Menu Close
ఎక్కడున్నావో..నా చెలీ !?
- రాఘవ మాష్టారు -

ఎప్పుడో నిను జూసిన నాడే వలపు వరించె
అప్పుడే నిను కలసిన వేళే తలపు జనించె

నా ఎదలోతుల వూహల రస రేఖలా
నా తొలివలపు వసంత యామినిలా

బాలా నీ కనురెప్పల వాలు చూపు
జారె దిగజా రె నాగుండెల విరి తూపు
కరిమొబ్బు దొంతరల వేణీ సుమదళాల
పరిమళాలు
తీక్షణ వలపువీక్షణా నీరజాక్షి శుక్ల పక్ష
చకోరాలు
ఆ నడక లయల హొయలు అనురాగ భరిత
భారత నాట్యాలు
నీ జిలుగు విరుపుల నగవులు వినీల
తారాతోరణాలు

నీ చొట్ట బుగ్గన ఎన్నెన్ని మెరుపులు
ఆ ఎర్ర మూతిన ఎన్నెన్ని విరుపులు
అల వదలగలనా లలనా!
ఇల ఎదను వదల తరమా!

పెను నిద్దరలోమనమిద్దరమేలే
నిదురింతునా నీ కలవరింతలే
నిదుర పొదిగిళ్ళ వొదిగి వొదిగి
కనుపాపల నీలికొనల జారిపడిన
స్వప్నమ్ము నీవు
వెత శీతల హృదయాంతరటూరుపుల
కోమలామోద ప్రమోద చుంబనమ్ము నీవు
ఎటుల నిను వీడుదునే
ఎటులైన నిను వేడుదునే

నిండు తెలి వెన్నెల వన్నెల మల్లె పూలతో
నిలువెల్ల కొలుచుదునే
నీ మంజుల మంజీరనాదాల పల్లవ శోభిత
పాదాక్రాంతుడనై ప్రణయ కరుణాల వేడుదునే

ఎక్కడున్నావే...నెచ్చెలి
పసి పిల్లాడిలా నీ ప్రేమ పొత్తిళ్ళ
వలపు పాలకై అల్లాడుతున్నా.....
ఎలా ఉన్నావే....నా చెలి
వసివాడని నా ప్రేమ హత్తిళ్ల
ముద్దుమురిపాల ఉసులాడుతున్నా.....

Posted in May 2022, తేనెలొలుకు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!