Menu Close
manusmrithi page title
రెండవ అధ్యాయము (ఆ)

సంస్కారములు

ద్విజులకు నిషేకము (గర్భాధానము) మొదలు వేదములలో చెప్పబడిన అన్ని సంస్కారములు (పవిత్ర విధులు) పాటించడం తప్పనిసరి. అవి ఇహ పరలోకములలో శరీరాన్ని పవిత్రంచేసి, పాపములనుండి పరిశుద్ధం చేస్తాయి.

ఈ లోకంలో పాటించే సంస్కార విధులు ఐహిక శరీరాన్ని పరిశుద్ధం చేస్తే, ఔర్ధ్వదైహిక క్రియలు మరణానంతర దేహాన్ని అంటే సూక్ష్మ శరీరాన్ని పవిత్రం చేస్తాయి.

గార్భైర్హోమైర్జాతకర్మచౌళమౌంజీ నిబంధనై : |
బైజికం గార్భికం చైనో ద్విజానామపమృజ్యతే || (2- 27)

గార్భైర్హోమములు (గర్భము యొక్క క్షేమం కోరుతూ చేసే హోమములు) చేయడం వలన, జాతకర్మము, చౌళము, మౌంజీ బంధనము వంటి సంస్కారములను పాటించడం వలన ద్విజులకు తమ తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన దోషములు తొలగిపోతాయి.

తల్లిదండ్రుల నుంచి సంతానానికి దోషాలు పుట్టుకతోనే ఎలా వస్తాయో, అవి తొలగిపోయేటందుకు ఏ యే సంస్కారాలు పాటించాలో సూత్ర సాహిత్యంలోనూ, ఆగమాలలోనూ వివరంగా చెప్పబడింది. గర్భాధానము మంత్రోక్తంగా చెయ్యాలనేది ఒక నియమం. స్త్రీ బహిష్టు స్నానం తరువాత మాత్రమే పవిత్రమౌతుందనీ, అంటే ఋతుమతి అయిన తరువాత నాలుగవ రోజునుంచి 16 వ రోజు లోపల మాత్రమే గర్భధారణకు సరియైన కాలమనీ, అప్పుడే స్త్రీ పురుషులు సంగమించాలనీ మరొక నియమం. ఎవరైనా ఈ నియమాలు అతిక్రమించి సంగమిస్తే వారికి పుట్టే పిల్లలకు దోషాలు వస్తాయట. భార్యాభర్తలు రాత్రివేళలోనే సంగమించాలి. పగలు సంగమించే వారికి అభాగ్యశాలి, శక్తిహీనుడు, అల్పాయుష్కుడు పుడతాడని ఒక నమ్మకం. మాసములో అష్టమి, ఏకాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య, ఇంకా పర్వదినములు సంగమానికి నిషిద్ధములని మరొక విశ్వాసం. ఈ నియమాలకు విరుద్ధంగా స్త్రీ పురుషులు సంగమించినప్పుడు వారికి కలిగే సంతానానికి ఎలాంటి దోషాలూ కలుగకుండా ఉండేందుకు పలు బైజిక (బీజ సంబంధమైన), గార్భిక (గర్భ సంబంధమైన) సంస్కారాలు చెప్పబడ్డాయి.

స్త్రీ గర్భిణిగా ఉన్నప్పుడు పురుషుడు పుట్టాలనే కోరికతో పాటించే సంస్కారం పుంసవనము. పిండానికి స్త్రీ, పురుష చిహ్నాలు నాలుగవ నెలలో ఏర్పడతాయని నమ్మకం. అందుకే గర్భిణికి నాలుగో నెలలోపు ఈ పుంసవనం చేస్తారు. మర్రి చెట్టు (Ficus benghalensis) బెరడును దంచి ఆ రసమును గర్భిణి కుడి నాసిక (ముక్కుపుటము) లో మంత్రం చదువుతూ పిండుతారు. కొందరు దర్భనూ, సోమలతనూ దంచి, ఆ రసమును పిండుతారు. కొందరు పుంసవనంలో మర్రి చెట్టు బెరడుకు బదులుగా వట శుంగం (లేత మర్రి చిగుళ్ళకు రక్షా కవచంగా ఉండే పొర - the sheath of a young bud of a Banyan tree) వాడతారు. కొందరు మర్రి ఊడల చివళ్ళను కోసి, దంచి, ఆ రసాన్ని ఇందుకు వినియోగిస్తారు. లక్ష్మణ (Smithia geminiflora), సహదేవి లేక గరిట కమ్మ (Vernonia cinerea)  మొదలైన మొక్కల రసం వాడతారు మరికొందరు. ఏది ఏమైనా ఈ పుంసవనము అనేది ఒక నమ్మకంతో, కొడుకు పుట్టాలనే ఆశతో చేసేదే కాని, శాస్త్రీయంగా చూస్తే స్త్రీ అండంలోనూ, పురుషుని వీర్యంలోనూ ఉండే ‘x’ మరియు ‘y’ క్రోమోజోముల కలయిక జరిగే తీరు మాత్రమే పుట్టబోయే బిడ్డ లింగాన్ని నిర్ధారిస్తుంది. స్త్రీ అండంలోని ‘x - క్రోమోజోము’ పురుషుని వీర్యంలోని ‘y -  క్రోమోజోము’ తో కలిసినప్పుడు మగబిడ్డ (x,y) జన్మిస్తాడు. అలాకాక స్త్రీ అండంలోని ‘x - క్రోమోజోము’ పురుషుని వీర్యంలోని ‘x - క్రోమోజోము’ తో కలిసినప్పుడు ఆడబిడ్డ(x,x) జన్మిస్తుంది. గర్భిణి ముక్కు పుటంలో పిండే ఈ మూలికా రసాలు వేటికీ క్రోమోజోముల కలయిక తీరును నిర్దేశించే శక్తిలేదు. అయితే పైన పేర్కొన్న ఓషధులకు స్రావాలను అరికట్టే (Astringent) గుణం ఉన్న కారణంగా అవి గర్భపాతం (Abortion) కాకుండా గర్భాన్ని కాపాడగలవు. ప్రత్యేకించి లక్ష్మణ మొక్క స్త్రీలలో వంధ్యత్వాన్ని (Sterility) నివారించే గుణం కలదిగా కూడా పేరొందింది. అలాగే గర్భిణికి గర్భపాతం కాకుండా, ‘చరక సంహిత’ లో పేర్కొన్న ‘అనవలోభనము’ లేక ‘గర్భరక్షణము’ పేరిట మూడవ నెలలో చేసే శుద్ధి కార్యక్రమం (Purificatory Ceremony) లో వినియోగించే చేదుపుచ్చ (Citrullus colocynthis), సరస్వతీ (వల్లారి ఆకు- Centella asiatica), తిప్ప తీగ (అమృతవల్లీ- Tinospora cordifolia), కరక కాయ (Terminalia chebula), కటుక రోహిణి (Picrorhiza kurroa) మొదలైన ఓషధులకు అవి స్రావాలను అరికట్టే గుణం కలిగినవి (Astringents) కనుక, వాటికి గర్భపాతాన్ని నివారించే గుణం కూడా ఎంతోకొంత ఉంటుంది.

గర్భిణికి ఎనిమిదో నెలలో చేసే సీమంతోన్నయనము (సీమంతము) లేక ‘ఫల స్నానము’ అనే సంస్కారం మరో ముఖ్యమైన సంస్కారం. గర్భిణిని మానసికంగా ఉల్లాసంగా ఉంచడం, ఆమెకు భర్తే స్నానం చేయించడం, ఆమె కురులను భర్తే దువ్వడం, ఆమెను భర్తే పుష్పమాలలతో అలంకరించడం, ఆమె కోరినవన్నీ ఇస్తూ ఆమెను ఎప్పుడూ తృప్తిగా ఉంచడం, ఆమెలో ఆత్మవిశ్వాసం, ధైర్యం కలిగే విధంగా భర్త నడుచుకోవడం వంటివి ఈ సంస్కారం పాటించేటప్పుడు చేయవలసిన విధులు. శారీరక ఆరోగ్యం మాత్రమే కాక ఆత్మవిశ్వాసం, మానసిక ఉల్లాసం ఉన్న గర్భిణికి సత్సంతానం కలుగుతుందని ఈ సంస్కారం పాటిస్తారు.

వైఖానస ఆగమం ప్రకారం గర్భిణి ఎనిమిదవ నెలలో పాటించవలసిన సంస్కారం విష్ణుబలి. పిండానికి కలగబోయే హానిని పోగొట్టి, సుఖప్రసవానికి తోడ్పడుతుందని ఈ సంస్కారం పాటిస్తారు. విష్ణువుకు ‘నమో నారాయణాయ’ అంటూ సమర్పించే హవిష్యాన్నంలో నుంచి భార్య, భర్త చెరొక ముద్ద వేర్వేరుగా తీసుకుని తింటారు. కొందరు హోమంచేసి అగ్నిలో విష్ణువుకు హవిష్యాన్నాన్ని (లేక పాయసాన్ని) సమర్పించి, ఆ తరువాత బలి ఇస్తారు. ఇంకొందరు కాల్చిన రాగి శంఖు చక్ర ముద్రలను పాయసం మీద అద్ది, ఆ పాయసాన్ని గర్భిణి చేత ప్రాశనం చేయిస్తారు. దాంతో గర్భస్థ శిశువు సంస్కారం పొంది, జన్మ వైష్ణవుడు (పుట్టుకతోనే వైష్ణవుడు) అవుతాడని వైఖానసులు నమ్ముతారు. వైఖానసులు అలా జన్మతః వైష్ణవులు కనుకనే వారు శ్రీవైష్ణవుల వలె కాల్చిన రాగి శంఖు చక్రములతో తమ భుజాలమీద తప్త చక్రాంకన ముద్రలు వేయించుకోనవసరం లేదు. ఇక్కడివరకు చెప్పబడిన సంస్కారాలు గార్భైర్హోమాల కిందికి వస్తాయి. ఈ సంస్కారాలు గర్భిణుల క్షేమంకోరి చేస్తారు కనుక, వీటిలో ప్రతి ఒక్కటి హోమం చేసి మొదలుపెడతారు కనుక వీటిని గార్భైర్హోమాలు అంటారు.

ఇక శిశువు జన్మించిన తరువాత చేసే సంస్కారాలలో ముఖ్యమైనది జాతకర్మ. ఈ సంస్కారం బొడ్డు కోసే ముందే జరగాలి. ఎవరి మరణం కారణంగానైనా మృతాశౌచము (మైల) కలిగితే, అది పూర్తయ్యాక ఈ సంస్కారం పాటించాలి. కొందరు శిశువు జన్మించిన పది రోజులలోపు దీనిని నిర్వహిస్తారు. ఆ సందర్భంగా జాతకాగ్ని అనబడే అగ్నిని రగిలించి హోమం చేస్తారు. శిశువు శరీరంలో పేరుకున్న కఫము, మలము కారణంగా శిశువుకు కలిగే శారీరక బాధలు తొలగిపోవడానికి బంగారం అరగతీసి, తేనెతో కలిపి నాకిస్తారు. తరువాత చంద్రదర్శనము, నామకరణము, అన్న ప్రాశనము, కర్ణ వేధ (చెవులు కుట్టించడం) అనే సంస్కారాలు పాటిస్తారు. రోగాదుల నుండి రక్షణకోసం, భూషణముల నిమిత్తం శిశువు చెవులు కుట్టించాలని సుశ్రుతుడు ‘శరీరస్థానమ్’ లో పేర్కొన్నాడు. ‘రక్షా భూషణ నిమిత్తమ్ బాలస్య కర్ణౌ విధ్యేత్’ ( శరీర స్థానమ్). పిల్లవాడికి బలము, ఆయుస్సు, వర్చస్సు పెంపొండడం కోసం చూడాకరణం చేస్తారు. శిరోముండనం చేసి (శిరోజములను తొలగించి), శిరస్సుపై కేవలం చూడా (శిఖా లేక పిలక) ను మాత్రమే మిగల్చడాన్ని చూడాకరణము అంటారు. పుట్టు వెంట్రుకలను వపనము చేసే (తొలగించే) ఈ సంస్కారాన్ని చూడాకరణము అనే కాక, చౌడము లేక చౌలము (చౌళము) అని కూడా అంటారు. శిశువు జన్మించిన మొదటి లేక మూడవ సంవత్సరంలో ఈ సంస్కారం చేయాలి. అయితే ప్రస్తుతం ఉపనయనమునకు ముందుగా చౌళము చేస్తున్నారు. ఇది పగటి వేళలో మాత్రమే చేయాలి. శిశువు తల్లి గర్భిణి అయినట్లయితే శిశువుకు క్షురకర్మ నిషిద్ధం. శిఖ (పిలక), యజ్ఞోపవీతము (జందెము) ద్విజులకు అనివార్య చిహ్నములుగా భావిస్తారు. ఇవి ధరించనివాడు ధార్మిక సంస్కారములకుగానీ, పూర్ణ పుణ్యమును అనుభవించుటకుగానీ అర్హుడు కాడని శాస్త్రాలు చెపుతున్నాయి. ఏ ద్విజుడు మోహముచేతనో, ద్వేషము చేతనో లేక అజ్ఞానము చేతనో శిఖను తీసివేస్తాడో అతడు ‘తప్తకృచ్చ్రము’ అనే ప్రాయశ్చిత్తం ద్వారా శుద్ధిని పొందాలి. వరుసగా మూడురోజులపాటు వేడి నీళ్ళు, ఆ తరువాత మూడు రోజులు వేడి పాలు, ఆ తరువాత కరగిన నెయ్యి తాగాలి. మూడు రోజులు కేవలం  వేడి గాలి మాత్రమే ఆహారంగా పీల్చాలి. వసిష్ఠుడు శూద్రులతో సహా అన్ని వర్ణముల వారికి శిఖ ఉండాలన్నాడు. శిఖ లేని శిరస్సు అపవిత్రమైనదని వేదాలు పేర్కొన్నాయి. (అమేధ్యం వా ఏతచ్ఛిరో యదశిఖమ్). బాలికలకు ఈ సంస్కారం అవసరం లేదు. పిలక మర్రి ఆకు అంత పెద్దదిగా ఉండాలని  కొందరు, గోష్పాదమంత ఉండాలని ఇంకొందరు పేర్కొన్నారు. సుశ్రుతుడు మస్తిష్కము యొక్క పై భాగంలో సిరసంధులయొక్క సన్నిపాతం ఉందనీ, ఆ ప్రదేశంలో చిన్నపాటి దెబ్బ తగిలినా తక్షణం మరణం సంభవిస్తుందనీ, రోమావర్తము అనే సున్నితమైన ఈ ప్రధాన భాగాన్ని రక్షించుకోవడం కోసం శిఖ అవసరమనీ పేర్కొన్నాడు. బ్రహ్మ రంధ్రానికి సరిగ్గా పైనవున్న సహస్రదళ కమలం పరమాత్మ నివాసస్థలమనీ, శిఖ దానిని కప్పి ఉంచడం కారణంగా ఆత్మశక్తి రక్షించబడుతుందని కొందరి నమ్మకం. కేవలం భారతీయులలోనే కాదు - చైనా, టిబెట్, అలాస్కా ప్రజలు కూడా  శిఖాధారణ చేస్తారు. శిఖా ధారణ చేసే వ్యక్తి రోజూ దానిని స్పృశించడం, శ్రద్ధగా దువ్వి ముడివేసుకొనడం చేస్తాడు కనుక, ఆ యా సందర్భాలలో అతడి దృష్టి మొత్తం సహస్రదళ కమలం పైనే నిలిపే కారణంగా అతడి ఆత్మశక్తి వృద్ధి చెందుతుందని ఆర్యసమాజ స్థాపకులు స్వామి దయానంద సరస్వతి అభిప్రాయపడ్డారు.

వటువు (బ్రహ్మచారి) కి ఉపనయనం సందర్భంగా ముంజగడ్డితో మూడు పేటలుగా అల్లిన మేఖల (మొలతాడు) ను ‘ఇయం దురుక్తాత్’ అనే మంత్రం ఉచ్చరిస్తూ ఆచార్యుడు నడుముకు కడతాడు. ముంజ గడ్డిని ఉపయోగించి పేనిన మొలతాడు అయిన కారణంగా ఈ సంస్కారానికి ‘మౌంజీ నిబంధనము’  అనే పేరు వచ్చింది. ఈ విధంగా బిడ్డకు తల్లిదండ్రుల కారణంగా జన్మతః సంక్రమించిన దోషాలు తొలగిపోయేందుకు ఈ సంస్కారాలు ఉపకరిస్తాయి.

ఇక చివరిగా ఆరోగ్యవంతులైన బిడ్డలు కలగాలంటే గర్భాధానం రాత్రి మాత్రమే చేయాలి, పగలు సంగమించే వారికి శక్తిహీనులైన పిల్లలు పుడతారు, నెలలో కొన్ని దినాలలో కలవకూడదు, మంత్రం ఉచ్చరిస్తూనే స్త్రీ పురుషులు సంగమించాలి - వంటి నమ్మకాలు, నియమాలకు ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. సాధారణంగా 28 రోజులకు ఒకసారి బహిష్టు అయ్యే స్త్రీలలో, బహిష్టు అయినరోజు నుంచి 14వ రోజున అండం విడుదల అవుతుంది కనుక, ఆ రోజుకు రెండు రోజుల ముందు, ఆరోజు, ఆ తరువాత రెండురోజులు గర్భధారణకు పూర్తిగా అనుకూలమైనవని శాస్త్రీయంగా నిర్ధారణ అయింది. పురుష హార్మోన్(Testosterone) లోపం లేని పురుషుడు స్త్రీతో సమర్థవంతంగా శృంగారంలో పాల్గొన గలుగుతాడు. స్త్రీ అండంతో పురుషుడి వీర్యకణం కలిసే కారణంగా ఫలదీకరణం జరిగి పిండం ఏర్పడి అది కణవిభజన ప్రక్రియ ద్వారా తొమ్మిది నెలలపాటు స్త్రీ గర్భాశయంలో పెరిగి, ప్రసవ సమయంలో బిడ్డ జన్మించడం జరుగుతుంది. శిశు జననానికి ఆవశ్యకమైనవి - పురుషుడి వీర్యంలో తగు సంఖ్య (Count) లో వీర్య కణాలు  ఉండడం, అవి వేగంగా కదులుతూ స్త్రీ అండాన్ని చేరుకొని దాని బాహ్య పొరను ఛేదించగలిగే కదలిక సామర్థ్యం (Motility) కలిగివుండడం. ఇక స్త్రీ గర్భాశయంలో పిండం పెరుగుదలకు అనుకూలమైన పరిస్థితులు ఉండాలి. ముఖ్యంగా గర్భపాతం (Abortion) కాకుండా ఉండాలంటే గర్భిణి శరీరంలో తగినంతగా ఈస్ట్రోజెన్ (Oestrogen), ప్రోజెస్టెరోన్ (Progesteron), HCG (Human Chorionic Gonadotropin) హార్మోన్లు ఉండాలి. పుంసవనం పేరిట చేసే సంస్కారానికి ఎలాంటి శాస్త్రీయత లేదు. మగ సంతానం కోసం పలువురు దంపతులు  మనదేశంలో అసంఖ్యాకంగా చేసిన  పుంసవనాలకు ఎలాంటి ఫలితమూ లభించకపోవడమే ఇందుకు ప్రబల సాక్ష్యం. చెరకు జాతికి చెందిన ముంజ గడ్డి (Saccharum bengalense) మొక్క పొడవాటి ఆకుల నుంచి తీసే నారతో పేనిన మొలతాళ్ళు తడిసినా పాడవని గుణం కలిగివున్న కారణంగా ఉత్తరభారతదేశంలో పురుషులు మొదటినుంచీ వాటినే వాడతారు. ఇంకా ఈ నారతో చాపలు, బుట్టలు, మోకులు కూడా తయారు చేస్తారు.

సీమంతం సందర్భంగా భర్త గర్భిణికి చేసే సేవల కారణంగా ఆమె మనస్సు పూర్తిగా సంతోషంతో నిండి, ఆమెకు కాన్పుకు అవసరమైన ధైర్యం, ఆత్మవిశ్వాసం కలుగుతాయనేది మాత్రం నిజం. ఈ తరహా మానసికోల్లాసం గర్భిణికి, గర్భస్థ శిశువుకు ఎంతో ప్రయోజనకరం.

ఎనిమిదవ నెలలో చేసే విష్ణుబలి సందర్భంగా భార్యాభర్తలు హవిష్యాన్నమో, పాయసమో తింటే గర్భస్థ శిశువుకు ప్రత్యేకించి ఏదో ప్రయోజనం చేకూరుతుందనేది కేవలం నమ్మకం మాత్రమే. పాలు, పాల అన్నం, పాయసం వంటివి తీసుకోవడం గర్భిణికి ఎప్పుడూ శ్రేయస్కరమే!

శిశువుకు పుట్టు వెంట్రుకలు తొలగించడంలో కొంత  ప్రయోజనం ఉంది. దానివల్ల తరువాత వచ్చే శిరోజాలు ఒత్తుగా, బిరుసుగా, కాంతివంతంగా ఉంటాయి. అదే కాదు మనం శిరోముండనం చేయించుకున్న ప్రతిసారీ బిరుసైన వెంట్రుకలు రావడం కూడా గమనార్హం. అయితే శిరోముండనంచేసి తల వెనుక రోమావర్తము అనే అతి సున్నితమైన శరీరభాగానికి రక్షణ కోసమంటూ మర్రి ఆకంత శిఖను వదలడం మాత్రం అర్థవంతం కాదు. ఎందుకంటే రోమావర్తమునకు లభించే రక్షణ శిఖ ఉన్నప్పటిలాగే, అసలు శిరోముండనమే చేయించుకోకుండా శిరోజాలను అలాగే ఉంచివేసినా కూడా లభిస్తుంది కదా! శిఖ తీసివేసిన ద్విజుడికి విధించిన తప్తకృచ్చ్రము అనే ప్రాయశ్చిత్తము ఆరోగ్యం మెరుగుపడేందుకు ఉపకరించే చక్కటి ఉపవాస నియమం. మనువు ప్రాయశ్చిత్తాలలో కూడా ఆరోగ్యరక్షణకు తోడ్పడే చక్కటి నియమాలను పొందుపరచడం విశేషం.

కాలేయం మరియు క్లోమ గ్రంధుల పనితీరును మెరుగుపరచడం, చర్మాన్ని కాంతివంతం చేయడం, హానికరమైన విషపదార్థాలను శరీరం నుంచి తొలగించడం, ఎదుగుదలకు తోడ్పడటం వంటి బంగారానికున్న ఔషధ విలువలను గుర్తించిన కారణంగానే భారతీయులు అనాదిగా షోడశ సంస్కారాలలో భాగంగా చేసే జాతకర్మ సంస్కారంలో బంగారాన్ని అరగదీసి, తేనెతో కలిపి శిశువుచేత నాకిస్తున్నారు. అయితే ఇందుకోసం రాగి కలిపిన బంగారం కాక శుద్ధమైన 24 కారెట్ల బంగారమే వాడాల్సి ఉంది. ఇక కర్ణ వేధ (శిశువుకు చెవులు కుట్టించడం) చెవులకు కర్ణాభరణాలు ధరించేందుకు అనువుగా వాటిని చేయడమే తప్ప, దాని కారణంగా శిశువుకు రోగాదుల నుంచి రక్షణ ఎలా లభిస్తుందో సంతృప్తికరమైన సమాధానం లభించలేదు.

***సశేషం***

Posted in June 2020, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!