భూమి గోళాకారంలో ఉండి ఒక నిర్దిష్టమైన కక్షలో సూర్యుని చుట్టూ తిరుగుతుందని, మిగిలిన గ్రహాలను కలుపుకొని సౌరకుటుంబం ఏర్పడిందని, ఈ విశ్వంలోని కోటానుకోట్ల నక్షత్రాలలో సూర్యుడు కూడా ఒక నక్షత్రమని మనకు తెలుసు. కానీ ఒకప్పుడు, భూమి బల్లపరుపుగా ఉంటుందని, సూర్యుడు, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ పగలు రాత్రి ఏర్పడుతుందని నమ్మేవారు. ఆ అపోహను తొలగించి ఐదవ శతాబ్దంలోనే వాస్తవాలను కనుగొని అంతరిక్ష శాస్త్రంలో భారతదేశానికి ఉన్నత స్థానాన్ని కల్పించిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త మన భారతీయుడు ‘ఆర్యభట్ట’ నేటి మన ఆదర్శమూర్తి.
గణిత శాస్త్రంలో సున్నాకు ఎంత ప్రాముఖ్యత ఉందో మనకు తెలుసు. సంఖ్యలకు ముందు, వెనుక సున్న ఉంటే విలువ వాటి విలువ మారుతుంది. ఈ సృష్టికే మూలబిందువు ‘సున్న’. కొందరి దృష్టిలో సున్న కు విలువలేదు. మరి కొందరికి సున్నాయే సర్వస్వం. నిరాశావాదం లోంచి మనుషులను ఆశావాదులుగా మార్చేది ఈ ‘సున్న’. అటువంటి సంఖ్య ‘సున్న(౦)’ ను వాడి సంఖ్యల యొక్క స్థానవిలువలను సిద్ధాంతపరంగా రూపొందించిన మహనీయుడు మరెంత గొప్పవాడు. అతనే ఐదవ శతాబ్దంలో కారణ జన్ముడై, మన భారతావనిలో పుట్టిన శ్రీ ఆర్యభట్ట. ఆయన వ్రాసిన ‘ఆర్యభట్టీయం’ అనే గ్రంధం ఎన్నో గణిత సిద్ధాంతాలకు, ఖగోళ కాల నిర్మాణాలకు ఒక పెద్ద కొలమానము. మనందరం నేటికీ సంఖ్యలకు మూలం గ్రీకు, రోమ్ అని అనుకొంటాము. కానీ వారందరికంటే ముందుగానే ఆ సంఖ్యలకు ఒక నిర్దిష్టమైన విధానాన్ని రూపొందించిన ఘనత మన భారతీయులది. కాకుంటే ఆ విధానాలకు సరైన ప్రాచుర్యం లభించలేదు.
క్రీ. శ. 476 సంవత్సరంలో జన్మించిన శ్రీ ఆర్యభట్ట గారి గురించిన వ్యక్తిగత వివరాలు అంతగా తెలియవు. కానీ ఆయన వ్రాసి ప్రచురించిన ‘ఆర్యభట్టీయం’ ఒక మహా గొప్ప గణిత ఉద్గ్రంథము. ఆ గ్రంథమే నేడు ఆయన ఉనికికి తార్కాణము.
ఎంతో మంది గణిత మేథావులకు, శాస్త్రవేత్తలకు ప్రామాణికమైన ఆ గ్రంథంలో arithmetic, algebra, plane trigonometry, spherical trigonometry, continued fractions, quadratic equations, sums of power series మరియు a table of sines ఇలా ఎన్నో సిద్ధాంతాలను రూపొందించడం జరిగింది. అంటే నేడు మనం కుస్తీ పడుతూ calculator ను వాడి నేర్చుకుంటున్న గణిత సిద్ధాంతాలన్నీ ఎటువంటి గణిత సాధనాలు లేకుండా ఆయన విరచించాడు. ఆ మహామనిషి మేధస్సు ఎంత గొప్పదో మనకు సులువుగా అర్థమౌతుంది. సున్న ను అతను సరైన రీతిలో వాడి సంఖ్యల యొక్క స్థాన విలువలను పొందుపరిచాడు. కనుక అతనే సున్న సంఖ్యను కనుగొన్నవాడుగా చరిత్ర చెబుతున్నది. అయితే అందుకు తగిన ఆధారాలు మాత్రం లేవు. ఏది ఏమైనా గణిత శాస్త్రంలో ఆయన రూపొందించిన సిద్ధాంతాలన్నీ నేటికీ మనం నేర్చుకొంటూ వాడుకొంటున్నాము. నేడు జామెట్రీ లో అతి ముఖ్యమైన వృత్తపరిధి మరియు వృత్తవ్యాస నిష్పత్తి పరామితి అయిన ‘p’ యొక్క ఖచ్చితమైన విలువను ఆనాడే నిర్వచించాడు. ఇలా తన సిద్ధాంతాల ద్వారా కనుగొన్న ఎన్నో విషయాలకు చెందిన సంఖ్యాపరమైన విలువలు నేటి ఆధునిక పరిజ్ఞానంతో గణించిన లెక్కలతో సరిపోతున్నాయి. మనిషి మేథస్సు యొక్క మహిమాన్వితమైన శక్తి కి ఇటువంటి ఉదాహరణలు నిదర్శనాలు.
ఆర్యభట్ట గారి మేధోసంపత్తి ఒక్క గణితంతోనే ఆగిపోలేదు. గణితశాస్త్రాన్ని ఉపయోగించి ఖగోళ శాస్త్రంలోని ఎన్నో విషయాలను కాలంతో లెక్కలుగట్టి సరైన సంఖ్యలతో కాల ప్రామాణికాలను తయారుచేశారు. సూర్య గ్రహణం, చంద్రగ్రహణం ఎప్పుడు సంభవిస్త్తాయో మన ప్రాచీన కాల సంఖ్యా శాస్త్రాలతో ఏకీభవించే విధంగా సిద్ధాంతాలను ప్రతిపాదించారు. సూర్య కుటుంబంలో ఒక్క సూర్యుడు మాత్రమే స్వయంప్రకాశము. భూమి, ఇతర గ్రహాలూ మరియూ చంద్రుడు కూడా స్వయంప్రకాశకాలు కాదు అన్న వాస్తవాన్ని కూడా ప్రపంచానికి వివరించారు. సూర్యుని గతిని బట్టి గ్రహాల యొక్క కాల నియమ పట్టికను తయారుచేశారు.
ఆర్యభట్ట గారు రచించిన ‘ఆర్యభట్టీయం’ గురించి మరో గణిత శాస్త్రవేత్త భాస్కరుడు వివరిస్తూ ఆర్యభట్ట గారు శాస్త్రవిజ్ఞానాన్ని మొత్తం అవపోసన పట్టి, గణిత శాస్త్రము, గోళగణితశాస్త్రము, శుద్ధగతిశాస్త్రం మూడింటినీ కలిపి ఒక పాత్రలో పోసి రంగరించి తయారుచేసిన ఒక గొప్ప శాస్త్రీయ ఔషధమే ఈ ‘ఆర్యభట్టీయం’ అని సెలవిచ్చారు.
నేడు ఎంతో ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాలతో అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో వెళుతున్న సర్వ ప్రజానీకం, అందుకు బీజాలు నాటి ఎన్నో విలువైన విషయాలను తమ మేథో పటిమతో కనుగొని మనకు అందించిన శ్రీ ఆర్యభట్ట వంటి మహనీయులను సదా స్మరించుకుంటూనే ఉండాలి.