Menu Close
Kadambam Page Title

అవును, వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు

- వి. లక్ష్మీశోభాన్విత

మూడు ముళ్ల బంధానికే
ముచ్చట గొలుపుతూ
చూడచక్కని జంట అని
వేనోళ్లు  పొగడగా
ఒకరికి ఒకరై ఒద్దికగా
వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు

అర్ధ నారీశ్వర తత్వానికి
అర్ధంగా మారమని
అథితిదేవుళ్ళందరూ
ఆత్మీయంగా దీవించగా
తలలు వంచి అంగీకరిస్తూ
వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు

ఈనాటి బ్రహ్మ ముడిని
ఏనాడో బ్రహ్మ నిర్ణయింపగా
ఆనాటి వేదమంత్రాల
విలువల పరమార్ధాన్ని తెలుసుకుంటూ
జన్మ జన్మల అనుబంధంతో
వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు

బంధు మిత్రుల శుభాభినందనలు
అక్షింతలై కురియగా
బాధ్యతాయుత నవజీవితానికి
శ్రీకారం పలుకుతూ
భార్యా  భర్తలుగా దీక్ష వహించి
వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు

అంబరాన్నంటిన సంబరాలు
ఆనందోత్సహాపు వేడుకలన్నీ
ఇక మావేనంటూ
అందమైన ఆలుమగలుగా
వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు

కలసిన కన్నులలో స్వప్నాలేవో
కోటికాంతులు వెదజల్లగా
విరిసిన చిరునవ్వుల వదనంతో
మౌనమే భాషగా మారుతుండగా
మధురోహల మధుపర్కాలతో
వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు

"మాంగల్యం తంతునానేనా" మంత్రం
సమస్త జీవన పర్యంతం సౌభాగ్యం కాగా
మ్రోగుతున్న మంగళ వాయిద్యాలన్నీ
తధాస్తు తధాస్తు అని ఆలపించగా
మంగళ సూత్రం పవిత్రతను గౌరవిస్తామంటూ
వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు

జోరుగా హుషారుగా సాగిన
ముత్యపు తలంబ్రాల వేడుక
మరపు రాని మధుర జ్ఞాపకమై
నిత్యం మదిలో మెదలగా
సమానత్వ భావనలో సరిలేరు మాకంటూ
వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు

గెలుపెవరిదైనా సంతోషించాలన్నది
ఉంగరాల ఆట సందేశం కాగా
ఓటమి ఎదురైనా ఉత్సాహం  వదల వద్దన్న
తరాలనాటి మాట సారాంశాన్ని స్వీకరిస్తూ
ఆటు పోటు  లందు అరమరికలు లేక ఉంటామంటూ
వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు

ప్రతి క్షణం నీచెంతే నంటూ
అగ్ని ముందు ప్రమాణం చేస్తూ
ప్రతి పదం నీవెంటే నంటూ
హోమం చుట్టూ నడువగా
సప్తపది సాక్షిగా అరుంధతి మెచ్చగా
వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు

మనందరి ఆశీస్సులు పన్నీటి జల్లులై
ప్రతి ఉదయం పలకరించగా
వారిద్దరి ఆకాంక్షలు మల్లెల మాలలై
ప్రతి రాతిరి పరిమళించగా
నీది నాదన్న భేదమే లేదు మాకంటూ
వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు

Posted in August 2019, కవితలు

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!