తెలుగు యాసల జిలుగు
- కొడుపుగంటి సుజాత
మన భాష తేట తెలుగు, మన యాస రుధిర ఘోష జిలుగుల వెలుగు
మాట తీరులెన్నున్న, కట్టు బొట్టు వేరైనా,
తెలుగు భాష చెణుకుల యాసతో అల్లుకున్న మల్లెల పందిళ్ల కులుకుల సొగసు.
తిక్కన నెల్లూరు యాసలకే నెరజాణ,
తెలుగు భాష యాసకు ఆభరణం రాజమహేంద్రవరం,
విశాఖ యాస వెన్నెల చల్లదనం, కోనసీమ యాస కోవెలలో దివ్వె
శ్రీకాకుళం యాస సిరులకే సీమంతం.
త్యాగయ్య కలం లో కలుపుకొని కదిలింది తెలుగు,
ఒదిగొదిగి పోతన ఒరవళ్లలో ఉరిమింది తెలుగు,
వేమన గా తరతరాలుగా సాగింది తెలుగు,
మన ఆడపడుచు మొల్ల తనవంతు అల్లింది తెలుగు రమ్య రామాయాణ గాథ,
కాళిదాసు నాలికపై జాలువారింది తెలుగు ఊట.
రాయలంటి కవి భాషల్లో తెలుగు భాష లెస్స అని పలికిన హైలెస్స మన తెలుగు యాస,
ఆత్రేయ మనసులో వికశించే మల్లెల తెలుగు, దాశరధి రచనలు కరుణాపయోనిధీ కావ్యాలు, గద్దరు గళంలో గాన తెలంగానం, సి నా రే కలం చిత్ర సీమలో హలం.
కడలిని మీటుతూ తరలింది తెలుగు, దేశదేశాలలో తేజమై మెరిసింది తెలుగు,
సాంప్రదాయ సంస్కృతికి పెట్టింది పేరు తెలుగు, ఆచారాల హరివిల్లు లోని వర్ణాలు తెలుగు,
యాసలలో తుమ్మెదల ఝంకారాల సందళ్ళు తెలుగు,
వేదాల కొసలందు వెలుగొందే తెలుగు,
యాసలు వేరైనా భాష భావం ఒక్కటే, అక్షరాలు కొన్నైనా అవి చేసే యజ్ఞాలు ఎన్నెన్నో!!!