Menu Close
Kadambam Page Title
Polayya
కాపాడండి..! కామపిశాచులనుండి..!
పోలయ్య కవి కూకట్లపల్లి

మహిళలు అర్ధరాత్రిలో స్వేచ్ఛగా తిరిగినరోజే
మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన రోజు
అన్న మన జాతిపిత బాపూజీ కన్న కలలు
ఎప్పుడు? ఎప్పుడు? సాకారమయ్యేదెప్పుడు?

మన తల్లి భరతమాత స్త్రీనే
మన న్యాయ దేవత స్త్రీనే
నిన్ను నన్ను కన్నది ఒక అమ్మనే
స్త్రీని దేవతంటారు శక్తిస్వరూపిణంటారు
ఆకాశంలో సగభాగమంటారు, కానీ
కంటపడితే, కాలు బయటపెడితే చాలు
వెంటపడుతుంటారు వేధిస్తుంటారు
వదల బొమ్మాళీ నిన్ను వదలమంటూ
కామాంధుల వేట మొదలౌతుంది
ఆడదంటే ఆటబొమ్మేనా? అంగడి సరుకేనా?
ఎక్కడ? ఎక్కడ? ఈ స్త్రీజాతికి రక్షణ ఎక్కడ?

ఆడజన్మ ఎత్తితే ఈ నేలపై
ఇంటి నుండి ఆఫీసు వరకు
జననం నుండి మరణం వరకు
ముందున్నవి ముళ్ళబాటలే...
ప్రక్కలో బల్లాలే...బాకులే...
మరతుపాకులే...
కళ్ళముందు తేనెపూసిన కత్తులే...
మేక వన్నె పులులే...అందరూ శత్రువులే...
కాలేజీలో.....పోకిరి కుర్రాళ్లు
బజారులో... రౌడీలు...రాక్షసులు
ఆఫీసులో.....ఉన్మాదులైన సహఉద్యోగులు
స్కూల్లో........పాఠాలు బోధించే
గురువులు....గుంటనక్కలు
ఆశ్రమాల్లో.....దొంగబాబాలు
నేడు కొత్తగా...గుడిలో...పూజారులు
ఎక్కడ? ఎక్కడ? ఈ స్త్రీజాతికి రక్షణ ఎక్కడ?

ఔను ఈ మగమృగాళ్ళు మనుషులుగా మారినప్పుడే...
నీ కన్న తల్లి...నిన్ను నమ్మిన నీ‌అక్క నీ చెల్లి
నిశ్చింతగా ప్రశాంతంగా నిదురపోయినప్పుడే...
నిర్భీతితో ఒంటరిగా స్వేచ్ఛగా వీధిలో తిరిగినప్పుడే...
ఈ అంధులను...ఈ కామాంధులను ఉరితీసినప్పుడే...
ఈ ఊసరవెల్లులపై ఈ ఉన్మాదులపై
ఉక్కుపాదం మోపినప్పుడే...
ఈ విషసర్పాల నుండి
ఈ కామపిశాచుల నుండి ఈ స్త్రీ జాతికి విముక్తి...! అప్పుడే నా కవితకు కనకాభిషేకం...!

(గుడిలో అత్యాచారం వార్త చదివి గుండె పగిలి రాసిన కవిత)

Posted in May 2022, కవితలు

1 Comment

  1. అయ్యగారి సూర్యనారాయణమూర్తి

    కవిత చక్కగా ఉంది. భావవ్యక్తీకరణ బాగుంది.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!