Menu Close
SahitiSirikona_Title

సాహితీ సిరికోన లో ప్రచురించిన కొన్ని కవితలు, పద్యాలు గంగిసెట్టి గారి అనుమతితో సిరిమల్లె పాఠకుల కొరకు ఇక్కడ అందిస్తున్నాము.

త్రోవ తెలియని బాటసారులు… - వేణు ఆసూరి

బస్సులలో, రైళ్లలో
కార్లలో, కాలి నడకలో
కొందరు విమానాలలో, విలాసంగా
కదలి వచ్చారీ చోటికి

“ఏముందీ చోట?
ఎందుకు చూపారీ త్రోవ?”
అలసిన ఒక బాటసారి
అయోమయపు ప్రశ్న

“వద్దంటున్నా వినకుండా
తరిమి తరిమి త్రోశారు
ముందు త్రోవ కనపడదే?”
అసహనంగా ఒక ప్రక్క
అనుకోని విరామం
మార్గ మధ్యంలో ఈ మజిలి
తెలిసిన త్రోవ, ఆగని నడక
తెలియక, ఆగిన సంధ్యా సమయం

దారీ, తెన్ను, చిన్నెలు తెలిసి
వడిగా సాగిన తిన్నని నడక
దారి తప్పకుంటే
అన్ని త్రోవలు కలిసే దిక్కడ!

---

అగిదో ఆ మలుపు తిరుగు
‘బాల్యం బాట’ను దాటి,
‘చదువు, సంధ్యల’ త్రోవల
కదలి సాగు కొన్ని మైళ్లు

‘ఉద్యోగాల వీధి’ దొరికిందా
కొద్ది దూరమే ‘కళ్యాణ కూడలి’,
మరో బాటసారితో, కలసి కదులు
‘వైవాహిక వీధులలో’

సరదాలు, సరసాలు
విచిత్రాల వీధి అది
సరుకుల అంగళ్లెన్నో
తీరని కోరికలెన్నో

ఒకరైనా, ఇద్దరైన,
మూడైనా ముద్దేగా!
భారం అనుకోకుండా
భరించాలి బాధ్యతగా!

రెక్కలు విప్పిన కూనలు
రివ్వున ఎగిరిన వేళ
భారం దింపిన వేళ
కాలం ఆగిన వేళ

“ఏముందీ చోట?
ఎందుకు చూపారీ త్రోవ?”
ఇది అనుసరణకు అంతిమ యాత్ర
స్వాతంత్ర్యపు తొలి అడుగు!

కల్పవృక్ష ప్రసూనాలు - బులుసు వెంకటేశ్వర్లు

ఇది నారాయణమూలమౌతరువునా
యీ రాముడన్ బోదె యొ
ప్పిదమై లక్ష్మణుడన్న పంగయు మహా 
భీష్మంబులౌ శాఖలై
ముదివగ్గై చను జాంబవంతుడు మరుత్
పుత్రుండు సుగ్రీవుడం
గద మైందద్వివిదుల్ గవాక్ష గవయుల్
గా వందలౌ వానరుల్ (యుద్ధకాండము)
(రావణుని స్వగతం)
ఎవరీ రామ లక్ష్మణులు? ఏమైనా వెయ్యేళ్లు తపస్సు
చేసి బ్రహ్మను మెప్పించిన మొనగాళ్లా??
నిన్నమొన్న నాకళ్లముందు పుట్టి, గుడ్డువచ్చి పిల్లను
వెక్కిరించినట్లు వచ్చినారే!!
పట్టుమని వందేళ్లు కూడా బ్రతుకలేని ఈ మానవులు
ఒక మహా వృక్షము వలే వూగిపోవుచుందు రేల??
సందేహములేదు
"ఇది నారాయణ మూలమైన వృక్షము , రాముడను
వాడు దాని కాండము.  లక్ష్మణుడు పంగ. మహా భయంకరమైవిస్తరించిన దీని కొమ్మలే ఈ  ముస్సలి జాంబవంతుడు! హనుమంతుడు,సుగ్రీవుడు, అంగద మైంద ద్వివిదులు, గవాక్ష గవయులు--ఇంకా వందలు
వేలైన ఈ  వానరులూ శాఖలే!!
ఇది "నారాయణమూల"మైన తరువే
సందేహం లేదు ..
(చెట్టు మూలం 'నారాయణమ్'(నీటి తో తడిస్తే)అయితే
దాని విస్తరణ  ఇంత గొప్పగా వుంటుందన్నమాట !)
జానకీ హరణ మనే మందుపెట్టి  ఈచెట్టును చంపుదామని అనుకున్నాను.  కానీ ఇంకా పంతగించి
పూలతో రెమ్మలతో దిక్కులను ఆక్రమించి వచ్చుచున్నది -ఈ వృక్షము.
ఇది నారాయణమూలమైన తరువే!!

ఒక్క క్షణం - డా.శనగవరపు కృష్ణమూర్తి శాస్త్రి

ఒక్క క్షణం ఆగవే ఓ ! మనసా
జీవితం విలువ తెలిసి
మసలుకోవే ఓ ! మనసా !!

ఆత్మహత్యల పాలు పడకే
బ్రతుకు చీకటి చేసుకోకే
కష్ట నష్టాలేవి కలకాల ముండవే
చీకు చింతలేవి చిరకాలముండవే

చిరు ఆశ దివ్వొకటి
వెలిగించి చూడవే
జీవితాన ముసిరియున్న
చీకటన్నది మాయమగునే

చేదు గతమును నెమరు వేయక
రాని భవితకు రంగు పూయక
జరుగు నిజమును  తెలుసుకుంటూ
బుద్ధి నడవవే ఓయి ! మనసా !
బ్రతుకు బాటిక పూల బాటవునే 💐
ఓ ! మనసా!
బ్రతుకు బాటిక పూల బాటవునే 💐

ధైర్యమనే సుదర్శనముతో
స్థైర్య మనే పాంచజన్యముతో
బ్రతుకు సమరము చేయవే
విజయ బావుటా ఎగురునే
ఓ మనసా
విజయ బావుటా ఎగురునే

ఆత్మ కథ (తుది భాగం) - విశ్వర్షి వాసిలి

నేను

వంశాంకుర మయ్యాను
వంశప్రతిష్ట నయ్యాను
తర మయ్యాను
తరతరా లయ్యాను.

వేటగాడి నయ్యాను
వలస నయ్యాను
కలహ మయ్యాను
శత్రువు నయ్యాను.

పోరాట పటిమ నయ్యాను
విజయ కేతన మయ్యాను
సామ్రాజ్య హేతువు నయ్యాను
అంతర్యుద్ధ మయ్యాను
ప్రపంచ సంగ్రామ మయ్యాను.

***

నేను

ఆత్మకథగా కలవరపాటవుతున్నాను
ఆత్మకథతో కలత చెందుతున్నాను.

***

నేను

మట్టిమనిషిగా రారాజుని
రాజరికంలో మట్టిమనిషిని
ప్రజా రాజ్యంలో ప్రధానిని
పదవీ పోరులో ఓటరుని.

లెఖ్ఖల ఖాతాలో అక్షరాస్యుడిని
వోటరు వేలిగ నిరక్షరకుక్షిని
స్వదేశాన అప్రయోజకుడిని
విదేశాన మేధాసంపన్నుడిని.

అరువు పొలాల ఎరువు బ్రతుకును
పసిమి క్షేత్రాల
పలచబడిన వ్యవస్థను
అభ్యుదయ భావాల
అడుగంటిన అవస్థను
విప్లవగళాల
అరణ్య వేదనా సాంద్రతను.

***

నేను

అణుయుగ కర్తను
అణ్వాయుధ నేతను
అరచేతి అణురేఖను
అణుక్షణ అవతరణను.

అణువుల భూవలయానికి
అణుబాంబు నయ్యాను
అణువు అణువున
విస్ఫోటన నవుతున్నాను.

అణుదిన మవుతున్నాను
అణుదేహ మవుతున్నాను
అణుదేశ మవుతున్నాను
అణుప్రాయ మవుతున్నాను.

అవును, నేను

అణువాద అక్షరాన్ని
అణ్వీక్షణా కలాన్ని
అణ్వేషణా పత్రాన్ని
మట్టిపొరల అణురాగాన్ని
అణురంగ అంటురోగాన్ని
అణుబంధ అంతస్తత్వాన్ని
అణుమాన అస్తిత్వాన్ని
అణుయుగ మనిషిని
అణుమాత్ర ఆత్మని.

హృదయ గీతం - అత్తలూరి విజయలక్ష్మి
పాడాలనే అనుకున్నాను

ఒక  పాట గొంతెత్తి పాడాలనే అనుకున్నాను

నరాలన్నీ దారాలై కంఠనాళాలను  బిగదీస్తుంటే

పైకి రాని రాగాన్ని  గొంతు పెగుల్చుకుని

ఓ కమ్మటి పాట పాడాలనుకున్నాను

నీ మస్తకంలో భావాలన్నీ అక్షరాలలో గుచ్చి

నీవు రాసిన నీ  పాటకోసం వెతుక్కుంటూ

పల్లవి “అను” పల్లవి కోసం పల్లవించాను

రాగం , తానంల చిరునామా వెతుకుతూ

గొంతులో గమకాలు పలుకుతుంటే

గతి తప్పిన అక్షరాలను శృతి చేస్తూ

నీ కోసం  పాట పాడాలనే అనుకున్నాను

చరణాలలో నీ చరణాలు కనిపిస్తే కన్నీటితో అభిషేకించి

చేసిన తప్పులకు క్షమార్పణల సంగతులు పలికిస్తూ

హృదయం విప్పి పాడాలనుకున్నాను

ఒలికిపోయిన అక్షరాలలో నీవు రాసిన విషాద

గీతాలను వెతికి  వెతికి

ఆర్తిగా , ఆర్ద్రంగా  పాడాలనే అనుకున్నాను

కన్నీటి పొరలమధ్య అలుక్కుపోతున్న

అక్షరాలలో  కనిపించని గీతాలను

నీవు రాయని స్వ “గతాలను”

ఎలా పాడను! ఏ రాగంలో పాడను!

Posted in August 2019, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!