Menu Close

ఆగష్టు 2019

సిరిమల్లె పాఠకులందరికీ మన సిరిమల్లె నాల్గవ వార్షిక శుభాకాంక్షలు!!

సిరిమల్లె తాజా సంచిక చదువుటకై ఈ క్రింది చిత్రము పై క్లిక్ చేయండి.

భాష సజీవంగా ఉండాలంటే అది జనులనోట పలుకుతుండాలి. అదే భాష పదికాలాలు నిలిచి భావితరాలకు తరగని సంపద కావాలంటే అందుకు వ్యాకరణ నియమాలు, విశ్లేషణతో కూడిన భావయుక్త రచనల గ్రంథాలయం ప్రతి ఇంటిలో ఉండాలి.

అది జూలై నెల 2015. అంతకు మునుపే సంపాదించిన కొద్దిపాటి సాహిత్య సేవానుభవంతో ఇనుమడించిన సేవాసక్తి, ఆలోచనల ప్రవాహం. మెండుగా ఏర్పడిన సాహిత్య పిపాస. అదే మా, మన “సిరిమల్లె” ఆవిర్భావం. స్వచ్ఛమైన, సరైన, సరళమైన తెలుగు భాషా వేదిక. గ్రాంధిక సాహిత్యానికి, వ్యవహారిక తెలుగు పదాలకు మరియు అచ్చ తెనుగు నుడికారానికి మధ్యన పొంతన చేకూరుస్తున్న ఒక చిన్న వారధి.

మహా సముద్రం లాంటి మన తెలుగు సాహిత్య సంద్రాన్ని, ఎందఱో భాషా వేత్తలు సోధించి, తమ భాషా పటిమతో చిలికి ఎన్నో ఆణిముత్యాలను, అధ్బుత సమాచారాన్ని మనకు అందించారు, అందిస్తూనే వున్నారు. ఇటువంటి వారి స్ఫూర్తితో మరియు ప్రోత్సాహంతో,

వేదాలను, ఇతిహాసాలను వివరిస్తున్న సంస్కృతాంధ్ర రచనలు

జన పదాలతో జన్మించిన మాండలీకాలు

శాస్త్ర, సాంకేతిక అంశాలతో కూడిన విజ్ఞానదాయక వితరణలు

తమ జీవన సాఫల్యాలతో జన జీవితాలను ప్రభావితం చేసిన కారణజన్ముల జీవిత విశేషాలు 

భావితరాలకు మనం ఇవ్వగలిగిన ప్రశాంత జీవన సూత్రాలు

ఇలా, వివిధ అంశాలను ఒకే వేదికమీదకు తెచ్చి తెలుగు భాషాభిమానులుగా సాటి తెలుగువారికి గత నాలుగు సంవత్సరాలుగా మేము అందిస్తున్న ఒక అందమైన సాహిత్య పచ్చదనాల పసిడి పూదోట,  గ్రాంధిక సాహిత్యానికి, వ్యావహారిక తెలుగు పదాలకు మధ్యన పొంతన చేకూరుస్తున్న ఒక చిన్న వారధి, మా, మన “సిరిమల్లె” అంతర్జాల మాస పత్రిక (sirimalle.com).

‘సిరిమల్లె’ పత్రికకి నాలుగు సంవత్సరాలు నిండి ఐదో సంవత్సరం అంటే ఆశ్చర్యంగా ఉంది కదూ మనందరికీ!!. ప్రతి నెల మొదటి రోజున పత్రికను అంతర్జాలంలో నిరాఘాటంగా ప్రచురించడం మాకు నిజంగా గర్వంగా ఉంది. కానీ, ఇంకో విషయం కూడా సదా గుర్తుకు వస్తున్నది. ఎక్కడికక్కడ ఏర్పడుతున్న భాషాప్రయుక్త ఆనకట్టల ఒడిదుడుకులు. ఆ ప్రయోగాలను అభినందించే మేధావులు, నిస్సందేహంగా విమర్శించే పండితులు. ఏది ఏమైనా సాహిత్య సాగరంలోకి ఇంకిపోవాలనే బలమైన సంకల్పం.

ఎన్ని అడ్డంకులు ఎదురైననూ వాటిని అధికమించేందుకు,  మన సిరిమల్లె ను ఎత్తుకొని సాహిత్యమనే గోరుముద్దలతో పరిపూర్ణతను సంతరింపజేసి ఎంతో చేయూతనిచ్చిన మహానుభావులు, సాహిత్యసేవా ధురందరులు. ముఖ్యంగా ఎంతో ఆదరాభిమానాలను చూపిస్తూ సిరిమల్లె ను మీ ఇంటి ‘సిరి’ మల్లె గా అన్వయించుకొన్న పాఠకులు. అందరికీ శతకోటి నమస్కారములు.

అన్ని విషయాలను అవలీలగా అందిస్తున్నామంటే అది మీవంటి రచయితల కలం కల్పిస్తున్న సువర్ణవకాశం.

స్వచ్ఛమైన, సరైన, సరళమైన తెలుగును మనందరి నోట సదా పలుకుతూ ఉండాలనేదే మా అభిమతం, ఆరాటం.

సిరిమల్లె పత్రికని ఒకసారి వీక్షించి మీ అమూల్యమైన అభిప్రాయములను మాకు తెలుపమనవి.

భాషాపరంగా వినూత్న ప్రయోగాలు చేయుటకు ఉత్సుకత చూపించే ఔత్సాహికులకు ఇదే మా ఆహ్వానం, ప్రోత్సాహం. మీ సాహిత్య పరిణతి చూపించుటకు మా ‘సిరిమల్లె’ వేదికను వినియోగించుకోండి.

నమస్కారములు.

మధు-ఉమ