Menu Close
మన ఆరోగ్యం మన చేతిలో...
Our health in our hands...
- మధు బుడమగుంట

నేడు మనందరం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులకు యావత్ ప్రపంచం ఒక విధమైన అభద్రతాభావంతో, ఏదో ఉపద్రవము ముంచుకొస్తున్నదనే భయంతో ఆరోగ్యపరంగా. మానసికంగా కూడా ఒడిదుడుకులకు లోనుకావడం జరుగుతున్నది. అన్ని దేశాలలో ఆర్ధిక సమస్యలు కూడా ఏర్పడి వ్యవస్థ మొత్తం ఆగిపోయింది. ఇది ఒక కుటుంబానికి, సమాజానికి, దేశానికి సంబధించిన కష్టం కాదు, యావత్ ప్రపంచానికి కలిగిన ఒక పెద్ద ఆరోగ్య సమస్య. ఇది అనుకోకుండా వచ్చిన దుర్మార్గపు అతిధి. కనుకనే ఎదుర్కొనే ప్రణాలికలు, సరైన సూత్రాలు, పనిముట్లు మనవద్ద లేవు. కానీ ఈ పరిస్థితిని ఎదిరించి నిలబడే మానసిక ధైర్యం, సామాజిక ఐక్యత, సహజ రోగనిరోధక శక్తి మనందరికీ ప్రస్తుతం అవసరం.

కాలగమనంలో ఎన్నో సార్లు మనం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉన్నాం. అది ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు లేక అంటువ్యాధులు మరియు మనలోని చెడుస్వభావం వలన మన ముప్పు మనమే కొనితెచ్చుకొన్న సందర్భాలు కూడా కావచ్చు. భూకంపాలు, సునామీలు, అంటువ్యాధులు, యుద్ధాలు, విప్లవాలు ఇలా ఎన్నో విధాలుగా మన జీవన ప్రయాణంలో చవిచూస్తూనే ఉన్నాం.  ప్రస్తుతం, ఈ భూమి మీది సకల మానవకోటి ఈ అంతుచిక్కని అంటువ్యాధి దాడికి గురైనది. చరిత్రను గమనిస్తే, మన సమాజంలో స్థితిగతులు, జీవన శైలిలో వచ్చిన మలుపులు, నడవడికలు, అన్నీ కూడా ఒక చెడు అనుభవం ద్వారా తెలుసుకొని మనలను మనం మార్చుకొంటూ వస్తున్నాము. ఉదాహరణకు రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జపాన్ ప్రజలు 30 సంవత్సరాలు అకుంఠిత దీక్షతో శ్రమించి యుద్ధం వలన వారికి జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తూ ఎలక్రానిక్, మరియు యాంత్రిక రంగంలో అగ్రస్థాయికి చేర్చారు. సునామీలు, భూకంపాలు మనిషికి ఎన్నో అనుభవాలతో కూడిన ఆలోచననలను, ధైర్యాన్ని అందించాయి. ప్రస్తుత పరిస్థితి మన జీవితాలలో ఎన్ని మార్పులను తెస్తుందో మరి. ఆ మార్పులన్నీ సర్వమానవాళికి సుఖమయ జీవన ప్రమాణాలను అందిస్తుందని ఆశిద్దాం.

ప్రస్తుత పరిస్థితిలో సమాజంలోని మనుషుల మానసిక పరిస్థితి ఎలావుంది? దాని ప్రభావం మనందరి జీవితాలలో ఎటువంటి ప్రభావాన్ని చూపుతున్నది తెలుసుకోవాలంటే మనకు ఒక విశ్లేషణ అవసరం. మానసిక వైద్యుల అంచనాల ప్రకారం నేటి పరిస్థితులలో మనిషి, ‘నిరాకరించడం, కోప్పడడం,సర్దుకుపోవడం,నిరాశకు గురవడం మరియు ఒప్పుకోవడం’ అనే ఐదు దశలను ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఇది వ్యక్తిగత సమస్య అయితే ప్రస్తుతం ఏ దశ జరుగుతున్నదో చెప్పవచ్చు. కానీ యావత్ ప్రపంచం లో ఇదే పరిస్థితి ఉంది కనుక భౌగోళిక, సామాజిక, ప్రాంతీయ, మతపరమైన,ఆర్ధిక పరమైన అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని మానసిక పరిస్థితిని విశ్లేషించ వలసిన అవసరం ఉంది. త్వరలోనే పరిస్థితులన్నీ చక్కబడి మన జీవితం సాధారణ స్థాయికి చేరుకుంటుందని మనందరం వేడుకొందాం.

‘సర్వే జనః సుఖినోభవంతు’

Posted in June 2020, ఆరోగ్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!