Menu Close
Page Title

పిల్లల సందడి అణగగానే సరోజ గొంతు సవరించుకొని,

“ఆత్మీయ అతిధులకు ఆనందాంజలులు – చల్లని ఈ సాయంకాలంలో మా ఆలోచనలను, ఆశయాలను, ఆనందాలను మీతో పంచుకోవాలని ఎంతో ఆశగా ఉంది. కాని ఈనాటి మానవుని జీవితం ఉరుకుల పరుగులతో నిల్చొని నీళ్ళు త్రాగడానికి కూడా సమయంలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నది. అందుకే మేము తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని గూర్చి మీ అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో అన్ని విషయాలను క్లుప్తంగా ఒక పుస్తకంలాగా వేయించాము. సభానంతరం అందరికీ అవి అందజేయబడతాయి.

మైక్ చూస్తే ఎవరికైనా మైకం కమ్మడం తనకు తెలిసినదంతా చెప్పాలనుకోవడం సహజం. అందుకే ఆ పరిస్థితిని నివారించి, నిర్ణీత సమయంలో సభ ముగించాలని మా ఉద్దేశ్యం. అయినా చెప్పవలసిన కొన్ని విషయాలను చెప్పకుండా ఉండడం కూడా ఒక రకంగా తప్పే అవుతుంది. అందుకే ఒక ముఖ్య విషయం మీకు మనవి చేసుకొంటున్నాను.

మాకు సంతానం లేని కొరత కొంతకాలంగా మమ్మల్ని బాధిస్తుండేది. దానికి ఒక పరిష్కార మార్గం చూపించడానికి భగవంతుడే దిగివచ్చాడా అన్నట్లు వచ్చి మా వ్యధ తీరడానికి మంచి మార్గం చూపిన ఒక గొప్ప వ్యక్తిని గూర్చి, అతని శ్రమను గూర్చి మీకు పరిచయం చేస్తాను.

మా వారికి ప్రాణమిత్రుడు, సహృదయుడు, గౌరవనీయులైన సుకుమార్ గారు. దేశ, విదేశ పర్యటనలతో స్వతహాగా ఉన్న తెలివితేటలతో, విశేష ప్రతిభతో కూడిన తన రచనల ద్వారా సమకూడిన అనుభవంతో ఏదైనా సమస్యలలో ఉన్నవారిని, కష్టాలను ఎదుర్కొంటున్న వారిని తగు పరిష్కార మార్గాలను వెతికి, వాటిద్వారా వారిని ఒడ్డుకు చేర్చడం ఆయన జీవిత ధ్యేయం. మేం కొంతకాలం అమెరికాలో ఉండడం వల్ల ఆయన్ని కలిసి మా సమస్య చెప్పలేకపోయాం. మాకు దత్తత, అద్దె గర్భం లాంటి విషయాలను గూర్చే ఆలోచనలు సాగుతుండేవి.

మాటలు చెప్పడం చాలా సులభం. కాని ఒకరి కష్టాలలో పాలు పంచుకోవడం చాలా కష్టం. అది సుకుమార్ వంటి వారికే సాధ్యం. ఇన్నాళ్ళకు మాకు మంచి రోజులొచ్చాయి. అందుకే ఆయనను కలిసి మా బాధలను చెప్పినపుడు ఇంత పెద్ద కార్యాన్ని తన భుజస్కందాలపై వేసుకొని, నిర్విఘ్నంగా పూర్తి చేసి మా చేతిలో పెట్టిన ఆయన ఋణం ఎలా తీర్చుకోగలం.

ఈ విధంగా చెల్లా చెదురుగా ఉన్న అర్హతలు గల్గిన యువతను, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఒప్పించి ఒకచోట చేర్చి, వారికి చక్కని భవిష్యత్తు ఇవ్వాలనుకోవడం నాకు తెలిసి ఒక క్రొత్త ప్రక్రియ. మేం చేసే ఈ ప్రయత్నానికి అన్ని విధాల తగిన వ్యక్తులను ఎంపిక చేయడం సామాన్యం కాదు. ఇప్పుడు ఎంపిక చేయబడ్డ విద్యార్థుల విద్యకు సంబంధించిన సర్టిఫికేట్ లను రికార్డులను పరిశీలిస్తే వారు చదివినంతమటుకు లెక్కలు, సైన్సు వంటి సబ్జెక్ట్ లలో కూడా నూటికి తొంభై తొమ్మిది మార్కులు సాధించినవారే. నూటికి నూరు కూడా సొంతం చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఇదొక మహాయజ్ఞం. మా సంస్థ నుండి వెలువడే ప్రతి విద్యార్ధి విద్యచేత సాన పెట్టబడి వజ్రంలా మెరవాలని మా ఆకాంక్ష. చివరగా రెండు మాటలు” అని ఆపి సరోజ తిరిగి,

“ఈ నాటి సమాజ పోకడలను గూర్చి కొద్దిగా చెప్పాలనుకొంటున్నాను. ఈనాడు ధనం ఒక విచిత్ర వస్తువయింది. లేనివాడు తానుకూడా సంపాదించుకోవాలనుకోవడం న్యాయమే. కాని ఉన్నవారు కూడా మరింత నిల్వ చేయాలని తాపత్రయపడడం ఎక్కువయింది. అలాగే సంపాదించాలన్న ఆరాటంతో పాటు అవసరానికి కావలసినంత మాత్రమే వాడుకొనే గుర్నాం ఉన్నప్పుడే ధనార్జనకు ఫలితం ఉంటుంది. మనం సంపాదించే దానిలో సమాజ శ్రేయస్సుకు, సాటి వ్యక్తి ఉన్నతికి ఖర్చుపెట్టడం ప్రతి వారు ఒక సత్కార్యంగా భావించాలి. సమాజం లేకపోతే మనం ఇంత ఉన్నతికి రాగలిగేవారమా? ఇవన్నీ ఎవరికీ వారు ప్రశ్నించుకోవాలి. ఏమైనప్పటికీ మాకు, మా ధనానికి, శ్రమకు తగిన విధంగా ఫలితం సమకూరింది. దానికి మూల కారకుడు మా సుకుమార్ అన్నయ్య గారు. వారిని ఇప్పుడు మా వారు సభకు పరిచయం చేస్తారు” సరోజ మైక్ దగ్గర నుండి ప్రక్కకు తొలిగింది.

“సరస్వతీ సభకు నమస్సులు. ఇతను నా ప్రాణ స్నేహితుడు. అయితే ఇతడే నా జీవితంలో మూగిన చీకట్లను పోగొట్టి వెలుగునిస్తాడని నేను ఎప్పుడు ఊహించలేదు. స్నేహమనే పదానికి నిజమైన అర్హత కలిగించాడు. భర్తృహరి, విష్ణుశర్మ మొదలైన వారు స్నేహాన్ని గూర్చి ఎన్నో మంచి సూక్తులు చెప్పివున్నారు. స్నేహమంటే  పుట్టుకతో లేని బంధం,  పుటుకలతో పోనీ బంధం, మధ్యలో వచ్చినా మమతానురాగాలను చిందించేది. మన మనుగడలో ఒక భాగమది. అదే స్నేహం. కృష్ణ కుచేల స్నేహ బంధం కన్నా గొప్ప సాక్ష్యమేముంటుంది.

నా స్నేహితునికి నేనేమివ్వగలను. అందుకే మా దంపతులం స్నేహబంధమైన పెద్దల సూక్తులను బహుమతిగా ఇవ్వదలుచుకొన్నాం. పంచతంత్రంలో విష్ణుశర్మ, భర్తృహరి నీతిశతకంలో స్నేహాన్ని గూర్చి, స్నేహితునికి ఉండవలసిన లక్షణాలను గూర్చి చెప్పిన శ్లోకాలు ఆణిముత్యాలు. వాటిని ఎందఱో ప్రముఖులు తెలుగులోకి అనువదించారు. ఆ అనువాద పద్యాలంటే మా దంపతులకు ఎంతో ఇష్టం. అందుకే విష్ణుశర్మ సూక్తులలో నుండి ఒక అనువాద పద్యాన్ని, భర్తృహరి సూక్తులకు ఆంధ్రానువాదం చేయబడిన పద్యాలనుండి ఒక పద్యాన్ని ఎంపిక చేసుకొన్నాం.

సుకుమార్ కు మేము బహుకరించే చిత్రపటం మీరందరూ చూసి మా స్నేహాన్ని, మమ్మల్ని ఆశీర్వదిస్తే మాకు తృప్తిగా ఉంటుంది.” అంటూ రమేష్ ఆ పటాన్ని సభకు కనపడేటట్లు తిప్పాడు. బంగారు పూతతో తళతళ మెరుస్తున్న ఫ్రేమ్ తో లోపల, పైన రెండు పద్యాలు దాని క్రింద సుకుమార్ ఫోటో ఉంది. ఆ ఫోటోను చూసి అందరూ మెచ్చుకొన్నారు.

రమేష్ దంపతులనుండి ఆ బహుమతిని అందుకున్న సుకుమార్,

“నా జీవితంలో విలువైన వస్తువు ఏదైనా ఉందంటే అది ఈ ఫోటో మాత్రమే.” అని సభకు వందనం చేసి కుర్చీలో కూర్చున్నాడు. రమేష్ దంపతులు సభ వైపు తిరిగి మంచి మాటలు, సూక్తులు, నీతులు మనిషికి విజ్ఞానాన్ని పెంచుతాయి. మంచి, చెడుల మధ్య తేడాను వివరిస్తాయి. అందుకే జ్ఞానమూర్తులైన మీకు విష్ణుశర్మ, భర్తృహరి స్నేహాన్ని గూర్చి చెప్పిన సూక్తులను చదివి వినిపించాలని మా కోరిక. దయతో ఆలకించండి.

‘బ్రతుకు కొనగడియల హితులు గెడలనున్న
చావబోవు వాడు సంబరపడు
అట్టి హాయివలన అసులు నిల్వగవచ్చు
కాని యెడల మిత్తియైన తనుపె’

ఎవరైనా చావబోయే పరిస్థితిలో ఉన్నప్పుడతడు తన మిత్రులను చూస్తే ఎంతో సంబరపడతాడు. అంతేగాక మిత్రులను కలుసుకొన్న సంతోషంలో ఆ వ్యక్తి ప్రాణాలు తిరిగి పొందవచ్చు. ఒకవేళ చనిపోయినా సంతృప్తిగా చనిపోతాడు.

ఇక భర్తృహరి మాటల్లో స్నేహితుని లక్షణాలు

‘అఘము వలన మఱల్చు హితార్థ కలితు
జేయు గోప్యంబు దాచు బోషించుగుణము
విడువఁ డాపన్ను లేవడి వేళ నిచ్చు
మిత్రుడీ లక్షణంబుల మెలగుచుండు’

‘పాపం చెయ్యకుండా తన స్నేహితులను ఆపుతాడు. మంచి పనులు మిత్రుల చేత చేయిస్తాడు. మిత్రుల రహస్యాలు దాచి పెడతాడు. ఆపదలో ఆదుకొంటాడు. ఇలా ఎన్నో విషయాలలో సహాయం చేసేవారే సుస్నేహితులు. స్నేహితులలో రెండు రకాలు. మన చుట్టూ తిరిగి కావాల్సినమటుకు తిని ముఖం తప్పించే రకం ఒకరయితే, ఇప్పుడు మనం చెప్పుకొన్నవారు అసలైన స్నేహితులు, రెండో రకం. ఇది గమనించి మనం స్నేహం చెయ్యాలి. మీరందరూ మేము తలపెట్టిన కార్యానికి వచ్చి సభను దిగ్విజయం చేసినందుకు మా ధన్యవాదాలు. సభ ముగించేముందు ఒక గీతం మా దంపతులమిద్దరం గానం చేసి మీ వద్ద సెలవు తీసుకొంటాం.”

సరోజ మాటలకు రమేష్ మైక్ దగ్గరికి వచ్చి సరోజ ప్రక్కన నిలబడి,

“బంగారు తల్లిరా మా భరతమాత
పొంగారు సిరులకు శిఖ మల్లెపూవు
అమ్మతో విడివడి భూమిపై పడగానే
అఖిల విద్యలు నేర్చు నేర్పు మా ధనము
ధైర్యసాహసములే మా చేతులై వెలయగా
వైరి మూకను మేము ఎదిరించగలము
సరస శృంగార రసపూర్ణ హృదయాల తోడ
స్వర్గ సౌఖ్యాల నిలమేము స్థాపింపగలము
జై భారతమాతా! జై తెనుగుతల్లి
ప్రతి ఇంట వెలసిన ఓ మాతృమూర్తి
మాతృశబ్దము మాకు మరువలేని పదము
జై కన్నతల్లీ! జయము జయము నీకు”

అంటూ ఆ దంపతులు పాట ఆపగానే కొన్ని నిమిషాలు కరతాళధ్వనులతో ఆ ప్రదేశమంతా మారుమ్రోగింది.

**** సశేషం ****

Posted in June 2020, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!