Menu Close
అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
-- మధు బుడమగుంట --

ముందుమాట: సంస్కృతాంధ్ర సాహిత్య పిపాసి, నిత్య సాధనా పారంగతుడు, మాతృభాషాభిమానం మెండుగా కలిగి సాహిత్య సేవకై తపించేవాడు, శాస్త్ర సాంకేతిక విజ్ఞాన ఘనుడు, అమ్మవారి అనుగ్రహ పాత్రుడై బహుభాషా కోవిదుడుగా ప్రభవించి నేటికి వేలపద్యాలను చక్కటి వ్యాకరణ శుద్ధితో రచించి ఎంతోమంది తెలుగు భాషాకోవిదుల మన్ననలను పొందిన శ్రీ అయ్యగారి సూర్యనారాయణమూర్తి గారి విరచితమైన పద్యాల గ్రంథాలయం నుండి వారి అనుమతితో కొన్ని ఆణిముత్యాలను సేకరించి మరల మన సిరిమల్లె పాఠకుల కొఱకు ఇక్కడ పొందుపరుస్తున్నందుకు ఎంతో ఆనందముగా ఉన్నది. శ్రీ అయ్యగారి సూర్యనారాయణమూర్తి గారి ప్రతి పద్యమూ ఒక అద్భుతమే. ఆయన దేవీకటాక్ష వరసిద్ధుడు. అందులో నుండి కొన్నింటిని మాత్రమే ఇక్కడ అందిస్తున్నాము. ఈ నవంబర్ నెల సంచిక పద్యాలను చదివి ఆనందించండి.

సరస్వతీదేవి

మ.
లలితంబౌ ముఖసారసంబు హృదయోల్లాసంబుగాఁ గచ్ఛపిన్
బలికింపన్ జలియించు కోమల కరద్వంద్వంబు రాజిల్ల నేఁ
బిలువన్ బల్కి మదిన్ వసించి కలమో విద్యాలయంబో యనన్
గలనైనన్ రచియింపఁజేసి గురువుల్ గర్వింప దీవింపవే...................................................................14
శా.
కావ్యోద్యానసురద్రుమా! ప్రవిమలాకర్ణాయతాక్షిస్ఫుర
న్నవ్యస్ని గ్ధసుధాంశుబింబవదనా! నాదప్రియా! శారదా!
భవ్యౌకస్సితపద్మమందిర! సుశబ్దప్రౌఢి భావోన్నతిన్
శ్రావ్యం బై మధురంబునౌ కవిత నశ్రాంతంబుఁ బల్కింపవే...................................................................15
శ్లో.
మూలానక్షత్రజాతాం బుధజనవినుతాం నిత్యజిహ్వాగ్రధామాం
జ్ఞానానందస్వరూపాంస్ఫటికనిభతనుం పద్మపత్రాయతాక్షీమ్
వీణాతంత్రీచాలత్కరనఖసురుచిధ్వస్తనమ్రార్తివృత్రాం
నానావిద్యాప్రదాత్రీం కమలభవసతీం నౌమి మన్మాతృమూర్తిమ్ II...........................................................16
సీ.
సుమధురసుశ్లోకసుందరపదగుంభ
.....న మొసంగు శారద నాదు తల్లి
కరుణార్ద్రదృక్కులఁ గాంచి దీవించు నా
.....నళినసంభవురాణి నాదు తల్లి
సకలచరాచరనికరంబు సృష్టించు
.....నలుమోమువేల్పెగా నాదు తండ్రి
ప్రతిజీవిజీవనపథనిర్ణయము సేయు
.....వేదనిర్ణేతయె నాదుతండ్రి
తే.గీ.
‘ఎవరురా నీవు? వివరింపు మీ క్షణంబె’
యన్న ‘భారతియే నాదు కన్నతల్లి;
సృష్టికర్తయె తండ్రి; తదీక్షణంబె
నిత్యసంవర్ధకంబ’ని నే వచింతు.................................................................................................17
చం.
పలుకులతల్లి పల్కునెడ భావము శబ్దముఁ బూవుఁ దావియున్
మిళితములౌ విధిన్ వెలసి నిత్య మొసంగు మనోవికాసమున్
లలితమృదంగసుస్వనవిలాసమెయౌఁ బఠియుంచువేళ; నా
పలుకులఁ దాండవించఁగను బ్రార్థన సేసెద శ్రీసరస్వతిన్...................................................................18
మ.
నను నీ వీణియతంత్రిఁ జేయు ఘడియన్ నాదోద్భవస్థానమై
కొనగోటన్ నను మీటు భాగ్యము మెయిన్ గోకొల్లలౌ సుస్వరా
లనయంబున్ బులకించి పల్కెదను మాతా! నీదు స్పర్శానుభూ
తినిఁ గైసేయవె జన్మ ధన్యమయి స్పందింపన్ మరాళాసనా!...............................................................19
చం.
ఇదియొక పద్యకూప మిట నెందఱొ భక్తిరసంబుఁ దోఁడఁగా
సదమలమౌచు నిండు గుణసాంద్రుల కోరిక తీరఁగా ముదా
స్పదమయి జ్యోతిరూపమున వర్తిలు నప్పరమాత్మసత్కృపన్
హృదయము నాఁబడున్ విధిహృదీశ్వరికిన్ బ్రియవాస మియ్యదే........................................................... 20
Posted in December 2022, సాహిత్యం

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!