కంటేనే అమ్మ అని ...
తెలుగు సాహిత్యంలో ‘అమ్మ’ అనే పదానికి అత్యున్నత స్థానం ఉంది. ఎంతటి సాహిత్య పటిమ కలిగిన రచయితలకు, రచయిత్రులకు కూడా అమ్మ అనే మాట ఒక అద్భుతమైన భావన. ఎన్ని భావరూప వ్యక్తీకరణలతో విశ్లేషించినను ఎప్పుడూ సరికొత్త కావ్యమౌతుంది. అటువంటి ‘అమ్మ’ మాట యొక్క అర్థాన్ని సరికొత్త రీతిలో గేయరూపంలో సి.నా.రె. కలంనుంచి జాలువారిన మరో ఆణిముత్యం ఈ ‘కంటేనే అమ్మ అని అంటే ఎలా...’ గేయం. ఈ మాతృదినోత్సవ శుభతరుణంలో వినండి, వింటూ ఆనందించండి మరి.
పల్లవి :
కంటేనే అమ్మ అని అంటే ఎలా (2)
కరుణించే ప్రతి దేవత అమ్మే కదా
కన్న అమ్మే కదా
కంటేనే అమ్మ అని అంటే ఎలా (2)
కడుపుతీపి లేని అమ్మ బొమ్మే కదా
రాతి బొమ్మే కదా
చరణం : 1
కణకణలాడే ఎండకు శిరుసుమాడినా
మనకు తన నీడను అందించే చెట్టే అమ్మ
చారెడు నీళ్లయిన తాను దాచుకోక
జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ
ఆ అమ్మలనే మించిన మా అమ్మకు (2)
రుణం తీర్చుకోలేను ఏ జన్మకూ ॥
చరణం : 2
ఎన్నో అంతస్తులుగా ఎదిగిపోయినా
మేడకున్న అసలు ఉనికి ఆ పునాది పైనే
సిరుల జల్లులో నిత్యం పరవశించినా
మగువ జీవన సాఫల్యం మాతృత్వంలోనే
ప్రతి తల్లికి మమకారం పరమార్థం (2)
అది లేని అహంకారం వ్యర్థం వ్యర్థం
కరుణించే ప్రతి దేవత అమ్మే కదా
కడుపుతీపి లేని అమ్మ బొమ్మే కదా
రాతి బొమ్మే కదా