నింగిని చూసినపుడు
విశ్వనాథుడిలా దర్శమిస్తవు
గాలిని పీల్చినపుడు
శ్రీకాళహస్తీశ్వరుడిలా అగుపిస్తవు
నిప్పును చూసినపుడు
అరుణాచలేశ్వరుడిగా కనిపిస్తవు
నీరు తాగినపుడు
త్రయంబకుడిలా గుర్తొస్తవు
నేలపై నిలబడినందుకు
ఏకాంబరేశ్వరుడిలా తోడుంటవు
ఏ పని చేసిన ఏదోలా అగుపిస్తవు
నీ మాయమీద మన్నుబడ మాయేశ్వరుడిలా
నన్ను ఉద్దరిస్తవు
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివా
నిన్నే నమ్ముకున్నా...
నీ భక్తికి నన్నే అమ్ముకున్నా...
కరుణించి వరాలిస్తవో...
కోపంతో వేదన జ్వరాలిస్తవో...
దయతో ఆనంద స్వరాలిస్తవో...
నీ ఇష్టమయ్యా
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివా
లక్ష్మీ నువ్వే...
సరస్వతి నువ్వే...
పార్వతి నువ్వే...
వరము నువ్వే... శాపము నువ్వే...
తిక్కరేగితే అంతామసిజేసి
ఒంటబూసుకుని కాటింటా తైతక్కలాడే
నా బుజ్జి తండ్రీ... నువ్వే
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివా
నేనేమి పోటుగాణ్ణి కాదయ్యా
నీ ఆటలో పోటీ పడనీకి...
నీకు నువ్వే పోటీవి..పోటుగాడివి
నీ ఆటలో ఎగిసిపడే ఆటుపోట్లు మాత్రమే నేనయ్యా
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివా...
కొడుకులు లేరని కోరి మొక్కితే
కొడుకునిస్తివా
అల్లారుముద్దుగా పెంచుకొనుటచూసి అసూయపడితివా
చెట్టంతకొడుకునే కొట్టేస్తివా
కొండంత మా ఆశలు తుంపేస్తివా
అడ్డగోలుగా ఆడుకునే నీ ఆటకు నీవెసాటి
ఇపుడు నీ కళ్ళు చల్లబడ్డయా సదాశివా...?
నీవెంత మాయగాడివయ్యా
కడుపులో ఆకలి పుండు బెట్టినావ్
ఆ పుండును గుచ్చే వేదన ముండ్లను మనసులో బెట్టినావ్
యేది యాడబెడతవో...
యెవడిని యెపుడు బొందబెడతవో నీకె ఎరుకా...!
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివా...
కొందరు అహంకారివి అన్నారయ్యా
కొందరు అమాయకుడివి అన్నారయ్యా
కొందరు మంచి వాడివి అన్నారయ్యా
కొందరు చెడ్డవాడివి అన్నారయ్యా
ఎవరేమన్నా...నేనేంటో నీకె తెలుసయ్యా...
ఏనాటికైనా నీ ఒంటిమీద బూదినైతా కనుక...
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివా...
మావి గాలి బ్రతుకులయ్యా
గాలికే గాలి తిరుగుళ్ళు తిరుగుతవయ్యా
ఆ గాలికే విషమును బూసి మాతో ఆడుకుంటున్నవా... (కరోనా)
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివా...
వాన చినుకై గంగరాగానే
మా గుడిసె వెయ్యికన్నుల ఇంద్రుడని తెలిసెనయ్యా...
ఇంద్ర దర్శనమైంది
గంగలో మునకైంది
నీ దర్శన బాగ్యమెప్పుడయ్యా
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివా...
తట్టలమ్ముతరు కొందరు
బుట్టలమ్ముతరు కొందరు
బట్టలమ్ముతరు కొందరు
ఏవేవో అమ్మి తమ కుటుంబాన్ని పోసిస్తరు అందరూ...
నువ్వేమో అందరి ప్రాణాలమ్ముతవు
దానితో ఏమీ చేస్తవో ఏమో...
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివా...