మన సంస్కృతిలో తల్లికి అన్ని విషయాలలోనూ ప్రథమ స్థానాన్ని ఇస్తాము. మాతృదేవోభవ అని అన్న తర్వాత కానీ పితృదేవోభవ అని అనలేదు ఎవ్వరూ. అన్నిటా అన్ని వేళలా ప్రథమ వందనం ముందు తల్లికే! చివరికి ఆ దేవుడైనా సరే, ఆ తల్లి తర్వాతే! అవునా? సరే, ఇంక మాతృదేశం, మాతృభాష, మాతృభూమి వంటి మాతృదేవతకి సంబంధించిన పదాలు మనకి అనేకం. ఇలా అన్ని వేళలా అన్ని విషయాలలోనూ అందరూ తల్లి గురించే మాట్లాడతారు. కానీ తండ్రి గురించి ఎవ్వరూ ఏమీ చెప్పలేదు. ఎందుకో? అసలు తండ్రిలేనిదే తల్లి ఎక్కడనుండి వస్తుంది? స్త్రీకి అత్యున్నతమైన ఆ మాతృస్థానం ఎవరి వలన వచ్చింది? ఈ విషయం ఎవరూ ఆలోచించరేం? త్యాగానికి, ప్రేమకి తల్లేనా నిర్వచనం? తండ్రి పిల్లలకోసం అసలు ఏమీ త్యాగమే చేయడా? తండ్రికి బిడ్డలమీద ప్రేమే ఉండదా? ఒకవేళ వున్నా తల్లికి ఉన్నంత ఉండదా? ఒకవేళ వున్నా తన స్వార్థం అడుగున ఆ ప్రేమ కప్పబడివుంటుందా? మరి తల్లికి? తల్లికి అసలు స్వార్థమే ఉండదా? ప్రతీ తల్లీ ఒక దేవతేనా? మరి తండ్రి? తండ్రి గురించి ఎవ్వరూ పెదవి కూడా విప్పరేం? తండ్రి అంటే అంత తీసిపోయాడా?
నాకు తల్లి అంటే ఎవరో తెలీదు. నేను పుట్టినప్పుడే నా తల్లి ఏదో జబ్బు చేసి పోయిందట. అప్పటినుండీ మా నాన్నే నన్ను పెంచారు. వేరే పెళ్లి కూడా చేసుకోకుండా తన ప్రాణాలన్నీ నామీదే పెట్టుకుని అనుక్షణం కంటికి రెప్పలా చూసుకుంటూ నన్నెంతో అపురూపంగా పెంచారు. అందుకే ఎవరన్నా అమ్మ అన్నా, నాన్న అన్నా నాకు మా నాన్నే గుర్తొస్తారు. అమ్మ గుండెలో దాగటం, అమ్మ ఒడిలో ఒదగటం, అమ్మ చేతి గోరుముద్దలు తినటం ఇవేమీ నాకు తెలీదు. నాకు గుర్తు తెలీని పసి వయసు నుండీ నా జ్ఞాపకాలన్నీ మా నాన్నకి సంబంధించినవే! అందరూ అమ్మ ఒళ్ళో ఆడుకుంటే నేను నాన్న గుండెలమీద ఆడాను. అసలు నాకు ఏడేళ్లు వచ్చేదాకా మంచం మీద పడుకోవటం నాకెప్పుడూ గుర్తు లేదు. ఎప్పుడూ నాన్న ఒడిలోనే పడుకునేవాడిని. రాత్రవగానే ఆయన ఒడిలో ఊగుతూ నిద్రలోకి జారటం మాత్రమే నాకు గుర్తుండేది. మళ్ళీ వుదయం నిద్రలోంచి కళ్ళు తెరిచేసరికి నాన్న ఒడిలోనే ఉండేవాడిని. ఈమధ్య నన్ను పక్క మీద నాన్న ఎప్పుడు పడుకోబెట్టేవారో నాకు చాలా పెద్దగా అయ్యేదాకా నిజంగా తెలీదు. నాకు నాన్నే అన్నం పెట్టేవారు. ముద్దలు చేసి తినిపించేవారు. ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేసేవారు. రాత్రిళ్ళు దుప్పటి కింద నాన్నను కరుచుకుని పడుకుని బోలెడన్ని కథలు చెప్పించుకునేవాడిని. స్కూలు నుండి ఇంటికి రాగానే ఆయన ఆఫీసు నుండి ఎంత అలిసిపోయి ఇంటికి వచ్చినా నాకు రోజూ శ్రద్ధగా చదువు చెప్పేవారు. ఆదివారాలు వుదయం పూట నాచేత టెన్నిస్ ఆడించేవారు. ఆడి ఆడి అలిసిపోయి ఇంటికి రాగానే తల మీద నూనె బాగా మర్దనా చేసి వేడి వేడి నీళ్లతో తలంటి స్నానం చేయించేవారు. పండగలు, పర్వదినాలకి రకరకాల పిండివంటలు ఆయనే వండేవారు. ఇలా నాన్న ప్రేమవర్షంలో పూర్తిగా తడిసి, ఆయన ప్రేమామృతాన్ని పూర్తిగా తాగి, ఆయన నీడలో హాయిగా ఎదిగి, ఆయన నేర్పిన పాఠాలని నేర్చుకుని, సంపూర్ణ వ్యక్తిత్వాన్ని సంతరించుకుని నేను పెరిగి పెద్దవాడిని అయ్యాను. నేను విజయవంతంగా పెద్ద చదువులు చదవగలిగినా, ఎంతో మంచి వుద్యోగం సంపాదించగలిగినా, ఒక మంచి వ్యక్తిగా ఎదగగలిగినా దానికి మానాన్న, ఆయన నాకు నేర్పిన మంచి అలవాట్లు, క్రమశిక్షణే కారణం. నాక్కూడా అందరిలాగా అమ్మ వుంటే బాగుండేది అని అప్పుడప్పుడు అనిపించిన మాట నిజమే! అయితే అది అందరినీ చూసి చాలా సహజంగా కలిగిన సర్వసాధారణమైన తలపే కానీ అమ్మలేని లోపం అనుభవించటం వల్ల కాదు. అందుకే ఎవరైనా, ఎప్పుడైనా "పాపం, తల్లి లేని బిడ్డ, భగవంతుడు ఎందుకింత అన్యాయం చేసాడో" అని జాలిపడుతూంటే 'నేను బాగానే వున్నాగా! ఎందుకిలా అనవసరంగా బాధపడుతున్నారు? అమ్మ లేకపోతేనేం, నాన్న వున్నాడుగా' అనుకునేవాడిని అమాయకంగా, అయోమయంగా మనసులో. పెద్దయి విషయాలన్నీ బాగా ఆకళింపు అయ్యాక కానీ అమ్మ స్థానం, అమ్మ ప్రత్యేకత నాకు తెలీలేదు. నాన్న ఎంత అమ్మలా మారినా అమ్మ అమ్మే! ఆ స్థానం ఎవ్వరూ పూడ్చలేరు. అలా అని నాన్న స్థానం కూడా ఏమీ తక్కువ కాదు. ఎవరికీ తీసిపోదు. ప్రతీ చోటా దేవుడు వుండలేక ప్రతీ ఇంటికీ ఒక అమ్మని పంపాడట. మరి అమ్మ లేని మా ఇల్లు లాంటి ఇళ్ళకి కూడా ఆ దేవుడు తన బదులు నాన్నని పంపాడని మా నాన్నని చూసిన నేను అంటాను.
మాతృప్రేమకి పితృప్రేమ ఏమాత్రం తీసిపోదు. ఈ నిజానికి నా జీవితమే ఒక పెద్ద ఋజువు. నేను పెద్దవుతున్నకొద్దీ నాన్న నేర్పిన జీవిత సత్యాలు బాగా అర్థం అవటం మొదలెట్టాయి. కష్టాలు కాచి వడబోసిన అనుభవాలు, లోకాన్ని చూసిన తెలివితేటలు, జీవితం నేర్పిన సత్యాలు ఇవన్నీ నేను నాన్న దగ్గర నేర్చుకున్న పాఠాలు. తల్లితండ్రులు పిల్లల మీద ప్రాణాలన్నీ పెట్టుకుని ఎలా బతుకుతారో, వాళ్ళకోసం ఏపనైనా సరే, చేయటానికి ఎలా సిద్ధం అవుతారో, వారి సుఖం కోసం ఎన్నెన్ని త్యాగాలు చేయటానికైనా ఎలావెనుకాడరో, ఇవన్నీ బాగా ఊహ కూడా తెలియని వయసులోనే నేను నాన్నని చూసి బాగా ఆకళింపు చేసుకున్నాను. అందుకే అంత చిన్న వయసులోనే నేను రెండు గట్టి నిర్ణయాలు తీసుకున్నాను. ఒకటి, నాన్న మనసుని ఎప్పుడూ నొప్పించకూడదు. చిన్న కానీ, పెద్ద కానీ, ఏ విషయమైనా సరే, నాన్న మాటని ఎప్పుడూ జవదాటకూడదు. నా కోసం తన జీవితాన్నంతా త్యాగం చేసిన ఆ త్యాగశీలి కి అన్నిటికంటే, అందరికంటే అత్యున్నతమైన గౌరవ మర్యాదలు ఇవ్వాలి. రెండోది భవిష్యత్తులో నేను నాన్నని అయినప్పుడు నా బిడ్డలని ఇప్పుడు మా నాన్న నన్ను చూసుకున్నట్లుగానే ఎంతో అపురూపంగా, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి, పెంచి పెద్ద చేయాలి. ఈ రెండు నిర్ణయాలు చిన్నప్పటి నుండీ నా మనసులో చాలా గాఢంగా నాటుకుపోయాయి. వయసుతో పాటు అవి కూడా పెరిగి పెద్దవయ్యాయి. అందుకు నిదర్శనంగా నేను నాన్న పట్ల అనుక్షణం చాలా విధేయతగా వున్నాను. ఆయన చెప్పినట్లు చదువుకున్నాను. ఆయన చెప్పిన దోవలో నడిచాను. ఆయన కోరుకున్న వుద్యోగంలో చేరాను. ఆయన ఎన్నుకున్న పిల్ల మెడలో ఆ మూడుముళ్లు వేసాను. బతికున్నంతకాలం ఆయనకీ ఏలోటూ లేకుండా నెత్తిన పెట్టుకుని చూసాను. నాకు తెలుసు, వంట్లో ఓపిక వున్న రోజుల్లో ఎలా బతికినా జీవిత చరమాంకంలో ఏ చీకు చింత లేకుండా హాయిగా, సంతోషంగా, శాంతి గా బతికినవారే అదృష్టవంతులు. ఆ అదృష్టాన్ని నాన్న పుష్కలంగా అనుభవించారు. నా ఒడిలో ఎంతో తృప్తితో ఈ ప్రపంచంలోకి నేను వచ్చిన పని అయిపోయింది, ఇంక ఇక్కడ నాకు పని లేదు అన్నట్లుగా మృత్యుముఖం లోకి సునాయాసంగా నడిచి వెళ్లినట్లు అతి సుఖ మరణం పొందారు. తీరని కోరికంటూ ఏదీ ఆయనకి లేకుండా చేశానని నాకు కూడా చాలా తృప్తి కలిగింది.
చిన్నప్పటినుండీ నాన్న లాగానే వుండాలన్న నా కోరికకి మొదటి మజిలీ నేను కూడా నాన్ననవటం. అసలు నేను పెళ్లి చేసుకున్నదే నాన్ననవటం కోసం. నేను పొందిన పితృప్రేమనంతా నా పిల్లలకి పంచిపెట్టటం కోసం. అందుకే నాన్ననవటం కోసం నేనెంతో తహతహలాడాను. అసలు మాతృత్వం లోనే ఆడపిల్ల సార్థకత వుందని, అమ్మా అనిపించుకున్నప్పుడే ఆమె జన్మ ఫలిస్తుందని అందరూ అంటారే కానీ మరి నాన్న అనిపించుకోవటానికి మగవాడెంత ఎదురు చూస్తాడో, చివరికి ఆ శుభదినం వచ్చినపుడు ఎంత ఆనందపడతాడో ఎవ్వరూ ఎందుకు చెప్పరు? మనది పురుష ప్రధానమైన సమాజమని అందరూ అస్తమానూ ఈ సంఘాన్ని ఆడిపోసుకుంటారు కానీ ఆడవారికి మన సంస్కృతిలో ఎంత వున్నత స్థానం వుందో, వారికి ఎంత గౌరవ మర్యాదలు ఇస్తారో బహుశా ఎవ్వరూ గమనించటంలేదు కాబోలు. ఏమో బాబూ! నేను మాత్రం స్త్రీ శక్తిని ఎప్పుడూ గౌరవిస్తాను. మా నాన్నే నాకు అది నేర్పారు. స్త్రీ శక్తి, పురుష శక్తి, రెండూ రెండే! ఒకదానికి ఇంకోటి ఏమీ తీసిపోదు.
మా అబ్బాయి పుట్టినపుడు నేను పొందిన సంతోషాన్ని వర్ణించి చెప్పలేను. వాడు నా రక్తం, నా రూపం, నా జీవితం, నా ప్రాణం, నా సర్వస్వం. అప్పటినుండీ వాడే నాకు అన్నీ. వంద కోట్లు లాటరీ వచ్చినా, లేక ఈ ప్రపంచానంతటినీ జయించినా లేక ఒక అతిలోక సౌందర్యరాశి తో వివాహమాడినా లభించని అత్యున్నతానందం మా అబ్బాయిని హృదయానికి హత్తుకున్నప్పుడు కలిగింది నాకు. బిడ్డని చూస్తేనే ఇంత సంతోషంగా వుందే, ఇంక పది నెలలపాటు ఆ చిన్ని ప్రాణాన్ని తన శరీరంలో ఒక భాగంగా మోసి, ప్రాణాలు పణంగా పెట్టి, ఈ చిన్ని కూనను ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చిన ఘనత ఆడవారికి ఎంత వుంటుందో! అందుకేనేమో, సంతానం విషయం వచ్చేసరికి వారికి అంత గర్వం! ఇంతటి అత్యున్నతమైన వరాన్ని పొందటానికి, ఇంతటి అపురూపమైన అనుభూతిని అనుభవించటానికి వారెంత అదృష్టం చేసుకున్నారో! ఓ దేవుడా! తనలో ఒక ప్రాణానికి ఊపిరి పోసి, ప్రసవ వేదనలో తన జీవితాన్నే పణంగా ఒడ్డి, తన శరీరాన్ని చేధించుకుని ఆ ప్రాణాన్ని ఈ లోకంలోకి తీసుకురాగల ఈ అద్భుతమైన, అపురూపమైన వరాన్ని కేవలం ఒక్క ఆడవారికే పరిమితం చేయటం నీకు న్యాయమా? ఇలా ఎన్నోసార్లు ఆ దేవుడిని ప్రశ్నించేవాడిని. ఏమైనా సరే, ఇవన్నీ లేకపోయినా కూడా సరే, నాకు మా నాన్నే గొప్ప. ఎందుకంటే అమ్మ ప్రాణాన్ని పోస్తే నాన్న బతుకుతెరువుని ఇస్తాడు. మా నాన్న నాకు అన్నీ ఇచ్చారు.
మా అబ్బాయిని నేను చిన్నప్పటినుండీ కంటిపాపలాగా చూసుకున్నాను. వాడి కళ్ళల్లో వెలుగులు, వాడి బుగ్గల్లో సొట్టలు, వాడి నవ్వుల్లో వెన్నెలలు, వాడి నడకలలో గలగలలు, వాడి మాటల్లో అమృతాలు, అబ్బ! సంతానం వల్ల ఎంత ఆనందం లభిస్తుంది? ఈ కడుపు తీపి ఎంత తియ్యగా వుంది? ఎంత అదృష్టం చేసుకున్నాను ఈ వరాన్ని పొందటానికి! నాన్ననయిన తర్వాత ఈ జీవితం ధన్యమయింది సుమా! చిన్నప్పుడు మా అబ్బాయి పాకుతున్నపుడు నా ప్రాణం కొట్టుకునేది వాడి మోకాళ్ళకి ఎక్కడ గాయాలవుతాయేమోనని. ఇంకా సరిగ్గా వచ్చి రాని చిట్టిపొట్టి అడుగులు వేస్తున్నప్పుడు గుండెలు గుబగుబలాడేవి పడితే ఎక్కడ దెబ్బలు తగులుతాయేమోనని. బంతి ఆటలు ఆడుతుంటే ఆరాటంగా వుండేది ఎక్కడ చేతులు కందిపోతాయేమోనని. నాకు తెలుసు, ప్రతి తండ్రి తన సంతానం గురించి ఇలాగే అనుకుంటాడు. ఇలాగే ఆరాటపడతాడు. ఆ ఆరాటాలలోనే పిల్లలు పెరిగి పెద్దవారవుతారు. అప్పటిదాకా జరిగే అత్యాసక్తికరమైన ఈ జీవన ప్రయాణంలో ఎన్నో మలుపులు, ఎన్నో మజిలీలు, అప్పుడప్పుడు గతుకుల బాటలు, చిన్న చితక ఎదురుదెబ్బలు, ఇలా ఎన్నో లెక్కలేనన్ని అనుభవాలు. కానీ అదృష్టవశాత్తు నాకు ఎక్కువగా తియ్యటి అనుభవాలే ఎదురైనాయి. మా అబ్బాయి బోసినవ్వుల్లో వెన్నెలలు విరిసేవి. మాటలు రాకమునుపు ఆఆ ఊఊ లు అంటుంటే అమృతపు జల్లులు కురిసేవి. వాడు మొదటిసారిగా నన్ను నాన్నా అని పిలిచినప్పుడు అబ్బ, నా చెవుల్లో అమృతం వర్షించినట్లు, నా నోటిలో తేనెల వాన కురిసినట్లు, ఎంత బాగుందో చెప్పలేను. ఇన్నాళ్ళకి నా జన్మ ధన్యమైందని, నేను ఊహ తెలిసినప్పటినుండీ ఎదురుచూస్తున్న తీయటి కోరిక ఇప్పటికి తీరిందని నేను మురిసిపోయాను. అందరూ అమ్మా అన్న పిలుపు గురించే చెప్తారు, కానీ నాన్నా అన్న పిలుపు కూడా ఎంత తియ్యగా వుంటుందో, బ్రతుకు మీద ఎంత తీపిని రేపుతుందో అది అనుభవమైన నాన్నలకే తెలుస్తుంది.
అందరు తల్లితండ్రులలాగానే నాక్కూడా మాఅబ్బాయి అంటే చాలా మురిపెంగా వుండేది. ఎప్పుడూ వాడిని నా ఒళ్లోనే కూర్చోబెట్టుకునేవాడిని. నా చిన్నప్పుడు నేను మా నాన్నతో వున్నట్లు సాధ్యమైనంత ఎక్కువ సమయం వాడితో గడిపేవాడిని. వాడు టెన్నిస్ లో ట్రాఫి గెలుచుకుంటే నా ప్రాణానికి ఏదో ఒలింపిక్స్ లో మెడలు సంపాదించినంత ఆనందం కలిగేది. వాడు చిన్న చిన్న పాటలు పాడుతూంటే బాలమురళీకృష్ణలాగా పాడుతున్నట్లు, సినిమా పాటలకి అనుగుణంగా ఏవో గంతులు వేస్తుంటే మైకేల్ జాక్సన్ లాగా డేన్స్ చేస్తున్నట్లు, చదువులో ఒక్కొక్క క్లాసు పాసవుతుంటే ఏదో ఐ.ఐ.టి. ఎంట్రన్స్ లో గెలిచినట్లు ఆనందంగా, గర్వంగా అనిపించేది నాకు. నాకే కాదు, అందరు తండ్రులకి అలాగే అనిపిస్తుంది కాబోలు. బుద్ధిలో బృహస్పతిలాగా, విద్యలో విఘ్నేశ్వరుడిలాగా, ధనంలో కుబేరుడిలాగా, అందంలో మన్మధుడిలాగా, తల్లితండ్రుల మాట నిలబెట్టటంలో సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడిలాగా, వినయ విధేయతలతో ఎదుటివారిని సమ్మోహనపరిచే వ్యక్తిత్వంతో అన్ని విషయాలలోనూ అత్యుత్తమంగా తమ బిడ్డలు వుండాలని కోరుకోని తల్లితండ్రులు ఈ ప్రపంచంలో ఎవరుంటారు? నాకూ అలాగే మా అబ్బాయి పట్ల చాలా కోరికలుండేవి. వాడు కూడా నా కోరికలు చాలానే తీర్చాడు. కొడుకుగా వాడు నాకిచ్చిన ఆనందం ఒక తండ్రిగా నాకు పూర్తి సంతృప్తినిచ్చింది. నా నాన్న దగ్గర నుండి నేను పొందిన ప్రేమ నా సంతానానికి నేను ఇవ్వాలన్న నా జీవితాశయంతోపాటు మా అబ్బాయి నాకు తిరిగి ఇచ్చిన ఆనందంతో నా జన్మ నిజంగా తరించింది. ఇంతకంటే ఎక్కువగా ఏ తండ్రికైనా మాత్రం ఏం కావాలి?
ఆడది తను పుట్టినప్పటినుండీ తన కుటుంబ సభ్యుల కోసం అనేక వేళల్లో అనేక త్యాగాలు నిస్వార్థంగా చేస్తుందని అందరూ అంటారు. కానీ మరి మగవాడు? పగలనక, రాత్రనక, ఎండనక, వాననక కష్టపడి మగవాడు ఎందుకు సంపాదిస్తాడు? ఆ సంపాదనంతా ఎవరికిస్తాడు? తన పెళ్ళాం, పిల్లలకోసమేగా! వారిని అందలాలలో విహరింపచేయాలని, వారికి తీరని కోరికలంటూ వుండకూడదని అనుక్షణం ఎందుకు అంతగా తాపత్రయపడతాడు? దీనికి సమాధానం ఎవ్వరూ చెప్పరేం? ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది వుంటుందంటారు. మరి ఏ మగవాడి సహాయ, సహకారాలు లేకపోతేనే ఈ ఆడవారికి ఇంతటి ప్రగతి లభిస్తోందా? తండ్రి తర్వాత తండ్రిగా మారిన పెద్ద కొడుకులు నాకు తెలుసు. తమ్ముళ్ల చదువులు, చెల్లెళ్ళ పెళ్లి పేరంటాల కోసం తమకు లభించిన విదేశయానాలలాంటి అరుదైన అవకాశాలను వదులుకున్న త్యాగమూర్తులైన అన్నలు నాకు తెలుసు. తల్లితండ్రులను సాక్షాత్తు దైవస్వరూపాలుగా చూస్తూ వారిని వృద్ధాప్యంలో విడిచి వెళ్ళటం ఇష్టం లేక దూరదేశాల్లో, సుదూరప్రదేశాల్లో వచ్చిన అత్యోన్నత వుద్యోగావకాశాలు వదులుకొన్న విధేయులైన తనయులు నాకు తెలుసు. యవ్వనంలో భార్యను కోల్పోయినా మళ్ళీ పెళ్లయినా చేసుకోకుండా తమ జీవితాన్నంతా తమ పిల్లల కోసం వెచ్చించిన త్యాగమూర్తులైన మా నాన్నలాంటి తండ్రులు నాకు తెలుసు. తమ రక్తాన్ని చమటగా మార్చి, కష్టపడి సంపాదించి తమ భార్యాబిడ్డలకి సుఖాలని అందివ్వటం కోసం అనుక్షణం శ్రమించిన ప్రేమమూర్తులైన భర్తలు నాకు తెలుసు. నాకే కాదు, చాలామందికి తెలుసు. ఎంతటి రాజ్యాలనేలే రాజైనా, ఎంతటి ఉన్నతోద్యోగాలు చేసి ఊళ్ళేలే పెద్ద ఉద్యోగస్తుడైనా, ఎంతటి ధనరాశులలో తులతూగే భాగ్యవంతుడైనా పొద్దు వాలి, రోజు ముగిసే సమయంలో తన పెళ్ళాం బిడ్డల దగ్గరికి, వారి కోసం తను కట్టిన గూటికే కదా చేరతాడు! కష్టపడి సంపాదించిందంతా వారికే కదా ఇస్తాడు! మరి ఇలాంటి విషయాల గురించి ఎవ్వరూ ఏమీ అనరేం? ఆడదానిలోని అమ్మని గుర్తించినంతగా మగవాడిలోని నాన్నని గుర్తించరెందుకు? మగవాడి కష్టాలని, త్యాగాలని గమనించరెందుకు?
అసలు ఎవరికైనా ఈ విషయం గుర్తుందో లేదో కానీ ఉపనయన సమయంలో బ్రహ్మోపదేశం చేసి గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేసే అర్హత ఒక్క తండ్రికే వుంది. అందుకే మా అబ్బాయి వడుగు చేస్తున్నపుడు నేనెంతో గర్వించాను. మెడలో కొత్తగా వేసుకున్న జంధ్యం మెరుస్తూ ఉంటే. భవతి భిక్షామ్ దేహి అంటూ భిక్షకి వచ్చిన ఆ వటువుని చూసి నేను తెగ ముచ్చట పడిపోయాను. 'అమ్మయ్య, నా బాధ్యత పూర్తయింది. ఇంక ఇలాగే పెళ్లి బాధ్యత కూడా సక్రమంగా నిర్వహించాలి' అని నన్ను నేనే పదేపదే హెచ్చరించుకున్నాను. బాధ్యతలను కేవలం బాధ్యతలుగా చూస్తే అవి బరువనిపిస్తాయి. అలా కాకుండా బాధ్యతలని కూడా మనం చేసే మామూలు పనులలాగా చిత్తశుద్ధితో జాగ్రత్తగా చేస్తే అప్పుడు వాటిల్లో మనకు ఆనందమూ లభిస్తుంది, ఆ పనులు సక్రమంగాను అవుతాయి. కాకపొతే బాధ్యతలను మనం తప్పనిసరిగా చేయాలి. దాటవేయకూడదు. మరిచిపోకూడదు. ఈ విషయం గుర్తు పెట్టుకుంటే చాలు.
మా అబ్బాయి విషయంలో చిన్నప్పటి నుండీ నేనలాగే చేసాను. అందుకే వాడికి సంబంధించిన ప్రతి మజిలీ లోనూ, తీర్చుకున్న వాడి ప్రతి బాధ్యతలోనూ నేనెంతో పూర్ణానందాన్ని పొందాను. వాడు కూడా అదృష్టవశాత్తూ నాకెప్పుడూ ఎటువంటి సమస్యనీ, మనస్తాపాన్ని ఇవ్వలేదు. అందుకే మా అందరి జీవితం ఏవో చిన్న చితక ఎగుడుదిగుడులు తప్ప, పెద్ద ఆటంకాలేవీ లేకుండానే గడుస్తోంది. ఆఖరికి జీవితంలో అతి ముఖ్యమైన పెళ్లి విషయంలో కూడా మా అబ్బాయి మాకేమీ సమస్యలు తీసుకురాలేదు. అచ్చం నాలాగే మాకు నచ్చిన, మేము మెచ్చిన ఒక మంచి అమ్మాయి మెడలో సంతోషంగా ఆ మూడుముళ్ళూ వేసాడు. చిన్నప్పుడు నా ఒడిలో ఒదిగి మాటలు నేర్చుకున్నవాడు, నా వేలు పట్టుకుని చిట్టిపొట్టి నడకలు నడిచినవాడు, నా పక్కలో దూరి నాచేత అనేక కథలు చెప్పించుకున్నవాడు, టెన్నిస్ గేములో ఓడిపోతే వుక్రోషంతో ఇంట్లో నానా గొడవ చేసినవాడు, ఈనాడు చెట్టంతవాడయి నుదుట కళ్యాణం బొట్టుతో, బుగ్గన దిష్టిచుక్కతో, నొసట బాసికంతో, మెడలో ఘుమఘుమలాడే కర్పూరపు దండలతో, పట్టుబట్టలు కట్టుకుని పెళ్ళికొడుకు రూపంలో నా ముందు నుంచుంటే, అబ్బ, సంతోషం పట్టలేక నా కళ్ళల్లోంచి నీళ్లు వచ్చాయి. నాకంటే అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ వుండరేమో! ఈ సంతోషం పట్టలేక నా ఈ చిన్ని గుండె బద్దలవుతుందేమో! భగవంతుడా! ఏ జన్మలో ఏం పుణ్యం చేసానో, ఆ పుణ్యఫలం అంతా ఇలా ఇస్తున్నావా! అనుక్షణం నామీద వర్షంలా కురిపిస్తున్న నీ కరుణా కటాక్షాలకి నా శతకోటి వందనాలు.
మా అబ్బాయి పెళ్లి అయినప్పటినుండీ నా ఆనందానికి ఇంక అవధులే లేవు. దీనికి ముఖ్య కారణం వాడి వివాహమైంది, కోడలు ఇంటికి వచ్చింది, నా బాధ్యత తీరింది, ఇవన్నీ అయినా వీటన్నిటికీ వెనక అసలు కారణం వేరే వుంది. నేను చిన్నప్పటి నుండీ మా నాన్న దగ్గర నుండి తనివితీరా అనుభవించిన పితృప్రేమ, నా శాయశక్తులా మా అబ్బాయి మీద నేను కురిపించిన పితృప్రేమ, ఇప్పుడు మా అబ్బాయి కూడా తన పిల్లల మీద కురిపించటానికి, ఆ పితృప్రేమలోని ఆనందాన్ని తనివితీరా అనుభవించటానికి అవకాశాన్ని ఇచ్చింది ఈ పెళ్లి. అందుకే వాడి పెళ్లయినప్పటి నుండీ ఆ శుభవార్త వాడు అందించే శుభఘడియల కోసం నేను చాలా ఆతురతగా, అసహనంగా ఎదురుచూశాను. నాలాగే నా చిట్టినాన్న కూడా నాన్న అవాలి. అనుక్షణం తన పితృప్రేమలో తన బిడ్డలని ముంచి ముద్ద చేయాలి. ఆ అమృతానందంలో పూర్తిగా లీనమయి పునీతుడవాలి. అదంతా చూసి నేను తరించాలి.
కానీ మనం ఒకటి అనుకుంటే జరిగేది ఇంకొకటి కదా! నాకున్న తొందర వాళ్లకి లేదేమో! లేక ఇంకేదన్నా కారణమేమో! రెండేళ్లు గడిచిపోయాయి. మా అబ్బాయి దగ్గర నుండి నేను ఆతురతగా ఎదురుచూస్తున్న ఆ శుభవార్తేమీ రాలేదు. మనసులో ఏదన్న గాఢంగా కోరుకుని, దాని కోసం ఇన్నాళ్లు వేచిచూడటం నాకిదే మొదటిసారి. బయటికి చెప్తే ఎవరన్నా ఏదన్నా అంటారేమో! వాళ్లకి లేని తొందర నీకెందుకు అని చికాకుపడతారేమో! ఏమిటి నీ చాదస్తం అని విసుక్కుంటారేమో! అనవసర విషయాలలో తలదూర్చి హద్దులు దాటకు అని హెచ్చరిస్తారేమో! చెట్టంత ఎదిగిన కొడుక్కి పెళ్లి చేసిన తర్వాత కూడా వాళ్ళ స్వవిషయాలలో ఎందుకు ఇలా అనవసరంగా కలగచేసుకోవాలనుకుంటున్నావు అని కసురుకుంటారేమో! ఇలా రకరకాల అనుమానాలతో బయటికి ఎవరికీ చెప్పుకోలేక, అలా అని గుండెలోనే గుప్తంగా దాచుకోలేక సతమతమయి నేను మన శాంతి పూర్తిగా కోల్పోయాను.
సరిగ్గా అదే సమయంలో మా అబ్బాయి ఒకరోజు ఈ రహస్యం విప్పాడు నా దగ్గర. వాళ్ళు మొదట్లో ఒక ఏడాది పాటు పిల్లలు వద్దని అనుకున్నారట. కానీ ఆ తర్వాత మాత్రం పిల్లల కోసం చాలా ప్రయత్నించారట. ఆ ప్రయత్నాలేవీ ఫలించకపోతే చివరికి డాక్టరు దగ్గరికి వెళ్లి ఏవో పరీక్షలేవీ చేయించుకున్నారట. వాటిల్లో తేలినదేమిటంటే కోడలిలో ఏ లోపము లేదు. కానీ మా అబ్బాయికి ఏదో మెడికల్ ప్రోబ్లం వుందిట. మగవాళ్లలో ఇలాంటి infertility ప్రోబ్లంలు పరిష్కరించటం సాధారణంగా చాలా కష్టమట. ఈ విషయం విన్న నేను కుప్ప కూలిపోయాను. ఇంతదాకా జరిగిన నా సుభాగ్య పయనంలో ఎవ్వరూ తొలిగించలేని ఆటంకం ఇప్పుడు కలింగింది. నా ఆనందానికి ఏదో తెలియని శాపం వలన పెద్ద అడ్డం వచ్చింది. అసలు కంటే వడ్డీ ముద్దు అంటారు. అలాంటి ముద్దుముచ్చట్లకి నేను దూరం అవుతానా? నాన్నని అయ్యాను, సరే, మరి నాన్న నాన్నని కూడా అయ్యే అదృష్టం నాకు లేదా? నా సంగతి సరే, పాపం, నా చిట్టినాన్న సంగతి ఏమిటి? సంతానం కోసం తపిస్తూ నిస్సంతుగా వాడలాగే వుంటాడా? నా దగ్గర నుండి పొందిన పితృప్రేమని వాడి పిల్లల మీద కురిపించటానికి వాడికింక సంతానమే వుండదా? అయ్యో! ఈ వయసులో నాకిలాంటి మనస్తాపం కలిగిందేమిటి? ఏ లోటు లేని జీవితం నాదని నాకు నేనే దిష్టి పెట్టుకున్నానా? అయినా ఏ మందు లేని ఇలాంటి జబ్బు వచ్చిందేమిటి నా పిచ్చినాన్నకి? పిల్లలంటే, పాపం, వాడికెంత ఇష్టమో! ఎప్పుడూ పిల్లలతోనే ఆడేవాడు. అసలు నాకే ఇంత బాధగా వుంటే, పాపం, వాళ్ళిద్దరికీ ఇంకెంత బాధగా వుందో! ఇప్పుడేం చేయాలి? నేనేవిధంగా ఈ సమస్యని పరిష్కరించగలను? ఇలా నేను అనేక ఆలోచనలతో అనేకానేక విధాలుగా తల బద్దలు కొట్టుకొంటున్నాను.
ఇంతలో ఒకరోజు మా అబ్బాయి నా దగ్గరకు వచ్చి ఈ సమస్యకు తను తీసుకున్న పరిష్కార విధానాన్ని చెప్పాడు. ఆ నిర్ణయం విన్న నేను ఒక్కసారి మ్రాన్పడిపోయాను. అనాధ పిల్లలంటే నాకు విముఖత్వం ఏదీ లేదు. కానీ పెళ్ళైన రెండేళ్లకే పిల్లలు కలగటం లేదని, ఇంకొన్నాళ్ళు ఇంకా ప్రయత్నిద్దామని కూడా అనుకోకుండా ఎవరైనా అనాధలని పెంచుకోవాలని నిర్ణయించుకోవటానికి చాలా తెగింపు, ధైర్యం, గుండెనిబ్బరం, వీటన్నిటినీ మించి చాలా పెద్ద మనసు కావాలి. ఇవన్నీ మా అబ్బాయిలో వున్నందుకు నేనెంతో గర్వించాను. ఎందుకంటే మా అబ్బాయి తీసుకున్న నిర్ణయం తేలికైనదేమీ కానేకాదు. నా పెంపకంలో వాడు నేను ఆశించినదానికంటే ఎన్నో రెట్లు పైకి ఎదగటం నాకు చాలా సంతోషాన్నిస్తోంది. నా పితృప్రేమ, గారాబం వాడినేమీ పాడు చేయలేదు సరికదా, ఇంకా ఎంతో వున్నతమైన వ్యక్తిత్వాన్ని ఇచ్చాయి వాడికి. ఈ తలపు నాకు చాలా తృప్తినీ, గర్వాన్నీ ఇస్తోంది. పిల్లల్ని పెంచుకోవాలన్న నిర్ణయమే తీసుకున్నప్పుడు చుట్టాలలోనూ, స్నేహితులలోనూ కాకుండా ఎవరైనా అనాథను పెంచుకోవాలనుకోవటం లో కూడా చాలా ఉదారత వుంది. ఒక దీనను వుద్ధరించాలన్న సుసంకల్పం వుంది. పిల్లలు భగవత్స్వరూపాలు. పాపం, నా అంటూ ఎవ్వరూ లేని వారిని మన ఇంటికి తీసుకొచ్చి, నీకు నేను వున్నాను, అందరిలా నీకు అందరూ వున్నారు, ఈ రోజు నుండీ నువ్వు మాలో ఒక భాగం అని చెప్పటం చాలా గొప్పతనం. ఇలాంటి వుదాత్తమైన లక్షణాలని ఆ భగవంతుడు మెచ్చుకుంటాడు. ఉదారతలో, విశాల హృదయం లో నా బిడ్డ చాలామందిని మించిపోయాడు. గభాల్న లేచి నేను వాడిని గట్టిగా కౌగలించుకున్నాను. నీ నిర్ణయానికి నాకెంతో గర్వంగా వుంది నాన్నా అని చెప్పాలని చాలా ప్రయత్నించాను. కానీ మనసులోని సంఘర్షణ వలన గొంతు పెగల్లేదు. పెదవులు తెరుచుకోలేదు. కళ్ళల్లో నీళ్లు వూరుతున్నాయి. "నా పిచ్చి నాన్నా! ఎప్పటికప్పుడు ఈ నాన్నకి నువ్వు ఒకదాన్ని మించి ఒకటి, ఇలా ఎప్పుడూ ఎక్కువ ఆనందాన్ని ఇస్తూనే వున్నావు. నేను నీకు ఇస్తున్న పితృప్రేమకి ఎన్నో రెట్లు ఎక్కువ ప్రతిఫలాన్ని పొందుతున్న అదృష్టవంతుడిని నేను. ఆ భగవంతుడు నీకు పూర్ణాయువునీ, ఆరోగ్యాన్నీ, ఐశ్వర్యాన్నీ ఇచ్చి ఆశీర్వదించాలి" అనుకుంటూ వాడి వెన్ను నిమురుతూ మౌనంగా వుండిపోయాను. మనసు నిండుగా వున్నప్పుడు మాటలు కరువవుతాయి. భాష దొరకదు. అలాగే వుంది అప్పుడు నా పరిస్థితి.
ఇది జరిగిన కొన్ని వారాలకి మా అబ్బాయి నన్ను ఒక అనాధాశ్రమానికి తీసుకెళ్లాడు, తను పెంచుకోవటానికి ఎన్నుకున్న పాపను చూపిస్తానంటూ. దత్తతకు కావాల్సిన పేపర్ వర్క్ అంతా అయిపోయిందిట. మిగిలిన చిన్న చిన్న ఫార్మాలిటీస్ అన్నీ పూర్తిచేసుకుని ఇంకో వారం రోజుల్లో ఆ పాపను మా ఇంటికి తీసుకొస్తాడట. అక్కడికి వెళ్లిన తర్వాత నన్ను ఆఫీసులో కూర్చోబెట్టి ఆ పాపను తీసుకురావటానికి తను లోపలికి వెళ్ళాడు. బయట ఆ ఆఫీసులో నేనెంతో ఆతురతగా ఎదురుచూస్తున్నాను. ఇంతలో మా అబ్బాయి ఒక పసిపాపను పొత్తిళ్ళలో ఎత్తుకుని వచ్చాడు అక్కడికి. వాడిని చూడగానే అప్రయత్నంగా చేతులు చాపాను నేను ఆ పాపను ఎత్తుకోవటానికి. సొంత బిడ్డలు గర్భం లోంచి పుడితే పెంచుకున్న పిల్లలు తల్లి, తండ్రి ఇద్దరి మనసులలోంచి పుడతారు. అందుకే శారీరకంగా వాళ్ళు తల్లితండ్రుల్ని పోలకపోయినా మానసికంగా వాళ్లకి చాలా దగ్గరయి చివరికి వాళ్లలో ఒకరుగా కలిసిపోతారు. అందుకే ఈ ప్రపంచంలో ఏ శక్తి పెంచిన ప్రేమని తక్కువగా చూడదు. అప్రయత్నంగా ఆ పాపను నా చేతుల్లోకి తీసుకున్నాను. గుబురుగా వున్న ఆ జుట్టును నుదుటి మీద నుండి చేత్తో పైకి దువ్వుతూ 'దేవుడు రాసిన నీ నుదుటి రాతను సవరించి మళ్ళీ ఇంకో మంచి రాతను రాస్తున్నాడమ్మా నా చిట్టినాన్న' అనుకున్నాను మనసులో. బలవంతాన ఆపుకుంటున్న కన్నీళ్లు ఇంక అదుపు తప్పి నా బుగ్గల మీదుగా జారుతున్నాయి. 'నా చిట్టితల్లీ! నా బుల్లికన్నా! నా బంగారు తండ్రిని నాన్నని చేయటానికి, ఆ పితృప్రేమని పంచటంలో వున్న ఆనందం వాడికి ఇవ్వటానికి వస్తున్నావా తల్లీ నువ్వు మా ఇంటికి' అనుకుంటూ ఆ పాపను గాఢంగా హృదయానికి హత్తుకున్నాను.
nice heart touching story.