2020 వ సంవత్సరంతో పాటుగా కరోనా మహమ్మారి భారత్ లో కూడా ప్రవేశించింది. దేశమంతటా కోవిడ్-19 బారినపడ్డ రోగుల సంఖ్యతోపాటుగా, మరణాల సంఖ్య కూడా వేగంగా పెరగసాగింది. లాక్ డౌన్ మొదలయ్యింది. ఎన్నో సంస్థలు, మరెన్నో వృద్ధాశ్రమాలు మూతపడ్డాయి. ఆ క్రమంలో "కారుణ్యా ఓల్డెజ్ హోమ్" కూడా మూసెయ్యడానికి నిశ్చయించుకున్నారు. అదే పనిమీద అక్కడకు వచ్చాడు ఆ హోమ్ నిర్వాహకుడు. అప్పటికే – ఒక్క పరంధామయ్యను మినహాయిస్తే అక్కడుండే వృద్ధులందరూ ఇళ్లకు వెళ్ళిపోడంతో, మొత్తం ఖాళీ ఐపోయింది ఆ వృద్ధాశ్రమం.
అక్కడ నివాసముంటున్న వారిలో ఒకరు పరంధామయ్య మాష్టారు. ఆ హోమ్ మేనేజరు, ఆయన నుద్దేశించి, “హోమ్ మూసేస్తున్నామని మేము మీకు వారం క్రితమే చెప్పాము కదా! ఆ సంగతి ఫోన్లు చేసి, మీ వాళ్ళకి కూడా అప్పుడే చెప్పడం అయ్యింది. మేమిచ్చిన గడువు నిన్నటితో ముగిసింది, హోంకి తాళం వేసి వెళ్లాలని వచ్చా. అందరూ వెళ్లిపోయారు. మీరు కూడా మీ ఇంటికి వెళ్ళిపోడం బాగుంటుంది" అని అన్నాడు కటువుగా. ఆ మాటలు చెప్పి తరువాత అక్కడనుండి వెళ్ళిపోయాడు ఆయన. కొడుక్కి ఫోన్ చేసి, విషయం చెప్పి, శీఘ్రం వచ్చి తనను ఇంటికి తీసుకెళ్లమని ఎప్పుడో కోరారు పరంధామయ్య. ఏదో ఒక రోజు కొడుకు వచ్చి తనని ఇంటికి తీసుకు వెడతాడన్న నమ్మకంతో ఎదురుచూస్తున్నారు ఆయన నిన్నటిదాకా. కొడుకు పనితొందరలో మర్చిపోయాడేమో - అనుకొని, నిన్న రాత్రి మళ్ళీ కొడుక్కి ఫోన్ చేశారు. రింగయ్యింది కానీ ఎవరూ ఫోన్ ఎత్తలేదు. ఎన్నిసార్లయినా అదే తంతు. ఈ ఉదయమే ఆయన మళ్ళీ ఫోన్ చేశారు. ఫోన్ మ్రోగలేదు. మళ్లీ మళ్లీ చేశారు. ప్రయోజనం లేదు.
"వాళ్ళకు ఏమయ్యింది!” ఆ ఆలోచన ఆయనను కలవరపెట్టసాగింది.
ఉదయం 8 గంటలు అయ్యిందని సూచించింది హాల్లోని గడియారం. అలవాటుగా భోజనశాలకు నడిచాడు పరంధామయ్య. అక్కడ టిఫిన్ తింటున్న మేనేజరు పరంధామయ్యను చూడగానే వంటమనిషిని పిలిచి, మాష్టారుకి టిఫిన్ తీసుకురమ్మన్నాడు. ఆమె, యజమాని చెప్పిన పని పూర్తిచేసి, తనకు రావలసిన డబ్బు తీసుకుని వెళ్ళిపోయింది.
"చూడు పెద్దాయనా, నువ్వు వెళ్ళిపోతే, నేను హోంకి తాళం వేసి పోతా. నాకు పది గంటలకు ఒక ముఖ్యమైన పనుంది, వెళ్ళాలి! మీరు త్వరగా తెమలాలి" అంటూ పరంధామయ్యను తొందరపెట్టాడు మేనేజరు.
పరంధామయ్య మనసు వికలమైపోయింది. ఆపైన ఆయనకు టిఫిన్ సయించలేదు. ఇక్కడకు వచ్చినప్పుడు కొడుకు, తన సొంత కారులో తీసుకువచ్చాడు. అప్పుడు పరంధామయ్య కొడుకుని అడ్రసు అడగలేదు. మనసు మనసులో లేకపోవడంతో అది ఎంత అవసరమన్నది ఆయన గ్రహించలేకపోయారు. భార్య పోయిన తొలినాళ్ళలో మహాదుఃఖంలో మునిగి ఉండి ఆయన మరే విషయమూ పట్టించుకోలేదు.
"ఇప్పుడు ఏమనుకొని ఏమి ప్రయోజనం! గతం నాస్తి! ఇప్పుడేమి చెయ్యాలి అన్నది ప్రస్తుతం ఆలోచించాల్చిన విషయం" అనుకున్నారు ఆయన. వెంటనే మేనేజర్ని అడిగి కొడుకు అడ్రస్ తీసుకున్నారు. కానీ అది పాతయింటి అడ్రస్! ఇప్పుడు వాళ్ళు వేరే ఇంటికి మారారు. ఆ పాత ఇంటి అడ్రస్ తన కొడుకు ఎందుకు ఇచ్చాడో ఆయనకు అర్థమవ్వలేదు. అలవాటు వల్ల వచ్చిన పొరపాటు అయ్యి వుంటుంది - అనుకుని మనసు సరిపెట్టుకున్నారు ఆయన.
మేనేజరు, హోమ్ అటెండర్ సూరి కలిసి కిటికీలు, తలుపులూ మూసే పనిలో హడావిడిగా ఉన్నారు. ఇక పదేపదే వెళ్లిపొమ్మని అనిపించుకోడంకన్నా ఇక్కడనుండి వెళ్లిపోడమే మేలు – అనుకున్న పరంధామయ్య తన బేగ్ తీసుకుని బయటకు నడిచారు. గేటు దాటి అక్కడే రోడ్డువార నిలబడ్డారు.
పరంధామయ్య బయట కాలు పెట్టగానే, హోం మేనేజర్ భవనానికి తాళం వేసి, బైక్ ఎక్కి వేగంగా వెళ్ళిపోయాడు. సూరి మాత్రం ఇంకా అక్కడే తచ్చాడుతూ ఉన్నాడు. తనకు షుమారుగా ఒక సంవత్సరం ఆశ్రయమిచ్చిన ఆ వృద్ధాశ్రమాన్ని కృతజ్ఞతతో మరొక్కసారి చూడాలనిపించి పరంధామయ్య వెనక్కి తిరిగేసరికి సూరి ఎదురుగా కనిపించాడు.
మొహమాటంతో కూడిన చిరునవ్వుతో వాడు ఆయనకు దగ్గరగా వచ్చి దణ్ణం పెట్టి నిలబడ్డాడు.
సూరి ఎందుకు వచ్చాడన్నది పరంధామయ్యకు వెంటనే అర్థమైపోయింది. బేగ్ లోంచి పర్సు తీసి చూస్తే దానిలో ఒక్క ఏభై రూపాయల నోటు మాత్రమే ఉంది. అది తీసి సూరి చేతిలో ఉంచారు ఆయన. అంతలో ఆయనకు "ఇక్కడికి బస్సు స్టాపు చాలా దగ్గర" అని ఎవరో చెప్పుకుంటూండగా విన్నది గుర్తురావడంతో సూరిని అడిగారు, "ఇక్కడినుండి సిటీబస్సు స్టాపుకి ఎటువైపుగా వెళ్ళాలి నాయనా" అని. నిండుగా పచ్చకాగితం ఇవ్వకుండా సగం మాత్రమే ఇచ్చినందుకు సూరికి ఆయనపై కోపం వచ్చింది. నోరు విప్పి ఒక్క మాటైనా మాటాడకుండా ఆయనకు ఎటు వెళ్ళాలో వేలితో చూపించి, గిరుక్కున వెనుదిరిగి వెళ్ళిపోయాడు సూరి.
సూరి చూపించిన వైపుగా నడవడం మొదలుపెట్టారు పరంధామయ్య. క్షణ క్షణానికీ బరువు పెరుగుతున్నట్లనిపిస్తున్న బ్యాగ్ ని ఎంతో కష్టం మీద మోసుకుంటూ, ఆ ఎండలో సిటీబస్సు స్టాప్ ని వెతుక్కుంటూ ముందుకు సాగుతున్నాడు ఆ పెద్దాయన.
"లాక్ డౌన్" వల్ల రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఎండవేడి ఎక్కువగా ఉండడంతో పదైనా కాకముందే ఎండ చురుక్కుమంటోంది. ఎనభై దాటిన వయసులో, ఆ కోరెండలో సంచిని మోసుకుంటూ పరంధామయ్య చాలా దూరం నడవాల్సివచ్చింది. చెంపల వెంట చెమటలు ధారలుగా కారిపోతూండగా, ఎంతో ప్రయాసపడి ఎట్టకేలకు సిటీబస్సు స్టాపును చేరుకున్నారు ఆయన.
ఆయాసంతో వగరుస్తూ అక్కడున్న సిమెంట్ బెంచీ మీద కూలబడి, బేగ్ లోంచి తువ్వాలు తీసి చెమట తుడుచుకుంటూ అనుకున్నారు ఆయన, “ఇటు రాకుండా నేను అటువైపుకి వెళ్లి ఉంటే దగ్గరలోనే బస్సు స్టాపు వచ్చివుండేది కదా! ఎంత మోసం చేశాడు సూరి." దాహంతో నోరు ఎండిపోయినట్లు అనిపించి, బ్యాగు సైడ్ పోకెట్టులో ఉంచిన మంచినీళ్ల సీసా బయటికి తీసి, కాసిని నీళ్లు గొంతుకలో పోసుకున్నారు. ఎండ వేడికి కాగిన నీళ్లు కావడంతో అవి ఆయన దాహం తీర్చలేకపోయాయి. ఎలాగో రెండు గుక్కలు తాగి, సీసాకి మూత బిగించి యధాస్థానంలో ఉంచి, ఫోను బయటికి తీసి, కొడుక్కి ఫోన్ చేశారు, తానిక్కడ బస్సు షెల్టర్ లో కూర్చునివున్న సంగతి చెప్పాలని. కానీ అవతలి ఫోను మోగలేదు. సిటీ బస్సులు తిరక్కపోడంతో బస్ స్టాప్ లో జనం, ఆయన తప్ప, మరెవ్వరూ లేరు. ఆయాసం తగ్గేవరకూ ఆగి, ఆయన కొడుక్కి మళ్ళీ ఫోను చేశారు. కానీ, ఫోన్ "రింగ్" అవ్వలేదు. ఇప్పుడు తనేమి చెయ్యాలి - అన్నది పెద్ద ప్రశ్న అయ్యింది ఆయనకు. నెమ్మదిగా భయం మొదలయ్యింది. ఆశ పూర్తిగా పోవడంతో ఏడుపు వచ్చింది. ఆయన గతం గుర్తుచేసుకున్నారు...
తమ పల్లెటూరిలో, తనకు ఎంతో గౌరవం ఉండేది. ఆ ఊరి బడిలో ఉన్నవి ఎనిమిది క్లాసుల వరకే! అయినా, అక్కడి జనం, వాళ్ళ పిల్లలు పెద్ద చదువులు చదువుకుని వృద్ధిలోకి వచ్చారంటే, దానికి ముఖ్యమైన కారణం, ఆయన వాళ్ళ చదువులకు వేసిన పునాది పటిష్టంగా ఉండడమే - అని నమ్మేవారు. "మాష్టారు," "మాష్టారు" అంటూ అక్కడి వాళ్ళు తనని ఏంతో గౌరవించేవారు. ఇక తన భార్య సంగతి సరే సరి! ఆమె బ్రతికి ఉండగా తానొక మహారాజే! ఎంత అపురూపంగా, ఎంత ప్రేమగా చూసుకునేది! ఆమె పోయిన తరువాతే తనకు ఈ దుర్దశ మొదలయ్యింది.
తల్లి పోయిందని వచ్చిన మాధవ, కర్మకాండలన్నీ ముగిశాక, తమకు అక్కడున్న కొద్దిపాటి ఆస్తుల్నీ అమ్మేసి, తనని పట్నానికి తీసుకు వచ్చేశాడు. దుఃఖం తలమునకలుగా ఉండడంతో, తన గురించి తనేమీ పట్టించుకోలేదు. యాంత్రికంగా కొడుకు చెప్పినట్లుగా చేస్తూవచ్చాడు.
తానొక పల్లెటూరి చిన్నబడి పంతులు అయినా, లేకలేక కలిగిన ఒక్కగానొక్క కొడుకని తనూ, తన భార్య కష్టపడి, డబ్బు కూడబెట్టి, కొడుకుని పెద్ద చదువు చదివించారు. మాధవ కూడా చక్కగా చదివి, స్కాలర్షిప్పుల సాయంతో పై చదువులు చదివాడు, ఇంజనీరుగా ఎదిగాడు. వెంటనే ఉద్యోగం వచ్చింది. స్ఫురద్రూపి, మంచి ఉద్యోగంలో ఉన్నవాడు" అని, ఒక శ్రీమంతుల అమ్మాయి అతన్ని వలచి, వలపించుకుని పెళ్లాడింది. కొడుకూ కోడలూ ఉద్యోగపు ఊరిలోనూ, వృద్ధ దంపతులిద్దరూ పల్లెటూరిలోనూ సుఖంగా ఉండేవారు అప్పట్లో. అప్పుడప్పుడు వాళ్ళే వచ్చి తమతో ఒక వారం రోజులు గడిపి, సెలవు లేదని చెప్పి వెళ్ళిపోయేవారు.
అత్తగారు పోయాక మామగారు వచ్చి తమ దగ్గరే స్థిరంగా ఉండిపోవడమన్నది కోడలికి నచ్చలేదు. ఎలాగైనా ఆయనను అక్కడనుండి వెళ్లగొట్టేందుకు ఆమె పన్నాగాలు వెతక సాగింది. భర్త ఆఫీసునుండి ఇంటికి రాగానే ప్రతిరోజూ ఆయనపైన ఏవేవో చాడీలు కల్పించి చెప్పి, మాధవ్ మనసు కలుషితం చేసింది. కొడుకువెంట పట్నం వచ్చి రెండు నెలలైనా తిరక్కముందే తన కొడుకు, "మీ తంపులు పడలేకుండా ఉన్నాను నాన్నా" అంటూ, తనని తీసుకువచ్చి ఈ వృద్ధాశ్రమంలో వదలి వెళ్ళాడు. ఫరవాలేదు, ఇక్కడ బాగానేవుంది - అనుకునేటంతలో హోమ్ మూతపడింది. అది చాలదన్నట్లు తనకు కొడుకు అడ్రస్ తెలియక పోడమేమిటో! ఇప్పుడు తనేమి చెయ్యాలి - బాధగా అనుకున్నాడు ఆయన.
ఈ కష్టాన్ని ఎలా గడిచి గట్టెక్కాలో తోచడం లేదు ఆయనకు. దిక్కు లేని వారికి దేవుడే దిక్కు - అనుకుంటూ ఆయన, "అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ| తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో మహేశ్వరః || " అని, మనసులోనే దైవాన్ని ప్రార్ధిస్తూ, రెండు కళ్ళూ గట్టిగా మూసుకుని, పొంగివస్తున్న దుఃఖాన్ని అదుపుచేసుకునే ప్రయత్నంలో పడ్డారు పరంధామయ్య మాష్టారు.
అలా ఎంతసేపు గడిచిందో ఏమోగాని, కళ్ళుతెరిచేసరికి అయనకు ఎదురుగా ఒక పోలీసు, ఇటువైపుకే వస్తూ కనిపించాడు. ఆ పోలీసు వస్తూనే ఆయన్ని పలుకరించాడు ...
“ఇదుగో పెద్దాయనా! ఇది కరోనా కాలం, మాస్కు పెట్టుకోకుండా బయట తిరగకూడదు. పెనాల్టీ పడుతుంది! ఇక్కడ కూర్చున్నావేమిటి? లాక్డౌన్ ఉంది, సిటీబస్సులు తిరగవు. ఇదిగో ఈ మాస్కు కట్టుకో” అంటూ తన జేబులోంచి ఒక మాస్కు తీసి ఆ పోలీసు పరంధామయ్యకి ఇచ్చాడు. ఆ తరువాత బారెడు ఎడంగా అదే బెంచీమీద కూర్చుని, తన మాస్కు సవరించుకుని ఆయనతో మాటలు కలిపాడు.
"ఈ సమయంలో మీరు ఎందుకు బయటికి వచ్చారు" అన్న ఆ పోలీసు ప్రశ్నకు జవాబుగా,
బాబూ పోలీసాయనా! నేను సరదాగా వచ్చిఇక్కడ కూర్చోలేదు, రాక తప్పనిసరియై ఇలా వచ్చాను" అంటూ తనకు వచ్చిన ఇబ్బందిని గురించి ఆ పోలీసుకు చెప్పారు పరంధామయ్య. నొచ్చుకున్నాడు ఆ పోలీసు. ఆపై , “మీ అబ్బాయి అడ్రస్సు గాని, ఫోన్ నంబర్ గాని ఉంటే ఇవ్వండి, మిమ్మల్ని అక్కడకు పంపే ఏర్పాటు చేస్తాను“ అన్నాడు.
నిట్టూర్చి పరంధామయ్య, “ఫోన్ నంబర్ ఉంటే ఇక అన్నీ ఉన్నట్లే అనిపించి నేను మా అబ్బాయి అడ్రస్ తీసుకోలేదు. ఈ వేళ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎవరూ ఫోన్ ఎత్తడం లేదు, ఏమయిందోగాని” అన్నారు దిగులుగా.
“ఔను, ఫోన్ నంబర్ ఉంటే అడ్రస్ పట్టుకోడం పెద్ద కష్టం కాదు. కానీ అంతకన్నా సులువైన మరో పధ్ధతి ఉండగా అదెందుకు! ముందిది ప్రయత్నించి చూద్దాము“ అన్నాడు ఆ పోలీసు.
అంతలో ఒక ఆటో వచ్చి అక్కడ ఆగింది. ఆటోలో నుండి ఒకామె క్రిందకు దిగింది. ఆమె ఈ కరోనా కష్టకాలంలోని "లాక్ డౌన్" సమయంలో అన్నార్తులైన వారికోసం వంట చేసి, ఆటోలో ఉంచి తెస్తుంది. అంతే కాదు, ప్రతి రోజూ మెయిన్ బజార్లలోని నాలుగు వీధుల కూడళ్లలో కాపలా కాస్తూ, తిండీ నీళ్ళూ మర్చిపోయి, కరోనా వ్యాప్తి కాకుండా ఉండేందుకు, జనం పాటించవలసిన నిబంధనలను పట్టించుకోకుండా తిరిగే పామర జనాల్ని హెచ్చరిస్తూ, వారికి కరోనా సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు బోధిస్తూ, తమ క్షేమాన్నిసైతం మర్చిపోయి, ఎండల్ని లెక్కచేయకుండా, కష్టనిష్ఠూరాలను భరిస్తూ డ్యూటీ చేస్తున్న పోలీసులకు కూడా వేళకు భోజనం పెడుతుంది ఆ ఇల్లాలు.
పరంధామయ్యగారికి ఆమె పరిచయం చెప్పి, ఆమె వైపు తిరిగి ఆ పోలీసు, “అమ్మా! ఈ రోజు నాతో ఉండే పోలీసు సెలవు పెట్టాడు. కానీ మనకొక "అనుకోని అతిధి" ఉన్నారు. ఈ పెద్దాయనకు భోజనం పెట్టాలి నువ్వు” అన్నాడు అభ్యర్ధనగా.
“అయ్యో! అంతకన్నానా బాబూ! తప్పకుండా“ అంది ఆమె. ఆపై పరంధామయ్య వైపుకి తిరిగి, "బాబుగారూ! దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు, ఎవరో రావాలి, ఏదో చెయ్యాలి - అని ఎదురుచూస్తూ కూర్చోకుండా మనలో మనమే ఒకరికొకరం, ఉడతా భక్తిగానైనా, ఎవరికి చేతనైనంత సాయం వాళ్ళు, అవసరంలోఉన్న మరొకరికి చెయ్యాలి, అది ఎంత చిన్నదైనా సరే" అనిపిస్తుంది నాకు. అందుకే ఈ పని మొదలుపెట్టా. పెద్దవారు, మీరుచెప్పండి - నా ఉద్దేశం సరైనదే అంటారా" అని అడిగింది.
పరంధామయ్యగారి కళ్ళలో కన్నీరు తొణికిసలాడింది! “నువ్వు చాలా గొప్ప పని చేస్తున్నావమ్మా! అపరాహ్నమయింది, పెద్దవాడిని ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. ఆకలికి అలమటించిపోతూ, అన్నార్తితో కొట్టుమిట్టాడుతున్న నా ప్రాణం నిలబెట్టి పుణ్యం కట్టుకుంటున్నావు నువ్వు, పుణ్యాత్మురాలివి! ఎంతో మంచిపని చేస్తున్నావు నువ్వు. పిల్లా పాపలతో నీ ఇల్లు చల్లాగా ఉండాలి తల్లీ” అన్నాడు ఆయన గద్గదస్వరంతో. ఆమె రెండు పేపరు ప్లేట్లు తీసి, ఇద్దరికీ చెరొకటి ఇచ్చి, చల్లని మంచి నీళ్లు కూడా ఇచ్చి, భోజనం వడ్డించి సెలవు తీసుకుని, వెళ్ళిపోయింది.
భోజనాలు అయ్యాక పరంధామయ్యగారిని అడిగాడు ఆ పోలీసు ...
“ఇదిగో, పెద్దాయనా! ఇప్పుడు చెప్పు, మీ అబ్బాయి ఇంటికి దగ్గరున్న ఏదైనా ఒక “లాండు మార్కు” - అంటే, ఒక గుడిగాని, ఒక బడిగాని, ఒక మాల్ గాని - ఇలాంటి కొండ గుర్తు ఏదైనా ఉంటే చెప్పు ... " అన్నాడు.
పరంధామయ్య ఆలోచించడం మొదలుపెట్టారు ...
కొడుకు తనని ఈ ఊరు తీసుకు వస్తున్న సమయంలో బస్సు దిగి ఆటో ఎక్కినప్పుడు, ఆ ఆటోడ్రైవర్ "ఎక్కడకు వెళ్ళాలి" అని అడిగితే, తన కొడుకు, "కనకదుర్గ గుడి" దగ్గరకి తీసుకువెళ్ళు" అన్నాడు. అది గుర్తువచ్చింది ఆయనకి. అక్కడికి వెడితే చాలు గుడి పక్కనున్న వీధిలో ఉంది కొడుకు ఇల్లు. ఆయన తన కొడుకు ఇల్లును గుర్తు పట్టగలడు. చుట్టుపక్కల ఉన్న అపార్టుమెంట్లలో అది తమాషాగా ఉంటుంది. ఒకసారి చూస్తేచాలు గుర్తుండిపోతుంది ఎవరికైనా. ఆ సంగతి వినగానే ఆ పోలీసు కూడా చాలా సంతోషించాడు.
"పెట్రోలింగ్ వేను" ఇక్కడకు వస్తుంది, వాళ్ళు మనకి సాయం చేస్తారు. నిన్ను మీ ఇంటి గుమ్మంలో వదిలిపెట్టి వెడతాను, కొంచెంసేపు ఓపికపట్టు బాబాయ్” అన్నాడు ఆ పోలీసు. ఆ మాటలు పరంధామయ్యకి ఆనందాన్నిచ్చాయి.