ఏమని అడుగను?
ఏమని చెప్పను?
ఎంతని తవ్వను?
ఎంతని తోడిపోయను?
తల నుండి పాదాల దాకా రోజూ
ఒకే పూజ.....
సూర్యోదయం నుండి సూర్యాస్తమయం దాకా ఒకే త్రవ్వకం...
శిఖరంలా ఎదురై కనిపించినప్పుడు
కేవలం మనిషిలా
చెవులలో పదాలు పోసి
కళ్లకు నవ్వులు చూపి
ముఖానికి పరిచయం పూసి
"మనసు"ను మురిపిస్తూ మరిస్తే ఎలా?
* * *
కోట తలుపుల్లా తెరుచుకొని
నిలువెత్తుమనిషి నిను చేరుకుంటూ
దగ్గరి కొచ్చినప్పుడు..
అతడి మనసులోని
ఆకలి దప్పులను, ఆశల ఊహలను
కాలిముద్రలను, పలుకు నీడలను,
ఏ పరిజ్ఞానంతో వాటి విలువ
తెలుసుకుంటావో నీ ఇష్టం.
నీకై వ్రాసిన ఏకాంత
కవితా గీతికలెన్నో
నీ చెంతకు ఎగబాకి
సాగే అమృత గమనాన
పొంగే సుందర దృశ్యాతీరాలను
ఏ రీతిలో మదిలో దాచుంటావో?
శబ్దంలేని భాషలో
సముద్రమంత అర్థాన్ని గుండెకు హత్తుకుని
నగ్నంగా స్నానించే అతడి అంతరంగ అలజడులకు
నీ అందమైన ఆలోచనను వస్త్రంగా కప్పి
అలంకరణగా ఉండిపో...
ఈ లోగా
ఒక్క కన్నీటి బొట్టు రాలి,
సముద్రమై హృదయాన్ని ఢీ కొట్టి
జీవితాలు మునిగిపోకుండా కాపాడేది
రెండు జీవితాలు పయనించే
ఒకే పడవలా
ఇద్దరి రాత్రులు నిలిచే
ఒకే లంగరులా
నిలిచే ప్రేమొక్కటే.