ఆమె విస్తారమైన ఎదలో ప్రేమ గడ్డకట్టుకుపోయి ఉంది
ఎవరైనా శిశువులా స్పృశిస్తే క్షీరాభిషేకం చేస్తుంది
పచ్చి బాలెంతరాలి స్తన్య వేదనతో
మాటకు ప్రాణం పోస్తుంది
అణువణువులో ప్రాణస్పందనకు పట్టాభిషేకం చేస్తుంది
వేదాంతంవారింటికి ఆమె వేలువిడిచిన చుట్టం
అన్నికళల ఇంటితనానికి వన్నెతెచ్చే వారసత్వం
కల ఆమె పుట్టిల్లు
క్రాంతి మెట్టిల్లు
ఆమె ఎప్పుడూ కలవరిస్తూ ఉంటుంది
ఒక మార్మిక సంవేదనల జగత్తు కోసం...
ఆమె కలలా ప్రవహిస్తూనే ఉంటుంది
చైతన్యాచేతనల మధ్య చిరులంక విడిది కోసం
ఆమె నిట్టూర్పుల సడితో సాగిపోతూనే ఉంటుంది
అధివాస్తవిక సందేశ తీరాల కోసం...
హిమపాతాలకు చండమారుతాలకు ఆమె గొంతులో చెలిమి
రసాతలానికి వియత్తలానికి ఆమె గుండెలో పొత్తు
సాగరాలకు బడబాగ్నులకూ ఆమె కంటి తడి హద్దు
అనంత ప్రకృతి వైరుధ్యాల మధ్య
ఆమె సామరస్య గీతిక
ప్రాణాప్రాణ సమాయుక్తాల మధ్య సాదృశ్య రేఖ
బహిరంతః ప్రకృతుల సంధిలేఖ
ఆమెకు ఆమే ఓ ఆవిష్కారం
విశ్వలయ సౌందర్య సాక్షాత్కారం
ఆమె నడిరాత్రి శ్వాసత్రవ్వకాల్లో బయటపడే పురా చారిత్రక వాస్తవం
మానవ కథనాలలో ఇమడని
మరో లోక మార్గ 'దర్శనం'
మేధకు అంతు చిక్కని శక్తి ప్రవాహం
ఆమె పేరు కవిత్వం...
“ఈ పుస్తకం హీరోవి నువ్వే! అక్షరాలతో అడుగులు వేస్తుంటావు పదాలతో మౌనంగా మాట్లాడుతుంటావు పేరాల మధ్య ప్రతిబింబం అవుతుంటావు పేజీల మధ్య మనసు విప్పుతుంటావు అధ్యాయాల మధ్య ఆలోచనలు అవుతుంటావు చాప్టర్ ల చివర టెస్ట్ పేపర్ అవుతుంటావు టెస్ట్ టేస్ట్ తెలిసేసరికి టెక్స్ట్ బుక్ అవుతావు అనుసరించగలిగితే వర్క్ బుక్ అవుతావు. ••• ఈ పుస్తకం చదువుతున్నంతసేపూ నువ్వు ఎలా తప్పిపోయావో ఎప్పుడు జారిపోయావో ఎక్కడ మిస్ అయిపోయావో తెలుస్తుంటుంది. ఎలా తప్పిపోకూడదో ఎప్పుడు జారిపోకూడదో ఎక్కడ మిస్ కాకూడదో స్పష్టమవుతుంటుంది. ••• ఈ పుస్తకం చదవటం ఒన్ టైమ్ ఎచీవ్ మెంట్ కాదు... ఎప్పటికీ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్. ఈ పుస్తకం చదివిన తర్వాత గెలిచేది నువ్వే ! గెలిపించేది నువ్వే !! అందుకే యు ఆర్ 'ది హీరో' ! యు ఆర్ 'ది విన్నర్' !!"
(నా పుస్తకం “ది విన్నర్ : గెలవాలి ! గెలిపించాలి !!” బాక్ టైటిల్ పైని నా నాలుగు మాటలు. “సిరికోన”లో పెట్టవచ్చో పెట్టకూడదో తెలీని సందిగ్ధత.)
మనిషి మారుతూ....
పూరేకై..ఏకై....మేకై..
పడుగు పేకల్లాంటి కాలంలో
అజ్ఞానం..అదయ...
ఆధిపత్యం..అహంకారపు దుప్పట్లు. కప్పుకొని
నువ్వు నిదురపోతావు...
పగలో.....రాత్రో. తెలియక...
తెలుసనుకుంటూ..
తెలుసుకోక కాలం విలువ పడుకుంటావు...ఆగని కాలాన్ని కౌగిలించుకుని..
రాగం..మధుర రవం..రాసం
ఎరుగకుండా..
ఎద మెత్తన చేసుకోకుండా...
వన్నెల వెన్నెలలో
వలపు వానల్లో తడవకుండా
ప్రాగ్దిశ వెల్లువౌ వేకువ పొలికేకలు వినకుండా
వెలుగు రేఖలు కనకుండా
ధమనులు సిరలలో సాగే
రక్తపు రంకెలు వింటూ
పలులు....పలుకులు
పలుకుల పలుకులు
ఏవీ పట్టించుకోలేవు
ధన పేటికల...సమాధుల
ప్రాణధనమెంత నలుగుతోందో
తెలిపావా...ఎపుడైనా...
నీకు చేయందించాలనుకుంటా..
మట్టి వాసన
ఆమని ఆలింగనాల రుచి చూపాలని
నీలో మల్లెల గుబాళింపు ఇంపు. నింపాలనుకుంటా
మెలకువ మత్తునీయాలని
మోడు కాని మోదుగవై
పూయాలని
అడవి ఆత్మను నిలపాలని
పగడపు పెదవుల సీమల
నవ్వుల దివ్వెలు వెలిగించటం
నేర్పాలనుకుంటా..
నటనే లేని నడతెలాగో వివరించాలనుకుంటా
కాల్చటం..పేల్చడం..
పోల్చటం.. వ్రేల్చటం ...
రాల్చటం వద్దంటూ....
చెట్టును పచ్చగా ఎదగనీమంటూ...
ఐనా....
నీవు ఒంటరితనపు ఒంటి
స్తంభపు మేడలోనే...
గర్జించే సింహం లా
వర్షించే మేఘంలా
అమ్మా అన్న పిలుపులా
అమ్మో అన్న కేకలా
అచ్చంగా వచ్చేదే కవిత
పురివిప్పిన నెమలిలా
అరవిరిసిన మందారంలా
ఉదయించే సూర్యునిలా
విరబూసిన వెన్నెల లా
అచ్చంగా వచ్చేదే కవిత
వల్లించే వేదంలా
వినిపించే రాగంలా
కదిలించే కావ్యంలా
కరుణించిన దైవంలా
అచ్చంగా వచ్చేదే కవిత
బోధించే గురువులా
శోభించే విద్య లా
పడి లేచే కెరటం లా
పయనించే నావలా
అచ్చంగా వచ్చేదే కవిత
కవిత్వం నీడ నాలో పరచుకుని
ఉఛ్వాస,నిశ్వాశలతో ఊపిరి పోస్తున్నది
ఇంకా హృదయం తడి అవుతున్నది
ఉద్వేగాలకు కళ్ళు చెమరిస్తున్నాయి
ఎన్నో సమూహాలతో సహజీవనం చేస్తున్నా
ఒక వంటరి సమయం కోసం
ఎదురు చూస్తుంటా...
కవితా వస్తువు కోసం అన్వేషణ కొనసాగిస్తూ
సమాజంలోని భిన్నత్వాన్ని పరికిస్తూ
ఏకత్వ దారాన్ని చుట్టుకుని పోతుంటాను
ఎప్పుడైనా ఓ అక్షర సమూహం కనబడినప్పుడు
కళ్ళూ మనసూ దానికేసి పరుగెత్తడం
గుండెనిండిన భావాల పరంపరలను
వెదజల్లుకునేందుకు వెదకులాటలు
ఎగిరెళ్ళిన పక్షి వెనక్కి తిరిగి వచ్చినట్లు
ఎప్పటి ఆలోచనలో పదచిత్రాలవుతాయి
రోజుల తరబడి బరువెక్కిన ఆకాశం
గంగను భువిపైన కుమ్మరించినట్లుగా
మధనంతో నిండిన హృదయం
దూది పింజలా తేలికైపోతుంది
నేను ప్రకృతి లో మమేకమై పోతూ
ఋతుశోభలను కళ్ళలో బంధించుకుని
కవిత్వ వానలో తడిసిపోతాను
జీవితంలోని రంగులన్నీ పూసగుచ్చినట్లు
వెలుగు చీకట్లను అనుసరిస్తున్నా
నేనెప్పుడూ నైరాశ్యంలో మునగలేదు
చైతన్యం సిరా వున్నంత వరకూ
అక్షరం కాలాన్ని జయిస్తూనే వుంటుంది
ఎన్నో కవిత్వపు సంతకాలకు
నా ఇల్లు చిరునామాగా మారుతుంది
తొలకరి మేఘమై అమాయకత్వం
వాగుల వెంటా వంకల వెంటా పరుగులు పెట్టిన సమయం
అనగనగా ఒక రాకుమారిలా
అమ్మ చూపుల మధ్య అపురూపపు బొమ్మలా
నాన్న ఆశల మధ్య
ఆకు చాటు గులాబీలా ఒదిగిన కాలం
స్వప్నాలకూ సౌరభాలకూ మధ్య
ఈలలు వేస్తున్న లేలేత పవనమై
ఇటూ అటూ సందడిగా తీరిన సమయం
మసక చీకట్ల మడతల మధ్య పూలేరుకున్న జ్ఞాపకాలు
మళ్ళీ తిరిగి వస్తాయా ఎప్పటికైనా ఒకసారి
నడి రోడ్డుమీద గాజు గోలీల గ్రహాలు వెదజల్లి
సవాలు చేస్తూ గురి చూసిన రోజులు
పసిపాదాలు సుతారంగాకదిపి
వాలుగా వాలిన పె౦కు దొ౦తరల
ఇంటి కప్పున జారకుండా
పగిలి ముక్కలయితే నే౦ గాక
పంచవన్నెల చిలకలా వాలిన గాలిపటం
వేటలో మునిగి తేలిన దినాలు
మళ్ళీ తిరిగి వస్తాయా ఎప్పటికైనా ఒక సారి?
రుతువుకో చెట్టెక్కి తరచి తరచి వెదుక్కుంటూ
వగరు పిందెలూ కసరు కాయలూ
రుచిచూసిన చిలుకలైన వైనం
బుసకొట్టే పాము పడగల్లోనూ
రంగుల సింగిణీ పరచుకున్న సౌందర్యం
అస్తమిస్తున్న రవి బింబం లో
ఉదయిస్తున్న జాబిలి కూనలో
ఇష్ట జన౦ రూపాలను ముద్రి౦చుకున్న ఆశలూ
మళ్ళీ తిరిగి వస్తాయా ఒకసారైనా?
అక్షరాలూ దిద్దిన మునివేళ్ళ కొసల్లో
కెంజాయ చిగుళ్ళూ రెక్కల రెపరెప లూ
చిరుగోట మీటిన నాదమై కొమ్మచాటు పలకరింపులూ
నడకలు నేర్చిన వయ్యారాలూ
నదులు నదులుగా ప్రవహి౦చిన ఊహలు
తడిసి ముద్దై పచ్చిక హరితాలైన తొలి సంతకం కవిత్వాలూ
మళ్ళీ తిరిగి వస్తాయా? ఒకసారైనా?
మళ్ళీ వచ్చేందుకు ఎంత ఉవ్విళ్ళూరినా
తరగతి గదులకు తాకట్టులో ఉన్న తరం
సెల్ ఫోన్ పిడికిట్లో ఉక్కిరిబిక్కిరయే పసితనం
సాంకేతిక నాగబందంలో ఇరుక్కుపోయిన ఆధునికత
ఎక్కడ చోటిస్తాయి
చెక్కిన శిల్పాల ఎదుగుదలకు?
అణువణువునా తొణికిసలైన సజీవ క్షణాలు
మళ్ళీ తిరిగి వస్తాయా? మనుషులుగా మసిలే౦దుకు?