Menu Close
విశ్వాసం (కథ)
-- జి.ఎస్.ఎస్. కల్యాణి --

అప్పుడప్పుడే తెల్లవారుతూ ఉంది. రమణమ్మ తమ పెంకుటిల్లు వరండా శుభ్రం చేస్తోంది. నీళ్లు చిమ్మి కొబ్బరి చీపురుతో ఊడుస్తూ ఉంటే ఆ శబ్దానికి నిద్రాభంగం కలిగింది హనుమయ్యకు.

"అప్పుడే తెల్లారిందా?", అని చిరాకు పడుతూ లేచాడు హనుమయ్య.

"ఏంటి మావాఁ? ఈరోజు పనికి పోవట్లేదా? ఇంకా పడుకునే ఉన్నావేంటీ?", హనుమయ్యను అడిగింది రమణమ్మ.

"ఆఁ! ఏం పోతా? మా అయ్యగారికి మతి చెడింది కదా?! ఆయన దగ్గర మానేసి నేను వేరే పని చూసుకోవాలి!", అన్నాడు హనుమయ్య.

"అదేమిటి మావాఁ? అలా అంటావ్?? ఇన్నేళ్లూ ఆ అయ్యగారే కదా మన బాగోగులు చూసుకున్నారూ?! అలాంటిది ఈరోజు అయ్యగారికి కష్టం వచ్చిందని ఆయన్ని వదిలిపెట్టి ఇంకెక్కడికో పోతానంటావేంటీ? ఇంకోసారి ఆలోచించుకో!", అంది రమణమ్మ.

"లాభం లేదే రమణీ! అయ్యగారి దగ్గర కాస్తో కూస్తో డబ్బుంది కానీ ఆయనేం చేస్తున్నాడో ఆయనకే తెలియని పరిస్థితిలో ఉన్నాడు! ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య పోయేసరికి ఆ దుఃఖంలో అయ్యగారు వ్యాపారం పై దృష్టి పెట్టలేకపోయాడు. దాంతో ఆయనకు వ్యాపారంలో నష్టాలు వచ్చి కోట్ల ఆస్తి పోయి ఇప్పుడు ఏవో కొద్ది లక్షలు మాత్రమే మిగిలాయి! అయ్యగారి మనసుకు తగిలిన దెబ్బవల్ల ఆయన మతి పోయినట్లుందే. ఈ మధ్య అయ్యగారు ఎప్పుడూ ఏదో లోకంలో మౌనంగా ఉంటున్నాడు. నీకో చిత్రం తెలుసా? ఇన్నేళ్ళుగా నేను ఆయన దగ్గర పనిచేస్తున్నానా? మొన్న నన్ను 'రాముడూ' అని పిలిచాడే! రేపెప్పుడో నువ్వెవరని అడిగి నాకు జీతం ఇవ్వకపోతే ఎలా? మనకు డబ్బులేందే ఇల్లు గడవదు. అందుకే! ఇవాళ నేను పట్నం పోయి మరో ఉద్యోగం వెతుక్కుంటా!", అంటూ లేచి స్నానం వగైరాలు పూర్తి చేసుకుని వచ్చాడు హనుమయ్య.

అప్పటికి రమణమ్మ రొట్టెలు చేసి సిద్ధంగా ఉంచింది.

హనుమయ్య రొట్టెలు తింటూ ఉంటే, "మావాఁ! పట్నం సంగతి నువ్వు ఇంకోసారి ఆలోచిస్తే బాగుంటుంది! అమ్మగారు ఉన్నప్పుడు మనకు ఏ లోటూ రానియ్యలేదు! పండగలొచ్చినా, పబ్బాలొచ్చినా ఆవిడ మనకు బట్టలూ, డబ్బులూ పెద్ద మనసుతో ఇచ్చేది గుర్తుందా? అయ్యగారు కూడా మన పిల్లల చదువులకు ఆ రోజు డబ్బు సాయం చేసుండకపోతే ఇవాళ మన పిల్లలు అంత పెద్ద కాలేజీకి వెళ్లగలిగేవారా?", అడిగింది రమణమ్మ.

అప్పుడు హనుమయ్య, "నిజమేనే! గతంలో అయ్యగారు మనకు చాలా సహాయం చేశారు! ఆయన పేరుకు తగ్గట్టు ఆ శ్రీ రామచంద్ర మూర్తే! ఆయన భార్య జానకమ్మ మనల్ని తన పిల్లలను చూసుకున్నంత ప్రేమగా చూసుకుంది. కాదని అనను! కానీ అయ్యగారి సొంత కొడుకులే ఆయన్ను భరించలేక ఆస్తి కూడా వదిలిపెట్టి మరీ వేరే ఊళ్లకు వెళ్ళిపోయి ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుకుంటున్నారు కదా! నేను వెళ్ళిపోతే తప్పేంటీ?", అని అడిగాడు.

"ఏమో మావాఁ! అయ్యగారి పెద్ద కొడుకు పేరు అనంతరాం కదూ? ఆయనకు తన కొడుకు గుర్తుకొచ్చి నిన్ను ‘రాముడూ’ అని పిలిచారేమోనని నా సందేహం!", అంది రమణమ్మ.

"ఛ! ఛ! అలాంటి లేనిపోని సందేహాలు పెట్టుకోకు. లోకంతోపాటే మనమూనూ! అయ్యగారిని పట్టుకుని వేళ్ళాడితే నాక్కూడా మతి పోతుంది! ఇక నువ్వేం మాట్లాడకు!", అంటూ రొట్టెలు తినడం పూర్తి చేశాడు హనుమయ్య.

హనుమయ్య తిన్న కంచం శుభ్రం చేసిన తర్వాత రమణమ్మ ఒక రొట్టెను తీసుకెళ్లి ఇంటిబయట తచ్చాడుతున్న ఒక నల్లకుక్కకు తినడానికి ఇచ్చింది. అది చూస్తూనే హనుమయ్యకు పట్టరాని కోపం వచ్చింది.

"రమణీ!! ఏంటే ఆ నిర్లక్ష్యం?? నేను రోజంతా ఎంతో కష్టపడి డబ్బు సంపాదించి నీకు తిండి కొనిపెడుతూ ఉంటే నువ్వు ఆ రొట్టెని ఎందుకూ పనికిరాని ఆ దరిద్రపు కుక్క ముందు పడేస్తావేంటే? అసలు నీకు బుద్ధుందా??", అంటూ రమణమ్మను కేకలేశాడు హనుమయ్య.

"నువ్వూరుకో మావాఁ! పాపం ఆ కుక్క చిన్నపిల్లగా ఉన్నప్పటినుండీ ప్రతిరోజూ మనింటి చుట్టూనే తిరుగుతోంది. దానికి ఒక చిన్న రొట్టె పెడితే మనకు పోయేదేం లేదు! పైగా నల్లకుక్క కాలభైరవుడి వాహనమట తెలుసా?!!", అంది రమణమ్మ.

"నాకు పట్నంలో ఉద్యోగం దొరికాక ఇలాంటివన్నీ చేద్దువుగాని! ప్రస్తుతం డబ్బు జాగ్రత్తగా వాడుకోవాల్సిన సమయం! వెళ్ళొస్తా!!", అని చిరాకుపడుతూ పట్నం వెళ్ళిపోయాడు హనుమయ్య.

అలా వెళ్లిన హనుమయ్య చీకటి పడుతూ ఉండగా ఇల్లు చేరుకున్నాడు.

ఇంట్లోకి వస్తూనే, "ఒసేయ్ రమణీ! నాకు పట్నంలో ఉద్యోగం దొరికిందే! రేపే వచ్చి చేరిపోమన్నారు! అక్కడ మనం ఉండేందుకు ఇల్లు కూడా చూసి వచ్చాను! వాళ్లకి మూణ్ణెల్ల అద్దె ముందే ఇవ్వాలట! మన దగ్గర అంత డబ్బెక్కడిదీ? ఏం చెయ్యాలా అని బాగా ఆలోచించి నా స్నేహితుడు నారాయణని అప్పడిగి డబ్బులు పట్టుకొచ్చా. ఇదిగో!! ఈ మూటలో డబ్బులున్నాయి! జాగ్రత్తగా దాచిపెట్టు!", అంటూ ఒక చిన్న మూటను రమణమ్మకు ఇచ్చాడు హనుమయ్య.

రమణమ్మ ఆ మూటను పడక గదిలో ఉన్న పెట్టెలో దాచింది. భోజనాలు ముగించి పడుకున్నారు హనుమయ్య, రమణమ్మలు. ఓ రాత్రివేళ ఇద్దరు దుండగులు హనుమయ్య ఇంట్లోకి ప్రవేశించి హనుమయ్య, రమణమ్మలను కత్తులతో బెదిరించి వారి దగ్గరున్న డబ్బంతా ఇవ్వమని అడిగారు. దొంగల్ని చూసి గజగజా వణికిపోయారు హనుమయ్య దంపతులు. ఆ క్షణం ఏమి చెయ్యాలో వారికి ఏమాత్రం పాలుపోలేదు. తమ జీవితమంతా కష్టపడి కూడపెట్టిన డబ్బు ఒకవైపైతే తమ నిజాయితీని నమ్మి స్నేహితుడు అప్పుగా ఇచ్చిన సొమ్ము మరొకవైపు! ప్రాణాలు దక్కించుకోవడానికి తమ దగ్గర ఉన్న మొత్తం డబ్బును దొంగలపాలు చేసి కష్టాల్లో చిక్కుకోవడం తప్ప వేరేమార్గం తోచలేదు హనుమయ్య, రమణమ్మలకు.

అంతలో, ఎటునుంచో ఇంట్లోకి ప్రవేశించిన నల్లకుక్క, మెరుపు వేగంతో దొంగలపైకి దూకి వారిని కరుస్తూ గట్టిగా మొరగడం మొదలుపెట్టింది. ఆ చప్పుడుకి ఇరుగు-పొరుగు ఇళ్లవాళ్లు నిద్రలు లేచి కర్రలతో హనుమయ్య ఇంటికి వచ్చి దొంగలను పట్టుకుని, వారిని చితకబాది రక్షకభట నిలయానికి తీసుకెళ్లిపోయారు. నల్లకుక్క రమణమ్మ వంక చూసి తోక ఊపి అక్కడినుంచీ వెళ్ళిపోయింది.

"నువ్వు ఈ కుక్కకి రోజూ తిండి పెడుతూ ఉంటే ఏమో అనుకున్నా! అది ఇవాళ నిజంగా ఆ కాలభైరవుడిలా దొంగలమీద విరుచుకుపడి మన ప్రాణం, మానం, ధనం, అన్నీ కాపాడింది! ఆ నారాయణ నాకు అప్పుగా ఇచ్చిన సొమ్ము పోయి ఉంటే మనకు చెడ్డ పేరొచ్చేది. సరికదా మనం జీవితమంతా కష్టపడ్డా అతడి అప్పు తీర్చలేకపోయేవాళ్ళం!", అన్నాడు హనుమయ్య వణుకుతున్న కంఠంతో.

"అందుకే మరి! కుక్కకు విశ్వాసం ఎక్కువ అని అంటారు! మన ఇంటి తిండి తిన్న సంగతి గుర్తుపెట్టుకుని ఆ నల్లకుక్క ఇవాళ మనల్ని కాపాడింది!", అంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది రమణమ్మ.

మర్నాడు హనుమయ్య పొద్దున్నే లేచి గబగబా స్నానం, ఫలహారం ముగించుకుని, నారాయణ దగ్గర అప్పుగా పుట్టుకొచ్చిన డబ్బులున్న మూటను చేతి సంచిలో పెట్టుకుని, చెప్పులేసుకుని, "నేను బయటికెళ్ళొస్తా రమణీ!", అన్నాడు.

"జాగ్రత్త మావాఁ! పట్నం పోతున్నావుగా? అసలే అక్కడ మోసగాళ్ళెక్కువ!", అంది రమణమ్మ.

“నిన్న రాత్రి జరిగింది చూశాక నా మనసు మార్చేసుకున్నానే రమణీ! నేను ఇప్పుడు పట్నం పోవట్లా! నారాయణ దగ్గరికెళ్లి ఈ డబ్బు అతడికి ఇచ్చేసి అక్కడినుంచీ మన అయ్యగారి దగ్గరికెడుతున్నా! ఇన్నాళ్లూ మనల్ని తన కన్నబిడ్డల్లా చూసుకున్నాడు ఆ అయ్య! ఇప్పుడు ఆయన  కష్టంలో ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఆయన్ని వదిలి వెళ్లిపోవడం సబబు కాదని తెలుసుకున్నా! నన్ను 'రాముడూ' అని ఆప్యాయంగా పిలిచి నాలో ఆయన కొడుకుని చూసుకున్నందుకైనా ఆయనున్నంత కాలం నేను ఆయన దగ్గరే పని చేస్తా! మనిషినై ఉండీ ఆ నల్లకుక్కకున్న పాటి విశ్వాసం నాకు లేకపోతే ఎలా?? మన పెద్దబ్బాయి మరో మూడు నెలలలో లాయరవుతున్నాడుగా?! వాడి సహాయంతో అయ్యగారి ఆస్తిని కూడా కాపాడి, అది మంచి పనులకు సద్వినియోగమయ్యేలా చేస్తా!", అన్నాడు హనుమయ్య.

"మంచి మాట చెప్పావు మావాఁ! వెళ్ళిరా! అదిగో, నీకు తోడుగా నల్లకుక్క వస్తోంది చూడు!!", అంది రమణమ్మ సంతోషంగా.

తల పక్కకుతిప్పి చూసిన హనుమయ్యకు తోక వేగంగా ఊపుతూ, అంతులేని విశ్వాసంతో తన పక్కనే నిలబడి కనిపించింది నల్లకుక్క!

********

Posted in November 2022, కథలు

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!