Menu Close

Alayasiri-pagetitle

మన ఆలయాలు, మన సంస్కృతి పరిరక్షక పవిత్ర ప్రామాణికాలు

మనిషికి, మతానికి మధ్యన మహోన్నతమైన మరో అంశం దాగి ఉంది. అదే మానవత్వం. మానవత్వం మనుగడతో సిద్దించేదే దైవత్వం. మతాలు వేరైనా వాటి పరమార్థం ఒక్కటే. అదే మంచితనం. మనిషికి మంచి నడవడిక, మంచి ఆలోచనల స్థిరత్వం, మంచి సామాజిక విలువల మార్గనిర్దేశం తదితర ధర్మాలను ప్రభోదిస్తూ, ప్రతిబింబించే వేదికే, ప్రతి ఊరిలోనూ ఉండే పవిత్ర స్థలం ‘ఆలయం’ ‘దేవాలయం’. రూపాలు ఎన్నైనా అనంతమైన శక్తిపుంజము ఒక్కటే. అదే దైవత్వం.

ఆలయం అంటే ఆది నుండి లయం వరకు మానవ జీవితంలో అడుగడుగునా అండగా ఉంటూ ఆదర్శవంతమైన జీవిత ప్రాభవాన్ని వివరిస్తూ, తదనుగుణంగా మానవ విలువలను, మన సంస్కృతిని పరిరక్షిస్తూ, మన జీవన వైవిధ్యాన్ని వివరిస్తూ, నిక్షిప్తిస్తూ, మనిషి జన్మ యొక్క మాధుర్యాన్ని మన భావితరాలకు కూడా అందించే అద్భుత పవిత్ర స్థలం.

నాటి రాజుల నుండి నేటి సామాన్యుని వరకు ప్రతి భాషకు, సంస్కృతికి ఒక క్రమశిక్షణతో కూడిన విధానం వుంది. ఆ విధానాన్ని నేటి సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా మలుచుకొంటే మన జీవితం, ఎంతో సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది.

మన సిరిమల్లె చతుర్థ వార్షిక ప్రత్యేక సంచిక సందర్భంగా సెప్టెంబర్ 2018 నుండి జూలై 2019 సంచిక వరకు ప్రచురించిన వివిధ ఆలయాల సంగ్రహ సమాచారం మీ కోసం మరొక్కసారి అందిస్తున్నాం.

ఈ అంశాలను పూర్తిగా చదువుటకై క్రింద ఇవ్వబడిన శీర్షికలపై క్లిక్ చేయండి.

సెప్టెంబర్ 2018 - లేపాక్షి, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్

మన చరిత్ర ఎన్నో మధురానుభూతులను, సంస్కృతీ సంప్రదాయాలను వివిధ రూపాలలో భద్రపరచి మనకు అందిస్తుంటుంది. ముఖ్యంగా మన ఆలయాలలో ఉన్న శిల్పసంపద మనకు ఎన్నో అమూల్యమైన ఆధ్యాత్మిక విషయాలను, సనాతన పద్ధతులను కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది.

‘లేపాక్షి బసవయ్య లేచి రావయ్య
కైలాస శిఖరానా కదిలి రావయ్య’

అని అడవి బాపిరాజు గారు భావావేశంతో అన్న మాటలు అక్షరాల నిజం చేస్తూ నేటికీ ఠీవిగా 15 అడుగులఎత్తు, 27 అడుగుల పొడవుతో అలంకార భూషితమై ఏకశిలా రూపంతో కూర్చొని ఆ వీరభద్ర స్వామి రక్షకుడిగా ఉన్న నందీశ్వరుడు మనకు అనంతపురం జిల్లాలోని లేపాక్షి లో దర్శనమిస్తాడు. క్రీ.శ.16వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయ ప్రాంగణ విశేషాలే నేటి మన ఆలయసిరి.

పూర్తిగా ఇక్కడ చదవండి.. https://sirimalle.com/lepakshi-aalayam/

అక్టోబర్ 2018 - శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం, బ్రిడ్జి వాటర్, న్యూ జెర్సీ, యు.ఎస్.ఎ.

గత సంవత్సరం అక్టోబర్ మాస ఆలయసిరి లో న్యూ జెర్సీ రాష్ట్రం లోని అక్షర పురుషోత్తం సంస్థాన్ వారు నిర్మించిన అత్యంత ఖరీదైన లక్ష్మీనారాయణ మందిరం గురించి వ్రాశాను. కానీ, ఈ సంచిక ఆలయసిరి, అతి సామాన్యమై ఎక్కువ సంప్రదాయ బద్దమై ఆగమ శాస్త్ర ధర్మాలకు అనుగుణంగా నిర్మితమైన శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ బాలాజీ మందిరం.

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంఈ ఆలయ నిర్మాణం సంప్రదాయ బద్ధంగా నిర్మితమైననూ, ఎన్నో న్యాయసంబంధ చిక్కులను పరిష్కరించుకోవాల్సివస్తున్నది.

పూర్తిగా ఇక్కడ చదవండి.. https://sirimalle.com/sri-venkateswars-swamy-aalayam/

నవంబర్ 2018 - శ్రీ ఉమా మహేశ్వర ఆలయం, యాగంటి కర్నూల్, ఆంధ్రప్రదేశ్

సాధారణంగా శైవ క్షేత్రాలలో శివుని ఆలయం, అమ్మవారి ఆలయం ఇరువురి రూపాలు విడి విడిగా ఉంటాయి. అయితే, అర్థనారీశ్వర రూపంతో విలసిల్లె క్షేత్రాలు చాలా అరుదుగా ఉంటాయి. అటువంటి వాటిలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ జిల్లా యాగంటి లోని శ్రీ ఉమా మహేశ్వర ఆలయం ఒకటి. ఈ ఆలయ నిర్మాణం క్రీ.శ.15 వ శతాబ్దంలో జరిగింది. కానీ, అంతకు మునుపే ఎన్నో వందల సంవత్సరాల నుండి ఇక్కడ అగస్త్య మహర్షి నిర్మించిన ఆలయం ఉన్నట్లు ఇక్కడి స్థాన చరిత్ర చెబుతున్నది. అయితే విజయనగర రాజుల కాలంలో ఈ ఆలయం ఎంతో వైభవంతో విలసిల్లింది. రాతితో నిర్మించిన ఈ శిల్ప కళా వైభవం నేటికీ తన కళా కాంతులను ప్రసరిస్తూనే ఉంది. ఇక్కడి అర్థనారీశ్వరుడు నేటికీ నిత్య పూజలందుకుంటూ భక్తులకు కోరిన వరాలను తీర్చే భక్త వల్లభుడుగా వినతి కెక్కాడు.

పూర్తిగా ఇక్కడ చదవండి.. https://sirimalle.com/sri-uma-maheshwara-alayam/

డిసెంబర్ 2018 - భారతీయ మందిర్, సంద్రింఘాం, ఆక్లాండ్, న్యూజీలాండ్

న్యూజీలాండ్ దేశం ఆస్ట్రేలియాకు నైరుతి దిశగా పసిఫిక్ మహా సముద్రంలో ఉన్న మరో చిన్న దేశం. అంతర్జాతీయ కాలరేఖకు దగ్గరగా ఉండటం చేత ప్రపంచం మొత్తంలో మొట్టమొదట సూర్యుడు ఉదయించేది ఈ దేశంలోనే. అక్కడ కూడా 700 సంవత్సరాల క్రితమే నాగరికత వెలసింది. అయితే 18 శతాబ్దంలో జేమ్స్ కుక్ మరియు ఇతర డచ్ అన్వేషకుల ద్వారా ఆ దేశ ఉనికిని గుర్తించడం జరిగింది. పిమ్మట 19 వ శతాబ్దంలో బ్రిటిష్ వారి రాజ్యకాంక్ష అక్కడకు కూడా విస్తరించి నెమ్మదిగా 1840 వ సంవత్సరంలో బ్రిటిష్ వారి నియంత్రణలో అక్కడ పార్లమెంటరీ వ్యవస్థ ఏర్పడింది. అప్పుడే మన దేశంలో కూడా ఆంగ్లేయుల ఆధిపత్యం మొదలైనందున మన దేశం నుండి నెమ్మదిగా సాంకేతిక నిపుణులు, పనివారు కూడా నెమ్మదిగా న్యూజీలాండ్ కు వలసలు వెళ్ళడం మొదలుపెట్టారు.

పూర్తిగా ఇక్కడ చదవండి.. https://sirimalle.com/bharathiya-mandir/

జనవరి 2019 - శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయం, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్

మహాభారతాన్ని తెలుగులోకి అనువదించినది ‘కవిత్రయం – నన్నయ, తిక్కన, ఎఱ్ఱాప్రగడ’. ఈ ముగ్గురిలో, తిక్కన గారు, సింహపురి రాజధానిగా పరిపాలించిన మనుమసిద్ధి ఆస్థానంలో ఉంటూ ఈ దేవాలయంలోనే మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడని ఒక నానుడి. మహా భారతం లోని పద్దెనిమిది పర్వాలలో పదిహేను పర్వములు తిక్కన సోమయాజి అనువదించాడు. అంతటి గొప్ప చరిత గలిగిన విక్రమ సింహపురి, నెల్లు అనగా వరి పంటకు ప్రసిద్ధిగాంచిన నెల్లూరు పట్టణంలో ప్రవహిస్తున్న జీవనది పెన్న ఒడ్డున వెలసియున్న శ్రీ రంగనాథ ఆలయానికి సంబంధించిన విశేషాలే నేటి మన ఆలయసిరి.

పూర్తిగా ఇక్కడ చదవండి.. https://sirimalle.com/sri-thalpagiri-ranganathaswami-alayam/

ఫిబ్రవరి 2019 - పశుపతినాథ్ ఆలయం, ఖాట్మండు, నేపాల్

శ్రీకర(1)కలితపదాబ్జ! య
గౌకస(2)! కందర్పదర్పహర! సుందరది
వ్యాకృతి! కావుమ భవ! హర!
శ్రీకంఠ(3)! నతార్థిచక్రి! శ్రీధరహారా!(4)
(1) శుభకర (2) పర్వతనిలయుడు (3) విషకంఠుడు (4) సర్పములు హారములుగా కలవాడు

అని అయ్యగారి సూర్యనారాయణ మూర్తి గారి స్తుతితో;

మనిషి భౌతిక దేహంలో ఇమిడిపోయి ఉన్న ఆత్మజ్ఞానాన్ని వెలికితీసి, ఆ జ్ఞానానికి సృజనాత్మకతను జోడించి ఇహ, పర విషయపరిజ్ఞానాన్ని శోధించి, అవగతం చేసుకుని తద్వారా అనంత విశ్వంలోని అనేక అలౌకిక విషయాలను అవపోసన పట్టినవాడే మహా యోగి, బ్రహ్మజ్ఞాని కాగలడు.  అటువంటి మహా జ్ఞానులు, యోగులకు ఆవాసమైన హిమపర్వత శ్రేణులలో ఉన్న నేపాల్ దేశం లోని పశుపతినాథ్ ఆలయ విశేషాలు మహాశివరాత్రి సందర్భంగా ఈ ఫిబ్రవరి మాస సంచికలో మీ అందరికోసం అందిస్తున్నాను.

పూర్తిగా ఇక్కడ చదవండి.. https://sirimalle.com/pashupathinaath-aalayam/

మార్చి 2019 - సంగమేశ్వర ఆలయం, కర్నూల్ జిల్లా, ఆంధ్రప్రదేశ్

శాస్త్ర సాంకేతిక రంగాలు అంతగా అభివృద్ధి చెందని కాలంలో మనిషి నిజంగా తన మెదడుకు పదునుపెట్టి ఎన్నో అపురూప అందాలను సృష్టించాడు. ఆనాటి సామాజిక జీవన పరిస్థితులను ప్రతిబింబించే విధంగా ఎన్నో రాతి కట్టడాలను నిర్మించాడు. అందుకొఱకు ఎంతగానో శ్రమించాడు. ఎందుకంటే ఈనాటి ఆధునిక పరిజ్ఞాన వసతులు, అవకాశాలు నాడు లేవు. అందుకనే ఒక్కో కట్టడం నిర్మించడానికి ఎన్నో ఏళ్ళు పట్టేది. అయితేనేమి శతాబ్దాలపాటు అవి చెక్కుచెదరక నిలిచి భావితరాలకు చరిత్రను చూపుతున్నాయి.

పూర్తిగా ఇక్కడ చదవండి.. https://sirimalle.com/sangameshwara-aalayam/

ఏప్రిల్ 2019 - చెట్టులోపల ఆలయం, వాట్ బాంగ్ కుంగ్, థాయిలాండ్ - Wat Bang Kung Thai name : วัดบางกุ้ง

ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్ననూ ప్రతి పురాతన కట్టడం ఒక చరిత్రను చెబుతుంది. అలాగే, ఎన్నో వందల సంవత్సరాలు బతికి, ఎకరాలకొలది విస్తరించే వృక్షాలు కూడా వందల ఏళ్ల నాటి సామాజిక స్థితిగతులను, పరిసరాల సారూప్యతను మనకు అందిస్తాయి. అయితే ఒక మఱ్ఱి చెట్టు వందల ఏళ్ల నాటి సంస్కృతిని, భక్తి భావాలను తనలోనే ఇముడ్చుకొని మనకు నేడు చూపిస్తుంటే, అది ఆశ్చర్యమే కదా! థాయిలాండ్ దేశంలో  అటువంటి వృక్షంతో పూర్తిగా కప్పబడిన ఆలయం యొక్క విశేషాలే నేటి మన ఆలయసిరి.

పూర్తిగా ఇక్కడ చదవండి.. https://sirimalle.com/wat-bang-kung-temple/

మే 2019 - రామనారాయణం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్

మనిషి జీవితం అన్ని వర్ణాలలో ఆద్యంతం అగుపిస్తూ, జీవిత సార్థకతను సిద్ధింపజేయాలంటే అందుకు మన పురాణ ఇతిహాసాల సారాశం, ధర్మాలు, సూత్రాలు తెలుసుకొని వాటిని ఆచరించవలసిన అవసరం ఎంతో ఉంది. వాటిని మనకు అందించిన మహానుభావులు, ఊరికే కూర్చుని ఉబుసుపోక ఆ గ్రంథాలను రచింపలేదు. తమ మేథోసంపత్తిని, అనుభవాన్ని రంగరించి, అమూల్యమైన విషయాలను మనకు అందించారు. ప్రతి గ్రంథం, పురాణం వెనుక నిగూఢంగా మన మార్గనిర్దేశం ఉంది. మరి ఆ నిర్దేశాలను సామాన్య మానవునికి కూడా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే కొంచెం కష్టంతో కూడుకొన్న కార్యమే. అయితే మనిషి సృజనాత్మకత ఆ కష్టాన్ని తగ్గించి కొంచెం సులభతరం అయ్యేట్లు చేసింది. అందులో ముఖ్యమైనది దృశ్య శ్రవణ ప్రక్రియ. మన రామాయణ, మహాభారత, భాగవతాలను బొమ్మల రూపంలో విశదీకరిస్తే ఆ ఇతిహాసాలలోని ధర్మాలను మరింత సులువుగా అర్థం చేసుకునేందుకు వీలౌతుంది. అటువంటి బృహత్కార్యాన్నిచేపట్టి అందుకొరకు ఒక సువిశాల ప్రాంగణాన్ని నిర్మించి అందరికీ ఆ ఆలయాన్ని దర్శించేందుకు వెసులుబాటు కల్పించిన నారాయణం నరసింహమూర్తి గారి  ‘శ్రీ రామ నారాయణం-శ్రీమద్రామాయణ ప్రాంగణం’ యొక్క ఆలయ విశేషాలే నేటి ఆలయసిరి.

పూర్తిగా ఇక్కడ చదవండి.. https://sirimalle.com/raamanaaraayanam/

జూన్ 2019 - పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయము, కరాచి, పాకిస్తాన్

మన సనాతన హిందూ సంస్కృతి యొక్క విశిష్టత గురించి ప్రత్యేకంగా వివరించనవసరం లేదు. తదనంతర కాలంలో వచ్చిన ఇస్లాం మతము, క్రైస్తవ మతము, మహావీరుని జైన మతము, గౌతమ బుద్ధుని బౌద్ధమతము, గురునానక్ సిక్కు మతము ఇలా ఎన్నో మతాలూ, ఆచారాలు కానీ వాటన్నిటి సారాంశం ఒక్కటే. సాటి మనిషిని గౌరవించు, అందరూ సుఖ సంతోషాలతో పవిత్రమైన ప్రశాంత జీవనాన్ని గడపాలి.

స్వాతంత్ర్యం సిద్దించక మునుపు మన భారతదేశం, నేటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలను కూడా కలుపుకొని అఖండ భారతావనిగా వెలుగొందింది. నాడు, నేడు కూడా భారతదేశం మరియూ పై రెండు దేశాల ప్రజల మధ్యన సోదర అభిమానం మెండుగా ఉండి ఒకరి సంస్కృతిని ఒకరు గౌరవించుకుంటూ వస్తున్నారు. అయితే, ఆంగ్లేయుల రాజకీయ లబ్ది కోసం చేసిన దేశ విచ్ఛిన్నత, నేటి రాజకీయ నాయకుల, పాలకుల స్వార్థ చింతన, అసాంఘీక శక్తుల ప్రమేయం వలన అనిశ్చిత ఏర్పడి ప్రజల మధ్యన ఉన్న ఆ సోదర భావం నెమ్మదిగా సన్నగిల్లుతున్నది. ఆంగ్లేయులు మన దేశాన్ని పాలించక మునుపే దాదాపు పదిహేను వందల సంవత్సరాల క్రితం నేటి పాకిస్తాన్ దేశంలోని కరాచీ పట్టణంలో సహజసిద్ధంగా వెలసిన పంచముఖ ఆంజనేయుని ఆలయ విశేషాలు నేటి మన ఆలయసిరి.

పూర్తిగా ఇక్కడ చదవండి.. https://sirimalle.com/panchamukha-anjaneya-swami-aalayam/

జూలై 2019 - శ్రీ మురుడేశ్వర ఆలయం, కర్ణాటక రాష్ట్రం, ఇండియా

మన మనస్సులో రగులుతున్న వ్యాకులతను తొలగించుకునేందుకు మనం సాధారణంగా ఆలయానికి వెళుతుంటాం. తద్వారా మనసులోని బాధలకు ఉపశమనం కలిగి మనసు తేలికౌతుంది.  అయితే అందుకు ప్రకృతి కూడా మనకు సహకరించి చక్కటి సముద్ర తీరంలో, పచ్చటి కొండ మీద, చల్లటి సముద్ర గాలి తో మనలను ఆహ్లాదపరిస్తే, ఇక ఆ కోవెలను దర్శించుకోకుండా ఎవరైనా ఉంటారా? అక్కడే సమయమంతా గడపాలని కోరుకోకుండా ఉంటారా? అదే ఉత్తర కర్ణాటక రాష్త్రం లో అరేబియా సముద్రపు ఒడ్డున కందూక పర్వతం మీద నిర్మితమైన మురుడేశ్వర క్షేత్రం, నేటి మన ఆలయసిరి.

పూర్తిగా ఇక్కడ చదవండి.. https://sirimalle.com/sri-murudeswara-aalayam/

Posted in August 2019, July 2019, ఆధ్యాత్మికము

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!