Menu Close
అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
-- మధు బుడమగుంట --

ముందుమాట: సంస్కృతాంధ్ర సాహిత్య పిపాసి, నిత్య సాధనా పారంగతుడు, మాతృభాషాభిమానం మెండుగా కలిగి సాహిత్య సేవకై తపించేవాడు, శాస్త్ర సాంకేతిక విజ్ఞాన ఘనుడు, అమ్మవారి అనుగ్రహ పాత్రుడై బహుభాషా కోవిదుడుగా ప్రభవించి నేటికి వేలపద్యాలను చక్కటి వ్యాకరణ శుద్ధితో రచించి ఎంతోమంది తెలుగు భాషాకోవిదుల మన్ననలను పొందిన శ్రీ అయ్యగారి సూర్యనారాయణమూర్తి గారి విరచితమైన పద్యాల గ్రంథాలయం నుండి వారి అనుమతితో కొన్ని ఆణిముత్యాలను సేకరించి మరల మన సిరిమల్లె పాఠకుల కొఱకు ఇక్కడ పొందుపరుస్తున్నందుకు ఎంతో ఆనందముగా ఉన్నది. శ్రీ అయ్యగారి సూర్యనారాయణమూర్తి గారి ప్రతి పద్యమూ ఒక అద్భుతమే. ఆయన దేవీకటాక్ష వరసిద్ధుడు. అందులో నుండి కొన్నింటిని మాత్రమే ఇక్కడ అందిస్తున్నాము. ఈ నవంబర్ నెల సంచిక పద్యాలను చదివి ఆనందించండి.

లలితాదేవి

సీ.
నట్టింట నడయాడు నాతల్లి లలితాంబ
.....రక్షయౌ మాకుఁ బ్రతిక్షణంబు
కాలిగజ్జెలమ్రోఁత కలిదోషములఁ ద్రోలి
.....పలుకు శుభాలకు స్వాగతంబు
చేతికంకణములు సేయు నిస్వనములు
.....ముందుగా నాశీస్సు లందఁజేయు
వాత్సల్య మొలికించు పరదేవతాపాంగ
.....వీక్షణంబె నితాంతవిత్ప్రదంబు
తే.గీ.
జననమరణపునర్జన్మచక్రముక్తి
కలుగఁజేసి తదంఘ్రిపంకజపదాన
నిలిచి సేవించి యైక్యమౌ కలిమి నీయ
త్రికరణంబులఁ బ్రార్థింతు దేవి నెపుడు................................................................................7
చం.
పలికిన మాట పద్యమయి భవ్యము, నవ్యము దివ్యమై యెదన్
నిలిచిన నీ శుభప్రదపునీతసువర్ణమణిప్రభా(1)విభా(2)
కలితమనోజ్ఞరూపమునుఁ గాంచు నదృష్టము నిత్య మిమ్మ! శ్రీ
లలిత! సమస్తలోకజనలాలనపాలనలోలఖేలనా!......................................................................8
.....(1) బాహ్యకాంతి(చర్మనేత్రగోచరము)
.....(2) అంతఃకాంతి (జ్ఞాననేత్రగోచరము)
శ్లో.
శ్రీచక్రస్థితరాజబిమ్బసుముఖీం హ్రీంకారబీజాక్షరీం
కామాక్షీం పరదేవతాం భగవతీం భక్తార్తివిధ్వంసినీమ్
మాలాపుస్తకధారిణీం శుభకరీం జ్ఞానప్రదాం శారదాం
ప్రాఞ్చద్భూషణరత్నమణ్డితతనుం పద్మాలయాం త్వాం భజే ||.......................................................9
మ.
బహుబాహామకుటప్రభాకలితమై భాస్వద్వినీలాలక
ప్రహరీయుక్తలలాటికాతిలకనేత్రభ్రూలతోత్సేకమై
మహదంఘ్రిచ్ఛవిభిన్నకిల్బిషతమోఽస్మన్మార్గసంకేతమై
అహ మారంభము కాఁగ దర్శనము మాతా! నేఁడు కల్గించితే?.....................................................10
మ.
అదె భానూదయవేళ నాకసమునన్ వ్యాపించు కాంతిచ్ఛటల్
ముదమారంగను నీదు రాకఁ దెలుపున్ మున్ముందు నోజఃప్రభా(1)
స్పదమై యాపయి మంగళాకరవపుస్సందర్శనం బయ్యె నా
యెదతమ్మే వికసింప నిన్నుఁ గని దేవీ! సర్వలోకేశ్వరీ!..................................................................11
.....(1) శరీరకణముల నుండి వచ్చు కాంతి (aura)
శా.
శాస్త్రజ్ఞాననిధుల్ గనంగఁ గడు నిష్ఠన్ ని న్నుపాసింతు రో
శస్త్రాస్త్రాన్వితబాహుమండితవపుస్సౌందర్యవారాశి! త్వ
ద్వస్త్రాంశచ్యుతమల్లలాటలిఖితాంతర్వేగరేఖావళీ!
నిస్త్రాణంబును బాపి చేదికొనుమా నిత్యంబు, భాగ్యప్రదా!.............................................................12

గాయత్రీ

శ్లో.
రక్తాంభోరుహసంస్థితాం రవినిభాం పఞ్చాస్యవిభ్రాజితాం
విష్ణుబ్రహ్మశివాత్మికాం స్మితముఖీం త్రైశక్తిసన్ధాయినీమ్
సావిత్రీం శ్రుతిమాతరం శుభకరీం బ్రహ్మాణ్డసంవర్తినీం
విద్యాతన్త్రపురాణశాస్త్రవపుషీం ధ్యాయే జ్జగత్పాలినీమ్II ...................................................................13
Posted in November 2022, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!