లో ఎవరైనా అలాగే అనుమానిస్తారు. ఇవేం మనసులో పెట్టుకోకు. క్షేమంగా మీ లోకం వెళ్ళండి." అన్నాడు బ్లోండే.

బ్లోండే శార్వాణి ని ఆశీర్వదించి అక్కడి నుంచి అదృశ్యమై పోయాడు.

"మేథా మనం ఇప్పుడు ఎక్కడున్నాం? అడిగింది శార్వాణి.

"సంభాల అంటారు ఈ ప్రాంతాన్ని." చెప్పాడు మేథా. శార్వాణిని మిగిలిన పిల్లలందరి దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. శార్వాణి ని చూసి అందరూ ఎంతో సంతోషించాడు.

వారంతా శర్వాణిని చుట్టుముట్టారు. వాళ్లు అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్తూ వచ్చింది శార్వాణి.

"చరణ్, శార్వాణిని అందరూ పలకరిస్తుంటే నువ్వేమి తనను పలకరించలేదు?" అడిగాడు మేథా.

"తనకు ఏం కాదు అని నాకు తెలుసు."అన్నాడు చరణ్.

"ఎలా తెలుసు?" అని అడిగాడు డింగూ.

"నాకు ఇక్కడికొచ్చాక ....... శార్వాణి గురించి ఆలోచిస్తుంటే .........

ఆ దుండగులు శర్వాణి సీతాకోకచిలుకను చేసి పెట్టెలో పెట్టి తీసుకెళ్లటం, శార్వాణి పై వారు రకరకాల ప్రయోగాలు చేయడం, బ్లోండే శార్వాణిని రక్షించి తీసుకురావటం అంతా నా కంటి ముందు కనిపించింది. అంతే కాదు మేం మరికాసేపట్లో మా ఇళ్ళకు వెళ్ళిపోతాము అని కూడా నా మనస్సుకు అనిపిస్తోంది." చెప్పాడు చరణ్.

మేథా కళ్ళు మూసుకుని లిప్తకాలం ఆలోచించాడు. తర్వాత కళ్ళు విప్పి చిరునవ్వుతో .....

"చరణ్ నీకు గత జన్మ జ్ఞానం సంక్రమించింది. నువ్వు గత జన్మలో మహా యోగివి. 5D వరకు వెళ్ళావు. నువ్వే కాదు దినేష్ కూడా గత జన్మలో ఈ హిమాలయాల్లో ఘోర తపస్సు చేసాడు. అనుకోని పరిస్థితుల్లో మీరు చేసిన తప్పిదం వల్ల మీరు చనిపోయారు.

ఈ ప్రాంత ప్రభావం వల్ల మీకు పూర్వజన్మ జ్ఞాపకం, పుణ్యం ఆపాదించబడింది." చెప్పాడు మేథా.

"అవునా! నిజంగా!" ఆశ్చర్యంగా అన్నాడు దినేష్.

"నిజం ..... దినేష్ .నిజంగా నిజం." చెప్పాడు మేథా.

"మేథా ఇది సంభాలా అని చెప్పావు. అలాగే ఈ ప్రాంతానికి ఉన్న మహిమలు ఈ ప్రాంతం గురించి వివరంగా తెలియజేయవా ప్లీజ్” అడిగింది శార్వాణి.

"ఓ తప్పకుండా చెప్తాను విను. ఇది సంభాల అనే సామ్రాజ్యం. దీనిని హిడెన్ సిటీ అని కూడా అంటారు. ఇది ఎవరికి కనిపించదు. ఎంతో పుణ్యం చేసుకున్న వారికి, మంచి మనసు ఉన్న వారికే కనిపిస్తుంది.

దీనిని పాశ్చాత్యులు ప్లానెట్స్ ఆఫ్ హెడ్ సెంటర్ గా పిలుస్తారు. ఇక్కడ ఉండే ప్రజలు నాలుగు వేల సంవత్సరాలు జీవిస్తారు. మీకు తెలుసా! వేదాలు, ఆయుర్వేదము ఇక్కడే సృష్టించబడ్డాయి. ఇక్కడ నివసించే ప్రజలు టైం ట్రావెల్ చేయగలరు. అంతేకాదు వీరు టెలిపతి ద్వారా ఇక్కడే ఉండి ఎవరితోనైనా కమ్యూనికేట్ అవ్వగలరు. రోగాలు రావు వీరికి. మూడు డైమన్షన్స్ దాటిన వారు మాత్రమే వీరితో మాట్లాడగలుగుతారు.

మీకు విష్ణుమూర్తి దశావతారాలు తెలుసు కదా?" అడిగాడు మేథా.

"ఓ తెలుసు" అన్నాడు కౌశిక్.

"అందులో పదో అవతారమైన కల్కి సుమతి విష్ణు వ్యాసులకు కొడుకుగా ఇక్కడే పుడతాడు. పరశురాముని దగ్గర వేదాలు, విద్యలు నేర్చుకుంటాడు. మీ భూమి మీద అధర్మం పెరిగినప్పుడు తెల్ల గుర్రంపై వచ్చి పాపాత్ములను నరికి వేస్తాడు." అంటూ చెప్పాడు మేథా.

"దేవుడు అంటున్నావు ...... హత్యలు చేయడం పాపం కాదా!" అమాయకంగా అడిగాడు కౌషిక్.

"దుష్టశిక్షణ శిష్టరక్షణ చేయాలంటే తప్పదు పాపాత్ముల ఏరివేత. భగవంతుడు అవతారమెత్తేది దానికోసమే కదా! సత్య యుగం లో అందరూ సత్యవంతులే ఉండేవారు.

త్రేతాయుగంలో మూడొంతులు మంచివాళ్ళు ఒక వంతుచెడ్డవాళ్ళు ఉండేవారు.

తర్వాత ద్వాపర యుగం లో సగం మంది పుణ్యాత్ములు సగం మంది పాపాత్ములు ఉండేవారు.

ఇప్పుడు నడుస్తున్నది కలియుగం పాపాత్ముల యుగం. ఒక వంతు పుణ్యము మూడు వంతుల పాపము ఉంది.

పాపాత్ములు పెరిగి పోయాక కలియుగము అంతమైపోతుంది. అప్పుడు మళ్ళీ సత్యయుగం వస్తుంది. ఆ సత్యయుగం వచ్చినప్పుడు ఇక్కడ ప్రజలు మీ భూమి మీదకు వస్తారు. మళ్లీ కొత్త జనరేషన్ స్టార్ట్ అవుతుంది." చెప్పాడు మేథా.

“కొన్ని విశేషాలు చెప్పవా వీళ్ళ గురించి" కుతూహలంగా అడిగాడు చరణ్.

"చెబుతా విను. వీరికి అనేక శక్తులు ఉన్నాయి.

***సశేషం***

Posted in May 2022, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!