తేటగీతి:
దేశ దేశాల తెలుగిక తేజరిల్ల
కమ్మగ చదువ కన్నులు చెమ్మగిల్ల
కూర్చుచున్నది కవనంబు కులుకులరయ
చిరము సిరిమల్లె పలుకులు సిరుల మూట
మమ్మియని పిలువ మురిసె అమ్మ నేడు
తండ్రినిల దాడి యనగానె దర్పమాయె
అత్త పిన్నియో తెలియక అంటి యాయె
కూడు బువ్వను తెలియదు పాడు మీల్సు
చిరము సిరిమల్లె పలుకులు సిరుల మూట
సంస్కృతంబు దాడివలన చచ్చెసగము
ఆంగ్ల భాషనచ్చి తెలుగు అసలుచచ్చె
అసలు తెలుగు భాషను జూడ కొసరుయయ్యె
చిరము సిరిమల్లె పలుకులు సిరుల మూట
అన్యభాషలు నేర్చిన హాయి రాదు
అమ్మ మాటను మాటాడ అలుసుగాదు
అమ్మ లాలిపాటలవోలె హాయిగొల్పి
మనదు భాషలో భావాలు మధురమగును
చిరము సిరిమల్లె పలుకులు సిరుల మూట
చక్కని నుడికారాలతో శ్రామ్యమగుచు
మధుర మాండలీకములతో మాన్యమగుచు
రకరకముల యాసలతోడ రమ్యమగుచు
కమ్మనైన తెలుగు మన అమ్మ నుడిర
చిరము సిరిమల్లె పలుకులు సిరుల మూట
తేనెకన్న మన తెలుగు తీయనన్న
మల్లెకన్న మన తెలుగు తెల్లనన్న
వెన్నెల చలువకన్నను మిన్నయన్న
పరిమళ పునుగుకన్న సువాసనన్న
దేశ భాషలందు వెలుగు తెలుగులెస్స
చిరము సిరిమల్లె పలుకులు సిరుల మూట