Menu Close
balyam_main

మన్మథా... నవ మన్మథా...

- డా. రావి రంగారావు

మా నాన్న విత్తనాలు చల్లిన పొలం

కట్టుబట్టలతో ఎక్కడినుంచో
వలసవచ్చిన నాన్న
మా వూళ్ళో నేలను నమ్ముకొన్నాడు,
అవిశ్రాంత స్వేదాన్ని ఇక్కడే
పొలంగా మార్చుకున్నాడు,
నన్నిక్కడ విత్తనంగా చల్లి
మంచి పంటను పెంచుకున్నాడు...
ఈ పొలంలో పండిన పంటను నేను
విత్తనాలుగా మారి
మళ్ళీ ఈ పొలంలోనే
రెట్టింపు పంటగా మారిపోయాను,
మా నాన్న ఋణం తీర్చుకున్నాను...
మా పొలంలో పంట
కొన్నాళ్ళకు అమెరికాకు వెళ్ళింది,
అక్కడే విత్తనాలు చల్లి
అమెరికా పొలం పండిస్తోంది...
నిన్న మా పొలానికి వెళ్లాను
నా విత్తనాలు ఇక్కడ పంటగా మారే దెపుడని
భయం మబ్బుతో అడిగింది,
నా గుండెలో దిగులు నీరు చేరింది...
ఏ పరిశ్రమల చక్రంలోనో పెట్టి పారిపోతానో
ఏ పరాయివాడి పెత్తనాని కమ్మేస్తానో
ఏ ప్లాట్లుగా మార్చివేస్తానో...
మా పొలాని కెంత దిగులో...
నమ్ముకున్న పెంపుడుకుక్కలా
నా వారసులకోసమే ఎదురుచూస్తూ బతుకుతోంది...
నా విత్తనాలు, నా విత్తనాల విత్తనాలు
తనలో పంటగా మారాలని
మా పొలానికి ఒక నది కున్నంత తపన,
భారత దేశం వేదన...
మా నాన్నను నాకు అనుక్షణం గుర్తుచేస్తూ మా పొలం,
మా నాన్న పాత ఫోటో మాసిపోకుండా జాగ్రత్త పడుతూ నేను...
అదిగో, అమెరికానుండి ఫోను,
బహుశా మా మనవడే ననుకుంటా...
"తాతా, ఇండియా వసున్నా,
మన పొలంతో చెప్పు,
అక్కడే నా విత్తనాలు చల్లుతా"నని!

Posted in August 2019, బాల్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!