Menu Close
శ్రీ అన్నమయ్య వేదాంత రహస్యం
-- దుర్వాసుల వెంకట సుబ్బా రావు --

శ్రీ తాళ్ళపాక కవిత్రయం శ్రీ అన్నమాచార్య, కుమారుడు పెద్ద తిరుమలాచార్య, మనుమడు చిన్న తిరుమలయ్య. పదకవిత పితామహ, సంకీర్తనాచార్య, హరికీర్తనాచార్య సార్ధక బిరుదాంకితుడు శ్రీ అన్నమయ్య.

“వాక్చ, గేయంచ యస్స కురుతే వాగ్గేయ కారః” అనగా వాక్కును గేయమును సమాన ప్రతిభతో స్వయంగా సృష్టించు వాడే వాగ్గేయకారుడు అని లక్షణకారులు అన్నారు. శ్రీ అన్నమయ్య మన ప్రధమ వాగ్గేయకారుడు. మధుర పద రచనలే గాక, భక్తి, నీతి, వైరాగ్య, ఆధ్యాత్మిక కీర్తనలను “పాడేము నేను పరమాత్మ నిన్నను, వేడుక ముప్పది రెండు వేల రాగాలను” అని కీర్తించిన వాగ్గేయకారుడు. శ్రీ ఆన్నమయ్య ఆద్యుడు, అనవద్యుడు. ముప్పది రెండు వేలకీర్తనల్లో నాలుగు వేలకు పైగా ఆధ్యాత్మ కీర్తనలు. పండితులకు, పామరులకూ సులభంగా అర్ధమయే రీతిలో, కోకొల్లల మాండలీకాల తో శ్రీ అన్నమాచార్య ఈ కీర్తనలను ప్రసాదించేరు. కీర్తనల్లో భావుకత, పదప్రయోగానికి ఆయనకు ఆయనే సాటి. సం+ కీర్తనం అంటే అందరు సమానులు దైవాన్నికీర్తించేది అని అర్ధం చెప్పుకోవచ్చు. తన భావాల్ని సంగీత పరంగా ఈ విధంగా చెప్పేరు:

చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు – జాలెల్ల  నడగించు సంకీర్తనం
సంతోష కరమైన సంకీర్తనం – సంతాప మణగిన్చు సంకీర్తనం
జంతువుల రక్షించు సంకీర్తనం – సంతతము దలంచుడీ సంకీర్తనం” .. ..

శ్రీ అన్నమయ్య సాహితీ పరిశోధన కాకతాళీయం గా 1922 లో ప్రారంభించబడింది. ఈ ప్రస్థానంకి శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు, గౌరిపెద్ది రామసుబ్బ శర్మ గారు, శ్రీ అర్చకమ్ ఉదయగిరి శ్రీనివాస చార్యులు, సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు నాంది పలికేరు. శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు పట్టింది బంగారం. ఏందరో మహానుభావుల, సంగీత విద్వాంసుల సేవలవలన, శ్రీ అన్నమయ్య పాట నేడు ఇంటింటా వినిపిస్తున్నది. శ్రీ అన్నమయ్య సంగీత సాహిత్య సంపద తరగని గని. అది మన అదృష్టం. ముప్పది రెండు వేల రాగాలలో కనీసం రమారమి 18000 లభించాయి.

వేదాంత రహస్యము కర్తృత్వం, అహం వదులుకుని ఫలాపేక్ష లేకుండా నిష్కామ కర్మతో పరిశుద్ధుడై జీవించి పరబ్రహ్మము చేరమని బోధిస్తుంది.

“అని ఆనతి ఇచ్చే కృష్ణుడు ఆర్జనునితో విని ఆతని భజించు వివేకమా .. .....వేదములన్నీటి చేత వేదాంత వేత్తలచే, ఆదినే నెరగ దత గిన ఆ దేవుడను” అని శుద్ధ సావేరి కీర్తన లో విశదీకరించాడు శ్రీ అన్నమయ్య. సాంఖ్య యోగము లో శ్లోకం 20 నించి 25 వరకు వున్న గీతాసారాన్ని యదా తధంగా శ్రీ ఆన్నమయ్య

దేహి నిత్యుడు, దేహముల నిత్యాలు, ఈ హాలనా మనసా మారువకుమీ
గుది బాత చీర మాని కొత్త చీర గట్టినట్టు, ముది మేను మాని దేహమొగి గొత్త మేను మోచు
అదన జంపగ లేవు ఆయుధము లితని గదీసి యగ్నియు నీరు గాలి జంపగ లేవు
యీతడు నరకు పడ డీతదగ్ని గాలడు, యీతడు నీటమునుగ డీ తడు గాలి బోడు
చేతనుడై సర్వ గతున్ డో చెలియించ డేమీటను,యీ తల ననాది యీత యీతడిరవు గదలడు”
అని తోడి రాగంలో పాడుకొన్నాడు ఈ వేదాంతి.

చాలా ప్రాచుర్యం లోనున్న బ్రహ్మమొక్కటే పర బ్రహ్మ మొక్కటే పర బ్రహ్మమొక్కటే, పర బ్రహ్మ మొక్కటే” అన్న కీర్తన ద్వారా సృష్టి లోని  సర్వ సమానత్వాన్ని బోధించాడు శ్రీ అన్నమయ్య. ఆలాగునే ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు” అన్న బృందావని రాగమాలిక లో వైష్ణవులు, వేదాంతులు, శైవులు, అందరినీ  సంభోదించాడు శ్రీ  ఆన్నమయ్య.

వేదాంతం తెలుసుకోడానికి విముఖులైనవారికి, శ్రీ వేంకటేశ్వరుని శారణాగతియే వేదాంత రహస్యమని ముచ్చటగా మూడు మాటల్లో:

మూడే మాటలు మూడు మూళ్లు తొమ్మిది, వేడుకొని చదువరో వేదాంత రహస్యము
జీవ స్వరూపం చింతించి అంతటాను, దేవుని వైభవము తెలిసి యెరిగి
భావించి ప్రకృతి సంపద ఇది యెరుగుటే, వేవేలు విధముల వేదాంత రహస్యము.............
కూడి శ్రీ వేంకటేశ్వరుని గొలిచి దాసు డౌటే, వీడని బ్రహ్మానంద వేదాంత రహస్యము.”

నవద్వారాలున్న మానవ శరీరాన్ని అరిషడ్ వర్గాలు లొంగ దీసుకోడానికి ప్రయత్నిస్తాయి:
“కాయమనే పూరికి గంతలు తొమ్మిది, పాయక తిరిగాడేరు పాపపు తలారులు.”

ఈ జీవి పుట్టటం, చనిపోవటం, ఈ రెండింటికి మధ్య కాలంలో భోగాలకోసం పడే పాట్లు, వాటి ద్వారా వచ్చే తెగని పాప పుణ్యాలు  ఒక నాటకమని:

నానాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము
పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట్ట నడిమీపని నాటకము
యెట్ట నెదుటా గల దీ ప్రపంచము, కట్టకడపటిది కైవల్యము”

అని రేవతి రాగంలో కైవల్య సాధన గురించి పాడుకున్నాడు శ్రీ అన్నమయ్య.

శ్రీ అన్నమయ్య కీర్తనలు ఎన్నో సిరి సంపదలతో నొప్పారెడు తరగని గని. వెదుక్కునే వారికి వేదాంత సారం ఎంతైనా లభిస్తుంది. అందుకే వారి కీర్తనలు శ్రుతులై, శాస్త్రములై, పురాణ కధలై, సుజ్ఞనసారంబులై..”  వున్నాయి; వారి కీర్తనలను పంచమ వేదము గా కీర్తించారు.

కలియుగంబున మనకు గలదిదియే, వెలసిన పంచమవేదమే కలిగే
పరమగు వేదము బహుళము చదివియు, హరి నెరిగిన వారరుదనుచు
తిరువాయి ముడియై దివ్య మంత్రమై, వెలసిన పంచమ వేదమె కలిగే.”

హరి యవ తారమే ఆ తండితడు” కీర్తనలో:

శ్రీ అన్నమయ్య విష్ణు సంకీర్తనం  చేస్తూ వైఖుంఠంలో నారదాదులు, సనకాది మునులు, గరుడు ముఖ్యుల సందడిలో

“దేవవతలు, మునులును, దేవుండని జయవెట్ట,
కోవిదుడై తిరుగాడి, కోనేటి దండను,
హరి యవ తారమే ఆతండితడు, పరమ సంకీర్తన ఫలములో నిలిపే”
అని శ్రీ పెద్ద తిరుమలాచార్య, సౌరాష్ట్ర రాగంలో తన తండ్రిని స్మరించుకున్నాడు.

ఈ సంకీర్తనచార్యుని కీర్తనలు విని, చదివి, పాడుకొని, ఆచరణలో నుంచి బ్రహ్మానందాన్ని పొందండి.

@@@

నాకు 1996 లగాయతు శ్రీ అన్నమయ్య సంగీత, సాహిత్య సౌరభాలని చవిచూపి, శ్రీ అన్నమయ్య తిరిగిన కొన్ని ప్రదేశాలు చూపి, చక్కగా సంకీర్తనలునేర్పిన శ్రీ అన్నమాచార్యుల సంతతి వారైన నా గురువు గారు శ్రీ రామకృష్ణ భాగవతార్ గారికి కృతజ్ఞతా పూర్వకంగా వందనములతో ఈ చిన్ని వ్యాసాన్ని సమర్పిస్తున్నా.

 

********

Posted in May 2022, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!