Menu Close
అపస్వరంలో ఆత్మీయసందేశం
-- ఏల్చూరి మురళీధరరావు
Dwaram Venkata Swami Naidu

మహనీయుల మనస్సులో, మంగళమయ వాక్కులో యావత్కాలానికి ఉపదేశప్రాయమైన మహితసందేశం ఉంటుంది.

అంతర్జాలంలో ఒకరోజు పూజ్యులు వాయులీన మహావిద్వాంసులు శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారి చిత్రాన్ని చూసినప్పుడు ఎన్నడో చిన్ననాడు విన్న ఈ ఉదంతం గుర్తుకు వచ్చింది:

విజయనగరంలో అతినిర్ఘృణుడైన గొప్ప సంగీత విమర్శకుడు ఒకాయన ఉండేవారట.

ఆయన అభినివేశమూ, శాస్త్రజ్ఞానమూ సాటిలేనివని అందరూ అనుకొనేవారట.

నగరంలో ఏర్పాటైన ప్రతి సంగీత కార్యక్రమానికీ తప్పనిసరిగా వెళ్ళేవారట.

కచేరీ మొత్తం ఎంతో శ్రద్ధగా ముందు వరుసలో కూర్చొని మరీ వినేవారట.

చిక్కల్లా ఒక్కటే:

కార్యక్రమంలో ఏ చిన్ని లోపం దొర్లినా ఆయన ఇట్టే గుర్తుపట్టేవారు.

గుర్తుపట్టి, ఊరుకొనేవారన్నమాటేనా?

నిండు సభలో - పెద్దలందరి సమక్షంలో - దూకుడుగా లేచి నిలబడి,

“ఛీ!” అని పెద్దగా చీదరించుకొని -

దురుసుగా బయటికి వెళ్ళిపోయేవారట.

కొన్నాళ్ళకు విజయనగరంలో ఆయన వస్తున్నారంటేనే గాయనీగాయనులకు, వాద్యసంగీత నిపుణులకు సింహస్వప్నంగా మారింది.

పోనీ ఆయన పొరపడ్డారని, ఆయన విమర్శ సరికాదని వాదింపవచ్చునా? అంటే, నిర్వివాదమైన మహాపాండిత్యం ఆయనది.

ఒకసారి తప్పు చూపారంటే – ఎంతటివారైనా తలవంచుకోవలసిందే.

నిండుసభలో ఆయన తిరస్కృతికి గురైన తర్వాత, సామాన్యశ్రోతలు సైతం “ఈయనకేమీ రా”దని తమ గురించి ఏమనుకొంటారో? అని పెద్దపెద్దవారికి సైతం జంకూ, గొంకూ అంకురించేవట.

విజయనగరంలో నాయుడు గారు చాలా కాలం తర్వాత అభిమానుల కోరికపై ఒక కచేరీ చేయబూనారు.

ఏర్పాట్లు పెద్దయెత్తున జరిగాయి.

శిష్యులు నాయుడు గారిని హెచ్చరించారు:

స్వామీ! అతగాడొక గొంతులో పచ్చివెలక్కాయ వచ్చి కూర్చుంటాడు.

తప్పు జరుగుతుందని కాదు గాని, ఒకవేళ జరగకూడనిదేమైనా జరిగితే ఆయనను ఎట్లా ఆపాలో, మీకు ఎలా హెచ్చరించాలో మాకేమీ పాలుపోవటం లేదు –

అని.

ద్వారం వారు ఏమీ అనలేదు.

అంతా భగవంతుడు నిర్ణయించినట్లే జరుగుతుంది, మన చేతిలో ఏముంది? అన్నారట.

శిష్యుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తాయి.

ఆరోజు కనుక గురువుగారి కార్యక్రమానికి అడ్డుపడితే ఆయనపై దాడిచేయటమో,

మరోలా బుద్ధిచెప్పటమో –

తాడో పేడో తేల్చివేయాలని సంకల్పించుకొన్నారట.

ఊళ్ళోవాళ్ళూ కూడా ఈరోజు ద్వారం వారి పసో, నసో తేలిపోతుంది; ఆయనకు శలాకాపరీక్ష జరుగుతుంది కదా! అని -

సాయంతన వేళకు ఒళ్ళంతా కళ్ళుచేసికొని, కళ్ళన్నీ చెవులుగా మార్చుకొని బళ్ళుకట్టుకొని మరీ వచ్చారట.

కార్యక్రమం మొదలయింది.

అందరూ ఎన్నడూ లేని ఆందోళనతో, ఎప్పుడూ లేని ఎదురుచూపుతో నిశ్శబ్దంగా ఉపవిష్టులై ఉన్నారు.

ఆయన గారు సకాలంలో వచ్చి, ముందువరుసలో కూర్చున్నాడు.

శిష్యులు కళ్ళతోనే కత్తులూ కఠారులూ నూరుతున్నారు.

ఆబాలగోపాలం వేచి ఉన్న సంగీత కార్యక్రమం మొదలయింది.

అంతలోనే అందరూ ఏది జరుగకూడదనుకొన్నారో, అదే జరిగింది!

నాయుడు గారి చేతిలోని కమాను వణికినట్లయి, ఆదిలోనే హంసపాదు దొర్లింది.

ఉపక్రమణికలోనే అపస్వరం పలుకనే పలికింది.

మైకులో ఆ అపస్వరం తెరలుతెరలుగా వ్యాపించి,

ఉచ్చైఃశ్రవణయంత్రాల ద్వారా -

భగ్నశివధనుష్టంకారం లోకాలోకాలలో మారుమ్రోగినట్లుగా -

కర్ణేంద్రియకఠోరతమంగా -

ఆడిటోరియం నిండుగా

ఒక్కుమ్మడిని నినదించిందట.

శిష్యులు వడవడ వణికిపోతున్నారు.

అంతలో నాయుడు గారు –

మందస్మితముఖారవిందులై, శాంతగంభీరవాక్కుతో అన్నారట:

మనవాడు లేచి నిలబడ్డాడా? అని.

పైకి లేచి, చేయిపైకెత్తి, “ఛీ!” అని గర్జింపబోతున్న ఆయన ఒక్క క్షణం విభ్రాంతుడై ఆగాడట.

నాయుడు గారన్నారట:

మనవాడికి కావలసిందేదో మనము ముందే ఇచ్చేశాంగా.

ఇంకేమీ, బైటికి వెళ్ళిపోతాడు.

మనము హాయిగా సంగీతసరస్వతిని సేవించుకొందాము –

అని.

మన విమర్శకునికేమీ తోచలేదు.

సవినయంగా చేతులు జోడించాడు.

గురువు గారూ! క్షమించండి.

బుద్ధివచ్చింది.

లెంపలేసుకున్నాను –

అన్నాడట.

నాయుడు గారన్నారు:

నాయనా! లోకంలో భగవంతుడు తప్ప సర్వజ్ఞుడంటూ ఎవరుంటారు?

గుణగ్రామాన్ని ఆస్వాదించేవారికి దోషజాతంతో పనేముంటుంది?

మనోమాలిన్యాలను తొలగించుకొని రసాస్వాదన ప్రధానం అనుకొన్నవారికి రసదృష్టి ఉండాలి కానీ, తప్పులకేమి?

అందరికీ ఉంటాయి.

తండోపతండాలుంటాయి.

హాయిగా కూర్చో.

నీ వంటివాడు శ్రద్ధగా విని బాగుందంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుందో –

అని!

Posted in August 2019, వ్యాసాలు

4 Comments

  1. Kandukuri Suryanarayana.

    Very interesting. Beautifully naratted. Elchurivari sali vispashtam, aahlaadakam. Abhinandana namassulu 👌🙏

  2. మల్లాది సూరిబాబు

    అవును.ఆయనొ వైణికుడు.రాజావారి ఆస్థాన పండితుడు.
    ఆ తరువాత తగ్గిపోయి దాసు గారికి లొంగిపోయాడు.

    • ఏల్చూరి మురళీధరరావు

      మీ సహృదయ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు, శ్రీ సూర్యనారాయణ గారు! ఆకాశవాణి ప్రముఖులైన మీ వంటి పెద్దల ఈ ఆశీర్వాక్యం నాకు, ‘సిరిమల్లె’ పత్రికకు శ్రీరామరక్ష!

    • ఏల్చూరి మురళీధరరావు

      శ్రీమాన్ మల్లాది సూరిబాబు గారికి
      నమస్కారములతో,

      ఆకాశవాణి ప్రముఖులలో ఒకరైన మీరు కేంద్ర సంగీత నాటక అకాడమీ వారి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వార్షిక పురస్కారాన్ని అందుకొంటున్న శుభతరుణాన మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు! మీ యీ వాక్యం వల్ల ఒక క్రొత్త విశేషం తెలిసి ఎంతో సంతోషమైంది. మీ స్పందనకు ధన్యవాదాలు!

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!