Menu Close
Galpika-pagetitle
మిఠాయి పిల్లలు -- గౌరీ కాసాల

మధ్యాహ్నం ఒక చిన్న కునుకు తీసి లేచి కాఫీ తాగి హాల్ లోకి వచ్చి టైం చూసుకుని సరళ. అబ్బా ఇంకా నాలుగు గంటలేనా అయింది. ఇంకా ఆరు గంటలు ఏం చేయాలి దేవుడా అనుకుంటూ మొబైల్ చేతిలోకి తీసుకుంది. వాట్సాప్ లో ఫ్యామిలీ గ్రూప్ లో దగ్గర దగ్గర 100 పైగా మెసేజ్లు ఉండటం చూసి ఆశ్చర్యపోతూ ఓపెన్ చేసింది. పెద్ద తోటి కోడలు యూట్యూబ్ లో చూసి బాదుషాలు చేసి, ఫోటోలు పెట్టింది నిన్న.

దానిమీద ఆడపడుచులు వాళ్ళ పిల్లలు ఇంకో తోటి కోడలు పిల్లలు... కొందరు బావుందని కొందరు ఎలా చేయాలని వాకబు చేయడం, వరసైన వాళ్ళు ఇవి బోండాల భాద్షాలా అని హాస్యం ఆడటం,.... చాలా సరదాగా సాగిపోయింది సంభాషణంతా.. చదువుతున్న సరళకి ఎంతో ముచ్చట వేసింది. తను కూడా చేద్దాం అనుకుంది. మళ్లీ అంతలోనే నీరస పడిపోయింది. తన ఒక్కర్తీ కోసం ఏం చేసుకోవాలి.... ఒకవేళ చేసుకున్న కనీసం పది అయినా చేసుకోవాలి కదా! 10 తనే తినాలి. అదేదో జోకులో చెప్పినట్టు ఈ లాక్ డౌన్ అయ్యే సరికి తలుపు పట్టనంత ఊరిపోతోంది.

ఏంటో ఆయన దారి ఆయన చూసుకున్నారు. కూతుళ్లు ఇద్దరూ కాలిఫోర్నియాలో సెటిల్ అయిపోయారు. స్వదేశం మీద మమకారం, వృత్తి మీద ప్రేమతో తను ఇక్కడే ఉండి పోయింది.

డల్ గా అనిపించి ఆలోచిస్తూ బాల్కనీలోకి వచ్చింది. దూరంగా వాచ్ మెన్ భార్య, పిల్లల్ని దెబ్బ లాడుతోంది. "రేయ్ పెట్టింది తిని నోరు మూసుకొని పడుకోండి. తిండికే కష్టపడుతుంటే మీ గొంతెమ్మ కోరికలు నేను తీర్చలేను.” కొంచెం బాధ, కొంచెం కోపం కలిసిన గొంతుతో నచ్చచెపుతున్నట్లు మాట్లాడుతోంది...

పేరుకి వాచ్మెన్ అయినా గాని అందరూ చాలా శుభ్రంగా సంస్కారం గా ఉంటారు. భార్యాభర్తలిద్దరూ పని చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటున్నారు.

సరళ చిరునవ్వు నవ్వుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది. ఓ గంట తర్వాత పాకంతో నిగనిగలాడుతున్న వేడివేడి బాద్షాలు వాచ్మెన్ పిల్లల్ని పిలిచి వాళ్ళకి ఇచ్చింది. వాళ్ళ కళ్ళు భాద్ షాల కన్నా మెరిసేయి. సరళ మనసు మురిసింది.

లాక్ డౌన్ -- పాతూరి అన్నపూర్ణ

"దోయం పడింది నాకు...అమ్మయ్య నా కాయ పండింది"..అంటూ బాబ్జీ పెద్దగా అరిచాడు.

"ఎందుకురా బాబ్జీ!అంత పెద్దగా అరవాలా..చెవులు చిల్లులు పడేట్లు" అంటూ అమ్మ సమంత అరచింది.

"వాడి అరుపు కన్నా నీ అరుపు ఎక్కువ రీసౌండ్ ఇస్తోంది"అన్నాడు ఆనంద్.

"అనండి..అనండి..మీకాయ లోపలికి ఎట్లా వెళ్తుందో చూస్తా..చంపి చంపి పెడతా" శపథం చేసింది సమంత,

దాయాలాట మహారంజుగా సాగుతోంది...

..........

లాకవుట్ కాదుకానీ పాతకాలపు ఆటలకు ప్రాణంవచ్చింది

పొద్దున లేచిందగ్గరనించీ దాయాలూ పావులూ పట్టుకుని సమంత వెనకే తిరుగుతున్నారు స్నిగ్ధ,బాబ్జీ..చదవుకోండిరా..అంటే ఎంతసేపు చదవాలి .. బోర్ కొడుతుంది అంటారు.వదిలేస్తే టి.వి.లకు అడిక్టు అవుతారనే భయం. నిజమే పిల్లల స్వేచ్ఛకూ లాకవుట్ అయింది. ఇక లాభంలేదనుకుని ఈ దాయాలు బయటకు తీసింది సమంత. ఎప్పుడూ పెద్దగా ఎందులో కల్పించుకోని ఆనంద్ ని కూడా ఈ ఆటలోకి లాగారు తల్లీ పిల్లలు. ఒకళ్ళ కాయల్ని ఒకరు చంపుకుంటూ చివరికి పంట గడిలోకి వెళ్ళడం అనేది చిన్న విషయంకాదు. నలుగురిమీద ఆటాయె..ఒక్కోఆట రెండు మూడు గంటలు పడుతోంది..మధ్యాహ్నం భోజనాలయ్యాక మొదలెట్టిన ఆట పూర్తయ్యేసరికి సాయంత్రం ఐదైంది.

........

ఆనంద్ నేనలా ఓ అరగంట వాకింగ్ చేసి వస్తా..పిల్లల్ని కాస్త ఎంగేజ్ చెయ్యండి.. అంటూ అపార్ట్‌మెంట్ వెనక వీధిలోకి వెళ్ళింది సమంత. వీధి నిర్మానుష్యంగా వుంది. చాలా పొడవైన వీధి. ఒక రౌండ్ పూర్తి చెయ్యడానికి పది నిమిషాలు పడుతుంది. రోడ్డుకు రెండు ప్రక్కలా పెద్ద పెద్ద చెట్లు బారులు తీరి వున్నాయి. సమంత కెంతో ఇష్టమైన కోడిపందాల పూలచెట్లు..తురాయి చెట్లు అంటారు. వేపచెట్లు ఇంకా రకరకాలైన చెట్లు కూడా వున్నాయి..ఆ సాయంత్రపు నడక సమంతలో ఉత్సాహాన్ని నింపింది. గుండె నిండా చల్లటి గాలి పీల్చుకుంది..ఓ నెలనుండీ పార్కుకు వెళ్ళే వీలు లేక సమంత ఇక్కడే నడుస్తున్నది.

ప్రస్తుత పరిస్థితి మనుషుల జీవన విధానంలో చాలా మార్పులు తెచ్చింది. ఇంట్లోని మనుషుల మధ్య గోడలు కూలి పోయి వారధులు ఏర్పడుతున్నాయి. ఒకర్ని ఒకరు ప్రేమగా, భద్రంగా చూసుకుంటున్నారు. ఇష్టమైన వ్యాపకంతో సమయం గడుపుతున్నారు. అందరూ బాగుండాలని ప్రార్ధనలు చేస్తున్నారు.

పిల్లలతో ఆటలు పాటలు, అంత్యాక్షరిలు, చదివించడమే కాక ఆనంద్ చిన్న చిన్న పనులు కూడా చేస్తున్నాడు. గార్డెన్ వర్క్ లో ఎక్కువసేపు గడుపుతున్నాడు. ఇదివరకటికన్నా జీవితంలో ఏదోమార్పు వచ్చింది అనుకుంటూ చెప్పులు విడిచి లోపలికి వెళ్ళింది సమంత.

"రా..రా..టీ పెట్టాను..నేను ఇప్పుడే తాగాను.పిల్లలకి బిస్కట్స్ ఇచ్చాను..నీ టీ ఫ్లాస్కులో పోశాను. వేడిగా వుంటుందని" అంటున్న ఆనంద్ వైపు ధాంక్స్ అన్నట్లు చిరునవ్వుతో చూసింది సమంత. ఆమె కళ్ళలో కొత్త కాంతి.

లాక్ డౌన్ వెతలు – 4: డోంట్ టచ్ -- అత్తలూరి విజయలక్ష్మి

డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని కాబేజీ కట్ చేస్తోంది స్వప్న. ఒక్క కూర, రసం పచ్చడి చేస్తే చాలదు ఈయనగారికి. ఒక ముద్దకూర, ఒక వేపుడు లేకపోతె అది తెలుగువాడి భోజనం కాదు.. అసలు పప్పు దప్పళం ఉండాలి... కానీ, ఏదో అడ్జస్ట్ అవుతాలే అంటూ సానుభూతి ఒకటి ... కూరలు కొనడం ఒక పని అవన్నీ ఒకటికి రెండు సార్లు కడిగి ఆరపెట్టడం, ఆ కవర్ లన్నీ బయటపారేసి చేతులు కడుక్కోడం అవన్నీ ఆరాక మళ్ళి ఆరపెట్టిన చీరో, టవలో ఉతుక్కోడం దేవుడా! జీవితం కడుక్కోడం, తుడుచుకోడంతో అయిపోతోంది..

భుజం మీద స్పర్శ తగలగానే తాచుపాము మీద పడినట్టు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసి, తన భుజాల మీద చేతులేసి మీదకి ఒంగి నిలబడిన సుధీర్ని చూసి చేతిలో కాబెజ్ కింద పడేసి, ఒక్క గెంతులో దూరం జరిగి “ఎన్నిసార్లు చెప్పాలి నీకు ముట్టుకోవద్దని” అంది గట్టిగా.

“నేనేదో అంటరాని వాడిని అయినట్టు అట్లా పారిపోతావేంటి స్వప్నా! నీకు గుర్తుందా నేను నీ మొగుడిని” మీద, మీదకి వస్తూ కోపంగా అన్నాడు సుధీర్.

“అయితే! రూలు, రూలే ... మొగుడినా, అమ్మైనా, పిల్లలైనా డోంట్ టచ్ అంటే డోంట్ టచ్ అంతే... ఒక పక్క సామాజిక దూరం పాటించమని డాక్టర్స్ మొత్తుకుంటున్నారు. నీకు ఈ టైం లో రోమాన్స్ అవసరమా!”

“ఈ టైం, ఆ టైం అని టైమింగ్స్ ఫాలో అవడానికి నువ్వు నా బాస్ వా.. వీల్లేదు.. నెలరోజులైంది నువ్వా గదిలో నేనీ గదిలో.. అయినా నాకేం కుష్టువ్యాది ఉందా! దూరం దూరం అంటూ చంపుకుతింటున్నావు” చేయి పట్టుకోబోయాడు..

“నో ....” వీధి గుమ్మం వైపు పరిగెత్తుతూ అరిచింది.

“ష్ ఏంటా అరుపులు.. నువ్వలా అరుస్తూ వీధిలోకి వెళితే ఇంకేదో అనుకుని  పోలీసులను పిలుస్తారు పక్కింటివాళ్ళు.. రా ఇంట్లోకి ... మహాతల్లి ముట్టుకోను రా” పళ్ళబిగువున కోపంగా అరిచాడు.

అతన్ని బిక్కు,బిక్కుబిక్కుమంటూ చూస్తూ అడుగులో అడుగు వేస్తూ గోడవారగా నడుస్తూ వంటగది వైపు వెళ్ళింది. చేతులు కడుక్కుని వచ్చేసరికి తను కింద పడేసిన కాబేజీ తీసి “వెధవ బతుకు, వెధవ బతుకు...పెళ్ళాన్ని ముట్టుకోడం కూడా నేరమవుతోంది.. ఛీ, ఛీ” అని సణుగుతూ పెద్ద, పెద్ద ముక్కలు కసిగా తరిగి పళ్ళెంలో వేస్తున్నాడు.

అదిచూసి మరోసారి గట్టిగా అరిచింది... “చేతులు కడుక్కున్నావా! చేతులు కడుక్కోకుండా అన్నీ అలా ముట్టేసుకుంటే ఎలా? వెళ్ళు డెట్టాల్ సోప్ తో కడుక్కుని, శానిటైజర్ రాసుకో ..”

సుధీర్ చేస్తున్న పని ఆమె వైపు కళ్ళు చికిలించి తదేకంగా చూసి, చాకు టేబుల్ మీదకి గిరాటేసి బాత్ రూమ్ వైపు వెళ్ళాడు.

“ఈ మనిషికి ఎన్ని సార్లు చెప్పినా బుద్ధి ఉండదు... ఇంట్లో పనీ,పాటా లేకుండా ఉండేసరికి ఒకటే ధ్యాస... ఛీ, ఛీ” సణుక్కుంటూ తరిగిన కాబేజీ తీసుకుని కడగడానికి సింక్ దగ్గరకు వెళ్ళింది.

కాబేజీ కడిగివేనక్కి తిరిగేలోగా గబుక్కున వెనక నుంచి వచ్చి వాటేసుకున్నాడు సుధీర్..

కెవ్వుమంది స్వప్న...

“అరవకు... డెట్టాల్ తో స్నానం చేసి, ఒళ్ళంతా శానిటైజర్ పూసుకుని వచ్చా..” అన్నాడు అరచేత్తో ఆమె నోరు మూస్తూ..

“ఛీ, ఛీ కంపు ...” అతన్ని గట్టిగా తోసింది.

దగ్గర - దూరం -- రాజేశ్వరి దివాకర్ల

అమ్మ ఈ మధ్య సంతోషంగా కనిపిస్తోంది. శాలినికి కొంత ఆశ్చర్యంగా ఉంది. కొన్ని రోజుల క్రితం వరకు, నసుగుతూ ఉండేది. వెళ్ళి పోతాను, వెళ్ళి పోతాను, అంటూ, ఎప్పుడూ ఒక్కటే మాట. మీకు వండి వడ్డించడానికా నేనిక్కడ ఉండేది? చక్కగా నా ఇంట్లో అయితే, వంట మనిషీ, పనిమనిషీ, రాణీలా ఉండేదానిని, అంటూ అసహనం చూపించేది. ఫ్రిజ్ లో ఉంచినవి తీసి తినాలంటే, నేనిలాంటివి తినలేను. అంతగా ఆకలేస్తే చక్కగా హోటలు కెళ్ళి దోశో, ఇడ్లీ లో తినివచ్చేవాళ్ళం. ఇక్కడ ఎప్పుడూ తలుపులు మూసుకుని ఉండలేం బాబూ అంటూ తను మిస్సవుతున్న వాటినన్నింటినీ ఏకరవుపెట్టేది.

నాన్నైతే ఇక్కడ ఏమీ తోచట్లేదని చెప్పకనే చెప్తున్నాడు.

అదేమిటో ఈ మధ్య ఇద్దరిలోనూ, ముఖ్యంగా అమ్మలో చాలామార్పు వచ్చింది. అందరూ ఇంట్లోంచే పనిచేస్తున్నాం కాబట్టి, వేడి వేడిగా వంట చేసి, పిలిచి వడ్డిస్తోంది. బట్టలను ఓపికగా పై కెళ్ళి మషీన్ లో వేసుకుంటోంది. సాయంత్రం కొద్దిసేపు అందరితో పాటు టి .వి. చూస్తోంది. సరదాగా తను చదివిన వాట్సప్ జోకులు చెప్తోంది.

శాలిని ఆఫీసు పనుల ధ్యాసలో అమ్మా నాన్నల తిరుగు ప్రయాణానికిటికెట్లు కొనడం జాప్యం చేసింది .ఇద్దరూ వచ్చేటప్పుడు వాళ్ళతో పాటు అదే ఫ్లాట్లల్లో లో ఉంటున్న రామం దంపతులతో పాటు వచ్చారు కనుక , వాళ్ళతో పాటే వెళ్ళడానికి కూడా ఏర్పాటు చేసింది. రామం గారికి ఒంట్లో నలత గా ఉండడం వల్ల వాళ్ళు కూడా తిరుగు ప్రయాణానికి సిద్ధం అయ్యారు. కాని అంతలో వచ్చిన సంక్షోభం వల్ల అందరికీ ప్రయాణం అనిశ్చితం అయింది. ఒకసారి రామం గారిని పలకరిద్దామని శాలిని ఫోన్ కలిపింది .రామం గారు కూడా సంతోషంగానే ఉన్నట్టు ధ్వనించింది.

"అమ్మాయ్, మేము ఈసమయంలో ఇక్కడుండడం ఎంతో బాగుందమ్మా! అక్కడ మేం ఉండే ఫ్లాట్లల్లో అన్ని రాష్ట్రాలవాళ్ళూ ఉంటారుకదా. లాక్ డౌన్ కారణంగా వాళ్ళ పిల్లలందరూ, ఇతర ప్రదేశాలనుంచి రావడం, కొందరు ముందుగానే విదేశాలనుంచి రావడం వల్ల, అందరిళ్ళకీ తప్పని సరిగా తిరిగి, పనులను అందుకోవలసిన వాచ్ మేన్, కుటుంబంతో తమ ఊరికి వెళ్ళిపోయాడటమ్మా. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకంటే నగరాల్లో పని పాటలుచేసుకునే వాళ్ళు కూడ వార్తల ద్వారా విషయాలు తెలుసుకుని జాగ్రత్తగా ఉంటున్నారమ్మా. అక్కడివాళ్ళకిప్పుడు పని మనుషులెవ్వరూ అందుబాటులో కూడా లేరట. రూపాయి నోట్లను కూడా ఒకరినుండి పుచ్చుకోవట్లేదుట.. పైగా పోలీసులు కొడతారన్న భయం. హోటళ్ళన్నీ మూసేసారుట. వీధిలోకి అమ్మకానికి కూడా ఎవరూరావట్లేదుట. మాలాంటి వృద్దులకు అక్కడుంటే చాలా బెంగగా ఉండేది. మీరిక్కడ ఎలా ఉన్నారో అని ఆరాటపడేవాళ్ళం. అలా చెప్తున్న ఆయన మాటలను శాలిని వింది.

అంకుల్, మీ ఆరోగ్యం బాగుంది కదా అని కుశల ప్రశ్నలు వేసింది. “బాగానే ఉందమ్మా, నాకు ఒంట్లో నలతగా ఉండడం మామూలే కదా. ఒంటికి పడనివి తింటే అప్పుడప్పుడు దగ్గు కూడా వస్తుంది. ఇక్కడ నా కొడుకు వెంటనే ఆవిరి పట్టించి మామూలు దగ్గే అని నవ్వుతూ పలకరిస్తాడు. ఏవేవో ఊహించుకోవద్దని ధైర్యం చెప్తాడు.

మిమ్మల్ని దూర దేశాలకు పంపి ఒంటరి వాళ్ళం అయ్యాం. ఈ దూరం మమ్ములను బాధిస్తూనే ఉంది. ఈ దేశం మనది కాదని తెలుసు. కాని కష్ట సమయంలో మనవాళ్ళ దగ్గర ఉండడం, ఇంటి పట్టున అందరూ ఉండడం ఎంతో సుఖంగా ఉందమ్మా.” అన్నారు.

ఆయన మాటల వల్ల అమ్మ సంతోషానికి కారణం తెలిసింది శాలినికి. అవును, అమ్మకూ, నాన్నకూ దగ్గరగానే కాక, ఇంట్లోనే ఉండి చూసుకునే అవకాశం వచ్చింది. ఈ సమయాన్ని నేను ఆనందంగా గడపాలి. బహుశ అమ్మ, నాన్న కూడా ఇలాగే భావించారేమో అనుకుంది.

Posted in June 2020, కథానికలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!