Menu Close
Galpika_title

సాహితీ సిరికోన లో ప్రచురించిన కొన్ని గల్పికలు గంగిసెట్టి గారి అనుమతితో సిరిమల్లె పాఠకుల కొరకు ఇక్కడ అందిస్తున్నాము.

తెరిచిన తలపులు - అత్తలూరి విజయలక్ష్మి
“ఈ కిటికీ ఎవరు తెరిచారు?” లోపల ఉన్న వాళ్ళందరికీ వినిపించేలా గట్టిగా అరిచింది సౌజన్య.  అరవడమే కాదు కిటికీ రెక్క ఊడి వచ్చేంత బలంగా కిటికీ తలుపులు మూసేసింది.

“ఏంటా విసురు? తలుపు ఊడి వస్తుంది” అని సౌజన్య తల్లి తిట్టినా,  కసిగా మూసిన కిటికీ తలుపుల వైపు చూస్తూ “ఈ కిటికీ తెరవడానికి వీల్లేదు” అంది.

సౌజన్య అలా అనడానికి ఒక కారణం ఉంది. దాదాపు నెల అవుతోందేమో ఎదురింట్లో మేడమీద గదిలోకి ఓ యువకుడు అద్దెకి వచ్చాడు.  అతను ఎప్పుడు గదిలో దిగాడో కానీ, ఓ రోజు యధాలాపంగా కిటికీ దగ్గర కుర్చీ వేసుకుని కూర్చుని చడువుకోబోతూ బయటకి చూసిన సౌజన్య ఉలిక్కిపడింది. ఆ యువకుడి రెండు కళ్ళు తన వైపే చూస్తున్నాయి.. ఎదురింటికీ, సౌజన్య ఇంటికి పెద్ద దూరం లేదు.. వాళ్ళింట్లో పోపు వేస్తే ఆ వాసన వీళ్ళింటికి వచ్చేస్తుంది.

ఒక్కసారిగా భయం, దడ , ఒక రకమైన జలదరింపు మూకుమ్మడిగా డాడి చేసాయి సౌజన్య మీద. అక్కడ నుంచి అప్రయత్నంగానే జరిగి కిటికీకి దూరంగా కూర్చుంది.

నిజానికి సౌజన్యకి ఆ కిటికీ దగ్గర కూర్చోడం అంటే చాలా ఇష్టం ... కిటికీ బయట గాలికి ఊగే పచ్చని చెట్ల కొమ్మలతో, ఆ కొమ్మల మీద వాలి, కుహూ నాదాలతో చెలిమి చేసిన కోయిలమ్మలతో  బోలెడు ఊసులు చెప్పుకుంటూ ఆమె బాల్యం మొత్తం గడిచిపోయింది.

వర్షం పడుతుంటే మెరిసే మేఘాలను చూస్తూ, విరిసే ఇంద్రధనుస్సులను చూస్తూ కౌమారం గడిచింది. ఇప్పుడిప్పుడే యవ్వనం లోకి అడుగుపెడుతోందేమో.. వసంతంలో చిగిర్చే చెట్లను , పూచే పూలను, అప్పుడప్పుడూ చల్లగా వీస్తూ పలకరించి పోయే పిల్లగాలులను అనుభూతిస్తూ , ఆ అనుభూతులతో తెలియని మరెన్నో అనుభూతులను మేళవించు కుంటూ  కొత్త అనుభవాల మెత్తటి తెరలను తొలగించుకుంటూ ఆమె మనోచక్షువులు సంచలనంగా అటూ,ఇటూ కదులుతున్న సమయంలోనే కిటికీలోంచి దూసుకు వచ్చాయి మన్మధ బాణాలు.

అలా దూసుకువచ్చిన బాణాలు కిటికీ దగ్గర ఆగిపోతే బాగుండేది. కానీ ఆగిపోలేదు.. సౌజన్య కాలేజీకి వెళ్తుంటే ఆమె వెనకే అచ్చు మాయాబజార్ సినిమాలో ఆకాశంలో అలా సాగిపోతున్నట్టు సాగిపోతూ,  ఇంటికి వచ్చేటప్పుడు కరెంట్ స్థంభం వెనకాల నుంచి పొంచి, పొంచి చూస్తూ, డాబామీదకి దూకుతూ, అలా ఆమెని వదలకుండా గుండెల్లో బలంగా గుచ్చడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి.

ప్రశాంతంగా ఉన్న నదిలో గులకరాళ్ళు వేసి కల్లోలపరిచినట్టు అతని ప్రయత్నాలు సౌజన్య మనసులో కల్లోలం సృష్టిస్తూ ఆమెకి అసహనం, చికాకు కలిగించసాగాయి.

ఒకరోజు కోపం పట్టలేక ఎదురింటి ఆంటీ దగ్గరకు వెళ్లి గట్టిగా అడిగేసింది..” మీ ఇంట్లో అద్దెకున్న కుర్రాడు ఎప్పుడు ఖాళీ చేస్తాడాంటీ...”

“ఎందుకమ్మా” అడిగింది ఆవిడ అయోమయంగా.

“ఏం లేదు.. అతను బొత్తిగా మానర్స్ లేకుండా చూస్తున్నాడు నన్ను. వేరే పనీ, పాటా లేనట్టుంది. అసలేం చేస్తాడు అతను..”

“చదువు అయిపోయిందిట.. ఉద్యోగం కోసం చూస్తున్నాడు..”

“ఆ, ఆ దొరికినట్టే .... పొద్దస్తమానం ఆడపిల్లల వెంట పడుతుంటే ఉద్యోగం కాదు దొరికేది కాళ్ళు, చేతులు విరుగుతాయి అని చెప్పండి... బొత్తిగా పోకిరీలా ఉన్నాడు.. వెంటనే ఖాళీ చేయించండి"  విసురుగా వెనక్కి వచ్చేసింది.

మరునాడు తనకి తెలియకుండానే మరింత  శ్రద్ధగా అలంకరించుకుని కాలేజ్ కి బయలుదేరి మెట్లు దిగుతూ ఓరగా ఎదురింటి కిటికీ వైపు చూసింది. ఆశ్చర్యం కిటికీ మూసి ఉంది.. కిందకి దిగి మళ్ళి చూసింది తల ఎత్తి... కిటికీ మూసేఉంది.  ఇన్ని రోజులుగా తనని నిలువెల్లా తాకుతూ ఉన్న ఆ చూపుల స్పర్శ లేదు... ఏదో వెలితిగా... దిగులుగా.. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు కరెంట్ స్థంభం వెనక నుంచి పొంచి చూసే .... ఊహు ... అసహనంగా... కాళ్ళు నేరుగా ఎదురింటి వైపు వెళ్ళాయి.

“ఆంటీ పోకిరీ ఖాళీ చేశాడా...”

“అవునమ్మా... నువ్వైనా, నా కూతురైనా నాకు ఒకటే .. నీ గౌరవం నిలబెట్టాల్సిన బాధ్యత నాకూ ఉంది కదా... అందుకే ఉన్నపళంగా ఖాళీ చేయమన్నాను... చేశాడు..”

“ఓ...” నీరసంగా, దిగులుగా, బరువెక్కిన మనసుతో ఇంటికి వెళ్లి కుర్చీ కిటికీ దగ్గరకు జరుపుకుని కళ్ళు ఎదురింటి కిటికీకి అతికించింది ఆ రెండు కళ్ళ కోసం ఎదురు చూస్తూ.

గల్పికావని - శుక్రవారధుని 14 - వాడు - జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి

వాడిని చూస్తే చాలు నాకు మండుతుంది. ఎందుకంటే వాడు వాడు కాదు. వాడిని వాడనడానిక్కూడా నాకు నోర్రాదు. కానీ వాడు వాడే. వాడిని ఏమైనా అంటే చాలు మా రమణమూర్తికి కోపం వచ్చేస్తుంది. ఒక్కోసారి వాడిగురించి వీడిని కూడా తెగ తిట్టుకోవలసి వస్తూంటుంది.

ఈ రమణ మూర్తిగాడింట్లో అందరికీ నేనంటే ఇష్టం. వాడితో సహా. కానీ నాకు వాడు తప్ప అందరూ ఇష్టమే.

ఈ మాయదారి ఇష్ఠం అనేది ఎందుకు పుడుతుందో ఎలా పుడుతుందో ఎవరికీ తెలియనట్లే ఈ మహమ్మారి అయిష్టం కూడా ఎప్పుడు పుండుతుందో ఎవర్ని చూస్తే పుడుతుందో ఎవరికీ తెలీదు. అలాగే నాకు వాడిని చూస్తే మంట. అలాగని వాడు విశ్వాస హీనుడుగానీ కృతజ్ఞత లేనివాడుగానీ ప్రేమాభిమానాలు లేనివాడుగానీ కాడు.

నిజం చెప్పాలంటే మన రమణమూర్తిగాడింట్లో అందరికంటే వాడికి నేనంటేనే ఎక్కువ ఇష్టం. నన్నెంత ప్రేమగా చూస్తాడో. నన్ను చూసి ఎన్నెన్ని పిల్లమొగ్గలు వేస్తాడో. ఎన్నెన్ని నాటకాలాడతాడో. వాడి చూపుల భాష చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఒక్కోసారి ప్రేమగా చూస్తాడు. ఒక్కోసారి గోముగా చూస్తాడు. ఒక్కోసారి చిత్రంగా చూస్తాడు. కానీ ఎప్పుడూ కూడా నన్ను తన దగ్గరకి రమ్మంటున్నట్టుగానే చూస్తాడు. తన పక్కన కూర్చోమన్నట్టు చూస్తాడు ఏదో రమ్మన్నాడు కదా అని దగ్గరకి వెళ్తే చాలు ఒక్కసారిగా మీదకి దూకుతాడు. చేతుల్ని గోకుతాడు. బుగ్గల్ని నాకుతాడు. ఇదేంట్రాబాబూ కుక్కలాగా అని కోప్పడ్డామనుకోండి రమణ మూర్తికి కోపం వచ్చేస్తుంది. బండబూతులు తిడతాడు. ఇంకా కోపం వస్తే కొడతాడు. మొడతాడు. వీడి దెబ్బల కంటే వాడి గోకుడూ నాకుడే నయం. అందుకే రమణమూర్తిగాడింటికి వెళ్ళడమే తగ్గించేశాను.

వారం లోపే రమణమూర్తిగాడికి విషయం అర్థమైపోయింది. అందుకే కాబోలు, తిన్నగా ఇంటికొచ్చేశాడు. నాతో బాటు మా ఆవిణ్ణీ పిల్లల్నీ కూడా లాక్కుపోయాడు. విషయం ఏమిట్రా అంటే చెప్పడు. వీడు మమ్మల్నందర్నీ కలిపి నట్టేట్లో ముంచే ప్లాన్లో ఉన్నట్టున్నాడని మొదట్లో కంగారు కలిగింది. తరవాత అనుమానం కలిగింది. ఇప్పుడు కలగడానికేమీ మిగల్లేదు. దాంతో వాడేం చేసినా మా ప్రాణాలు మాత్రం తియ్యడనే నమ్మకం అయితే ఉంది కాబట్టీ అంతా వాడిమీదే భారం వేసి కార్లో కిక్కురుమనకుండా కుక్కిన పేనుల్లా పడున్నాం. వాళ్ళింటికెళ్ళాక చూద్దును కదా వాడి పుట్టినరోజు వేడుకల ఏర్పాట్లు బ్రహ్మాండగా చేస్తున్నారు. ఎంట్రెన్సులో హేపీ బర్త్ డే బోర్డుంది. కాస్త ముందుకెళ్ళి చూస్తే లెక్కలేనన్ని కొత్త ముఖాలు. వాడితోబాటు వాళ్ళన్నయ్య, అక్కయ్య, బామ్మర్దీ మాంగారు అమ్మా నాన్నా తాతయ్యా బామ్మా ఇలా ఎక్కడ చూసినా వాడి బంధుగణమే. వాడంటే రమణమూర్తిగాడి చుట్టాలూ పక్కాలూ అనుకునేరు. కాదు కాదు, వాళ్ళందరూ వాడి చుట్టాలు. వాడొక్కణ్ణి చూస్తేనే నాకు అరికాలిమంట నెత్తికెక్కుతుంది. అలాంటిది వాడి ఫామిలీ మొత్తం ఒక్కసారిగా చూస్తూంటే నాకు కడుపులో దేవినంత ఆనందం కలుగుతోంది.

అంతలోనే మా చిన్నాడికో డౌటొచ్చింది. వాడికి సుస్సొచ్చినా డౌటొచ్చినా ఆపుకోలేడు. వీడనేది మా రమణమూర్తిగాడి చెవిలో పడిందంటే వాడు మా చిన్నాడి టెంకి పగలగొడతాడనే భయంతో వాడి నోరు మూసే లోపే కక్కేశాడా డౌటు,"నాన్నా కుక్కలక్కూడా పుట్టిన్రోజులు చేస్తారా?"

వాడికి డౌటొచ్చాక్కూడా ఆన్సర్ సెప్పకపోతే వాళ్ళమ్మ మా ఆవిడెలా అవుతుంది? వెంటనే వాడిని  ఇంటివెనక్కి తీసికెళ్ళి మా రమణమూర్తిగాడి కుక్కగాడి తల్లిదండ్రుల సమాధులు చూపించింది. "మరి రమణమూర్తంకుల్ వాళ్ళ అమ్మా నాన్నల సమాధాలేవీ?" అని అడిగాడు మా చిన్నాడు.

దాని ఆన్సర్ మా ఆవిడకే కాదు, నాక్కూడా తెలియదు. వీలయితే వెళ్లి మా రమణమూర్తిగాడిని అడగచ్చు.

హవ్వ అవ్వ - మోహిత

నెలాఖరు. ఆ రోజు రాత్రి విజయవాడ నుంచి శ్రీకాకుళం వెళ్ళాలి. తర్వాతి రోజు పుస్తక ఆవిష్కరణ సభ ఉంది. నాతోటి వాళ్ళంతా హైదరాబాద్ నుంచే భువనేశ్వర్ ఎక్సప్రెస్ కి వస్తున్నారు. విజయవాడలో పుస్తక ప్రదర్శన జరుగుతోంది. పుస్తక ప్రదర్శనల గురించి వినటమే గాని ఎప్పుడూ చూడని నేను మంచి నవలలు కొనుక్కోవాలని ఒక రోజు ముందుగా విజయవాడ చేరుకొని అటునుంచి శ్రీకాకుళం వెళదామని ప్రణాళిక వేసుకున్నాను. దాంతో నా టికెట్, ట్రయిన్ వేరయిపోయాయి. అనుకున్న సమయానికి విజయవాడ వెళ్లి నాలుగు మంచి పుస్తకాలూ, కాశీమజిలీ కథల మొత్తం కట్టా కొన్నాను. బ్యాగ్ బాగా బరువైపోయింది. తరువాతి రోజు ప్రధాన వక్తగా సభలో కట్టుకోవాలనుకున్న పట్టుచీరా, దానిమీదికి గొలుసు గాజులు వగైరా పైన ఉంచి, పుస్తకాలన్నిటినీ అడుగున సర్దేశాను. విజ్ఞాన భారాన్ని భుజాన మోస్తూ టాగోర్ గ్రంథాలయంలో జరుగుతున్న కవి సమ్మేళనానికి వెళ్లి కూర్చున్నాను. ‘నా కవితా శీర్షిక పేరు’ అని చదువుతున్న కవులని తిట్టుకుంటూ, బాగున్న కవితల్ని మెచ్చుకుంటూ సాయంకాలం గడిపేశాను. ట్రైన్ కి ఇంకో రెండు గంటలుందనగా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న నా టికెట్ సంగతి కనుక్కోవాలని గుర్తొచ్చింది. రైల్వే వెబ్సైటులో చూసుకుంటే చార్ట్ తయారై పోయిందని, వికల్ప్ పెట్టుకోకపోవడంతో టికెట్ రద్దయిపోయిందని వచ్చింది. అసలే వెళ్లాలన్న ఆత్రుత. ఆపై టికెట్ లేకపోవడంతో కంగారు మొదలైంది. ఇది తెలిసిన ఊరు కాదు. శ్రీకాకుళం అంటే దగ్గరా దాపు కూడా కాదే. నా తోటి వక్తలు ఎక్కిన రైలు ఎప్పుడో విజయవాడ దాటేసింది. ఇప్పుడేమి చేయాలిరా భగవంతుడా అని మథనపడుతుండగా బస్సులో వెళ్లచ్చుగా అని అన్నాడు ఒక స్థానిక కవి. బస్సుకి డబ్బులు లేవని ఎలా చెప్పగలను? ఉన్న నగదు మొత్తం పుస్తకాలకే ఇచ్చేశాను మరి! సరే, ఒక అరగంట ఎలానో తిప్పలు పడి అటు చేసి ఇటు చేసి పేటీఎంలో ఏవో కొన్ని రూకలున్నాయని కనుగొని సంతోషించాను. వాటితో వెతికితే దొరక్క దొరక్క చివరాఖరికి ఒక బస్సులో చివరి బెర్తు దొరికింది. నడుము నొప్పి వల్ల ఎక్కువ సేపు కూర్చుని ప్రయాణం చేయలేకపోతున్నాను. పదకొండు గంటల ప్రయాణం అంటే నా వల్ల కాని పని. మంచినీళ్ళతో కడుపు నింపుకుని ఆటోకి డబ్బులు మిగిల్చి తొమ్మిదయ్యేసరికి బస్సు ఎక్కాను. డబల్ బెర్త్ కావటంతో బ్యాగుని ఇటుపక్క పెట్టుకుని పడుకున్నాను. ఆకలిబాధ, చివరి సీట్ కుదుపుల వల్ల నిద్ర పట్టలేదు. కాసేపయ్యాక మిగిలిన ప్రయాణీకులని ఎక్కించుకోవటానికి బస్సు ఒక చోట ఆగింది. అక్కడ ఒక అవ్వా మనుమడు ఎక్కారు. అవ్వని చూస్తే గిరిజన తెగలకు చెందినామె అని తెలిసిపోతుంది. రవికె లేదు, పైట వెనక నుంచి కుడివైపు ముందుకి వేసుకుని, చెవులకి బరువైన ఇత్తడి కమ్మలు తగిలించుకుని ఉంది. మనిషి వగ్గు. పాదాలకి చెప్పులు లేవు. ఒక కాలికి బరువైన వెండి కడియం ఉంది. నాది అప్పర్ బెర్త్ కిటికీ వైపు. నా పక్కన ఈ అవ్వ. రెండు మెట్లని చాలా కష్టపడి ఎక్కింది. చలిగా ఉంది, తళతళలాడే ఉక్కు మెట్లు చల్లగా తగులుతూ పట్టు జారుతున్నాయి. నేను చెయ్యందిస్తే కింద నుంచి మనవడు తోస్తే మొత్తానికి ఒక పావుగంట తర్వాత బెర్త్ మీదకి చేరుకోగలిగింది. మనవడు దర్జాగా కింద బెర్త్ లో ఉండి అవ్వని ఇలా పైకి ఎక్కించటం చిరాగ్గా అనిపించింది. మళ్ళీ వెంటనే ఆడవారి పక్కన ఆడవారే ఉండాలన్న నియమం గుర్తొచ్చి నాలుక్కరుచుకున్నాను. ఒక రకంగా అవ్వ ఇలా కష్టపడటానికి నేనుకూడా కారణమయ్యాను కదా. అవ్వ పైకి ఎక్కిందన్న మాటే గాని అటు ఇటు మసలుతూనే ఉంది. ఒక పట్టాన పడుకోదే. ఏదో నసుగుతూనే ఉంది. ఆమె భాష నాకర్థం కాలేదు. తల కిందకి దిండు, కప్పుకోవడానికి రగ్గు ఇచ్చాను. ఏసీ చలికి నా దిండు, దుప్పటి కూడా లాగేసుకుంది. చేసేదేమీ లేక బ్యాగ్ లోంచి గాలి ఊదే దిండు తీసి నేను పెట్టుకున్నాను. లైట్లు తీసేశారు. బస్సు రివ్వున వెళుతోంది. ఒక పరాయి మనిషికి అంత దగ్గరగా పడుకోవటం అసౌకర్యంగా అనిపించింది. కాని అవ్వ గొణుగుడులో ఏదో ఆప్యాయత. అమ్మమ్మ గుర్తొచ్చింది. పన్నెండవుతోంది. ఈవిడ భాష నాకు అర్థమైతే బాగుండు. వయసు మీదపడ్డాక నిద్ర తగ్గుతుంది అని ఎక్కడో చదివిన సంగతి గుర్తొచ్చింది. నాకు పొద్దున్నే సభ ఉంది, జాగారం నావల్ల కాదు. బస్సు మలుపు తీసుకున్నప్పుడల్లా ఈవిడ సణుగుడు పెరుగుతోంది. లాభం లేదని, “అవ్వా అవ్వా” అని భుజం తట్టాను. ఎముకల గూటితో నిలబడ్డ ముడతలు పడిపోయిన చర్మం చేతికి ఎలానో తగిలింది. నా వైపు తిరిగి చూసింది. పొగాకు వాసన గుప్పున కొట్టింది. నా జాలి అంతా ఒక్కసారిగా ఎగిరిపోయింది. పొగ తాగేవాళ్ళంటే నాకు ఎలర్జి. “ఏంటి, నిద్రపోవటంలేదు? ఏమైంది?” అని అడిగాను. నా తెలుగు ఆవిడకి అర్థమవుతుందో లేదో అని నెమ్మదిగా ఒక్కో పదం విరిచి మాట్లాడాను. అంతలో బస్సు మరో మలుపు తిరిగింది. “ఆమ్మో ఆమ్మో పడిపోతున్నా” అని అరిచింది. అవ్వ భయమేమిటో నాకు తెలిసింది. “కిటికీ వైపు పడుకో” అన్నాను. “వద్దు నువ్వు పడుకో బిడ్డే, నేను ఇప్పుడే దిగుతా” అంది. దగ్గర్లోనే దిగుతుందేమో అనుకున్నాను. ఈలోపునైనా కాస్త కునుకు తీస్తే బాగుంటుంది కదా. నా బరువైన సంచీ తీసి పసిపిల్లలు దొర్లకుండా పక్కల దిండ్లు పెట్టినట్టు అవ్వకి పెట్టాను. పొరపాటున బాగ్ కిందపడితే మనవడి గుండు పగులుతుంది, నాదేం పోయింది? సంచి, రగ్గు, దిండ్లు సర్ది “అవ్వా! నీకిప్పుడేమీ భయం లేదు, హాయిగా పడుకో” అని సర్దిచెప్పి నేను నిద్రలోకి జారిపోయాను. కాసేపటికి గరగరమని ఏదో చప్పుడు. పాలిథిన్ కవర్ని కదిలిస్తున్నట్టు. అది నేను పట్టుచీర పెట్టిన కవరులా ఉంది. కళ్లు తెరిస్తే చిమ్మచీకటి. చప్పుడు ఆగదు. నెమ్మదిగా తలెత్తాను. అవ్వ బ్యాగులో చెయ్యి పెట్టినట్టు తెలుస్తోంది. చీరతో బాటుగా మ్యాచింగ్ నగలు ఉన్నాయి. గ్రాము బంగారం నగలే కాబట్టి పెద్ద నష్టం లేదు. అవయినా అసలు ఎందుకు నష్టపడాలి? అసలు నా బ్యాగులో ఏముందో తెలుసుకోవటానికేనా అంతసేపు నిద్ర పోకుండా కాపు కాసింది? ఎంత దొంగ! అమ్మాయి ఒంటరిగా ప్రయాణిస్తోంది అని కనిపెట్టి నిద్రపోనిచ్చి బ్యాగులో వస్తువులు కాజేయాలనా పన్నాగం? అందుకేనా బస్సు ఎక్కినప్పటినుంచి అటూ ఇటూ దొర్లుతూ నటించడం? నేను నిలదీస్తే నిద్ర రావటం లేదని బుకాయించడం? అనుమానంతో బాటే నాక్కోపం వచ్చింది. అవ్వ నావైపుకి వీపు పెట్టి, బ్యాగువైపు తిరిగి పడుకుంది. నేను కళ్ళు తెరిచానని తనకు తెలీదు. ఇక అలానే మెలకువగా ఉండి ఏమి చేస్తుందో చూద్దాం అనుకున్నాను. కాసేపటికి చప్పుడు ఆగలేదు. నా నిద్రా ఆగలేదు. మళ్ళీ ఒకరాత్రప్పుడు ఉలిక్కిపడి కళ్లు తెరిచాను. నా ఎదురుగా రెండు గాజు కళ్లు. అదిరిపడ్డాను. అవ్వ నాముఖంలోకి ముఖం పెట్టి చూస్తోంది. ఎందుకో నాకు సన్నగా వణుకు మొదలైంది. కొంపదీసి నన్ను ఏ కత్తితోనో పొడిచేయదు కదా. అసలే నేనున్నది వెనకాల ఎక్కడో. ఏసీ పోకూడదని తలుపు వేస్తారు కాబట్టి నేను ఎంత పెద్దగా అరిచినా డ్రైవర్కు వినపడదు. “ఏంటి అవ్వా” అన్నాను. నిద్రలేమి వల్ల నా నోటివాసన నాకే చిరాగ్గా అనిపించింది. అవ్వ అదేమీ పట్టించుకోలేదు. “బిడ్డే బిడ్డే” అంది. “ఏంటి అవ్వా” అన్నాను మళ్లీ. బెదురు కూడ మొదలైంది. గువ్వలాంటి మనిషి. గుండె నొప్పి ఏమైనానా? చేత్తో ఏదో సైగ చేసింది. చీకట్లో నాకేమీ అర్థం కాలేదు. కొంచెం లేచి, అద్దాల కిటికీలకున్న తెరలు పక్కకి తీసి వీధి దీపాల వెలుతురులో “మళ్ళీ చెప్పు” అన్నాను. కుడిచేతి వేళ్ళు రెండు చూపించి “దొడ్డికెళ్ళాలి బిడ్డే. గది ఎక్కడుంది?” అని అడిగింది. గతుక్కుమన్నాను. బస్సులో బాత్రూము ఉండదని కూడ తెలియదా. దర్జాగా నిద్రపోతున్న ఆ మనుమణ్ణి తన్నాలనిపించింది. “బిడ్డే, తొరగా చెప్పు. ఆగం అయేట్టుంది” అంది. ఇప్పుడు బస్సునాపాలి. “సరే సరే, ఒక్క రెండు నిముషాలు ఓర్చుకో అవ్వా” అంటూనే బెర్త్ పైనుంచి కిందకి దూకాను. సీట్ల మధ్యన ఇరుకులోంచి చెప్పులు కూడ వేసుకోకుండా డ్రైవర్ దగ్గరికి వడివడిగా నడుస్తుంటే మళ్ళీ అనుమానం. ఒకవేళ అవ్వ నేను నిద్రపోలేదని గ్రహించిందేమో. నన్ను ఇటు పంపించి బ్యాగులోంచి నా వస్తువులు తీసుకుంటుందేమో. తలుపు తీసి బిగ్గరగా చెప్పాను - “ఒక్కసారి బస్సు ఆపండి. కొంచెం అర్జెంటు టాయిలెట్”. ఉలిక్కిపడ్డ డ్రైవరు క్లీనర్ నన్ను తిట్టుకుంటూ బస్సుని రోడ్డు పక్కకి కోశారు. లైట్లు వేశారు. నేను వెనక్కి చూసేలోపు అవ్వ బెర్త్ కమ్మీ పట్టుకొని దిగటానికి ఊగులాడుతోంది. పరుగున వెళ్లి చెయ్యిచ్చి కిందకి దింపాను. బస్సుమెట్లు దిగుతుంటే గమనించాను అవ్వ తిన్నగా నుంచోలేదని. నడుము వంగిపోయింది. తను చుట్టుకున్న కొల్లాయి గుడ్డలోంచి నా వస్తువులు ఏమైనా జారిపడతాయేమోనని నా అనుమానపు చూపులు నేలపైనే ఉన్నాయి. తిరిగి వచ్చాక అవ్వ నాకు పెట్టిన నమస్కారానికి నా సంస్కారం తల వంచుకుంది. అవ్వని వారించి, పైకి ఎక్కించి, నేనూ ఎక్కాను. “ఈ బస్సులవ్వీ ఫస్టుసారి ఎక్కాను బిడ్డే” అంది నేనడగని ప్రశ్నకు బదులుగా. అదా కంగారుకి కారణం. ఫర్వాలేదే, మొదటిసారి అయినా మనుమడు ఏసీ స్లీపర్లో ఎక్కించాడు! బహుశా అవ్వంటే అతనికి చాల ఇష్టమయుండాలి. ఆలోచనల్లోనే నాకు గాఢంగా నిద్ర పట్టేసింది. తెల్లవారి నాకు మెలకువ వచ్చేప్పటికి పక్కన అవ్వ లేదు. నాలో బ్యాగులో వస్తువులు వెతుక్కోవాలనే తపన కూడా.

రంగులు - రాజేశ్వరి దివాకర్ల

అలారం మోగింది. నేత్రిక కళ్ళు నులుపుకుంటూ లేచింది. మొహం మీద నీళ్ళు జల్లుకొని, పుస్తకం తెరవబోతుంటే అమ్మ వచ్చింది. గుడ్. లేచావా! ఓ గంట సేపు చదువుకో, ఆరుగంటలకల్లా కారు డ్రైవింగ్ కోచ్ వస్తానన్నాడు. కిందకెళ్ళు, అటు తరువాత ..అని అమ్మ ఇంకా చెప్పబోతుంటే, నేత్రిక అందుకుంటూ, స్నానం చేసి 402 ఫ్లాట్ లో ఉన్న శారదమ్మగారి దగ్గర సంగీతం క్లాస్ కు వెళ్ళాలి, కాలేజ్ కు వెళ్ళాలి. అంతేగా! అంటూ ఉంటే అమ్మ అందుకుని కాలేజ్ నుంచి డేడీ నిన్ను పిక్ చేసుకుని బేడ్మెంటెన్ గ్రౌండ్స్ దగ్గర దింపుతారు. అక్కడ ప్రాక్టీస్ కాగానే కాల్ చేయి. నేనొచ్చి తీసుకొస్తాను. తరువాత కొద్దిసేపు రెస్ట్ తీసుకుని, చదువుకుందువుగాని అంటూ, అమ్మ ఆ రోజు చేయ వలసిన దాన్నంతా చెప్పింది.

నేత్రిక దుఖం, కోపం రెండూ మిళితమైన స్వరంతో, అమ్మా ఇంకో నెలలో నాకు పరీక్షలు, బాగా చదువుకోవాలి . పరీక్షలయ్యేవరకూ చదువుతప్ప అన్నీ మానేస్తానమ్మా. మా స్నేహితులందరూ సి.ఇ. టి. కోచింగ్ కు వెళ్తున్నారు. నువ్వేమో కోచింగ్ క్లాసులు వద్దంటావు. ముఖ్యమైనది వదిలిపెట్టి తక్కినవన్నీ చేయమంటావు. అని గట్టిగా ఇంకా ఏదో అనబోతుంటే అమ్మ అందుకుని ..నిన్ను మంచి స్కూల్ లో చేర్పించాము. అక్కడ బెస్ట్ టీచర్లు ఉన్నారు కదా! మళ్ళీ ప్రత్యేకంగా పాఠాలు ఎందుకు చెప్పు? తరగతిలో శ్రద్ధగా వింటే చాలు, చదువే జీవితంకాదు, అన్నింటినీ నేర్చుకోవాలి. ఆ కోచింగ్ క్లాసులకు వెళ్ళే టైములో యోగా క్లాస్ కి వెళ్ళావనుకో, ఏకాగ్రత పెరుగుతుంది, ఆరోగ్యంబాగుంటుంది, ..నాతో వాదించకు, చెప్పినట్టు చెయ్యి అంటూ గది లోంచి బయటకు వెళ్ళింది పావని.

చేసేది లేక ఇక పుస్తకం మూసేసి, దుస్తులు మార్చుకుని కిందకు వెళ్ళింది నేత్రిక. లిఫ్ట్ లో తనతో పాటు చదువుకుంటున్న పిల్లలు కోచింగ్ క్లాసులకు వెళ్తూ పలకరించారు. ఓ డ్రైవింగ్ నేర్చుకోడానికి వెళ్తున్నావా? కోచింగ్ క్లాస్ లో రుద్ది రుద్ది పడేస్తున్నారనుకో. నీకేం, తెలివైన దానివి.. .అంతలో లిఫ్ట్ కిందకు దిగింది. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు.

అమ్మ చెప్పినవన్నీ ముగించుకుని ఇంటికి చేరేసరికి తమ ఫ్లాట్లో ఉండే స్త్రీలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు నేత్రికను చూడగానే, అమ్మతో, మీ నేత్రిక చాలా తెలివైంది. చక్కగా మీరు నేర్చుకోమన్నవన్నీ నేర్చుకుంటుంది. చదువులో కూడా ముందుంటుంది. అంటూ ప్రశంసించారు. తరువాత వాళ్ళ సంభాషణ కొనసాగిస్తూ, పావని గారూ, మీరిక్కడకు వచ్చినప్పటినుంచీ మాకందరికీ ఎంతో బాగుందండీ. మీరు మాకు కుట్లూ అల్లికలూ నేర్పుతున్నారు. మీరు నేర్పించిన "అచార్" మా ఇంట్లో వాళ్ళు ఎంతో ఇష్టపడుతున్నారు. అంది నార్త్ నుండి వచ్చిన లీలా బహెన్. అది సరేకాని రేపు హోళీ పండుగ కదా. మీరు చెప్పినట్టే రంగు రంగుల పూలన్నింటినీ ఏరి పూలపొడి తో రంగులను తయారు చేశాం కదా, ఆరోగ్యానికి ఎటువంటి హాని కలగకుండా హాయిగా హోలీ ఆడుకుందాం. సాయంత్రం అందరం కలసి కమ్యూనిటీ హాల్ లో భోంచేద్దాం. ఒక్కొక్కరం ఒక్కో వంటకం చేసి మన వంట రుచులను పంచుకుందాం. మన పిల్లలకు కూడా సరదాగా ఉంటుంది. అంది పరిణీత బెంగాలీ యువతి. పిల్లలకు రేపెలాగూ సెలవేకదా, రోజంతా హాయిగా గడపమందాం. అంది పావని.  నో,నొ, మాఅయన ఒప్పుకోరు, పరీక్షల రోజులు చదువుకోవాలంటారు. అంది కనక మహాలక్ష్మి. ఒక్క రోజు సరదాగా గడిపితే ఏమీ కాదు. పెరుగుతున్న పిల్లలకు, పౌరులుగా అందరితో కలిసిమెలిసి తిరిగే అలవాటు చేయాలి. అందరితో ప్రవర్తించే విధానం నేర్పాలి.రేపు పిల్లలందరినీ అన్నింటిలో పాలుపంచు కొనేటట్లు ప్రోత్సహించాలి అంది పావని.

అందరూ రేపటి సన్నాహాలను గురించి ముచ్చటించుకొని ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళారు. రాత్రి 11 పదకొండు గంటలయింది. నేత్రిక గదిలో లైటు వెలుగుతోంది. నేత్రికా పడుకో. మళ్ళీ రేపు చదువుకోవాలంటూ పొద్దున్నే లేస్తావు . అంటూ గదిలోకొచ్చి నేత్రిక తలను నిమురుతూ ముద్దుపెట్టుకుంది పావని. పడుకో అంటూ మరోసారి హెచ్చరించింది బయటికెళ్తూ.

పావని భర్త ఈశ్వర్ పావని ధోరణి తనకలవాటే కనుక "ఏమిటో అందరూ పిల్లల్ని చదువుకోమని పోరు పెడుతుంటే నువ్వు చదివింది చాలు పడుకో అంటావు," అన్నాడు అర్థం కానట్టు.

అదికాదండీ, నేత్రిక చదువులో వెనుకబడిందేమీ కాదు, అది తెలివైంది. చదువుకోవాలి నిజమే. చదువు జీవితానికి వెలుగు, కాని ఆ వెలుగు చుట్టూ ఉన్న అనేక రంగులను మనం గుర్తించాలి. ఆ రంగులన్నింటినీ అనుభవాలుగా వెదజల్లుకోవాలి. ఒకరు మనపై వేసిన రంగును ఆనందంగా స్వీకరించి, పూలరంగులతో వాళ్ళను మురిపించాలి. అన్ని రంగుల కలయికతో సంతృప్తిగా సాగిపోవాలి. అయినా మీకు తెలియని దేముంది. రేపు హోలీ పండుగ, మీరు కూడా రంగులు చల్లుకోడానికి సిద్ధ పడండి అంది నవ్వుతూ పావని.

Posted in August 2019, కథానికలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *