ఇరుకుగా ఉన్న సందులు, బాగా దగ్గర, దగ్గరగా ఉన్న పెంకుటిళ్ళు.. అక్కడక్కడా పక్కా ఇళ్ళు, అరుగుల మీద ఆడవాళ్ళు కూర్చుని కబురులు చెప్పుకుంటున్నారు. కొందరు పిల్లలకి జడలు వేస్తున్నారు. మగపిల్లలు వీధుల్లో ఆడుకుంటున్నారు. ఇళ్ళ ముందు మురికి కాలవలు... దుర్గంధంతో నిండిన ఆ ప్రదేశంలోకి అడుగుపెట్టగానే ముక్కు మూసుకున్నాడు బదరీ.
ఇక్కడికెందుకు తీసుకువచ్చావు నొసలు చిట్లించి స్మరణని చూస్తూ అడిగాడు. స్మరణ జవాబు చెప్పకుండా ఏదో వెతుకుతున్నట్టు పరిసరాలను చూస్తూ అడుగులో అడుగు వేస్తూ నడుస్తోంది. ఆమె చుడీదార్ వేసుకుంది. జుట్టంతా వదిలేసి, మొదట్లో ఒక క్లిప్ పెట్టుకుంది.. చున్నీ మెడచుట్టూ వేసుకుని, ఒక అందమైన కుర్రాడి పక్కన నడుస్తున్న ఆ అమ్మాయి సినిమా స్టార్ని చూస్తున్నట్టు, హీరో, హీరోయిన్స్ షూటింగ్ కి వచ్చినట్టు కుతూహలంగా చూస్తూ వాళ్ళలో వాళ్ళు ఏదో మాట్లాడుకోసాగారు ఆడవాళ్ళు.
స్మరణ అదేమీ పట్టించుకోవడం లేదు. మాలతిని కలవాలి... ఎలా? అదే ఆమె మనసులో ఉన్న ఆలోచన. మాలతికి వయసు ఎంత ఉండి ఉండచ్చు.. ఆమ వయసు అంచనా వేయడానికి ప్రయత్నిస్తోంది. అరవై... అరవై అయిదు... తాతయ్యకి డబ్భై రెండు... అంటే కచ్చితంగా ఆవిడ తాతయ్యకన్నా ఓ ఐదేళ్ళు చిన్నది అయి ఉంటుంది.. అంటే అరవై ఏడు... బాగా ముసలిది అయిపోయి ఉంటుందా... జుట్టు ముగ్గుబుట్టలా ఉంటుందేమో! మొహం ముడతలు పడి, కళ్ళు కనిపించక చేతులు అడ్డు పెట్టుకుని చూస్తూ ఉంటుందేమో! అలా అనుకోగానే చేదు తిన్నట్టు అనిపించింది. మాలతి అంటే ఓ ముద్దబంతి పూవులాగానో,, ఓ పొద్దు తిరుగుడు పువ్వు లాగానో ఉంటుందని ఒక ముద్ర మనసులో పడిపోయింది. తాతయ్య ప్రేమించిన అమ్మాయికదా ! అమ్మాయి అమ్మాయిగా కనిపిస్తోంది కానీ అమ్మాయి అమ్మమ్మలా కనిపించడం లేదు. అప్పటి మొగ్గ ఇప్పుడు పూవై ఉండచ్చు కదా. పూవు వడలపోతుంది.. కానీ అంతకన్నా ఏమవుతుంది? అంతకన్నా ముందుకు వెళ్లి ఆలోచించడానికి మనస్కరించలేదు.
ఆవిడ ఈ గూడెం లోనే పుట్టి ఉంటుంది.. పెళ్లి చేసుకుని ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది.. సాఫ్ట్వేర్ ఇంజనీరు కాదుగా ఏ అమెరికాలో ఉద్యోగం చేసే వాడిని పెళ్లి చేసుకుని ఎగిరిపోడానికి... డాక్టర్ కాదు మహానగరంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గరగా ఓ రిచ్ కాలనీలో ఉండడానికి...ఆమె అతి సాధారణ యువతి.. నిరక్షరాస్యురాలు..
హైదరాబాద్, బెంగుళూరు, ఢిల్లీ, నో... ఎక్కడికీ వెళ్ళదు ,,, ఆమెకి తగినవాడని, తమ తాహతుకి అనుకూలంగా ఉన్న వాడిని ఎవరినో ఈ ఊరు వాడినే ఇచ్చి పెళ్లి చేసి ఉంటారు..ఎంతమంది పిల్లలో... మనవాళ్ళు, మనవరాళ్ళు అందరూ చుట్టూ ఉండి ఉంటారు..
ఇప్పుడు తను ఆవిడ దగ్గరకి వెళ్లి ఓ యాభై సంవత్సరాల క్రితం ఆంజనేయులు అనే ఒకాయన మిమ్మల్ని ప్రేమించాడు.. ఆయన మిమ్మల్ని ఒక్కసారి చూడాలని అనుకుంటున్నాడు నాతో రండి అంటే వస్తుందా? జీవన సంధ్యా సమయంలో ఉన్న ఆమె ఎన్ని కుటుంబపరమైన, సామాజిక పరమైన బరువులు, బాధ్యతలు, కట్టుబాట్ల మధ్య ఉందో.. ఆవిడ గడప దాటడానికి అక్కడ ఎన్ని స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయో.. అవన్నీ దాటి ఎప్పుడో లేత వయసులో ప్రమాదవశాత్తూ పడిన ఆకర్షణని ఆమె గుర్తుంచుకుని ఉంటుందా! తాతయ్య అంత సున్నితంగా ఆమె కూడా ఆలోచిస్తోందా! పెళ్లి కాగానే భర్తే లోకంగా భావించి సంసార సాగరంలో మునిగిపోయే స్త్రీ జాతిలో జన్మించిన ఆమెలో తొలివలపు జ్ఞాపకాలు నోటు పుస్తకంలో దాచుకున్న నెమలీకల్లా ఉండి ఉంటాయా! పేజి, పేజి కి అద్దిన అత్తరు పరిమళంలా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండే అవకాశం ఉందా! అసలు నోటు పుస్తకమే తెలియని ఆమెకి అది సాధ్యమా! స్మరణ పెదవుల మీద సన్నని మందహాసం మెరిసింది.
“స్మరణా! నీ కసలు బుద్దిలేదు” ఎవరో చెళ్ళున చరిచినట్టు అయింది. ఇక్కడే ఆమె ఉంటుందని నమ్మకంతో రావడం అసలు తెలివైన పనేనా! ఏమో! తెలివో, అతి తెలివో.. తాతయ్య కోరిక తీర్చడం తన కర్తవ్యమ్.. అందుకోసం ఎంత సాహసం అయినా చేస్తుంది..ఒక పల్లెటూరి అమ్మాయి కోసం ఫేస్ బుక్ లో వెతుక్కుంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్న తాతయ్య మొహం పదే, పదే కనిపిస్తోంది. ఆయన మనసులో ఎంత బాధ ఉంటె కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఒక మనసు అంతగా స్పందించింది అంటే దాని వెనుక ఉన్న బాధ ఎంత తీవ్రమైనదో ఎవరూ చెప్పక్కర్లేదు..మనసున్న ప్రతి వాళ్లకి అర్థం అవుతుంది. ఫేస్ బుక్.... నవ్వొచ్చింది.
ఫేస్ బుక్ లో ఎంబెర్మన్నార్ దేవాలయం కనిపించవచ్చు.. లూథరిన్ చర్చి అభివృద్ధి చెందిన ఊరు మొత్తం కనిపించవచ్చు...లేసు పరిశ్రమలన్నీ కనిపించవచ్చు అందమైన గోదారి కనిపించవచ్చు.. కానీ అట్టడుగు వర్గంలో పుట్టి అనుకోకుండా తాతయ్య మనసులో పవిత్రమైన స్థానం సంపాదించుకున్నంత మాత్రాన ఆమె గూగుల్ లో కనిపిస్తుందా..
స్మరణ వెనకాలే బదరీ అసహనంగా నడుస్తున్నాడు. ఆరిస్టోక్రటిక్ వాతావరణంలో పుట్టి పెరిగి కారులో, ఖరీదైన బండి మీద మడత నలగని దుస్తుల్లో, గొప్పగా పెరిగిన ఆ యువకుడు మొదటిసారిగా అలాంటి వాతావరణంలోకి వచ్చాడు. స్మరణ బలవంతం మీద నడుస్తున్నాడు కానీ ఏ క్షణం అయినా పరిగెత్తుకుని పారిపోవాలనిపిస్తోంది. గోదావరి ఒడ్డు, పచ్చని చేలు, పరిగెత్తే మేఘాలు, ఆ ప్రకృతి అందాలని కాపలా కాసే కొబ్బరి తోటలూ, సినిమాల్లో విన్న లాకులు, బల్లకట్టులు ఉన్నాయి అనుకున్నాడు. కనీసం పరికిణీ, ఓణీ వేసుకున్న పల్లె పడుచు అయినా ఉంటుంది అని ఆశ పడ్డాడు. అవన్నీ ఏమి లేదు.. మురుగు కాలవలు, పేలు చూసుకునే అప్పలమ్మలు, చవకరకం పంజాబీ డ్రెస్ లలో తన వైపు ఓర చూపులు చూస్తున్న అమ్మాయిలను చూస్తుంటే చిరాగ్గా ఉంది.
స్మరణ మాత్రం అదేమి పట్టనట్టు బాగా పరిచయం ఉన్న వాతావరణంలో పుట్టి పెరిగినట్టు నడుస్తోంది. ఎవరికోసం వచ్చింది ఇక్కడికి ఈమె ... ఎవరి ప్రేమ కథని ఈమె రి రైట్ చేయాలి అనుకుంటోంది.. అయినా ఇలాంటి చోట ఉండే వాళ్ళని ప్రేమించడం ఏమిటి .. ప్రేమించే వాళ్లకి బుద్ధి లేకపోతే తనకైనా ఉండాలి కదా!
బాగా ముందుకు నడిచాక కొంచెం మెరుగైన వాతావరణం కనిపించింది.. పక్కా ఇళ్ళు, పరిశుభ్రంగా ఊడ్చి కల్లాపి చల్లి, ముగ్గులేసి, అరుగుల మీద ఎండు మిరపకాయలు, పప్పులు ఎండపోసి ఉన్నాయి.
“ఓ మేడం! ఇంకా ఎంత దూరం” అడిగాడు విసుగ్గా.
స్మరణ అతని వైపు చూసి నవ్వింది...” లైఫ్ అంటే అద్దాల మేడలు, ఎ సి కార్లు కాదు మై డియర్ ... లైఫ్ అంటే ఇది.. జీవితానికి ముడి సరుకు ఇక్కడే దొరుకుతుంది.. దీన్నే తీసుకువెళ్ళి అధునాతనంగా తీర్చిదిద్ది షో కేసుల్లో పెట్టి మనకే అమ్ముతున్నారు వ్యాపారవేత్తలు... వాట్ వి ఆర్ ఎంజాయింగ్ ఈజ్ ప్రాసెస్డ లైఫ్...” ఆమె మాటలు టక్కున ఆపేసింది.. పక్కనే ఎవరో అరుస్తున్నారు..
“మాల్తీ! మార్కెట్ కి ఎల్తన్నా వత్తావేటి “
స్మరణ టక్కున మాట్లాడడం ఆపేసి భుజం మీదుగా వెనక్కి చూసింది.
డెబ్భై ఏళ్ల వృద్ధురాలు చేతిలో సంచీతో ఒక ఇంటి ముందు అరుగు మీద కూర్చుని బియ్యం చెరుగుతున్న మహిళ వైపు వెళ్తోంది. ఆ మహిళ వయసు కూడా దాదాపు అరవై దాటి ఉండచ్చు. పండిన తల, కళ్ళు చికిలించి బియ్యం చెరుగుతోంది.. సన్నగా, ఎముకలకి చర్మం అంటుకుని పోయి ఉంది. ముందు పళ్ళు రెండు ఊడిపోయాయి. స్మరణ చివ్వున మొహం తిప్పుకుంది. ఒళ్ళు జలదరించినట్టు అయింది. ఈమెనా తాతయ్య ప్రియురాలు.! బదరీ చేయి పట్టుకుని గబుక్కున పరిగేట్టుతున్నట్టు గా ముందుకు నడిచింది.
“వాట్ హ్యపెండ్?” విచిత్రంగా ఆమె వైపు చూస్తూ అడిగాడు.
“ఏం లేదులే..” అతని చేయి వదిలి నడకలో కొంచెం వేగం తగ్గించింది.
ఆమె మానసిక పరిస్థితి అసాధారణంగా అనిపించింది బదరీకి .. ఏమైంది స్మరణకి? అసలీ అన్వేషణ ఏంటి.. చిన్నప్పుడు చదువుకున్న కథల్లో ఏదో నిధి కోసం అన్వేషిస్తూ కొందరు స్నేహితులు కొండలు, కోనలు, నదులు, సముద్రాలు దాటి వెళ్తారు.. ఆ కథలు చాలా థ్రిల్లింగ్ గా ఉండేవి.. సరదాగానూ ఉండేవి.. ఈ కథ బోర్ గా ఉంది.. చిరాగ్గా కూడా ఉంది.
స్మరణ నడుస్తున్నదల్లా గబుక్కున ఆగి వెనక్కి తిరిగి ఆ ఇద్దరు మహిళల వైపు నడవసాగింది. బదరీ ఆగిపోయాడు. స్మరణ పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరకి వెళ్లి నిలబడింది. బదరీ అటువైపు నడిచాడు. మాటలు అస్పష్టంగా వినిపిస్తున్నాయి.
ఆ మహిళలు స్మరణ వైపు వింతగా చూస్తున్నారు.. స్మరణ కొంచెం సందేహంగా అడిగింది..
“ఇదివరకు ఇక్కడ గుడిసేలుండేవి కదా!”
“ఆయ్ ... ఎప్పటి మాటండి... ఇయన్నీ పక్కా ఇల్లండి ... పెబుత్వం కట్టిచ్చింది కదండీ..”
“మీరంతా ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు?”
“మా అయ్యా, మా తాతలు అందరూ ఈడనే ఉండేవోరు కదండీ.. అప్పుడు గుడిసెలు..”
“అలాగా అంటే మీరంతా మీ చిన్నప్పటి నుంచీ ఇక్కడే ఉంటున్నారనమాట.”
“ఆయ్ “
“మీ అమ్మావాళ్ళు... అంటే... మీ”
ఆమె మాట పూర్తీ కాకుండానే అంది ఒకావిడ “మాది నర్సాపురవేనండి.. మా పుట్టింటారూ, మా అత్తారోరు అందరిదీ నర్సాపూరవే”
స్మరణ కళ్ళు మెరిసాయి.. “అంటే మీ పెళ్ళిళ్ళు అయ్యాక కూడా ఇక్కడే ఉన్నారన్నమాట..”
“ఆయ్ .. మనువులైనా ఈ సుట్టు పక్కల ఊళ్లోనే కదండీ అత్తారోరుండేది..”
“మీ పిల్లలంతా చదువుకుంటున్నారా..”
ఈమె చేతికి మైక్ ఒక్కటే తక్కువ అనుకున్నాడు బదరీ..
“ నీకెంత మంది పిల్లలు...”
“నాకా నలుగురండి..”
“నాకు ఐదుగురండి” అరుగుమీద కూర్చున్నావిడ అంది.
“మీ పేరేంటి..”
“రాదండి...” అంది డెబ్భై ఏళ్ల మహిళ
“మాల్తండి” అంది అరుగు మీద కూర్చున్నావిడ..
స్మరణ గుండె దడ, దడ లాడింది...
“మాల్తా .... అంటే మాలతా..”.అడిగింది..
“ఆయ్“
“ను.... మీరు.... మీకు... ఆ..... వెంకటయ్య గారు తెలుసా...”
“ఎవురండి ఆరు... మా కర్ణం గోరేటి...” మొహం వికారంగా పెట్టింది ఆవిడ..
“వారు... వారు.... ఆ.. ఆంజనేయులు గారి పెదనాన్న గారు..”
“ఆంజనేయులు గారెవరు...”
స్మరణ బలంగా ఊపిరి పీల్చుకుంది అదోలా నవ్వేసి “మాకు తెలిసిన వాళ్ళమ్మాయి మాలతి అని ఇక్కడే ఉండేది...మా ముత్తాత గారింట్లో పని చేసేది..”
కిసుక్కున నవ్వింది ఆవిడ..” ఏనాటి మాటండి... అప్పటాల్లు కొందరున్నారు... కొందరు పోయారు.. ఇంకా ఎక్కడుంటారండి.. అయినా ఈ సుట్టు పక్కల అందరం ఎసుపెబువు బిడ్డలం.. తవరు బెమ్మలు గదండి..”
స్మరణ మాట్లాడలేదు..” సరే థాంక్స్” అంటూ వెనక్కి తిరిగింది. ఆమెనే చూస్తున్నాడు బదరీ. ఆమె తన వైపు చూడగానే నుదిటి మీద కుడి చేయి గుప్పిటగా చేసి కొట్టుకుని “స్మరణా... దిసీజ్ టూ మచ్” అన్నాడు.
“నీకు అర్థం కాదులే బదరీ పద” గంభీరంగా అంటూ ముందుకు నడిచింది. అవును ఆమె మనసులో చెలరేగుతున్న భావోద్వేగాలు బదరీ లాంటి మామూలు వ్యక్తులకు అర్థం కావు.. ఆమెకి తొలిప్రేమ రుచి తెలుసు.. కొన్ని రుచులు నాలిక్కి తెలుస్తాయి... కొన్ని రుచులు మనసుకి తెలుస్తాయి. రుచి తెలుసుకునే మనసు ఎవరికీ ఉంటుంది!
వెనకాల నుంచి ఎవరిదో స్వరం వినిపించింది.. “పట్నం పిల్లకి మనూళ్ళో ఏం పని?”
“ఏవో... మాల్తి కావాలట...”
“మాల్తేవరు?”
“యావో...”
యాభై ఏళ్ల క్రితం మరుగున పడిన ఓ జ్ఞాపకం... ఇప్పుడు తవ్వాలన్నా ఆ నేల కూడా కనిపించడం లేదు... ఎంత గణనీయమైన మార్పు! అనుకుంది స్మరణ పార్క్ చేసిన కారు వైపు నడుస్తూ.
యాక్సిలేటర్ కసిగా నొక్కుతూ అంది “హిందూ దేశంలో హిందువులు కనుమరుగవుతున్నారు.. రాను, రానూ మన ట్రెడిషన్ తగలబడి పోతుంది.”
“మన మతానికి ప్రచారం అవసరం లేదు స్మరణా! వేదాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు గాలిలో ప్రణవనాదాల్లా మ్రోగుతూ అణువణువూ ప్రతిధ్వనిస్తూ ఉంటాయి.. ఇతర ధ్వనులన్నీ అందులో లీనమై పోతాయే కానీ, మరో ధ్వని వినిపించదు... ఐ బిలీవ్ ఇట్ ..”
ఆశ్చర్యంగా చూసింది బదరీ వైపు...
ఆమె చూపులకి నవ్వాడు...” మా డాడీ చెప్పినవే ఈ మాటలు... నేను నీకు అప్పచెబుతున్నా.”
“ఎక్సలెంట్ “ అంది..
“థాంక్ యూ...”
“ఆరు అవుతోంది... ఎంబెర్ మన్నార్ కోవెలకి వెళదామా...” అడిగింది.
“ఏం మాలతి అక్కడ ఉందేమో వెతుకుతావా.. “ హాస్యంగా అన్నాడు..
సీరియస్ గా చూసింది.
నోటి మీద వేలుంచుకుని...”సారీ... సారీ” అన్నాడు బదరీ..
“జి పి ఎస్ ఆన్ చేయి” స్టీరింగ్ తిప్పుతూ అంది.
ఊరంతా మారిపోయింది.. అభివృద్ధి అంటే సంస్కృతి మూలాలు కదిలిపోవడమా! బండ్లు, గూడు రిక్షాలు పోయి ఆటోలు, టాక్సీలు వచ్చాయి..ఆ రోజుల్లో లెక్క పెట్టి ఊరు మొత్తానికి పది కార్లు ఉండేవేమో! ఇప్పుడు అడుగడుగునా కార్లు... ఖరీదైన కార్లు.. ఎక్కడో అమెరికా రోడ్ల మీద తిరగాల్సిన కార్లు అక్కడ తిరుగుతున్నాయి.. అగ్రహారాలాకు అగ్రహారాలు తరలి వెళ్ళాయి అమెరికా... డాలర్లు రూపాయిల్లోకి మారి లక్ష్మీదేవి తాండవమాడుతోంది. ఎక్కడ చూసినా బంగారం, వెండి షాపులు, బట్టల కొట్లు, ఎలక్రానిక్ సామాన్లు, ఆధునిక ఫర్నిచర్ షాపులు, నాగరికత ముసుగు వేసుకున్న పల్లెటూరి పిల్ల.. గోదావరి తీరం వెంబడి ఉండే పెంకుటిళ్ళు అన్నీ డాబా ఇళ్ళుగా రూపాంతరం చెందాయి. మారిన పరిస్థితులను విశాలమైన కళ్ళతో చూస్తూ ఆంజనేయులు ధోరణిలో అనలైజ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా కారు దేవాలయం చేరింది.
ఎత్తైన కట్టడం, విశాలమైన ప్రాంగణం, పురాతన కాలం నాటి ఆలయం.. ఆలయం గోడల మీద దేవుళ్ళ బొమ్మలు, పెద్ద, పెద్ద వృక్షాలు అక్కడక్కడా, ధ్వజ స్థంభం, .. పవిత్రమైన పరిమళం ఏదో అడుగడుగునా వ్యాపించి ఉంది. ఇద్దరూ ఎత్తు గడప దాటి లోపలకి అడుగుపెట్టారు. జనం పల్చగా ఉన్నారు. ఉండి, ఉండి గంటలు మ్రోగుతున్నాయి.
ఆదికేశవుడి విగ్రహం ముందు కళ్ళు మూసుకుని రెండు చేతులూ జోడించి నిర్మలమైన మనసుతో నిలబడింది స్మరణ. తరవాత గర్భగుడి చుట్టూ ప్రదిక్షిణ చేసి, తరవాత అమ్మవారి దర్శనం చేసుకుని వెనకవైపు ఉన్న ఖాళీ స్థలం లోకి వచ్చారు. అటూ, ఇటూ తిరుగుతూ పరిశీలనగా చూసింది స్మరణ... ప్రతి గోడా, ప్రతి చెట్టు, ఆకులు, పూలు తాతయ్య ప్రేమ కథ చెప్పుకుంటున్నట్టే అనిపించింది. ఎక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళో ఇద్దరూ అనుకుంది. గాలి చల్లగా వీస్తూ, హాయిగా ఆహ్లాదకరంగా ఉన్న ఆ వాతావరణంలో నుంచి బయటకు రావాలనిపించలేదు.
“ఏం కోరుకున్నావు స్మరణా!” అడిగాడు బదరీ.
స్మరణ నవ్వింది.. “నువ్వేం కోరుకున్నావు”
“ఏమి కోరుకోడం అలవాటు లేదు స్మరణా. నేను కోరకుండానే నాకు అన్నీ అమర్చాడు దేవుడు... ఉద్యోగం పంతం కొద్ది చేస్తున్నాను కానీ... నేను చేయకపోయినా నష్టం లేదు.. నాకు దేవుడు ఇవ్వనిది ఒక్కటే...” అన్నాడు ఎటో చూస్తూ...
“ఏంటది?”
ఆమె వైపు చూసి నవ్వి “ చెప్పనా...” అన్నాడు.
“చెప్పు” అన్నట్టు చూసింది.
“నిన్ను ..”.
స్మరణ మాట్లాడలేదు.. మౌనంగా కొన్ని నిమిషాలు గడిచాక “పద వెళదాం” అంటూ లేచింది.
“గోదావరి ఒడ్డుకి వెళ్తున్నాం” అంది స్మరణ...
“ఊ... ఊ వెళ్ళాలి...”. అన్నాడు ఉత్సాహంగా..
కారు గోదావరి ఒడ్డు చేరింది. కారు పార్క్ చేసి ఇద్దరూ దిగారు.
శీతాకాలం వేసవికి స్వాగతం పలకడానికి ఆయత్తమవుతోంది. చల్లటి ఏటిగాలి వీస్తోంది. సూర్యాస్తమయం... ప్రకృతి కన్య లేత నారింజరంగు మేలిముసుగు సవరించుకుంటూ మబ్బులచాటుకి వెళ్తోంది.. సూర్యుడు పెద్ద బింబంగా మారి ఆవలి తీరానికి క్రుంగిపోతున్నాడు.. గట్టున కొబ్బరి చెట్లు నీళ్ళల్లో తమ ప్రతిబింబం చూసుకుంటున్నట్టు కొద్దిగా ఒంగి ఉన్నాయి. అలలు సొగసుగా కదుల్తున్నాయి. కొన్ని లాంచీలు తిరిగి, తిరిగి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాయి. గాలికి చెదిరి మొహం మీద పడుతున్న ముంగురులు వెనక్కి తోసుకుంటూ అందమైన కళ్ళతో విశాలంగా పరచుకున్న గోదావరి వైపు చూసింది స్మరణ..
పౌర్ణమి చంద్రుడు మబ్బులతో దోబూచులాడుతున్నాడు..
“ఎంత బాగుంది స్మరణా!” అన్నాడు బదరీ పరవశంగా..
“దీన్ని వశిష్ట గోదావరి అంటారు.. అదిగో అదే శివాలయం.. అవతలి గట్టుకు చూపిస్తూ చెప్పసాగింది. ఊళ్ళో వాళ్ళంతా పడవల్లో సరదాగా అప్పుడప్పుడూ ఆవలి తీరం వెళ్తుంటారు.. దాన్ని సఖినేటి పల్లి అంటారు.. తమాషా ఏంటంటే ఈవలి తీరం వెస్ట్ గోదావరి, ఆవలి తీరం ఈస్ట్ గోదావరి.. సఖినేటి పల్లికి చిన్న కథ ఉందిట..”
“చెప్పు...” ఆసక్తిగా అన్నాడు.
“త్రేతాయుగంలో సీతారాములు ఇక్కడ ఆగినప్పుడు రాముడు సీతకు పల్లె చూపిస్తూ సఖీ అదే పల్లి అన్నాడట.. అప్పటి నుంచీ అది సఖినేటి పల్లిగా పిలవబడుతోంది. అక్కడ చిన్న, చిన్న గుడిసెల్లో పూసలు, రిబ్బన్లు, గాజులు, తినుబండారాలు, బొమ్మలు పెట్టుకుని అమ్ముతుండేవాళ్ళు... తాతయ్య ఒకసారి ఆవిడకి అక్కడ రిబ్బన్లు కొనిపెట్టారు. వాళ్ళ పెదనాన్న పాకెట్ మనీ కింద ఇచ్చిన డబ్బులు దాచుకుని చిన్న, చిన్న గిఫ్ట్ లు ఇచ్చేవారుట..”
పారవశ్యంతో చెప్పుకుపోతున్న స్మరణకి “వావ్... వాట్ ఎ లవ్ స్టొరీ” అని బదరీ అనడంతో అప్పుడే స్పృహ వచ్చినట్టు అయింది..
“ఇదంతా నీకెలా తెలుసు” అడిగాడు..
నవ్వి చెప్పింది.. “ తాతయ్య చెప్పారు... చిన్నప్పటి నుంచీ కథలు, కథలుగా విన్నాను ఆయన నోటి వెంట...”
“ఏది లవ్ స్టొరీ కూడానా..”
కోపంగా చూసింది... “తన లవ్ స్టొరీ నాకు చెప్తారా.. డోంట్ బి సిల్లి” అంది.
“సిల్లి అని నువ్వే అంటున్నావు కాబట్టి కోప్పడకు... చెప్పు.. నెక్స్ట్ ఏం జరిగింది..”
“నర్సాపురం చాలా హిస్టారిక్ ప్లేస్ అని చెప్పారు తాతయ్య... బిఫోర్ ఇండిపెండెన్స్ బ్రిటిషర్స్ ఇక్కడ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ చేసారు.. ఇక్కడ నుంచి బోలెడు స్టీమర్స్ వెళ్ళేవట.. స్టీమర్ స్ట్రీట్ అని ఉందిట ... అక్కడే వాళ్ళ ఆఫీస్ లు ఉండేవిట... కలెక్టర్ బంగాళా కూడా చూడాలి మనకి టైం ఉంటె.. మూగమనసులు అనే ఒక ఓల్డ్ మూవీ షూటింగ్ అక్కడే అయిందిట..ఎప్పుడన్నా ఆ మూవీ చూడాలి బదరీ..”
“యూ ట్యూబ్ లో ఉంటుంది..”
“అవును.... మనం కలిసి చూద్దాం... ఇదంతా చూసాక ఆ మూవీ చూస్తె బాగుంటుంది కదూ.. అన్నట్టు జీళ్ళు తెలుసా నీకు..”
“అవేంటి...”
“స్టార్ హోటల్ లో దొరకని ఒక అపురూపమైన స్వీట్..” నవ్వి అంది... “అంతర్వేది అని రెండేళ్లకోసారి ఇక్కడ ఒక ఉత్సవం జరుగుతుంది..బే ఆఫ్ బెంగాల్, వశిష్ట గోదావరి కలిసే చోటు..లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఉంటుంది.. దాన్ని ఆంధ్రా వారణాసి అంటారు. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది బదరీ.. నేను కూడా అప్పుడే పుట్టి ఉంటే బాగుండేదేమో అని..” ట్రాన్స్ లో ఉన్నట్టుగా చెప్తున్న స్మరణ అలా అనేసరికి ఆమె వైపు చూసాడు.
ఆగి ఉన్న లాంచీల వైపు చూస్తోంది. ఆ చీకటి వెలుగుల సయ్యాటలో ఆమె కళ్ళు ఆ ప్రదేశాన్నంతా టార్చ్ వేసి చూస్తున్నట్టు రెండు పాదాల అడుగుల కోసం, చెట్ల చాటునుంచి వచ్చే చిరుమువ్వల సవ్వడి కోసం చెవులు రిక్కించింది. ఆమె ఏదో స్వప్నంలో ఉన్నట్టుగా ఉంది.. అతను ఆమెని పలకరించడం ఇష్టం లేనివాడిలా నదివైపు చూసాడు.
“ఏరుశేనక్కాయలండి .... ఏడి, ఏడిశేనక్కాయలు...”
“మాల్తీ సీకటడింది .... సాల్లే అమ్మినవి... పా పోదాం..”. వెంట, వెంట రెండు స్వరాలూ వినిపించడంతో గబుక్కున వెనక్కి తిరిగింది స్మరణ.
వేరుశెనక్కాయల బుట్ట పట్టుకున్న వృద్ధురాలు వాళ్ళ ముందుకు వచ్చింది.
స్మరణకి ఎక్కడలేని నీరసం ఆవహించింది. బదరీ ఆమె దగ్గర కాయలు కొన్నాడు. ఆమె వెళ్ళిపోయింది.
“పద వెళదాం” అంది స్మరణ ...ఇద్దరూ మెత్తటి ఇసకలో నడుస్తూ కారు దగ్గరకు వచ్చారు.
డిన్నర్ చేశాక అలసిపోయి ప్రశాంతంగా నిద్రపోతున్న బదరీని చూస్తూ అనుకుంది “స్నేహానికి నువ్వొక ఐకాన్ బదరీ... మగవాళ్ళంతా నీలా ఉంటె ఎంత బాగుండేది” బెడ్ లైట్ వెలుగులో అతని నుదుటి మీద వాలిన వెంట్రుకలు సవరించి తన బెడ్ మీదకు వచ్చింది.
మధుని కలవడం అంటూ జరిగితే తాతయ్య తరవాత నిన్నే పరిచయం చేస్తాను.. ఆమె మనసు మధు మీదకి వెళ్ళిపోయింది..
మిత్రమా! నేను వేసిన ప్రతి అడుగులో నీ అడుగుల కోసం అన్వేషిస్తూనే ఉన్నాను.. ఎప్పడు కనిపిస్తావు? నిన్ను మర్చిపోలేకపోవడం ఆనందమో, విషాదమో అర్థం కావడం లేదు.. ఎంత ఆధునిక యువతిని అయినా సంప్రదాయపు వృక్షం నీడలో పెరుగుతున్నాను కదూ.. విధిని నమ్మలేకుండా ఉండలేకపోతున్నాను. నా జీవితంలో సన్నాయి నాదం మ్రోగే క్షణానికి నువ్వు ఎక్కడ ఉన్నా వస్తావని నా అంతరాత్మ బలంగా నమ్ముతోంది. ప్రియతమా! నిద్ర లేచిన దగ్గర నుంచీ నిన్నే తలచుకుంటాను... నిద్రలోనూ నిన్నే అన్వేషిస్తాను.. ఎందుకు కనిపించడం లేదు... ప్రతి నిశి రాత్రి ఉషోదయం కోసం ఎదురుచూస్తూ గడుస్తుంది..
నువ్వు నన్ను మర్చిపోయావా... అలా అనుకోడానికి నా మనసు ఒప్పుకోడం లేదు.. ఎలా మర్చిపోతావు.. పెదవి విప్పి చెప్పకపోయినా ఆ రోజు నా దగ్గర సెలవు తీసుకుని వెళ్తున్న రోజు నీ కళ్ళల్లో నీ మనసు చదివాను తెలుసా.. నీ మొహం అనకు...అయినా కొంచేమేగా నాకన్నా వయసు ఎక్కువ అప్పుడు నువ్వు కూడా టీనేజ్ లోనే ఉన్నావుగా.. తప్పకుండా నువ్వు నన్ను ప్రేమించే ఉంటావు... నీదీ ఫస్ట్ లవ్ కాబట్టి నన్ను మరచిపోవు.. ఎక్కడో చదివిన కవిత గుర్తొచ్చింది స్మరణకి..