తేనెలొలుకు
ఉన్నమాట
౧. ఆ.వె.
పుట్టి గిట్టుట నిజము భువినందున జూడ
వయసువారు ముసలి వారగుదురె
మంచివారు రోగమొచ్చి బాధపడరె
కష్ట సుఖములెపుడు కలిసియుండు
౨.
అన్నిటికిని సిద్దమైన వారె నిజమై
నట్టి ఆత్మయోగి యగును జూడ
ఎప్పటికయిన యిల తప్పదు గద నీదు
మేను యాత్మనీడి మిత్తి జేర
౩.
ఇట్టి చిట్టి పొట్టి మట్టి గొట్టు మనిషి
కెంత ఆశ దోశ అప్పడాలు
కనుల ముందు పోయి కనుమరుగైన నీ
వారి జూసినైన మారలేర
౪.
ఎందుకంత అహము ఎందుకా ద్వేషము
అంత మమత కొంత చింత యేల
ఎంతకాల మిచట సొంతమనెడి మాట
ఏది నీది కాదు ఏది రాదు
౫.
ఉన్న కొద్ది కాలమైన మనిషిగాను
ఎన్నియున్న నీవు చిన్నగాను
ఉన్న దానిలోన చిన్ని సాయము చేయి
నీదు జన్మ సతము నిత్యమెలుగు