అనగనగా ఒక రాజ్యంలోని ఒకానొక పట్టణంలో ఒక నల్ల కుక్క నివసిస్తుండేది. ఒక సమయంలో ఆ రాజ్యంలో తీవ్రమైన కరువు వచ్చింది. మనుషులూ, జంతువులూ పక్షులూ ...ఇలా సమస్త జీవజాలమూ తిండిలేక మలమలా మాడిపోయాయి. ఎన్నో జీవాలు మరణించాయి.
నల్లకుక్క కూడా ఆకలికి తట్టుకోలేక తన దేశం వదిలి పరదేశం చేరుకుంది. అక్కడ ఒక ఊర్లో తిరుగుతూ తిరుగుతూ ఆహారం కోసం వెదుకుతూ ఒక ఇంటి ముందు ఆగింది. ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఇంట్లోకి ప్రవేశించింది. అక్కడెవ్వరూ కనబడలేదు.
ఎదురుగా బల్ల మీద బోలెడన్ని పదార్థాలతో ఆహారం పెట్టి ఉన్న పళ్ళెం కనిపించింది.ఆకలితో మాడుతున్న నల్ల కుక్కకి ఆహారం చూడగానే నోరూరింది. తినగలిగినంత కడుపునిండా తింది. ఎవరూ ఆ కుక్కని పట్టించుకున్నవాళ్ళే లేరు ఆ ఇంట్లో!
అలా కొన్ని రోజులు సుఖంగా గడిచాయి నల్ల కుక్కకి. ఒకరోజు ఎప్పటిలాగానే ఆహారం తిని బయటకి రాగానే బోలెడన్ని కుక్కలు ఒక్కసారిగా నల్ల కుక్క మీద పడ్డాయి.
అన్నీ ఊరకుక్కలే నల్లకుక్క లాగా. ఒక జాతికి చెందినవే! అయినప్పటికీ పరదేశం నుంచి తమ దేశానికి వచ్చిన నల్లకుక్కని చూసి సహించలేక పోయాయి. నల్లకుక్క మీద పడి గోళ్ళతో రక్కి, పళ్ళతో కరిచి తీవ్రంగా గాయపరిచాయి.
‘అయ్యో! ఇదేమిటీ ఇలా జరిగిందీ? కరువు కాటకాలున్నా నా దేశమే నయం. మనశ్శాంతితో బ్రతికాను. అందుకే అంటారు జన్మభూమిలోనే బ్రతకడం మంచిదని’ అనుకుని ఆ క్షణమే పరదేశం వదిలిపెట్టి తన దేశానికి వచ్చేసింది నల్లకుక్క.
స్వదేశానికి రాగానే నల్లకుక్కని బంధువులన్నీ చుట్టుముట్టి ‘పరదేశం ఎలా ఉంది? అక్కడి జనాలు ఎలా ఉన్నారు? మంచి వాళ్ళేనా? ఏం తింటారు? బాగా చూసారా నిన్ను?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించాయి.
‘ఏం చెప్పనూ? అక్కడి జనాలు మంచివాళ్ళే కానీ నిర్లక్ష్యమెక్కువ. ఇంటి తలుపులు వేసుకోరు. అయితే వంటలు చాలా రుచికరంగా చేస్తారు. మనం ఎంతైనా తినవచ్చు. కానీ సమస్య ఏమిటంటే మనవాళ్ళే మనల్ని పీక్కు తింటారు. ఆ బాధలు పడలేక మన దేశానికి తిరిగి వచ్చాను’ అని తన బాధంతా వెళ్ళబోసుకుంది నల్లకుక్క.
nice message. nice story .