Menu Close
balyam_main

సామెతలతో చక్కని కధలు

- ఆదూరి హైమావతి

తినగా తినగా గారెలు చేదన్నట్లు

పోలయ్య విందు

హేమంత పురం అనే ఊర్లో మహేశ్వరయ్య అమిత ధనికుడు. అతడికి ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్ళు. అంతా వివాహాలైనా అతడి ఇంట్లోనే ఉమ్మడి కుటుంబంగా ఉంటూ ఏ పొరపొచ్చాలూ లేకుండా ఎవరి పని వారు చేసుకుంటూ ఉంటారు. మహేశ్వరయ్య కొడుకులకూ, అల్లుళ్ళకూ అందరికీ ఆస్థి పంపకాలు చేసేసి, ఎవరి వ్యాపారాలు వారికి అప్పగించేశాడు. తాను అన్నింటినీ అజమాయిషీ చేస్తూ హాయిగా ఉంటున్నాడు.

మనవలూ మనవరాళ్ళతో ఇల్లంతా కోలాహలంగా రోజూ పెళ్లి ఇల్లులా ఉంటుంది. చాలా మంది పని వారు అందరిపనులూ జాగ్రత్తగా చేస్తుంటారు. వారినీ యజమానులు ప్రేమగా చూసుకుంటున్నారు. అన్నిపనులూ పని వారు చేస్తుండగా మహేశ్వరయ్య ఇల్లాలు ఇందిరమ్మ ఇంటినంతా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది. ఎవరికి ఏది కావాలో పనివారికి చెప్పి చేయించేది. ఆనందం, ఐశ్వర్యం, ఐకమత్యం ఉన్నందున వారికి దేనికీ కొరత అన్నది లేదు. వారి ఇంట్లో నిత్యం నవకాయ పిండి వంటలతో భోజనం చేస్తుంటారు అంతా.

మహేశ్వరయ్య మనవడు మనోహర్. అతడి తరగతిలో అంతా మనోహర్ ఐశ్వర్యానికీ, వారి ఇంటి తీరుకూ, అంతపెద్ద ఇంట్లో అంతా కలసి మెలసీ ఉంటున్నందుకూ, రోజూ అతడు తినే ఆహారాన్నీ వింతగా చెప్పుకునేవారు. ఎవరైనా పాయసం, పిండివంటలు ఏదైనా పండుగకు చేసుకుంటారు. కానీ వారింట కనీసం రోజూ యాభై మంది వరకూ భోజనాలు చేస్తారు. మహేశ్వరయ్య స్నేహితులు భోజనం సమయానికి వచ్చినా, వ్యాపార నిమిత్తం ఇతర ప్రాంతాలనుండి తమ అంగడికి వచ్చేవారైనా భోజన సమయమైతే రోజూ వారందరినీ భోజనానికి ఆహ్వానించేవాడు మహేశ్వరయ్య. అందువల్ల మహేశ్వరయ్య ఇల్లు పెళ్ళి ఇల్లు లాగానూ, భోజనం పండుగ భోజనం లాగానూ ఉంటుంది.

ఒకమారు మనోహర్ తన పుట్టినరోజుకు తన తరగతి పిల్లలందరినీ భోజనానికి పిలిచాడు తాతగారి అనుమతితో. అందరికీ వారి తోటలో భోజనాలు బ్రహ్మాండంగా పెళ్ళి విందులా ఏర్పాటు చేశాడు మనోహర్ తాతగారు. పిల్లలంతా అలాంటి విందు భోజనం ఎప్పుడూ చేయనందున తృప్తిగా తిన్నారు. చాలా కాలంపాటు మనోహర్ పుట్టినరోజు విందు గురించీ అంతా మాట్లాడుకోసాగారు. ఒకమారు మనోహర్ తో చదువుకునే అతడి తరగతి పిల్లవాడైన పోలయ్య అనే రైతు కొడుకు కొండయ్య ఆహ్వానం మేరకు, అతడి పుట్టిన రోజుకు స్నేహితులందరితో పాటుగా మనోహర్ కూడా వారింటికి భోజనానికి వెళ్లాడు.

వారింట గాదెలో దాచిన మాగిన మొలగొలుకుల బియ్యంతో అన్నం, పులిహోర, రాగి సంకటీ, సాంబారూ, జొన్నరొట్టెలూ, బియ్యపు నూక పాయసం చేశారు. జొన్నరొట్టెల్లోకీ నంజుకోను ఉల్లికారం చేశారు. అది ఎలా తినాలో కొండయ్య తన స్నేహితుడైన మనోహర్ కు చెప్పాడు. వారింటి భోజనం మనోహర్ కు మహా నచ్చింది.

ఇంటికెళ్ళాక బామ్మను అలాంటి భోజన పదార్ధాలు చేయించమనీ, రోజూ తమ ఇంట్లో తినే పదార్ధాలేవీ బాగుందటం లేదనీ కోరాడు. అవేంటో, వాటి పేర్లెంటో కూడా చెప్పలేకపోయాడు. మనోహర్ బామ్మ పోలయ్య తల్లి లక్ష్మమ్మను తన పనివారితో ఇంటికి విందుకు పిలిపించింది. భోజనాలయ్యాక, మనోహర్ బామ్మ లక్ష్మమ్మను ఆమె కొడుకు పుట్టినరోజుకు వండిన వస్తువులను, తమ వంట వారికి చెప్పమని కోరింది.

దానికి ఆమె ఫక్కున నవ్వుతూ "అమ్మా! తినగా తినగా గారెలు చేదన్నట్లు మీరు రోజూ కమ్మ కమ్మని వంటలూ, నేతి గారెలూ, గడ్డ పెరుగూ తింటున్నందున, మా నీళ్ల మజ్జిగా, జొన్నరొట్టె, దాన్లో నంజుడుకు ఉల్లికారం, రాగి ముద్దా, దానిలోకి బెండకాయ సాంబారూ మీ మనవడికి కొత్తగా ఉన్నట్లుంది. మావన్నీ పేదలు భుజించే వంటకాలేనమ్మా! మీలా ఐశ్వర్య వంతులు భుజించే వంటకాలు మేము ఏనాడూ చేసుకోలేము. ఐనా మీ నిరాడంబరం, మీ స్నేహ భావం, మీ మంచి తనం నాకెంతో సంతోషంగా ఉంది తల్లీ! వెయ్యేళ్ళపాటు ఇలాగే ఐశ్వర్యంతో జీవించండి." అని దీవించి వెళ్ళింది లక్ష్మమ్మ.

Posted in August 2019, బాల్యం

1 Comment

  1. Anupama

    హైమావతి గారు ధన్యవాదాలు.సత్యం చాలా బాగా చెప్పారు తల్లి.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!